మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత అయిన ఎన్. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి. జాతీయ పార్టీల నాయకులకే కాక, ప్రాంతీయ పార్టీల నాయకులకు కూడా కేంద్ర బిందువుగా, ప్రధాన రాజకీయ కేంద్రంగా వ్యవహరించిన వ్యక్తి ఆయన. 1995లో 45 ఏళ్ల వయసులో మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన చంద్రబాబు నాయుడు అతి స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ కూటమిలోనే కాకుండా బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ కూటమిలో కూడా కీలక పాత్ర పోషించారు. ఒక అజేయ నాయకుడుగా, అంతకు మించి చైతన్యవంతమైన నాయకుడుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భారత రాజకీయ రంగంలో రెండు భిన్న ధ్రువాలకు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించడం ఒక అరుదైన విషయం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఆయన నరేంద్ర మోదీ హవాను ఊతం చేసుకుని 2014లో ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. అయితే, అదృష్టం అనేది ఎవరికైనా తారుమారు అవుతుంటుంది. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం.
1990లలో అతి పిన్న వయసులో తాను ముఖ్యమంత్రి అయినట్టే వై.ఎస్.ఆర్.సి.పి యువ నాయకుడైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 2023 సెపెంబర్ 10 వచ్చేసరికి చంద్రబాబు ఒక్కసారిగా ఒంటరివాడయిపోయారు. ఇది వరకటి మాదిరిగా ఇతర నాయకుల సాన్నిహిత్యం కానీ, ఇతర పార్టీల మద్దతు గానీ ఆయనకు ఈసారి లభించలేదు. ఊహించని విధంగా ఒక అవినీతి కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లాల్సి వచ్చింది. ఆయనను అదృష్టం వదిలిపెట్టేసిందేమోనన్న అభిప్రాయం కలుగుతోంది.
నిజానికి ఇదేమీ శిక్ష కాదు. అయితే గియితే ఆయనకు బెయిల్ లభించవచ్చు. చివరికి ఆయనను నిర్దోషిగా న్యాయస్థానాలు వదిలేయవచ్చు. అయితే, ఇదంతా ఆయన రాజకీయ జీవితం మీద ఒక మాయని మచ్చగా ఉండిపోతుంది. ప్రతిభ, నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించే పేరుతో డొల్ల కంపెనీల ద్వారా సుమారు రూ. 371 కోట్లను ఆయన స్వాహా చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. గత రెండేళ్లుగా జి.ఎస్.టి, ఇ.డి, సి.ఐ.డి సంస్థలు ఈ లావాదేవీల మీద దర్యాప్తు సాగిస్తున్నాయి. రిమాండ్ రిపోర్టును బట్టి చూస్తే 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు అనేక నిబంధనలను ఉల్లంఘించినట్టు తేటతెల్లం అవుతోంది. ఈ లావాదేవీల లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ, దాని నాయకుడేనని రిపోర్టు ఆరోపణ చేసింది. ఇందుకు సంబంధించి సి.ఐ.డి అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయా, లేవా అన్నది తేలవలసి ఉంది.
దీనికి సంబంధించిన రాజకీయ ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం. అయితే, ముడుపుల రూపంలో అందుకున్న రూ. 118 కోట్లను అప్రకటిత సంపదగా పరిగణించడం జరుగుతుందంటూ ఆదాయపు పన్ను శాఖ ఇదే సమయంలో నోటీసులు ఇవ్వడం మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా తయారైంది. గత దశాబ్దకాల అనుభవాన్ని బట్టి చూస్తే, వివిధ దర్యాప్తు సంస్థలు ఆయన మీద ఓ కన్నేసి ఉన్నట్టు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న విషయం నిజమే కానీ, ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోందా అన్న విషయం మాత్రం నిర్ధారణ కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఇంతకు మించిన విషయం ఏదో ఉన్నట్టు కనిపిస్తోంది.
జైలులో ఎక్కువ కాలం ఉన్న పక్షంలో పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. పార్టీలో ఆయనకు దీటైన వ్యక్తి మరొకరు లేకపోవడం పార్టీకి ఇబ్బంది కలిగిస్తుంది. తెలుగుదేశం పార్టీ ముందున్న అవకాశాలు చాలా తక్కువ. దీనికంతటికీ పరిష్కారం చివరకు బీజేపీ కావచ్చు. చంద్రబాబు మనసులో ఇప్పటికే ఒప్పందం రూపుదిద్దుకుంటూ ఉండవచ్చు. ఆయన ఈ సంక్షోభం నుంచి బయటపడతారా అన్నది పార్టీనీ, కుటుంబ సభ్యులనూ తొలిచేస్తున్న ప్రశ్న. ప్రస్తుతానికి ఏ అవకాశాన్నీ, ఏ పరిష్కారాన్నీ తీసిపారేయలేం.
Challenges for Chandrababu: చంద్రబాబు ఎదుట అతి పెద్ద సవాలు
పార్టీ బలహీనపడితే..