Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్అసమానతలపై నినదించిన ధిక్కారస్వరం

అసమానతలపై నినదించిన ధిక్కారస్వరం

వివక్షకు మంత్రే గురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటో

కులతత్వం, లింగ వివక్ష, కుట్రాజకీయాలు, ధన బలంతో కూడుకున్న రాజకీయాలను నిరశిస్తూ పుదుచ్చేరి 30 మంది శాసనసభ్యులు గల పుదుపుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన ఏకైక మహిళా శాసనసభ్యురాలు, దళితురాలు మరియు రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన (ఎ.ఐ.ఎన్‌. ఆర్‌.సి మరియు బి.జె.పి సంకీర్ణ మంత్రివర్గం) ఎస్‌. చందిర ప్రియంగ అసమానతలపై ధిక్కారస్వరంతో నినదించి ఈ అక్టోబర్‌ 10 నాడు ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేసి దేశవ్యాప్తంగా సరికొత్త సంచలనం సృష్టించారు. ఆమె పుదుచ్చేరిలో మొదటి మహిళా మంత్రి కావడం గమనార్హం. గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్ర పాలిత ప్రాంతంలో మంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమె చరిత్రాత్మక రికార్డుని సాధించారు. ఆమె ఇతరు లలో కలిసి హౌసింగ్‌ మరియు లేబర్‌ మరియు ఎంప్లాయ్మెంట్‌ పోర్ట్ఫోలియో బాధ్యతలను కూడా నిర్వహించారు. ‘పురుషాధిక్య రాజకీయ రంగంలో కుల, లింగ వివక్షను అధిగమించడం తనకు కష్టంగా మారినందున తాను తప్పనిసరి పరిస్థితులలో మంత్రిగా వైదొలగాల్సి వచ్చింది’ అని పేర్కొనడాన్ని చాలా సునిశితంగా గమనించవచ్చు. ‘కుట్రాజకీయాలను నిరంతరం భరించాల్సిన విషమ పరిస్థితులలో తాను పదవిలో కొనసాగడం ఏమాత్రం సహేతుకం కాదు’ అని ఆమె పేర్కొనడం రాజకీయ అసమానతలను చాలా సృష్టంగా ఎత్తిచూపుతుంది. 2021 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో ఎస్‌. చందిర ప్రియంగ ఎ.ఐ.ఎన్‌.ఆర్‌.సి టిక్కెట్‌ దళిత వర్గానికి రిజర్వ్‌ చేయబడిన పుదుచ్చేరిలోని కారైకల్‌ ప్రాంతంలోని నెడున్కాడు రిజర్వడ్‌ నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ‘తన నియోజకవర్గంలో తనకు ప్రజల్లో తనకున్న ఆదరణ కారణంగా తాను అసెంబ్లీలోకి ప్రవేశించాను. అయిననూ కుట్రాజకీయాలను అధిగమించడం అంత సులువు కాదు’ అని ఆమె పేర్కొనడం రాజ్య మేలుతున్న అన్యాయ రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తుంది. ‘నిరంతరం తనని లక్ష్యంగా చేసుకుని మరియు పరిమితులకు మించి కుట్రాజకీయాలకు పాల్పడడాన్ని నేను ఏమాత్రం సహించలేకపోతున్నాను. అడుగడుగున నేను కులతత్వం మరియు లింగ పక్షపాతాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాను. అంతిమంగా ఈ సవాళ్లను ఒక పరిమితికి మించి నేను భరించలేకపోయాను’ అని ఎస్‌. చందిర ప్రియంగ ఆవేదనాభరితంగా పేర్కొనడాన్ని చాలా సునిషితంగా పరిశీలిస్తే ప్రజా పాలనలోనూ గూడుకట్టుకున్న అసమానతలు కళ్ళకు కట్టినట్లు చాలా సృష్టంగా బహిర్గతమవుతూనే ఉన్నాయి. కులతత్వం మరియు లింగ పక్షపాతానికి తాను లోనవుతున్నట్లు భావించిన దరిమిలా కులతత్వం, లింగ వివక్ష, కుట్రాజకీయాలు మరియు ధన బలంతో కూడుకున్న కుట్రాజకీయాలు అనే పెద్ద భూతాలకు వ్యతిరేకంగా తాను పోరాడలేను అని నిర్ధారించుకొని అంతిమంగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఎస్‌. చందిర ప్రియంగ రాజీనామా లేఖలో చాలా సృష్టంగా పేర్కొ న్నారు. తాను నిరంతరం ఒంటరిగా ఉన్నానని మరియు రాజకీయ కుట్రల సంక్లిష్టతలను మరియు ఆర్థిక వనరుల విపరీతమైన ప్రభావాన్ని తాను భరించలేని స్థితికి చేరుకున్నానని ఆమె నిక్కచ్చిగా వ్యక్తం చేయడం గమనార్హం. ‘నన్ను శాసనసభ్యురాలుగా ఎన్నుకున్న ఓటర్లకు రుణపడి ఉంటాను. అయితే ఆధిపత్య శక్తులపై నిరంతరం పోరాడ లేనని గ్రహించాను. నేను ధన శక్తికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని కొనసాగించలేకపోయాను. నా దళిత గుర్తింపుపై గర్వం ఇతరులకు సమస్య అని నాకు తెలియదు. నేను నిరంతరం కుల మరియు లింగ పక్షపాతానికి గురవుతున్నాను. మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు నా ఓటర్లకు క్షమాపణలు చెబుతున్నాను’ అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ‘నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా తప్పకుండా సేవ చేస్తూనే ఉంటాను’ అనే హామీ ఇస్తున్నాను అని ఆమె పేర్కొన్నారు. అంతిమంగా ఆధిపత్య శక్తులతో పోరాటం కొనసాగించలేనని గ్రహించి చివరికి ఆమె మంత్రి పదవికి రాజీనామాను సమర్పించి తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కేవలం శాసన సభ్యురాలుగా మాత్రమే కొనసాగనుండడాన్ని చాలా సునిశితంగా గమనించవచ్చు. ’తాను మంత్రిగా రాజీనామా చేసిననూ తనపై విశ్వాసం ఉంచిన ప్రజల కోసం పనిచేయడానికి శాసనసభ్యురాలు గాను మరియు ఒక సాధారణ కార్యకర్తగాను ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటాను’ అని ఆమె ప్రజలకు భరోసాని కల్పించి ఆ దిశగా ముందుకు సాగే విధంగా సమాయత్తం కానుండడం హర్షణీయం. ‘తాను మంత్రిగా రాజీనామా చేసిననూ నియోజక వర్గ అభివృద్ధి కోసం ఆయా శాఖలలో తాను సూచించిన మార్పులు, చేర్పులు, మెరుగుదలలు మరియు సంస్కరణలను హైలైట్‌ చేయడానికి సవివరమైన నివేదికతో త్వరలో బయటకు వచ్చి ప్రజలను కలుస్తాను’ అని ఆమె పేర్కొనడం ఆమె యొక్క ప్రజా సంక్షేమ దూరదృష్టికి అద్దం పడుతుంది. ‘డబ్బు యొక్క బలీయమైన ప్రభావం మరియు కులతత్వం మరియు లింగ పక్షపాతం యొక్క కలతపెట్టే ఉనికిని ఎదుర్కొనే సమర్థతనుని తాను ప్రదర్శించలేక పోయాను’ అని ఎస్‌. చందిర ప్రియాంగ ఆవేదనని వ్యక్తం చేయడం గమనార్హం. ‘ధన బలం ఆధారంగా అధికారం కోసం తహతహలాడుతున్న ప్రజలు ఈరోజుల్లో అనేకంగా ఉన్నారు’ అని ఆమె ఉటంకించిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ‘ధనబలం ప్రభావంతో మంత్రి పదవిని ఆశించే ఎవరిని వారసునిగా చేయకూడదు అని, అది వన్నియార్‌ లేదా దళిత లేదా మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తుంది’ అని ఆమె పేర్కొనడం ఆయా వర్గాల అభివృద్ధి పట్ల ఆమెకు ఉన్న సంక్షేమ దృక్పథాన్ని వెల్లడిస్తుంది. ఆమె రాజీనామాకు ముందు తనకు మంత్రి పదవిని కల్పించినందుకు ముఖ్యమంత్రి రంగస్వామికి కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా వన్నియార్‌, దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎవరైనా శాసన సభ్యులను చేయడం వల్ల తన ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాలి అని ఆయనను అభ్యర్థించారు. తన నియోజకవర్గంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని ఆమె ముఖ్యమంత్రిని అభ్యర్థించడాన్ని సునిశితంగా గమనించవచ్చు. ‘దళితులు రాజకీయాల్లో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందని నానుడి ఉంది. మా దళితులు రాజకీయాల్లో విజయవంతంగా రాణించి చరిత్ర సృష్టించిన ఘటనలు చాలా ఉన్నాయి. అందువలన నేను కూడా సానుకూల దృక్పథంతో మరియు కష్టపడి పనిచేయాలనే సంకల్పంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించాను. కానీ నేను లింగ మరియు కుల వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాకుండా ధన బలం మరియు కుట్రాజకీయాలతో పోరాడలేకపోయాను. నేను వీటిని ఒక పరిధికి మించి సహించలేకపోయాను’ అని ఎస్‌. చందిర ప్రియంగ పేర్కొనడం గమనార్హం. ‘మహిళలు విద్యావంతులు కావచ్చు, విశేష నేపథ్యం నుండి వచ్చినవారు కూడా కావచ్చు, కానీ పురుషాధిక్య రాజకీయ ప్రపంచం మహిళలను విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నుతోంది. పితృస్వామ్యంలో పాతుకుపోయిన వేధింపులను నేను భరించలేకపోయాను’ అని ఆమె పేర్కొనడాన్నిబట్టి విశృంఖల వివక్షతను సులువుగానే అర్థము చేసుకోవచ్చు. తన దళిత మహిళ గుర్తింపు గురించి తాను ఎప్పుడూ గర్వపడుతున్నానని, అయితే అది తనకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుందని ఏమాత్రం అనుకోలేదని ఆమె ఆవేదనాభరితంగా పేర్కొనడాన్ని సునిశితంగా గమనించవచ్చు. నేటి రాజకీయాలలో నీతి, న్యాయం, ధర్మం మొదలైన వాటికి ఏమాత్రం స్థానం లేదు. నేడు కుల, మత, వర్గ, బంధుప్రీతి, లింగ వివక్ష మరియు ధన రాజకీయాలు రాజ్యమేలుతూ సమసమాజ ఆకాంక్షలకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితులలో పుదుచ్చేరి మహిళా మంత్రి ఎస్‌. చందిర ప్రియంగ ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి అసమానతలపై నినదించిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అన్యాయాలు జరుగుతున్నా కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంకన్నా ఆ అన్యాయలపై తిరుగుబాటు చేయాల్సిన పోరాట అవసరాన్ని ఎస్‌. చందిర ప్రియంగ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా ఒక సృష్టమైన సంకేతాన్ని దేశ పాలకుల ముందు ప్రదర్శించారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే మరోపక్క ఎన్నో రకాల అసమానతలకు గురవుతున్ననూ కూడా ఆ అసమానతలపై కనీసం నోరు విప్పకుండా తమ పదవులను కాపాడుకోవడం కోసం ఉన్నత వర్గాలకు చెంచాలుగా ఉంటూ వారికి పాదపూజలు చేసే ప్రజాప్రతినిధులు నేడు కోకొల్లలుగా ఉన్నారు. అందువలన వారు తమ పదవుల పరిరక్షణ కోసం చెంచాలుగా పడి ఉండడం కాకుండా తమ జాతి ఉద్దరణ కోసం పదవులను సైతం త్యాగం చేయాల్సిన సమయం అసన్నమైనది. సాక్ష్యాత్తు ఒక మహిళా మంత్రి అసమానతలు భరించలేక ఏకంగా మంత్రి పదవికి రాజీనామాను సమర్పించిన ఈ ఉదంతాన్ని అణచివేతకు గురవుతున్న ప్రజాప్రతినిధులు మంత్రులు సైతం ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకొని నినదిస్తూ ముందుకు సాగుతూ ’అసమానతలు లేని సమసమాజం ఆవిష్కరణ కోసం’ ఆయా ప్రభుత్వాలను కదిలించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

– జె.జె.సి.పి. బాబూరావు రీసెర్చ్‌ స్కాలర్‌,

సెల్‌: 94933 19690.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News