Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Changing formulas: మారుతున్న రాజ్యాంగ సమీకరణాలు

Changing formulas: మారుతున్న రాజ్యాంగ సమీకరణాలు

సాధారణంగా ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా, ప్రజలు తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని, పాలనను కోరుకుంటారు. ఇందులో కూడా ఎవరి ప్రాధాన్యాలు వారికుంటాయి. ఇదే రాజ్యాంగ లక్ష్యం కూడా అవుతుంది. రాజ్యాంగం అనేసరికి ఇక్కడే ప్రజలు, ప్రభుత్వాల అభిప్రాయాలు కలవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలలో రాజ్యాంగం రూపుదిద్దుకున్నదంటే దాని అర్థం నియంతృత్వానికి పగ్గాలు వేయడమే. ఇదే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగ ఉదారత్వానికి ఆద్యుడైన జాన్‌ లాక్‌ ఇదే లక్ష్యంతో అనేక రాజ్యాంగాలకు మార్గదర్శకమయ్యాడు. ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాలకంటే కూడా ప్రజలే ఎక్కువని కూడా ఆయన నిర్ధారించాడు. ప్రముఖ రాజకీయ సిద్ధాంత కర్త, తాత్వికవేత్త అయిన మాంటెస్క్యూ ఈ వి షయంలో మరో అడుగు ముందుకు వేశాడు. ఆయన ఉద్దేశంలో, ఏ ప్రభుత్వానికీ సంపూర్ణ అధికారాలు ఉండకూడదు. ఈ అధికారాలను తప్పనిసరిగా విభజించాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని అధికారాలను మాత్రమే ప్రభుత్వాలు చేతుల్లోకి తీసుకోవాలి.
ప్రభుత్వ అధికారం, రాజకీయ అధికారం ఒకేలా కనిపిస్తాయి కానీ, నిజానికి అవి రెండూ వేరు వేరు. విధానాల రూపకల్పనలో, అధికారాల ఆచరణలో ఈ రెండు భిన్న మార్గాలను అనుసరిస్తాయి. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కొన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. అనేక ప్రభుత్వాలకు ఈ సంగతి అవగతం కావడం లేదు. ప్రజలకు సజావైన పాలనను అందివ్వలేని ప్రభుత్వాలకు క్రమంగా అధికారాలు తగ్గిపోతుంటాయి. అవే అధికారాలు ప్రజలకు పెరుగుతూ ఉంటాయి. వాగ్దానాలను నెరవేర్చలేని, ఒక విజన్‌ అంటూ లేని, భవిష్యత్తు గురించి పట్టని ప్రభుత్వాలకు, పాలకులకు అధికారాలు తగ్గిపోతుంటాయి. ఇవి వారికి బహిరంగంగా కనిపించకపోవచ్చు. కానీ, అంతర్లీనంగా ఇదే జరుగుతుంటుంది. పాలకులకు, ప్రజలకు అధికారాలు సమపాళ్లలో ఉన్నంత వరకూ రాజ్యాంగ స్ఫూర్తి వెలిగిపోతూ ఉంటుంది. సమతూకం దెబ్బతిన్నప్పుడు రాజ్యాంగం తప్పనిసరిగా కల్పించుకుంటూ ఉంటుంది. ఇదే మాంటెస్క్యూ సిద్ధాంతం. అంతేకాదు, ఆయన ఉద్దేశంలో రాజ్యాంగ అధికారమంతా ప్రజల చేతుల్లో, మనసుల్లోనే ఉంటుంది.
రెండు రకాల రాజ్యాంగాలు
కాగా, రాజ్యాంగాన్ని రెండు విధాలుగా విభజించడం జరిగింది. ఇందులో ఒకటి అలిఖిత రాజ్యాంగం కాగా, రెండవది లిఖిత రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం మాట ఎలా ఉన్నప్పటికీ, లిఖిత రాజ్యాంగం మీద ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలలో అనేక వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలున్నాయి. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టి, రాజ్యాంగంలోని అంశాల మీద చర్చోప చర్చలు సాగించడం జరుగుతుంటుంది. ఇది పూర్తిగా తమ అనుకూలత కోసమే. విచిత్రంగా లిఖితపూర్వక రాజ్యాంగంలోని వ్యాకరణ దోషాలకు వారు తప్పుడు భాష్యాలు, అర్థాలు, నిర్వచనాలు చెప్పి తమ పబ్బం గడుపుకుంటుంటారు. లిఖిత రాజ్యాంగమనేది కొత్త కొత్త సానుకూల ఆలోచనలకు కేంద్రం కావాలి. వాదోపవాదాలకు కాదు. అది ఓ పుస్తక రూపంలో ఉంటే ఉండవచ్చు. కానీ, అది ఆ దేశానికి తిరుగులేని అధిపతి. ఓ ప్రధానమైన మార్గదర్శి అన్న విషయాన్ని విస్మరించకూడదు. దానికి లోబడే శాసనాలు, చట్టాలు, తీర్పులు, రూలింగ్లే, ఒప్పందాలు, విధానాలు రూపుదిద్దుకుంటుంటాయి. దాని మీద ఆధారపడే నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాలు అమలు జరుగుతుంటాయి. దాని మీద ఆధారపడే శాంతి భద్రతలు అమలు జరుగుతుంటాయి. ప్రజలకు అదే భద్రత, అదే రక్షణ. అది అన్నిటికన్నా సుప్రీం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
అధికారాల వికేంద్రీకరణ, అధికారాల పంపిణీ, సంస్థల ఏర్పాటు, శాఖల ఏర్పాటు, హెూదాల నిర్ణయం వగైరాలన్నీ అది చెప్పినట్టే, దానికి లోబడే జరుగుతుంటాయి. ప్రభుత్వం కన్నా, పార్లమెంట్‌ కన్నా, చట్టాల కన్నా రాజ్యాంగమే అత్యంత ఉన్నతం. ప్రజాస్వామ్యంలో దానికి అతీతంగా ఏమీ లేదు. సుమారు 1215 ప్రాంతంలో ఇంగ్లండ్‌ రాజుకు, ప్రజలకు మధ్య అధికారాలు, బాధ్యతలు, హక్కులకు సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో రూపు దిద్దుకున్న ఆర్టికల్‌ ఆఫ్‌ బేరన్స్‌ క్రమంగా మాగ్నకార్టాగా మారిపోయింది. అదే ఆధునిక రాజ్యాంగాలకు మూలంగా, పునాదిగా పరిణామం చెందింది. రాజు అయినంత మాత్రాన ఏ వ్యక్తీ న్యాయానికి, నిబంధనలకు అతీతుడు కాడన్నది ఈ మాగ్నకార్టా స్పష్టం చేసింది. రాజు చెప్పిందే చట్టం అనే అభిప్రాయానికి అది ముగింపు పలికింది. కాలం మారుతున్న కొద్దీ రాజ్యాంగ స్వరూప స్వభావాలు కూడా మారిపోయాయి. రాజ్యాంగానికి, ప్రజలకు మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. పాలకుల నియంతృత్వం కుప్పకూలిపోయింది. విచిత్రమేమిటంటే, మాగ్నకార్టా పుట్టినిల్లయిన ఇంగ్లండ్‌లో మాత్రం లిఖితపూర్వక రాజ్యాంగం లేకుండాపోయింది. ఇక్కడ అలిఖిత రాజ్యాంగం అమలులో ఉంది.
సుదీర్గ చరిత్ర
పురాణ కాలం నుంచీ ఉన్న కొన్ని న్యాయ సూత్రాలకు, ధర్మ సూత్రాలకు, ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు కూడా రాజ్యాంగం రక్షణ కల్పించాలని, వీటి నుంచి కూడా అనేక అంశాలకు రాజ్యాంగంలో స్థానం కల్పించాలని థామస్‌ హాబ్స్‌, డేవిడ్‌ హ్యూమ్‌ వంటి రాజకీయ, సామాజిక మేధావులు అభిలషించారు. ఆధునిక మేధావులు, రాజనీతిజ్ఞులు సామాజిక పరిస్థితుల్ని, నాగరికతను, పాలనను లోతుగా మదించి ఓటింగ్‌, పన్నుల వ్యవస్థలకు రూపకల్పన చేయడం జరిగింది. కాగా, ఒక ఆదర్శవంతమైన పాలనకు, సమాజానికి అవకాశం కల్పించే చక్కని మేనిఫెస్టోను అశోక చక్రవర్తి రూపొందించాడు. ‘దమ్మ’ పేరుతో ఆయన పాలనకు సంబంధించి రాసిన గ్రంథం కూడా భారత రాజ్యాంగానికి ఆసరా అయింది. వ్యక్తి స్వేచ్ఛే ప్రధాన ధ్యేయంగా ధర్మ శాస్త్రాల నుంచి, స్మృతుల నుంచి, పురాణాల నుంచి, సూత్రాల నుంచి అనేక అంశాలను తీసుకుని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి రాజ్యాంగం అనేది తప్పనిసరి కాక పోవచ్చు కానీ, రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యానికి విలువ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
భారత రాజ్యాంగంలో ప్రాచ్య, పాశ్యాత్య విలువలన్నిటికీ చాలా వరకు అవకాశం కల్పించారు. భారత రాజ్యాంగం ప్రాచ్య, పాశ్చాత్య భావాల మిశ్రమంగా అమర్త్యసేన్‌ వంటి వారు అభివర్ణించారు. అనేక సంవత్సరాల పాటు చర్చించి, మదించి, అధ్యయనం చేసి దీన్ని రూపొందించడం జరిగింది. ప్రజల శ్రేయస్సును, హక్కులను, అధికారాలను దృష్టిలో పెట్టుకునే ఆ తర్వాత కొన్ని సవరణలు తీసుకు రావడం కూడా జరిగింది. క్రమంగా ఇది భారత ప్రజానీకానికి పరమ పవిత్ర గ్రంథంగా మారిపోయింది. ఇటువంటి పవిత్ర గ్రంథానికి తప్పుడు భాష్యం చెప్పే రాజకీయ నాయకులు క్రమంగా తయారవుతున్నారు. ఇది నైతికతకు విరుద్ధం. దిగజారుతున్న నాయకులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలే సుప్రీం అని రాజ్యాంగం ఘోషిస్తున్న విషయాన్ని మరచి పోకూడదు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు మనుగడ ఉంటుంది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News