భారతదేశం అనే గొప్ప నాగరిక సమాజం ఎన్నో శతాబ్దా ల చరిత్రను, సంప్రదాయాలను తనలో దాచుకుంది. ఈ భూమి సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రాల పరంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అయితే ఈ గొప్ప చరిత్రలోనే ఒక విభిన్నమైన, వివాదాస్పదమైన అంశం కూడా చోటు చేసుకుంది- అదే “కుల వ్యవస్థ.” సమాజ నిర్మాణంలో ఒక ప్రత్యేక దశలో ఏర్పడిన ఈ వ్యవస్థ, మొదట్లో వృత్తి ఆధా రంగా ఉండి సామాజిక సమన్వయానికి దోహదపడిందని కొం దరు భావిస్తారు. కానీ కాలక్రమేణా అది తన అసలు లక్ష్యాన్ని కోల్పోయి జన్మ ఆధారంగా స్థిరపడిపోయింది.
జన్మ ఆధారంగా ఏర్పడిన ఈ కుల వ్యవస్థ సమాజాన్ని విభజించడమే కాకుండా, మనుషుల మధ్య అసమానతలను పెంచింది. ఒక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, మరొక వర్గాన్ని తక్కువగా చూడడం అనే ధోరణి పుట్టుకొచ్చింది. ఈ కారణంగా అనేక తరాలుగా కొన్ని వర్గాలు విద్య, ఆర్థిక, సామా జిక అవకాశాల నుంచి దూరమయ్యాయి. అణగారిన వర్గాలపై వివక్ష, అవమానాలు, అణచివేతలు కొనసాగుతూ వచ్చాయి. ఈ పరిస్థితులు కేవలం వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుం డా, సమాజ మొత్తం అభివృద్ధిని కూడా దెబ్బతీశాయి.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగం సమా నత్వాన్ని ప్రామాణికంగా స్వీకరించినప్పటికీ, కుల వ్యవస్థ ప్రభావం పూర్తిగా తగ్గలేదు. చట్టపరంగా సమాన హక్కులు ఉన్నా, ఆచరణలో ఇంకా వివక్ష కనిపించడం బాధాకరం. గ్రా మీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ కుల ఆధారిత విభజనలు ఇంకా కొనసాగుతున్నాయి. వివాహాలు, వృత్తులు, సామాజిక సంబంధాలు వంటి అనేక అంశాల్లో కుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కుల వ్యవస్థ కేవలం ఒక పాత సంప్రదా యం కాదు; అది సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఒక సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. సమానత్వం, న్యా యం, మానవ గౌరవం అనే విలువలు బలపడాలంటే కుల భావజాలం క్రమంగా తగ్గిపోవాలి. ప్రతి వ్యక్తి తన ప్రతిభ, శ్రమ ఆధారంగా ఎదగగలిగే సమాజం నిర్మాణమే నిజమైన ప్రగతి. కాబట్టి కుల వ్యవస్థపై విమర్శాత్మక దృష్టితో ఆలోచించి, సమా నత్వ దిశగా అడుగులు వేయడం సమాజం ముందున్న ముఖ్య మైన బాధ్యతగా మారింది.
ఈ నేపథ్యంలో సామాజిక సంస్కర్తగా పేరుపొందిన పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ లేవనెత్తిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా కుల వ్యవస్థ రద్దు, దేవాలయాల్లో అర్చకత్వం అన్ని కులాలకు ఇవ్వడం, రిజర్వేషన్ల అవసరం వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక వర్గాల మధ్య చైతన్యాన్ని పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కొంత మంది బ్రాహ్మణ సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు మరిం త వివాదానికి దారి తీసాయి.
ఇక్కడ ప్రధానంగా నిలిచే ప్రశ్న ఒకటే, బ్రాహ్మణ సంఘా లు కుల వ్యవస్థ రద్దుకు అనుకూలమా? వ్యతిరేకమా? ఈ ప్రశ్న కు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, సామాజిక సమాన త్వం కోసం పోరాడుతున్న వారిని విమర్శించడం నైతికంగా సరైనదా? మొదటగా దేవాలయాల్లో అర్చకత్వం విషయాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ఆధ్యాత్మిక సేవ మాత్రమే కాని ఒక ప్రత్యేక కులానికి మాత్రమే కేటాయించాల్సిన హక్కు కాదు. వేదాలు, శాస్త్రాలు నేర్చుకొని, నియమ నిష్టలు పాటిస్తూ పూజ లు నిర్వహించే సామర్థ్యం ఉన్నవారు ఎవరైనా అర్చకులుగా ఉండవచ్చు. ఇది కేవలం సామర్థ్యం, శిక్షణ, నిబద్ధత ఆధారం గా ఉండాలి కాని జన్మ ఆధారంగా కాదు.
అయితే వాస్తవ పరిస్థితి చూస్తే, చాలా దేవాలయాల్లో ఇప్పటికీ అర్చకత్వం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమై ఉంది. ఇదే సమయంలో ఇతర కులాల వృత్తుల్లోకి అన్ని కులా ల వారు ప్రవేశించడం సాధారణంగా స్వాగతించబడు తోంది. చెప్పుల తయారీ, నేసే వృత్తి, శిల్పకళ, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మరి అదే సూత్రం దేవాలయాల్లో ఎందుకు అమలు చేయబడటం లేదు? ఇదే ప్రశ్నను మందకృష్ణ మాదిగ లేవనెత్తారు. ఇది కేవలం ఒక వృత్తి విషయం కాదు, ఇది సమానత్వం, గౌరవం, హక్కుల విష యం. ఒక వర్గం మాత్రమే దేవుడికి దగ్గరగా ఉండాలి, మిగతా వారు దూరంగా ఉండాలి అనే భావన ఆధునిక భారతదేశానికి అనుకూలం కాదు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించింది. కాబట్టి దేవాలయాల్లో అర్చకత్వం కూడా అన్ని కులాలకు అందుబాటులో ఉండాలి.
ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే, ఇది మరో కీలకమైన అంశం. కొంతమంది రిజర్వేషన్లు రద్దు చేయాలని వాదిస్తు న్నారు. అయితే అదే సమయంలో కుల వ్యవస్థను రద్దు చేయా లనే విషయంపై వారు మౌనం పాటిస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా? కుల వ్యవస్థ వల్లే అసమానతలు ఏర్పడ్డాయి. ఆ అసమానతలను సరిచేయడానికి రిజర్వేషన్లు అవసరమయ్యా యి. కాబట్టి కుల వ్యవస్థ కొనసాగుతున్నంతకాలం రిజర్వేషన్లు కూడా అవసరమే. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడా ఇదే విష యాన్ని స్పష్టం చేశారు. సామాజిక అసమానతలు తొలగిన ప్పుడు మాత్రమే రిజర్వేషన్లు అవసరం ఉండవు అని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ నేటికీ అసమానతలు కొనసాగుతు న్నాయి. కాబట్టి రిజర్వేషన్లను వ్యతిరేకించడం అంటే వాస్త వాన్ని నిరాకరించడం.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఈడబ్ల్యూఎస్ రిజర్వే షన్లు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ కోటాను అమలు చేస్తున్నారు. అయితే దీనిని సమర్థిస్తున్నవారు, ఇతర రిజర్వేష న్లను వ్యతిరేకించడం సరికాదు. అన్ని వర్గాలకూ అవకాశాలు కల్పించడం సమానత్వానికి దారి తీస్తుంది. ఇక మందకృష్ణ మాదిగ వ్యక్తిత్వం గురించి మాట్లాడితే, ఆయన మూడు దశా బ్దాలుగా అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడుతు న్నారు. ఆయనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారం కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు, అది ఆయన చేసిన సేవలకు గుర్తింపు. ఏ పదవి లేకుండా, ఏ అధికార ఆశ లేకుండా ప్రజల మధ్య ఉండి సేవ చేయడం అరుదైన విషయం. అలాంటి వ్యక్తిపై అను చిత వ్యాఖ్యలు చేయడం, ఆయనను విమర్శించడం సమాజా నికి మేలు చేయదు. విమర్శలు చేయాలంటే విషయపరంగా చేయాలి కాని వ్యక్తిగతంగా కాదు. ముఖ్యంగా సామాజిక సమానత్వం కోసం పోరాడుతున్న వ్యక్తులను అవమానించడం అనాగరికం. భగవాన్ శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకున్నారని ఘోరంగా అవమానకర వ్యా ఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కోట్లాదిమంది శ్రీకృష్ణుని భక్తుల మనోభావాలను గాయపరచా యని, యాదవ సమాజపు ఆత్మ గౌరవం దెబ్బతిన్నదని కావున వెంటనే బ్రాహ్మణ సమాజం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పలు యాదవ సంఘాలు డిమాండ్ చేశారు. పురాణాల ఆధారంగా శ్రీకృష్ణుడు మాకు బావ అవుతారని మందకృష్ణ మాదిగ ప్రకటిస్తే యాదవులకు లేని అభ్యంతరం, అలాగే ఇతర సమాజానికి లేని అభ్యంతరం, ఒక్క బ్రాహ్మణులకే ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. త్రేతా యుగంలో కులాలు లేవని మాట్లాడుతున్న బ్రా హ్మణ పెద్దలు మరి ఇప్పుడు కుల వ్యవస్థ ఏ విధంగా వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇక శ్రీకృష్ణుడిపై జరిగిన వ్యాఖ్యల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మతపరమైన అంశాలు కోట్లాది ప్రజల భావోద్వేగాలకు సంబంధించినవి. అలాంటి విషయాల్లో బాధ్య తతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎవరి భావోద్వేగా లను గాయపరచకుండా మాట్లాడటం అవసరం.
___________________________________________________
READ ALSO:
సాంస్కృతిక రంగంలో శాస్త్రీయ భావాలతో ముందుకెళ్లాలి
చర్చ పెట్టండి.. నిర్ణయాలు తీసుకోండి
పేరుకేనా ‘ప్రజా’ప్రభుత్వాలు?
___________________________________________________
మొత్తం మీద చూస్తే, ఈ చర్చ ఒక వ్యక్తి గురించి కాదు, ఇది ఒక వ్యవస్థ గురించి. కుల వ్యవస్థ కొనసాగాలా? లేక సమానత్వం ఆధారంగా కొత్త సమాజం నిర్మించాలా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.
బ్రాహ్మణ సమాజం సహా అన్ని వర్గాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో జరిగిన తప్పులను అంగీకరించి, భవిష్య త్తులో సమానత్వం కోసం కలిసి పనిచేయాలి. అణగారిన వర్గా ల పట్ల ఉన్న వివక్షతను వదిలి, వారిని సమాన భాగస్వాము లుగా గుర్తించాలి. కులం మనుషులను విభజిస్తుంది, కానీ మానవత్వం కలుపుతుంది. కాబట్టి మనం ఎంచుకోవాల్సింది విభజన కాదు, ఐక్యత. ద్వేషం కాదు, ప్రేమ. అసమానత కా దు, సమానత్వం. సమాజం ముందుకు సాగాలంటే ప్రతి వర్గం తన బాధ్యతను గుర్తించాలి. కుల వ్యవస్థను రద్దు చేయడం, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం, వివక్షను నిర్మూలించడం. ఇవే నిజమైన అభివృద్ధి సూచికలు. మందకృష్ణ మాదిగ లేవనెత్తిన ప్రశ్నలు అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ అవి సమాజాన్ని ఆలోచింపజేస్తాయి. ఆలోచన మార్పుకు దారి తీస్తుంది. మార్పు సమానత్వానికి మార్గం చూపుతుంది. అందు వల్ల ఈ చర్చను వ్యక్తిగతంగా తీసుకోకుండా, సామాజిక సంస్కరణగా చూడాలి. విమర్శలకు బదులు సమాధానాలు ఇవ్వాలి. ప్రతిఘటనకు బదులు సహకారం అందించాలి.
ఇక చివరిగా ఒక ప్రశ్న, మనకు కులం కావాలా? లేక సమానత్వం కావాలా? ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ తమ మన సులో నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే, భారతదేశ భవి ష్యత్తు మరింత న్యాయసమ్మతంగా, సమానంగా మారుతోంది అనేది నగ్నసత్యం.
–
కాలమ్ : ఉతుకు
మన్నారం నాగరాజు
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

