Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Chaitanya Spoorthy: సమాజ సమస్యలపై ఎత్తిన కలం- గళం

Chaitanya Spoorthy: సమాజ సమస్యలపై ఎత్తిన కలం- గళం

‘చైతన్య స్ఫూర్తి’ చిటికెన వ్యాస సంపుటి

ఎప్పుడైనా కవి గానీ, రచయిత గానీ తమ చుట్టూ పరిభ్రమిస్తున్న ఏవేని అంశాల పైనో, అలాగే ఏవో విషయాలకు మనసు స్పందించి వాటిపట్ల తమ అభిప్రాయాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కవిత, వ్యాసం, కథ ఇలా ఏదో రూపంలో రాస్తూ వుంటారు. అలాగే ఇదమిద్ధంగా తేల్చుకోలేని అనేక విషయాలు మనసును సందిగ్ధంలో పడేస్తూ ఉంటే సమాజంలో ఒక వ్యక్తి ఏది నిజం? ఏది అబద్ధం అని తెలుసుకోలేని తరుణంలో వాస్తవాన్ని తెలియ జేయడానికి నేను చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం అంటూ తాను రాసిన వ్యాసాల సంపుటి ‘చైతన్యస్ఫూర్తి’ ద్వారా తన కలం యొక్క ఉద్దేశ్యాన్ని ప్రస్ఫుటంగా చెప్తున్నారు. ఇంటర్నేషనల్‌ బెనెవోలెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సభ్యులు డా. చిటికెన కిరణ్‌ కుమార్‌… కవిగా, రచయితగా, సమాజహితాన్ని కోరే పౌరునిగా ఆయన రాసిన రచనలు వివిధ పత్రికల్లో ముద్రింపబడ్డాయి..
‘వనితా! నీకు వందనం’.. అనే వ్యాసంతో ప్రారంభమైన ఈ సంపుటిలో అనేకమైన అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఈ వ్యాసంలో ప్రతి మానవతా మనుగడకు ప్రధానమైనది స్త్రీ అయివుండి కూడా ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు పుట్టుకతోనే ప్రారంభమవుతాయని, సమాజం ఎంత మారినా ఆమెకు జరుగుతున్న అన్యాయాలు మారడం లేదని, తనంతట తాను స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రత పొంది, పరిణతి సాధించాలని సూచిస్తారు. స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవం అమితమైనది. ‘మన భారతదేశమే గొప్ప’ అనే వ్యాసంలో భారతదేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ ప్రపంచానికే దిక్సూచి మనదేశమంటూ జాతీయతను చాటుకున్నారు. సామాజిక చైతన్యమే సమ సమాజ నిర్మాణం అనే వ్యాసంలో ట్రాన్స్‌జెండర్‌ల మానసిక వేదనను, సమాజం వారిపట్ల చూపుతున్న వివక్షతను వివరిస్తూ ఒక సా మాజిక ఒప్పందంతో జీవిస్తున్న మనం తోటివారిని నిరాదరణకు గురిచేయడం అమానుషం అంటారు. యువత మాదక ద్రవ్యాలను వీడాలి అనే వ్యాసం నేటి యువత వ్యసనాలకు లోబడి జీవితాలను నరకప్రాయం చేసుకుంటూ తల్లిదండ్రుల ఆవేదనకు కారణం అవుతుండడాన్ని అద్దం పడుతుంది. దీనిలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వారి బాధ్యతలు నిర్వర్తించాలనే ఆకాంక్ష వ్యక్తమవుతుంది. యువత విచక్షణతో ఆలోచించి మార్పుకు వాళ్లే కారణంగా నడుం బిగించాలనే కోరిక వ్యక్తమవుతుంది. అంతర్జాలం మనిషి విజ్ఞానా నికి చిహ్నమైనా, దాని వలలో పడిపోకూడదంటూ, దాంట్లోని మంచిని మాత్రమే గ్రహించమని, మితిగా వాడమని ఉద్భోదిస్తారు.
కాలుష్యం వల్ల ఓజోన్‌ పొరకు కలుగుతున్న నష్టాన్ని, తద్వారా ప్రపంచం ఎదుర్కోబోయే విపత్తును సూచిస్తూ ‘కాలుష్య నియంత్రణ బాధ్యత మనదే’ అని మానవాళికి కర్తవ్యాన్ని బోధిస్తారు. ‘కరోనాతో అనుబంధాల పాత్ర అంటూ’ కరోనా ప్రపంచానికి మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదని, మరోవైపు కరోనా మనుషుల మధ్య ఆత్మీయతలను పెనవేసిన వైనాన్ని చెప్తారు. ఇవేకాకుండా వివేకానందుడు, దాశరథి లాంటివాళ్ళ మహోపకారాలు మరోసారి మనకు గుర్తుచేస్తారు. ‘బతుకమ్మలో గౌరమ్మ’ అనే వ్యాసంలో తెలంగాణ బతుకమ్మ పండుగ తీరుతెన్నులను వర్ణిస్తారు. ఇంకా ఈ పుస్తకంలో మనుషులకు ఉండాల్సిన ఆత్మవిశ్వాసాన్ని గురించి, దాని ద్వారా ఏ లక్ష్యాలైనా సాధింపవచ్చని, వ్యాయామం ద్వారా పరిపూర్ణ ఆరో గ్యవంతులు కావచ్చునని, ఆర్థికవ్యవస్థలో వస్తున్న తీవ్రమైన మార్పులను గురించి ఇలా ఎన్నో విషయా లు సంక్షిప్తంగా తెలియజేయబడ్డాయి. వీటిని చదివిన ప్పుడు రచయితకు సమకాలీన సమస్యల పట్ల, జరుగుతున్న మార్పుల పట్ల స్పష్టమైన అవగాహన ఉందని తెలుస్తుంది. ఈ కాలంలో సమాజ శ్రేయస్సును కాం క్షించే మంచి సామాజిక దృక్పథం ఉన్న రచయితగా ఆయనను పేర్కొనవచ్చు. ఆయన రచించిన ‘ఓ తండ్రి తీర్పు కథ’ శ్రీరామ దూత ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై లఘు చిత్రంగా రూపొందగా ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అసోసియేషన్‌ వారిచే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు అందు కోవడం వారి రచనా నైపుణ్యాన్ని బలపరుస్తున్నది. సమాజ హితుడైన కిరణ్‌ కుమార్‌ కలం నుండి మరెన్నో ఆణిముత్యాలు జాలువారాలని కోరుకుంటున్నాను.

  • అరుణ ధూళిపాళ
    సమీక్షకులు
    హైదరాబాద్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News