మన భారతీయ ఆచారాల్లో పండుగలు, యజ్ఞ యాగాదులు, వివిధ రకాల వేడుకలు చాలా ప్రముఖంగా, పవిత్రంగా నిర్వహించే కార్యాలు. ప్రతి వేడుకకు ఒక కారణాన్ని చూపిస్తున్నప్పటికీ నిజానికి వీటివెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వేరు. పండుగల/వేడుకల గురించి చాలా మందిలో ఉన్న నమ్మకం వాటిని జరిపితే పుణ్యం వస్తుంది, జరపకపొతే పాపం తగులుతుంది, ఎవరో (దేవుడు/దేవత) వస్తారు వరాలిస్తారు ఇలా ఎవరికీ తోచింది వారూహించుకుంటారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. ప్రకృతితో మమేకమై మనచుట్టూ పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవటం (అనుకూల కంపనాలు), నెగటివ్ ఎనర్జీ లెవెల్స్‌ని తగ్గించు కోవటం (ప్రతికూల కంపనాలు) అనేదే వీటి అసలు ఉద్దేశ్యం.
భగవంతుడు ఉన్నాడు, లేడు అనే రెండు బలమైన వాదాలు వేల సంవత్సరాల నుండి మన మెదళ్లను తొలుస్తున్నాయన్నది వాస్తవం, అంతం లేని ఆ వాదాల మాట ఎలా ఉన్నా ప్రకృతి బలమైనది అన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఈ చరాచర సృష్టిలోని ప్రతి అంశం ప్రకృతిలో భాగమే, మనుషులు వారి మనసులు కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతి శక్తి సహజ సిద్ధమైనది, ఒక రూపు నుండి వేరొక రూపుకు మారగలదే కాని శాశ్వతంగా నాశనం కాదు. ఖనిజాలు, లవణాలు, కణాలు, పంచ భూతాలతో నిర్మితమైన ఈ దేహం, దాని అంతరంగం ఎల్లప్పుడూ ప్రకృతితో మమేకమై ఉంటుంది. మనం దేనిని అందిస్తే అదే తిరిగివ్వటం ప్రకృతి లక్షణం, మనమేది బలంగా కోరుకుంటామో ఆ దిశలోనే అవకాశాలు లభిస్తాయి, ఫలితాలు గోచరిస్తాయి. మన ఆనందం, ఆత్మ విశ్వాసం, విశాలమైన భావ జాలం ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీ లెవల్స్ ని ప్రేరేపించి, ఆ దిశలో మనకు అవకాశాలు కల్పించి, ఫలితాలు అందిస్తాయి, అదే సమయంలో మనలోని దుఖం, బాధ, ఆత్మన్యూనతా భావం, ఈర్ష్య, అసూయలు ప్రకృతిలోని నెగెటివ్ ఎనర్జీ స్థాయిని ప్రేరేపిస్తాయి, ఆ దిశలోనే పలితాలు అందిస్తాయి.
పాజిటివ్ ఎనర్జీ మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని, మనో వికాసాన్ని పెంచుతుంది, తద్వారా మన జీవన గమనం సాఫీగా సాగిపోవడానికి సరిపడా శక్తినందిస్తుంది. వేడుకల్లో, పూజా కార్యక్రమాలలో బందువులు, స్నేహితులు, అభిమానులు, చుట్టూ ఉన్న వివిధ జీవరాసులు (ప్రకృతి శక్తులు) మన ఆతిథ్యాన్ని, మనం అందించిన ప్రేమా ఆప్యాయతలు అందుకొని తృప్తిచెందటం వలన వారి మనస్సులో మన గురించి ఏర్పడిన ప్రేమ పూర్వక ఆలోచనలు మన చుట్టూ వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తాయి, ఆ వైబ్రేషన్స్ మన మనసులతో మన చుట్టూ ఉండే వాతావరణంతో మమేకం అవుతాయి, తద్వారా ఉదయించే శక్తి మనలను మన లక్ష్య సాధనలో ముందుకు తీసుకుని వెళుతుంది.
దురదృష్టవశాత్తు ‘పలుకరింపులు’ అనే తొంపుతో కొందరు చావు (విషాదం) తంతును కూడా వేడుకలా జరుపుతూ నెగెటివ్ ఎనర్జీ స్థాయిని పెంచుకుంటున్నారు. ఏదైనా వేడుకే కదా, బందువులు, స్నేహితులతో కూడి చేసుకునేదే కదా పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి కాదా అనుకోవచ్చు, ఎంతమాత్రం కాదు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, గృహ ప్రవేశం, పూజా కార్యక్రమాల్లో మనవద్దకు వచ్చే అతిధులను మనం సంతృప్తి పరుస్తాం, తద్వారా వారి అభిమానాన్ని పొందుతాం, ఇటువంటి శుభ కార్యాలు మళ్ళీ మళ్ళీ జరుగాలి అందుకు తగ్గ శక్తి సామర్త్యాలు ఆతిధ్యమిచ్చిన వారికి కలగాలి అనే ఒక బలమైన ఆలోచన ఆ వాతావరణంలో ఏర్పడుతుంది అది పాజిటివ్ ఎనర్జీ. మరి చావు ( విషాదం) లో జరిగేదేమిటి? చావు అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వచ్చే సంఘటన. మన ఇండ్లలో ఇటువంటివి జరిగినప్పుడు సహజమైన ప్రేమాభిమానాల వలన మనిషి ఈ కటిన వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి కొంత సమయం పడుతుంది. బంధువులు, స్నేహితులు చేయవలసిన పని మృతుల గొప్పతనాన్ని, వారితో అనుబందాన్ని తలచుకుంటూ, వారిక తిరిగి రారనే వాస్తవాన్ని జీర్ణించుకునేలా ప్రవర్తించటం. పన్నెండు దినాల కార్యక్రమంలో జరిగేదిదే. కానీ నేడు మన పల్లెల్లో, పట్టణాలలో కొత్తగా పలకరింపు అనే సంస్కృతి మొదలైంది. చచ్చిపోయిన వారింటికి వట్టి చేతులతో వెళ్లరాదట! మందు సీసా, కల్లుముంత (గుడుంబా అయినా పర్వాలేదు) నంచుకోడానికి మాంసపు ముక్క లేనిదే పలుకరింపులకు పరిపూర్ణత రాదట. మరపు అనేది మనిషికి ప్రకృతి సిద్దంగా లభించిన వరం, మన ఆప్యాయతతో, మన భరోసాతో విషాదాన్ని మరచిపోయేలా చేయాలే కానీ, మందు విందులతో సంతృప్తి పరచి కలకాలం గుర్తుంచుకునేలా చేయ రాదు. మత్తుకు అలవాటైన మనసులు కలకాలం ఇలాంటి విందులు జరగాలాని కోరుకునే విధంగా పలకరింపుల జాతరలు జరుగుతున్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్లు మనలోని బలమైన కోరికలకు అనుగుణంగానే ప్రకృతి స్పందిస్తుంది. ఆతిద్యం స్వీకరించిన వ్యక్తుల్లో ఏర్పడే కృతజ్ఞతతో కూడిన అభిమానం అంతర్లీనంగా అవకాశం వస్తే వీళ్ళింట్లో ఇటువంటి విందు (పలకరింపు) ఏర్పాట్లు చేయాలి, సంతృప్తి పరచాలి అనే నెగేటివ్ వైబ్రేషన్స్‌కి కారణమౌతుంది. విషాదాన్ని కలకాలం గుర్తుంచుకునేలా చేసే ఇటువంటి పలకరింపులు ఎన్ని ఎక్కువైతే అంత నెగెటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, అది పెరిగి పెరిగి మనచుట్టూ చేరుతుంది. వీడు మంచివాడు ఎవరింట్లో పాడే లేచినా మందు సీసాతో, మాంసపు విందుతో పలకరిస్తాడు, ఏనాటికైనా వీడి రుణం తీర్చుకోవాలి , రెట్టింపు మందు, విందులతో ఆనందింప చేయాలి అనే ప్రేమతో కూడిన నెగెటివ్ ఎనర్జీ మనకు అవసరమా? ప్రకృతికి ఉద్దేశ్యాలతో పనిలేదు, ఆలోచనతోనే పని.
దుఖంలో ఉన్న బంధువులను/ హితులను / సాటి మనుషులను అక్కున చేర్చుకోవటం, బాధను మరచి పోయేలా, వాస్తవాన్ని గుర్తించేలా ప్రవర్తించటం మానవ ధర్మం. మందు విందులతో ఆనందింప చేయాలనుకోవటం, కలకాలం గుర్తుంచుకునేలా చేయాలనుకోవటం పైశాచికత్వం, ప్రకృతి విరుద్దం, అటువంటి చర్య వలన మనకు మేలు జరుగదు సరికదా నెగెటివ్ ఎనర్జీ రూపంలో కీడే జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త.
- చంద్రుపట్ల రమణ కుమార్ రెడ్డి
అడ్వకేట్
9440449392