చలన చిత్ర రంగంలో మహిళలను లైంగికంగా వేధించడమనేది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఇది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చలన చిత్ర పరిశ్రమల్లో కూడా వేళ్లు పాతుకుపోయి ఉంది. చలన చిత్ర రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నిరోధానికి కర్ణాటక చలన చిత్ర పరిశ్రమ ఎటువంటి చర్యలు చేపడుతోందో తమకు 15 రోజుల్లో తెలియజేయాలని ఆదేశిస్తూ, కర్ణాటక మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి ఒక నోటీసు పంపించారు. ఈ లైంగిక వేధింపుల నిరోధానికి ఒక కమిటీని నియమించడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను తమకు తెలియజేయాలని కూడా ఆదేశించడం జరిగింది. కేరళ చలన చిత్ర పరిశ్రమలో ఇటువంటి వేధింపులు, దాడులు అత్యధికంగా ఉన్నట్టు జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇటీవల నిర్ధారించిన నేపథ్యంలో కర్ణాటక చలన చిత్ర పరిశ్రమలో కూడా మహిళల నుంచి ఇటువంటి డిమాండ్ వ్యక్తం అవుతోంది. నిస్సహాయ మహిళలను ఆదుకోవడంలో అట్టడుగు స్థానంలో ఉన్న కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి సహజంగానే ఈ డిమాండ్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఇటువంటి ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని కూడా వ్యాఖ్యానించింది.
కర్ణాటక చలన చిత్ర రంగంలో వేలాది మంది మహిళలు దర్శకులు, నిర్మాతలు, నటులు, గాయనులు, నృత్యతారలు పనిచేస్తున్నప్పటికీ, వారి మీద రోజు రోజుకూ వేధింపులు, దాడులు పేట్రేగుతున్నప్పటికీ, వాటి నిరోధానికి ఒక కమిటీ వేయాలన్న స్పృహ కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలికి కలగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆందోళన కలిగించే విషయమేమిటంటే, ఈ వేధింపులు, దాడులను నిరోధించడానికి ఎప్పుడు ఏ ప్రయత్నం జరిగినా ఈ మండలి సభ్యుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. నిజంగా ఇది హేయమైన, గర్హనీయమైన విషయం. తమ పరిశ్రమలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని తెలిసినా ఈ వాణిజ్య మండలికి చీమ కుట్టినట్టయినా లేదు. తమ పరిశ్రమలో మహిళలకు రక్షణ లేదన్నా, వారిపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నా ఇక్కడి పురుషులు ఏమాత్రం నమ్మలేకపోతున్నారు. అటువం టివి కేవలం దుష్ప్రచారాలని, అసత్య ఆరోపణలని పురుషులు వాదిస్తున్నారు. అయితే, మహిళలు మాత్రం ఇందుకు భిన్నమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది.
మహిళలపై వేధింపులకు సంబంధించి ఒక కమిటీని వేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ‘ఫిలిమ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ ఫర్ ఈక్వాలిటీ (FIRE)’ అధ్యక్షురాలు కవితా లంకేశ్ తమను వేధించేవారిపై ఎవరికి ఫిర్యాదు చేయాల్లో కూడా తెలియని స్థితిలో మహిళలు ఉన్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు సూచించినట్టుగా ఈ ఫైర్ ‘జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ (GSICC) స్థాయి కమిటీ కానప్పటికీ, చలన చిత్ర రంగంలోని మహిళలకు ఉన్న హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడం, ఎవరైనా వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు చేసే పక్షంలో వాటిని సంబంధిత వ్యక్తులకు చేరవేయడం జరుగుతోంది. అయితే, ఫైర్ కార్యకలాపాలకు పెద్దగా మద్దతు లభించడం లేదు. 2018లో ‘మీ టూ’ అనే ఉద్యమం జరుగుతున్నప్పుడు తనపై సాగుతున్న లైంగిక వేధింపులను ఫైర్ దృష్టికి తీసుకు వచ్చిన శ్రుతి హరిహరన్ అనే నటికి ఆ తర్వాత నుంచి ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా లభించలేదు. ఆమెను చలన చిత్ర పరిశ్రమ పూర్తిగా బహిష్కరించింది. ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేనందువల్ల, తమకు అవకాశాలు రాకుండా ఉండే అవకాశం ఉన్నందువల్ల సాధారణంగా మహిళలు తమపై జరుగుతున్న వేధింపులను బయటపెట్టడం లేదు.
సుప్రీంకోర్టు సూచించిన జి.ఎస్.ఐ.సి.సిని, మహిళా కమిషన్ సూచించిన కమిటీని ఒక స్వతంత్ర వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, అందులో 50 శాతం మంది మహిళలకు సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వం వెంటనే కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిని ఆదేశించాల్సిన అవసరం ఉంది. మహిళలు ఏ రంగంలో ఉన్నా వారికి వేధింపుల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. సురక్షితమైన ఉద్యోగాలు, ఉద్యోగ ప్రదేశాలు మహిళల హక్కులకు సంబంధించినవి. ఒక్క కర్ణాటక చలన చిత్ర పరిశ్రమే కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలు కూడా మహిళల రక్షణ విషయంలో కొన్ని పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Casting couch in film industry: చిత్ర రంగంలో లైంగిక వేధింపులా?
మహిళా రక్షణే కరువు