పద్ధెనిమిదవ లోక్ సభకు జరిగిన స్పీకర్ ఎంపికను బట్టి పాలక ఎన్.డి.ఎ ప్రభుత్వం వెనుకటి విధానాలనే కొనసాగించే ఉద్దేశంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. స్పీకర్ ఎంపికలోనూ, ఎన్నిక లోనూ తమకు కూడా ప్రమేయం ఉండాలన్న ప్రతిపక్షాల కోరిక తీరే అవకాశం కనిపించలేదు. పార్లమెంటులో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని బట్టి, ఈ పర్యాయం లోక్ సభ సజావుగా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. పాలక, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో వ్యవహరించే పక్షంలో స్పీకర్ తన బాధ్యతలను సరైన విధంగా నిర్వహించగలుగు తారు. ఈ రెండు పక్షాలు ఘర్షణవాదానికి సిద్ధపడే పక్షంలో స్పీకర్ వ్యవహార శైలి కత్తి మీద సాముగానే కొనసాగుతుంది. స్పీకర్ ఓం బిర్లా 17వ లోక్ సభలో కూడా కత్తి మీద సామే చేశారు.
స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, తాము ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఏకాభిప్రాయ సాధన ద్వారానే దేశ పాలన సజావుగా, సక్రమంగా కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే, గత లోక్ సభ సమావేశాల అనుభవాన్ని బట్టి, పార్లమెంటును సజావుగా కొనసాగనివ్వబోమంటూ రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలు ఇప్పటికే చేసిన ప్రకటనలను బట్టి, ఈ ఏకాభిప్రాయ సాధనకు మార్గం సుగమంగా ఉండేలా కనిపించడం లేదు. స్పీకర్ పదవికి సంబంధించిన అభ్యర్థిని పాలక పక్షమే ఎంపిక చేయడం, పాలక పక్షం నుంచే ఎంపిక చేయడం సాంప్రదాయం మాత్రమే కాక, అనివార్యం కూడా. స్పీకర్ ఎంపికలో ప్రతిపక్షాలకు ప్రమేయం ఉండాలనడంలో అర్థం లేదు. దేశ 75 ఏళ్ల చరిత్రలో స్పీకర్ ఎంపిక పాలక పక్షం నుంచే జరిగింది తప్ప మరో విధంగా జరగలేదు.
మూజువాణీ ఓటుతో స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ పదవికి ఎన్నిక జరగడం ఇదే మొదటిసారి. ప్రతిపక్షాలకు ఉప సభాపతి పదవిని వదులుకోవడానికి పాలక కూటమి ససేమిరా అనడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఇదివరకు ఉప సభాపతి పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వడం జరిగేది. లోక్ సభ పాలక పక్షానిదే కాక ప్రతిపక్షాలది కూడా అనే సదభిప్రాయంతో ఉప సభాపతి పదవిని ప్రతిపక్షాలకు వదిలిపెట్టడం జరిగేది. నిజానికి స్పీకర్ అభ్యర్థికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపక్షంతో కూడా సంప్రదింపులు జరిపింది. అయితే, ప్రతిపక్షాల మంకుపట్టు కారణంగా దీని మీద ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వం 17వ లోక్ సభ స్పీకర్‌గా వ్యవహరించిన ఓం బిర్లా పేరునే ఖాయం చేసింది. స్థిరత్వం కోసం, కొనసాగింపు కోసం తాము ఓం బిర్లానే స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
గత లోక్ సభ సమావేశాల్లో స్పీకర్ వివాదాస్పదంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లోక్ సభ నిర్వహణ విషయంలోనే కాక, ప్రతిపక్షాలతో వ్యవహరించడంలో కూడా ఓం బిర్లా విమర్శలకు గురయ్యారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. గత లోక్ సభ సమావేశాల సందర్భంగా అనేక సస్పెన్షన్లు, బహిష్కరణలు చోటు చేసుకున్నాయి. గత శీతాకాల సమావేశాల్లో అనేక మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ చేయడం జరిగింది. ఒకే రోజున 78 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ చేసి స్పీకర్ రికార్డు సృష్టించారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేసి, అనేక ప్రధాన బిల్లులను ఆమోదించడం కూడా జరిగింది. తాను పక్షపాత రహితంగా వ్యవహరిస్తానని పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓం బిర్లా ప్రకటించారు. లోక్ సభలోని ప్రతి సభ్యుడు పార్లమెంటు విలువలకు, సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించాలని కూడా స్పీకర్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వం బాధ్యత వహించాలని కూడా వ్యాఖ్యానించారు.
అత్యవసర పరిస్థితిని విధించడమనేది ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే కానీ, లోక్ సభలో ప్రత్యేకంగా దీన్ని గుర్తు చేయడాన్ని బట్టి ఆయన మున్ముందు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకోబోతున్నారన్నది అర్థమవుతూనే ఉంది. స్పీకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిం దని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో మాదిరిగా స్పీకర్ వ్యవహరించకపోవడం మంచిది. పాలక, ప్రతిపక్షాలు సజావుగా వ్యవహరించే పక్షంలో స్పీకర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. పాలక పక్షమే కాదు, ప్రతిపక్షాల వైఖరి కూడా సజావైన చర్చలకు, ఏకాభిప్రాయ సాధనలకు కలిసి రావలసి ఉంటుంది.