దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 నగరాలను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేయడం నిజంగా హర్షణీయమైన విషయం. ఆర్థికాభివృద్ధి విషయంలో ఉన్నత ఆశయాలను, లక్ష్యాలను ఏర్పరచుకున్న భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థకు ఇటువంటి ప్రణాళికలు తప్పనిసరి. ఆరు పారిశ్రామిక నడవాలలో రూ. 28,000 కోట్ల వ్యయంతో ఈ 12 పారిశ్రామిక నగరాలను నిర్మించడం జరుగుతుంది. ఈ నగరాల్లో హరిత క్షేత్రాలతో పాటు, నివాస గృహ సముదాయాలను, వాణిజ్య సంస్థలను కూడా నిర్మించడం జరుగుతుంది. అనేక ఆధునిక సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ఈ పారిశ్రామిక నగరాలు అనేక ఏళ్లపాటు కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం కూడా భాగ స్వామ్యం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా భూమిని సమకూర్చు తుండగా కేంద్ర ప్రభుత్వం ఈక్విటీని లేదా రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. కొంత విదేశీ సహకారానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 1.5 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించాలన్న ఆలోచన చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాలను, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగాలను సృష్టించగలమని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. పారిశ్రామిక పార్కులకు సంబంధించి ఇదొక సువర్ణావకాశమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించారు.
ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఎదుగుతున్న ఈ స్థితిలో ఇటువంటి బృహత్తర కార్యక్రమం అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ నగరాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను, పరిశ్రమలను ఎంపిక చేయడం జరిగింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా భారతదేశాన్ని పారిశ్రామికంగా ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తలపెట్టింది. ఈ నగరాల్లో జౌళి పరిశ్రమలు, ఫ్యాబ్రికేషన్, విద్యుత్ వాహనాలు, ఏరో లాగిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం వంటి వంటివి ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఇక్కడి నుంచి 2030 నాటికి 20 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. చాలా కాలం పాటు కసరత్తు వేసి ఈ భారీ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. దీని అమలు మీద కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలు ఆధారపడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రత్యేక ఆర్థిక మండలా (SEZ)లను, 2014లో మేకిన్ ఇండియా (make in India) పథకాన్ని, 2015లో స్మార్ట్ సిటీ మిషన్‌ను (smart city mission) ప్రారంభించి, చాలావరకు ఆర్థికాభివృద్ధిని సాధించింది.
అయితే, ప్రభుత్వం మొదట్లో పేర్కొన్నంతగా ఈ పథకాలు పూర్తి స్థాయిలో లబ్ధిని చేకూర్చలేక పోయాయనే విమర్శలు ఉన్నాయి. ఈ సెజ్ లు చైనాలో మాదిరిగా లక్ష్యాలను సాధించలేక పోయాయి. ఇతర పథకాలు కూడా నత్తనడక నడుస్తున్నాయన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం ఈ 12 పారిశ్రామిక నగరాల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించిన సమయంలో వెనుకటి పథకాల స్థితిగతులను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అవి పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించింది. ఈ అధ్యయనాలు కొత్త పథకానికి మార్గదర్శకంగా ఉపయోగపడవచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలన్నా, ఆశించిన ఫలితాలను సకాలంలో ఇవ్వాలన్నా సామాజిక, భౌతిక ప్రాథమిక సదుపాయాల లభ్యత మీదా, కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం మీదా, భూ సేకరణ మీదా, పన్నుల వెసులుబాట్ల మీదా, విధానాల స్థిరత్వం మీదా అంతా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతి సంస్థా సవ్యంగా, సమస్యలు లేకుండా ప్రారంభం కావడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.