Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Census: జనాభా లెక్కలు తెల్చేది ఎప్పుడు?

Census: జనాభా లెక్కలు తెల్చేది ఎప్పుడు?

ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో సెన్సస్ చేస్తాం

దేశ అభివృద్ధికి కావలసిన మానవ వనరులను అందించడంలో దేశ జనాభా బహుముఖ పాత్ర పోషిస్తుంది. జనగణన చట్టం ప్రకారం భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు.
ప్రతి పది ఏళ్ళకు ఒకసారి లెక్కించే జనాభా లెక్కల సేకరణ వల్ల జనాభా ఎంత మేరకు పెరిగిందో తెలుసుకోవచ్చు. జనగణన ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అభివృద్ధి ప్రణాళిక, అభివృద్ధి పథకాలు ప్రాజెక్టుల నిర్మాణం విద్య వైద్య రంగాల అభివృద్ధి పథకాలు, ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుంది. జనాభా లెక్కలు సకాలములో చేపట్టక పోవడంవల్ల పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక అసమానతలు ఆదాయ అసమానతలు స్త్రీ, పురుష అసమానతలు, లింగ వివక్ష, బాల కార్మికులు శ్రామికుల వలస వికలాంగుల సంక్షేమం మున్నగు సమస్యల పరిష్కారంపై ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఉంటుంది. జనాభా పెరిగిన దేశం (నిష్పత్తిలో) ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెరగకపోవడం వల్ల రాజ్యాంగ లక్ష్యమైన ఆర్థిక న్యాయం పంపిణీ న్యాయం ఎండమావిగానే మారింది. జాతీయ శాంపిల్‌ సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆర్థిక సర్వే మొదలగు కీలక అధ్యయనాలకు జనాభా లెక్కలు కీలకం అయినప్పటికీ జనాభా గణన 3 యేళ్లు ఆలస్యమైంది.
కరోనా మహమ్మారి కారణంగా జనాభా లెక్కల సేకరణ ఆలస్యమైంది. పరిస్థితులు చక్కబడినప్పటికి కేంద్ర ప్రభుత్వం జనాభా గణన పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం జనాభా గణన నిర్వహణ పట్ల స్పష్టత ఇవ్వడం లేదు. జనాభా లెక్కలను వాయిదా వేయడం మీద చూపించే శ్రద్ధ నిర్వహణ పట్ల దృష్టి పెట్టని స్థితి నెలకొనడం వల్ల ప్రజా సంక్షేమం అటకెక్కింది.
జనాభా గణన చరిత్ర
మన దేశంలో బ్రిటిష్‌ వారు తొలి జనగణన 1881 సంవత్సరంలో నిర్వహించారు. బ్రిటిష్‌ వాళ్ళ పాలన కాలంలో దేశంలో కొన్ని విపత్తులు సంభవించినప్పటికి జనాభా గణన వాయిదా పడలేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జనాభా లెక్కలు సేకరించారు. వాయిదా వేయలేదు. దేశంలో 1918లో దేశవ్యాప్తంగా స్పానిష్‌ ఫ్లూ ఏర్పడి ప్రజారోగ్యం దెబ్బతిన్నా జనగణన ఆగిపోలేదు. 1921 లో రిజిస్ట్రార్‌ జనరల్‌ జనాభా లెక్కల కమిషనర్‌ కార్యాలయం జనగణన సకాలములో పూర్తి చేసింది. 1947 లో దేశ విభజన జరిగి పాకిస్థాన్‌ భారత దేశంగా విడిపోయినప్పటికీ జనాభా లెక్కలు ఆగిపోలేదు. బ్రిటిష్‌ వారి నుండి భారతీయులకు అధికార బదిలీ గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ 1951లో జనగణన యదావిధంగా జరిగింది.
జనాభా లెక్కలు సేకరణ నిర్వహణకు ఒక సంవత్సరం ముందు నుండే ప్రణాళికలు రూపొందించి ఆ ప్రణాళిక ప్రకారం 2020 ఏప్రిల్‌ సెప్టెంబర్‌ మధ్య దేశంలోని అన్ని గృహాలకు వెళ్లి గృహాలలో నివాసం ఉంటున్న వ్యక్తుల వివరాలు సేకరించి తర్వాత సంవత్సరం ఫిబ్రవరిలో దేశంలోని మొత్తం జనాభా లెక్కిస్తారు కానీ దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల జనకదలిక మీద విధించిన నిబంధనలు అమలు వల్ల జనాభా గణన వీలుపడలేదు. కరోనా అనంతరం జనాభా గణన వాయిదా పడుతూనే వుంది. గతంలో జనాభా గణన సరిగ్గా జరుగా లేదని సేకరించిన వివరాలు కచ్చితంగా లేవని జనాభా గణన కొత్త పద్ధతిలో చేపడతామని నూతన సాంకేతిక ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చేపట్టనున్నట్లు దేశ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఈ సారి జనాభా గణనలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా 35 కంటే ఎక్కువ సామాజిక ఆర్థిక కొలమానాల ఆధారంగా జనాభా లెక్కలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జన గణన ఆధారంగా జనాభా రిజిస్టర్‌ ఎలక్టోరల్‌ రోల్‌ రిజిస్టర్‌, ఆధార్‌ కార్డు రేషన్‌ కార్డు ‘పాస్‌ పోర్ట్‌’ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన వివరాలను డాటాను అప్డేట్‌ చేసి నవీకరించడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పడం గమనార్హం.
దేశంలో 2024 న లోకసభకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల వల్ల జనాభా లెక్కల సేకరణ చేపట్టే అవకాశాలు లేవు. దేశంలో లోక్‌ సభ, రాష్ట్ర విధాన సభల్లో మహిళా రిజర్వేషన్‌ బీసీ రిజర్వేషన్‌ జనగణనలో కుల గణన చేపట్టాలని డిమాండ్‌ బలంగా వున్నందున 2027 లో జరిగే జనాభా లెక్కల్లో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
జనాభా లెక్కల ప్రకారం లోక్సభకు రాష్ట్ర విధాన సభలకు ఎస్సీ, ఎస్టీ, మహిళా, బిసి రిజర్వేషన్‌ నిర్ధారించడం లోక్‌ సభ, విధాన సభ నియోజక వర్గాల పరిధిని నిర్ణయించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ ఎస్టీల బీసీల సంక్షేమానికి వ్యవసాయ పారిశ్రామిక, సేవా రంగాలకు నిధుల కేటాయింపు జనాభా నిష్పత్తి ప్రకారం చెయ్యాలి. జన గణనతో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, అభివృద్ధి స్థాయిలను అంచనా వేయవచ్చును. దేశంలో వెనుక బడిన ప్రాంతాలు పర్వత ప్రాంతాల ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం జనాభా గణన దిక్సూచి లాగా పనిచేస్తుంది.
ప్రభుత్వం జనాభా లెక్కలను నిర్దిష్ట కాలంలో నిర్వహించకపోవడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి.
దొంగ ఓట్ల బెడద ప్రభుత్వం జనాభా లెక్కలను సకాలంలో నిర్వహించి వుంటే జనాభా జాబితాతో ఓటర్ల జాబితాను సరిచుకునేది. దీనివల్ల దొంగ ఓటర్ల బెడద నమోదును అడ్డుకునే అవకాశం ఉండేది. దేశవ్యాప్తంగా అనేక నియోజక వర్గాలలో ఒకే ఓటరు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల నియోజక వర్గాలలో ఓటర్లుగా నమోదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ లో నకిలీ ఓటర్లు అధిక సంఖ్యలో రిజిస్టర్‌ అయినట్లు తెలుస్తోంది. ఇంటి నెంబర్‌ ‘నో’ అనే పేరు మీద వందల ఓటర్లు నమోదు అయినట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నకిలీ ఆధార్‌ కార్డులు పెరిగిపోతున్నాయి. ఆధార్‌ కార్డ్‌ రేషన్‌ కార్డ్‌ జన్‌ ధన్‌ ఖాతాలు ఆధార్‌ కార్డుతో అనుసంధానించడం వల్ల అనేక ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ప్రయోజనాలు అసలు లబ్ధిదారులకు అందడం లేదు. నకిలీ వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో జనాభా లెక్కలు సేకరిస్తే ఇలాంటి నష్టాలను అరికట్టవచ్చును. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అటవీ కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఆధార్‌ కార్డ్‌ను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా వున్న వారిని అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగస్వాములను చేయాలంటే జనాభా లెక్కలు సేకరించాలి.
ఇప్పటికీ దేశంలో 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారమే రేషన్‌ కార్డులు జారీ చేయడం వల్ల 10 కోట్ల మంది అసలైన లబ్దిదారులు నష్టపోతున్నారు ఒక అధ్యయనంలో వెల్లడైంది. జనాభా గణన ఆలస్యం అయితే కోట్లాది లబ్దిదారులు నష్టపోయే ప్రమాదం వుంది. ప్రభుత్వం త్వరిత గతిన సకాలములో జనాభా లెక్కలు పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలి. జనగణన పైననే జన సంక్షేమం అభివృద్ధి ఆధారపడి వుంది.
నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు

  • 9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News