Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Chandrayaan 3: చరిత్ర సృష్టించిన చంద్రయానం

Chandrayaan 3: చరిత్ర సృష్టించిన చంద్రయానం

అశేష ప్రజానీకం ఒక్కసారిగా మైమరచిపోయిన క్షణం

ఆగస్టు 23వ తేదీ సాయంత్రం అయిదు ముప్పావు వరకూ కూడా చంద్రయాన్‌-3 లాండర్‌ 1.7 టన్నుల లోహం, ప్లాస్టిక్‌, గ్లాస్‌ కలిసిన వస్తువే. అప్పటికి లాండర్‌ చంద్రుడికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఆరు దాటిన కొద్ది క్షణాలకు అది చంద్రుడి మీద దిగిందో లేదో దాని ప్రాధాన్యం, ప్రాభవం అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచ దేశాలన్నీ హర్షధ్వానాలు వ్యక్తం చేశాయి. సంభ్రమాశ్చర్యాలు ప్రకటించాయి. మెల్లగా, మృదువుగా అది చందమామ మీద దిగిన తీరే కాక, అది దక్షిణ ధృవం మీద దిగడం కూడా చరిత్ర గతిలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నిదానంగా అది చందమామకు చేరువ కావడం, నిటారుగా, నిలువుగా అది కిందకు దిగడాన్ని ప్రపంచ దేశాల ప్రజలు, శాస్త్రవేత్తలు ఉత్కంఠగా, ఊపరి బిగబట్టి చూశారు. దేశంలోని వివిధ భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రాల (ఇస్రో) చుట్టూనే కాక, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రం చుట్టూ చేరిన అశేష ప్రజానీకం ఒక్కసారిగా మైమరచిపోయి, చప్పట్లతో హర్షం ప్రకటించారు.
దీనిని మానవ ప్రయత్నానికి విజయంగా అభివర్ణించారు. మరో గ్రహం మీద ఏం ఉందో తెలుసు కోవడంతో పాటు, వనరుల అన్వేషణకు సంబంధించి మానవ కృషికి ఇది అద్దం పట్టింది. అందు కనే కోట్లాది మంది భారతీయులు ఈ చంద్రయాన్‌-3 లాండర్‌ ను ఆసక్తిగా తిలకించారు. ఈ లాండర్‌ చందమామపై విజయవంతంగా దిగడంతో పాటు తన కార్యకలాపాలను వెనువెంటనే ప్రారంభించడాన్ని బట్టి ఇస్రో శాస్త్రవేత్తలు తమ వెనుకటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చు కున్నట్టే కనిపిస్తోంది. 2019 సెప్టెంబర్‌ నెలలో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల పైన ఉండగానే భూమితో తన సంబంధాలను కోల్పోవడం జరిగింది. చంద్రయాన్‌-2 అంతవరకూ పంపించిన సమాచారాన్ని బట్టి, చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌తో సహా ఇతరత్రా సేకరించిన సమాచారాన్ని బట్టి, ఈ లాండర్‌ విఫలం కావడానికి దారితీసిన కారణాలను గుదిగుచ్చడం జరిగింది. ఈ వైఫల్యాలను బట్టి చంద్రయాన్‌-3ని మరింతగా మెరుగుపరచి, 21 సిస్టమ్స్‌ను మార్చి ప్రయోగించారు. ఏదైనా ఒక పరికరం లేదా సిస్టమ్‌ విఫలమైతే వెంటనే దాని స్థానంలోకి మరో పరికరం రావడానికి వీలుగా అప్‌ గ్రేడ్‌ చేశారు.
చంద్రయాన్‌-3 విజయంతో భారత్‌ అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు సంబం ధించి ఒక ప్రధానమైన స్థానం సంపాదించుకుంది. ఇతర గ్రహాల మీదకు మనుషులను పంపించడానికి సంబంధించిన ‘ఆర్టెమిస్‌ ఒప్పందం’లో భారత్‌ కూడా ఒక భాగస్వామిగా మారింది. అమెరికా నాయకత్వంలో అనేక దేశాలతో ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. 2025 నాటికి భారత్‌ చంద్రుడి మీదకు మానవ సహిత లాండర్‌ను పంపించే అవకాశం ఉంది. మొదట చందమామతో ఈ రోదసి యాత్ర ప్రారంభించి ఆ తర్వాత దాన్ని ఇతర గ్రహాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌ ఈ రంగంలో ముందంజ వేసినందువల్ల ఇతర దేశాలకు దిక్సూచిగా, మార్గదర్శిగా మారడంతో పాటు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది సహాయకారిగా ఉండే విధంగా కూడా ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది.
కాగా, ఆర్టెమిస్‌ ఒప్పందానికి పోటీగా అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు సహాయం చేస్తున్న రష్యాలు, చైనాలు రష్యా గత 19న ప్రయోగించిన లూనా-25 రోదసి నౌక విఫలం కావ డంతో కొద్దిగా వెనుకపట్టు పట్టాల్సి వచ్చింది. వాటి అంతర్జాతీయ చంద్ర పరిశోధన కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగింది. అంటే, అంతరిక్ష కార్యక్రమానికి ఈ రెండు దేశాల నుంచి ఈ దశాబ్దంలో అంతగా సహాయం అందే అవకాశం లేదని తేలి పోయింది. విచిత్రమేమిటంటే, చంద్రయాన్‌-3 ప్రయోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా జరిగింది. కేవలం తమ వైజ్ఞానిక పరిశోధనల్లో తమ విజయాన్ని నిరూపించుకోవడా నికే పరిమితం అయింది. అయితే, ఇప్పుడిక భారత్‌ తన పరిశోధనల్ని తీవ్రతరం చేయ బోతోంది. దక్షిణ ధృవం ప్రాంతంలోని జల, వాయు, భూమికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరించి మానవాళికి ఉపయోగించదలచుకుంది. వాస్తవానికి భారత్‌ ఇదివరకే రోవర్లు, లాండర్లు, ఆర్బిటర్ల తయారీ, ప్రయోగాలలో నైపుణ్యాన్ని, అపార అనుభవాన్ని గడించుకుంది.
అంతేకాక, అగ్రదేశాలకు దీటుగా, అనేక అంతరిక్ష పరిశోధన దేశాల కంటే మెరుగ్గా భారత్‌ ఈ చంద్రయాన్‌-3లో చాలా ముందుకు దూసుకుపోయింది. టెక్నాలజీపరంగా కూడా ఆధిపత్యం సంపాదించుకుంది. పైగా, మరిన్ని గ్రహాల మీద కాలు పెట్టే స్థాయికి ఎదిగిపోయింది. కుజ గ్రహ పరిశోధనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పరిశోధనల మీద విపరీతంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీపడబోనని తేల్చిచెబుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News