సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం. నేతెచ్చిన సామాన్యుల పుస్తకం గురించి హిందూ దినపత్రిక “One for the common man’ అని శీర్షిక పెట్టి ఒక చక్కటి కథనం ప్రచురించింది. అది చదివి ఎంతో గర్వంగా అనిపించి ఫ్రేం చేపించుకోని సంతోషపడ్డాను. పదేళ్ళు ఓపికగా వేచి చూశారాయన. ఒకరోజు అన్నారు “One for No one” కదా ఆసలు లక్ష్యం అని. “అర్థం కాలేదు సార్” అంటే వివరించారు. ఆ వివరణ విన్నాక ఎంత సిగ్గు వేసిందో!
‘ఒకరికోసం ఒకరు’ మామూలే. ఒకరి కోసం ఒకరు పనిచేయడం మంచిదే. అనివార్యం. తప్పదు. కానీ, ఎవరి కోసమూ కూడా మరో మనిషి పని చేయకుండా ఉండే సమాజం నెలకొనడం కదా అసలు ఆదర్శం” అన్నారు.
“ఒకరి గురించి అరాట పోరాటాలు లేకుండా మనగలగడం కదా అసలు బాగు. అవశ్యమైన స్థితి” అన్నారు. “నిజానికి అందరి తరపున ఒక్కరు గొప్ప విషయం కారాదు” అని కూడా యథాలాపంగా అన్నారు. అని ఊరుకున్నారు. అప్పుడర్థమైంది, “One for No one” లోని గూడార్థం, వారి విశాలమైన ఆశయం. అదీ కొలచల చంద్రశేఖర్ గారి జీవన దృక్పథం. తనదైన సేవానిరతిలోని అంతరార్థం. ఎంతమందికి దీని విలువ, అందలి లోతు అర్థమౌతుంది?
సర్ అని ప్రేమగా పిలుచుకునే కొలచల చంద్రశేఖర్ సార్ మెయిల్ ఐడీ కూడా అదే. [email protected]. ‘వన్ ఫర్ నో వన్’. నిజానికి సార్ తో ఆత్మీయ స్నేహానికి కూడా ఇరవై ఏళ్లకు పైబడిన పరిచయం. ఐతే, తన గురించి రాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వారిది ఉనికిని చాటని నిరతి. ‘సేవ’ అన్న మాట వారి విషయంలో అస్సలు కుదరదు. పొసగదు. ఆ మాటకొస్తే దాన్ని అవమానంగా ఫీలవుతారు. చిత్రమేమిటంటే, అప్పుడైనా ఇప్పుడైనా వారు ఏమీ చేసినట్టు ఉండరు. వారి దినచర్య ఎవరినీ ప్రభావం చేసినట్టు కూడా అనిపించదు.
ఇలాంటి వారు మనమధ్య ఒక్కరున్నా చాలు. ఘనత వహించిన అందరికందరం తలవంచుకుని మన మానాన మనం చేయదల్చుకున్నది చేసుకుంటూ పోవడానికి.
‘ఒకరికోసం ఒకరు’ అనే భావనతోనో, ‘సమాజానికి నేను సైతం’ అనే తీరుగానో లేక ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అన్న విధంగానో, ఇవేవీ కాకపోతే ‘మార్పుకోసం నడుం కట్టామనో’ బాహాటంగా చెప్పుకునే పద్దతి పట్లా – చాలామంది, వారు ఇష్టంగా చెప్పుకునే మాటలు, చేష్టలు, రాసుకునే రాతలు, అందుకునే అభినందనలు, పురస్కారాలు- ఇవేవీ ఇలాంటి సార్ కి పట్టవు. గిట్టవు. ఒక్కమాటలో వేపచెట్టు గాలి వంటి మనుషి తాను. ఒక మలయ మారుతం వెంట మెల్లగా వస్తారు. వంటరిగా వచ్చినట్టు ఉండదు.
ఇప్పుడని కాదు. గతంలో కూడా అంతే. వారు ఏజీ ఆఫీసులో పనిచేసేవారు. ఉన్నతాధికారే. ఆఫీసు పది పదిన్నరకు తెరుస్తారు. కానీ, ఆయన శ్రీమతి ఉద్యోగార్థం చాలాదూరం వెళ్ళాలి. అందుకే తనతో కలిసి ముందే బయలుదేరుతారు. గంట రెండుగంటల ముందే కార్యాలయంలో దిగుతారు. “అంత త్వరగా వెళ్లి ఏం చేస్తారు. వెళ్లి ఊడుస్తారా?” అని అడుగుతారు మిత్రులు. చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు. ఆయన నిజంగానే ఊడుస్తారేమో అని నా డౌట్. స్వీపర్స్ తో కలిసి కాలం గడుపుతాను అంటారు. నాకు తెలుసు. ఆయన ఉంటే వాళ్ళ కష్టసుఖాలలో భాగామవుతారు. అన్నట్టు, ఆయన వల్ల వాళ్ళ పిల్లలు కొందరు ఉన్నత చదువులు చదివారని నాకు తెలుసు.
నిజానికి తాను ఎక్కడ అవసరమో తెలియదు కాబట్టి ఆయన ఎక్కడైనా ఒకటే అని వెళతారు. ముందే వెళ్లి అక్కడ నిలబడుతారు. ఆఫీసు వదిలాక సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ తయారై రామ్ నగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ మిత్రులతో టీ తాగడం అన్నది కేవలం ఒక మిష. నిజానికి అక్కడ మళ్ళీ తనకు ఎదో పని తగులుతుంది. ఆ సంగతి తనకు మాత్రమే తెలుస్తుంది. చేసి పెడతారు.
ఉద్యోగంలో ఉన్నప్పుడు ఫీల్డ్ వర్క్ లో వందలాది గ్రామాలు తిరిగారు. వేలాది మనుషులకు సన్నిహితమయ్యారు. పదవి విరమణ అంతరం కూడా వారంతే. ఊరికే ఉండలేరు. ప్రస్తుతం ఒక కాలేజీలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పని చేయడం ప్రారంభించారు. అక్కడి విద్యార్థులకు ఆయన కేవలం లెక్చరర్ అని అనుకోలేం.
వారికి సమయం ఉంటుంది. తీరుబాటు ఉంటుంది. పరులను శ్రద్ధగా వినడానికి ఓపిక ఉంటుంది. విమర్శలేదు. ఎవరినీ నొప్పించరు. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యమూ ఉండదు. కష్టంలోనే కలగజేసుకుంటారు. సుఖంలో తప్పుకుంటారు.
వారొక రీడర్స్ డైజెస్ట్. తాను మనుషులను గమనిస్తారు. వాళ్ళ ఔదార్యంతో కనెక్ట్ అవుతారు. వాళ్ళ వైవిధ్యంతో టచ్ లో ఉంటారు. అవసరం వచ్చినప్పుడు కలుస్తారు. ‘పనులు’ అని ఎవరూ అనుకోని పనులను అయన చేస్తారు. ఆయన అచ్చమైన ‘వన్ ఫర్ కామన్ మ్యాన్’. ఆయన ఆశయం ఒకరికోసం ఒకరు నిలబడనక్కరలేని సహజ సుందరమైన సమాజం.
ఒకసారి ఒక క్యాన్సర్ పేషెంట్ తాలూకు సాంపుల్ ని హాస్పిటల్ నుంచి తీసుకొని మరో ల్యాబ్ లో పరీక్షించమని ఇచ్చారు. క్యాన్సర్ లేదని రుజువైంది. వారికి గొప్ప మేలు చేశారు. అలా చేయమని ఎవరూ ఆయనకు చెప్పనక్కరలేదు.
పెద్ద ఎత్తున రక్తదానం గురించి ఒకరు మాట్లాడుతున్నప్పుడు తెలిసింది. నా పక్కనే ఉన్న సార్ గ్రూప్ ‘ఓ నెగెటివ్’ అని. ఆయన ఇప్పటికే కొన్ని వందలసార్లు బ్లడ్ డోనేట్ చేసారని. కానీ, తనదొక ‘గిన్నిస్ రికార్డ్ వ్యవహారం’ అని ఎన్నడూ అనుకోలేదు. చెప్పనూ లేదు.
ఆయన ఆర్ట్ గ్యాలరీలను కూడా క్రమం తప్పక సందర్శిస్తారు. అందరూ అతడి రూపం, పొడవాటి జుట్టు, గడ్డాన్ని బట్టి పెద్ద ఆర్టిస్ట్ అనుకుని పలకరిస్తారు. కానీ, కాదు. అలా అని ఆయన బొమ్మలు వేయరని కాదు. వేస్తారు. కానీ, ప్రదర్శన చేయరు. చిత్రమేమిటంటే, తన ముందే వారి మిత్రులు ఎందరో ఆర్టిస్టులయ్యారు. ఆయన మాత్రం అక్కడే ఉన్నారు. అందరి బొమ్మలు చూస్తూ. తన బొమ్మలకు రంగులు అద్దుతూ.
వారికీ ఏదీ ప్రీతి కాదు, ఎవరూ ప్రత్యేకం కాదు. అలా అని ఒకరిని అలక్ష్యం చేయరు. ఒకసారి వాళ్ళ నాన్న గురించి చెప్పారు. తర్వాత అమ్మ గురించి చెప్పారు. వారిద్దరినీ నేను బాగా ఎరుగుదును. ఇద్దరూ ఈ లోకం వదిలి వెళ్ళిపోయిన రోజుల్లో కూడా ఆయన చలించలేదు. ప్రపంచంలో ఏ మార్పూ జరగలేదు అన్నట్టే ఉన్నారు. అదీ అయన స్థితప్రజ్ఞత. ‘ఒకరి వల్ల ఒకరు’ అన్న ప్రాసంగికత ఆయన దగ్గర పనిచేయదు. ఆయన సమష్టి. బూత భవిష్యత్తు వర్తమానాల్లో ఆయనది అదే సదా మారని స్వభావం.
తనకు భోజనం ఒకరు వడ్డించనక్కరలేదు. సపర్యలూ అనవసరం. అలా అని తాను పుట్టి పెరిగిన నూజివీడు దగ్గరలోని రెడ్డిగూడెం నుంచి ఆవకాయ తెస్తున్న వ్యక్తి కోసం ఆయన గంటలు గంటలు బస్టాండ్ లో వేచి ఉండకుండా ఉండలేరు.
మిత్రులారా…మీరు ‘‘కొండగాలి కొత్త జీవితం’ అన్న అర్మేనియన్ పుస్తకం చదివారా? అందులోని కథల వంటి వాడు ఆయన. ఒక కథలో ఒక ఆర్ద్రమైన మాట ఉంటుంది. “బిడ్డను కోల్పోయిన తల్లి మాత్రమే అనాథ ఆక్రందనకి మారు పలుకుతుంది” అని. అటువంటి సంస్పందనా శీలి ఆయన. అలా అని వారు కేవలం బాధితుడి ఆక్రందన ఒక్కటే వినరు. జీవితాన్ని వింటారు. అన్నిటికీ ఉంటారు. చేయదగ్గది చేస్తారు. కాకపోతే ఏమీ చేసినట్టు అనిపించదు. చేయరని కూడా అనిపిస్తుంది. మొదటే చెప్పవలసింది, తనకు సంబందించిన ఈ కింది ఉదాహరణ. రాస్తే గానీ తెలియదని చెప్పడం.
అదొక మేక పిల్ల. హృదయ విదారకంగా అరుస్తోంది. ఫ్లోర్ పై భాగాన నలుదిక్కులా తిరుగుతూ కిందికి చూస్తూ ఎలా దిగాలో తెలియక భయంతో గిజగిజలాడుతూ హృదయ విదారకంగా అరుస్తోంది.
కొత్తగా నిర్మాణమవుతున్న అపార్ట్మెంట్ మొదటి అంతస్థు అది. మందనుంచి తప్పిపోయి ఎలా ఎక్కిందో గానీ చకచకా మొదటి వరస మెట్లు ఎక్కింది అ మేకపిల్ల. కుడివైపు తిరిగి పైకి ఉన్న మెట్లన్నీ ఎక్కేసి పైకి చేరుకుంది. ఆ తర్వాత అటూ ఇటూ తిరిగాక కిందకు దిగాలనుకుంది. కానీ, దిగడం తెలియడం లేదు. అనుకోకుండా అక్కడ ఉన్న సార్ ఆ మేకపిల్ల అరుపు విన్నారు. పరిస్థితి గమనించారు. దాని దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అది భయంతో పైనుంచి కిందకు “దుంకినా దుంకుతుంది” అనుకున్నారు. ఆ భవన నిర్మాణానికి కాస్త దూరంనుంచే ఒక రౌండ్ తిరిగి నిదానంగా ఒక చోటుకు వచ్చి నిలబడ్డారు. అతడు తన గురించి ఆలోచిస్తున్న సంగతి మేక గ్రహించేదాక కదలకుండా నిలబడ్డారు. అది చూసింది. చూసి వెంటనే కిందకు చూసింది. మెట్లు కనబడ్డాయి. ఇంకేం? హయిగా చకచకా మెట్లు దిగింది. మళ్ళీ మెట్లు లేవు. అక్కడ తిరిగి అయోమయంతో ఆగిపోయింది. ఈ సారి సార్ కిందకు ఇటువైపు వచ్చి నిలబడ్డారు. మేకపిల్ల అతడ్ని చూసింది. చూసి కిందకు చూసింది. మళ్ళీ మెట్లు కనబడ్డాయి. ఆనందంతో చకచకా దిగేసింది.
పూర్తిగా కిందికి వచ్చేశాక అది ఎంత వాయువేగంతో మేకల మందలోకి ఉరికిందీ అంటే, ముందు, అది ఎంత హృదయ విదారకంగా అరిచిందో అంతే స్థాయిలో, ఈ సారి ఆనందంతో వెర్రిగా అరిచి, ఆ మేకల మందలో కలిసిపోయింది.
సార్ సంతృప్తిగా వెనుదిరిగారు. చిత్రమేమిటంటే, చంద్రశేఖర్ సార్ ఏం చేసిందీ తనకు, ఆ మేకపిల్లకి మాత్రమే తెలుసుగానీ ఆ మందలోని మేకలకు తెలియదు.
జర్నలిస్ట్, రైటర్, ఫొటోగ్రాఫర్.

