Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Chalam: స్త్రీవాదానికి ఆద్యుడు గుడిపాటి వెంకట చలం

Chalam: స్త్రీవాదానికి ఆద్యుడు గుడిపాటి వెంకట చలం

మహిళల హక్కులు, వారి సాధికారికత, వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల విషయంలో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి సాహితీవేత్తలు సంస్కరణోద్యమాలు చేపట్టారు కానీ, గుడిపాటి వెంకట చలం మాత్రం మరో అడుగు ముందుకు పోయి, ఆచార సంప్రదాయాల సంకెళ్ల నుంచి మహిళను విముక్తి చేయడానికి తన రచనల ద్వారా విశృంఖలంగా పోరాడారు. ఒక సంస్కర్తగా కాక, సాటి వ్యక్తిగా, సాటి మానవుడిగా స్త్రీల సమస్యలమూలాల్లోకి వెళ్లి అతి సున్నితమైన సమస్యలను కూడా స్పృశించి పరిష్కారాలు చూపడం జరిగింది. 1894లో కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన చలం ఆ తర్వాత తిరువణ్ణామలై వెళ్లి స్థిరపడ్డారు.1925లో ఆయన రాసిన ‘మైదానం’ అనే నవల ఆయనలోని స్త్రీవాద ధోరణికి అసలైన ప్రతీక.ఇది నిజంగా బాగా లోతుగా అధ్యయనం చేయాల్సిన పుస్తకం. స్త్రీల సమస్యలు, హక్కులు, వాటికి ఎదురవుతున్న ప్రతిబంధకాలు వగైరాల గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రంథాలు వెలువడ్డాయి కానీ, చలం రాసిన మైదానం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది.
మహిళలకు ఎటువంటి బాదర బందీ లేని పరిపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రాలుండాలని చలం వందేళ్ల కిందటే కోరుకున్నారు. సంప్రదాయ కుల వ్యవస్థకబంధ హస్తాల నుంచి, ఆచార వ్యవహారాలు, మూఢ నమ్మకాల నుంచి వారికి విముక్తి లభించడానికి విప్లవాత్మకంగా తన రచనల ద్వారా పోరాడారు ఆయన. మతం పేరుతో, సంస్కృతి పేరుతో మహిళలను అణచివేయడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ఇందుకు దోహదం చేస్తున్న, మద్దతునిస్తున్న సామాజిక పరిస్థితుల మీద ఆయన కఠిన పదజాలంతో దాడి చేశారు. మైదానం కథలోకి వస్తే&.ఒక న్యాయవాది భార్య ఆయనను పెళ్లి చేసుకునేముందు అమీర్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆమెకు ఈ న్యాయవాదిని పెళ్లి చేసుకోవడం, అతనితో కాపురం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు. నిర్లిప్తంగా, అనాసక్తంగా అతనితో కాపురం చేస్తుంటుంది. తాను ప్రేమించిన అమీర్‌తో కలిసి నైజామ్‌కు పారిపోవాలన్ని నిర్ణయించుకుంటుంది. స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌ప్రాంతాన్ని నైజామ్‌ రాష్ట్రం అనేవారు. ఈ నవలలోని న్యాయవాది గుర్రపు బగ్గీలో బయటకు వెళ్లడాన్నిబట్టి అప్పటిపరిస్థితులను అర్థంచేసుకోవచ్చు. ఆమె అమీర్‌తో వెళ్లిపోయిన తర్వాత, రచయిత ఇతర పాత్రల ద్వారా సంప్రదాయ కుల వ్యవస్థ మీదా, ఆచార వ్యవహారాల మీదా, సంస్కృతీ సంప్రదాయాల మీదా తీవ్రంగా దాడిచేయడం ప్రారంభిస్తారు. ఈ కట్టుబాట్ల వల్ల మహిళలు ఎంతగా నాశనం అయిపోతున్నదీ తెలియజేస్తాడు. తన భావాలను వెల్లడించేందుకు ఆయన రాజేశ్వరి పాత్రను ఎంపిక చేసుకున్నారు. ఆమె కూడా సంప్రదాయ కులానికి చెందిన మహిళే.
అమీర్‌తో వెళ్లిపోయిన రాజేశ్వరి కొంత కాలంపాటు అతనితో బాగానే కాపురం చేస్తుంది. అయితే, అమీర్‌ తన మతానికి చెందిన మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది. దాంతో కలతలు ప్రారంభం అవుతాయి. ఈలోగారాజేశ్వరి గర్భవతి అవుతుంది. గర్భం తీయించుకోమని అమీర్‌ సలహా ఇస్తాడు. తమమధ్యలోకి మూడవ వ్యక్తి రాకూడదని చెబుతాడు. ఈ క్రమంలో రాజేశ్వరిని దారుణంగా హింసిస్తుంటాడు. చివరికి రాజేశ్వరిని వదిలిపెట్టి రెండవ భార్య మీరాతో వెళ్లిపోతాడు. విచిత్రమేమిటంటే, రాజేశ్వరి రాజీపడి మీరా దగ్గరికి వెడుతుంది. ఈ ఇద్దరి మధ్యా స్నేహం కుదురుతుంది. ఈ ఇద్దరు మహిళల సమస్యా ఒకటే అయినందువల్ల వీరి పోరాటాలు, వీరి మనోభావాల గురించి రాస్తూ, చలం స్త్రీ జాతి పరిస్థితిని, దుస్థితిని చక్కగా కళ్లకు కట్టిస్తారు. దీని నుంచి బయటపడడానికి మహిళల ద్వారానే జరగాల్సిన ప్రయత్నాన్ని, కృషిని కూడా ఆయన వివరించారు. అప్పట్లో ఈ నవల తీవ్ర సంచలనం సృష్టించింది. చలాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభం అయింది. ఆయన ఒక చర్చనీయాంశంగా మారిపోయారు. చలాన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేక స్త్రీవాద రచనలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి. ఆయన స్ఫూర్తితోనే పలువురు స్త్రీవాద రచయితలు కూడా తెర మీదకు వచ్చారు. చలం ఆ విధంగా తెలుగునాట స్త్రీవాదం వేళ్లూనుకుని, విస్తరించడానికికారకుడయ్యారు.

- Advertisement -

జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News