దేశంలోని మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ను మొదలుపెట్టినట్టు వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇతర వైరల్ వ్యాధులకు, ఇతర అంటువ్యాధులకు వ్యాక్సిన్ ఇస్తున్నట్టే ఈ గర్భాశయ క్యాన్సర్ కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని, ముఖ్యంగా 9-15 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ ను విధిగా చేయించాలని కేంద్ర ప్రభుత్వం రెండు వారాల క్రితమే విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే, ఇటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, దేశంలో రాను రానూ విజృంభిస్తున్న గర్భాశయ క్యాన్సర్ విషయంలో ఇటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. స్థన క్యాన్సర్ తర్వాత అంత పెద్ద ఎత్తున మహిళలకు సోకుతున్న ఈ గర్భాశయ క్యాన్సర్ విషయంలో ఇక ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ఈ వ్యాధికి గురవుతున్న మహిళల్లో అయిదవ వంతు మంది భారతదేశంలోనే ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు కూడా తెలియజేసింది.
దేశంలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో దాదాపు 45 కోట్ల మందికి ఈ గర్భాశయ క్యాన్సర్ సోకే అవకాశం ఉన్నట్టు ఆస్పత్రుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలో ఎక్కువ మందికి రోగ నిర్ధారణ జరగకపోవడం వల్ల, సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్ ను గురించిన వివరాలు అందకపోవడం జరుగుతోంది. విచిత్రమేమిటంటే, స్త్రీలలో కనిపించే ఈ గర్భాశయ క్యాన్సర్ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే సెర్వాక్ పేరుతో ఔషధాన్ని ఉత్పత్తి చేసింది. సుమారు ఏడాది కాలం నుంచి ఇది మార్కెట్లో కూడా ఉంది. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కు కారణమవుతున్న కణాలపైన ఈ ఔషధం బాగా పనిచేస్తోందని అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థలు గుర్తించాయి. అంతేకాదు, ఈ ఔషధాన్ని 2022లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించడం కూడా జరిగింది. దీనిని పరీక్షించడం, నిర్ధారించడం, గుర్తించడం వంటి ప్రక్రియలు తేలికపాటివే అయినప్పటికీ, ఈ వ్యాధి పట్ల, రోగ నిర్ధారణ పట్ల సరైన అవగాహన లేనందువల్ల మహిళలు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు.
అంతేకాక, కొన్ని విదేశీ కంపెనీలు అత్యంత ఎక్కువ ధరతో మందులు, మాత్రలు విక్రయిస్తున్నందు వల్ల మహిళలు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. వ్యాక్సిన్ విషయాలకు సంబంధించిన జాతీయ సాంకేతిక సలహా బృందం గర్భాశయ క్యాన్సర్ నిరోధానికి సంబంధించిన వ్యాక్సిన్ ను కూడా జాతీయ వ్యాధి నిరోధక వ్యాక్సిన్ కార్యక్రమంలో చేర్చాలని 2018లోనే సిఫారసు చేసినప్ప టికీ, మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర బాగా ఎక్కువగా ఉండడం, దాని ఉత్పత్తి వ్యయం కూడా భారీగా ఉండడం వల్ల ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి సందేహిస్తోంది. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి విజృంభించడంతో ప్రభుత్వ దృష్టి కోవిడ్ మీదకు మళ్లింది. ప్రస్తుతం కోవిడ్ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ బాగా చౌక అయినందువల్ల, కోవిడ్ చాలావరకు మటుమాయం అయినందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా గర్భాశయ క్యాన్సర్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో పటిష్టమైన వ్యాక్సినేషన్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పడి ఉంది. పెద్ద ప్రయత్నం అవసరం లేకుండానే ఏ వ్యాధికైనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అంతేకాక, ఏ వ్యాక్సిన్ ను అయినా పాఠశాల స్థాయిలో ప్రారంభించడం వల్ల వ్యాధుల నివారణకు, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. పాఠశాలల్లో బాలికలను లక్ష్యంగా చేసుకుని గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ఈ వ్యాధిని నివారించడానికి గతంలో రెండు పర్యాయాలు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉండేది కానీ, ఇప్పుడు ఒక్క వ్యాక్సిన్ తోనే దీన్ని నివారించడానికి అవకాశం ఉందని పరీక్షలు, ప్రయోగాలు, సర్వేల్లో తేలిపోయింది. పాఠశాల విద్యార్థినులందరికీ ఈ వ్యాక్సిన్ ను ఒకటి రెండు డోసులు ఇవ్వడం చాలా మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 దేశాలు ఈ వ్యాక్సిన్ ను క్రమబద్ధంగా ఇవ్వడం జరుగుతోంది. భారత ప్రభుత్వం కూడా దేశంలోని మహిళల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా వెంటనే ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టడం మంచిది.