Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Change in Punjab and Kashmir voters: పంజాబ్‌, కాశ్మీర్‌ ఓటర్లలో మార్పు

Change in Punjab and Kashmir voters: పంజాబ్‌, కాశ్మీర్‌ ఓటర్లలో మార్పు

ఆ ముగ్గురి విజయానికి అర్థం ఏంటి

రెండు సరిహద్దు రాష్ట్రాల నుంచి ఘన విజయాలు సాధించిన ఇద్దరు అభ్యర్థులు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఆ ఇద్దరు అభ్యర్థులు జాతీయ భద్రతా చట్టం, అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం కింద తీవ్రస్థాయి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం కారాగారవాసం చేస్తున్నారు. మతోన్మాదిగా, ఉగ్రవాదిగా ముద్రపడిన మరో అభ్యర్థి కూడా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. ఈ ముగ్గురూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ప్రధాన స్రవంతి పార్టీల అభ్యర్థుల మీద భారీ మెజారిటీతో నెగ్గారు. దిబ్రూగఢ్‌ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న వారిస్‌ పంజాబ్‌ డే అధిపతి, మత ప్రచారకుడు అయిన అమృత్‌ పాల్‌ సింగ్‌ పంజాబ్‌ లోని ఖదూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు పోటీ చేసి గెలిచారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన బియాంత్‌ సింగ్‌ కుమారుడు సరబ్‌ జిత్‌ సింగ్‌ ఖల్సా ఫరీద్‌ కోట్‌ నుంచి విజయం సాధించారు. ఉగ్రవాదులకు నిధులు సరఫరా చేస్తున్నాడన్న ఆరోపణపై ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న ఇంజనీర్‌ రషీద్‌ బారాముల్లాలో జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను ఓడించారు. ఈ నియోజకవర్గాల్లో ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయనడానికి ఈ ముగ్గురు అభ్యర్థుల ఘన విజయాలే నిదర్శనం.
అమృత్‌ పాల్‌ సింగ్‌, సరబ్‌ జిత్‌ సింగ్‌ ఖల్సాలు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, అకాలీ దళ్‌ అభ్యర్థుల మీద భారీ మెజారిటీతో విజయాలు సాధించడం ఒక విధంగా ఆందోళనకర విషయమే. గత కొద్ది సంవత్సరాల్లో పంజాబ్‌ రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1990లలో భింద్రన్‌ వాలే నాయకత్వంలోని తీవ్రవాద కార్యకలాపాలు, ఉద్యమాలకు తెరపడినప్పటికీ, పంజాబ్‌ లో క్రమంగా నిరుద్యోగ సమస్య పెరుగుతూ వచ్చింది. ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మాదక ద్రవ్యాల వాడకం పెరిగిపోయింది. కాస్తో కూస్తో మిగిలిపోయిన తీవ్రవాద ధోరణులు కొత్త స్వరూప స్వభావాలు సంతరించుకున్నాయి. అకాలీ దళ్‌, బీజేపీలు విడిపోవడం కూడా ఇక్కడ తీవ్రవాద ధోరణులు కొత్త రూపం సంతరించుకోవడానికి కొంత కారణమైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ బలం పుంజుకోవడంతో ప్రధాన స్రవంతి పార్టీలు పంజాబ్‌ మీద పట్టుకోల్పోయాయి. సరిహద్దు దేశాల నుంచి ఈ రాష్ట్రానికి భారీగా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.
విచిత్రంగా, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం పెరిగిపోవడాన్నే అమృత్‌ పాల్‌ సింగ్‌ తన ప్రచారానికి ప్రధాన అస్త్రం చేసుకున్నారు. హర్యానాతో ఉన్న జల వివాదం, 1984లో జరిగిన సిక్కుల ఊచకోత, సిక్కు నాయకులను జైళ్లలో కొనసాగించడం వంటి అంశాలు పంజాబ్‌ రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద ఇంకా ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. కాశ్మీర్‌ లో రషీద్‌ విజయం సాధించడం కూడా ప్రధాన రాజకీయ పార్టీల పట్ల అక్కడి ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు అద్దం పడుతోంది. కాశ్మీర్‌ లో కుటుంబ పాలనకు ప్రతీకగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి అనంతనాగ్‌-రాజౌరీలో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో భారీగా పోలింగ్‌ జరిగింది. ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయడం జరిగింది కానీ, అవేవీ పూర్తిగా అమలు జరగలేదు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఓటింగ్‌ శాతం పెరగడాన్ని బట్టి, ఎన్నికల ఫలితాలన్ని బట్టి అక్కడ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెరిగిందనే సంగతి అర్థమవుతోంది. స్థానిక రాజకీయ పార్టీల తీరుతెన్నులే నిరాశా నిస్పృహలకు కారణమవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి కాశ్మీర్‌లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించడం, రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం అవసరమనిపిస్తోంది.
వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులూ తీవ్రవాదుల కిందే లెక్క. పైగా వీరు ఏ పార్టీకీ చెందినవారు కూడా కాదు. అయితే, వారిని ఎన్నుకున్న ప్రజలు మాత్రం ప్రభుత్వాలకు ఒక స్పష్టమైన సందేశం అందిస్తున్నారు. ఆ సందేశాన్ని వినడం, అనుసరించడం మంచిది. ఈ విజేతలను ప్రధాన జీవన స్రవంతిలో కలుపుకోవాలి. వారిని ఈ వ్యవస్థలో భాగం చేయాలి. వారి విజయాల వెనుక ఉన్న అంశాలను అర్థం చేసుకుని వాటిని పట్టించుకునే ప్రయత్నం చేయాలి. పార్లమెంటుకు అనుగుణంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పంజాబ్‌, కాశ్మీర్‌ ప్రజల మనోభావాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News