Homeఎడిటోరియల్ / బహుళUPI India: మోడీజీ.. యూపీఐ కో బచావో

UPI India: మోడీజీ.. యూపీఐ కో బచావో

UPI Digital India: మీ జేబులో ఇప్పుడెంత నగదు ఉంది? వంద రూపాయలా? ఐదు వందలా? లేక అసలు నగదే లేదా? ఈ ప్రశ్నకు నేటి భారతంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఇచ్చే సమాధానం ఒక్కటే.. “ఫోన్‌ ఉంటే చాలు” అంటున్నారు. కూరగాయల దుకాణం నుంచి కార్పొరేట్‌ మాల్‌ వరకు .. టీ దుకాణం నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వరకు..ఆటో రిక్షా నుంచి విమాన టికెట్‌ వరకు అన్ని ఖర్చులు ఒక క్యూ ఆర్‌ కోడ్‌తో చెల్లించేస్తున్నారు. నగదును పర్సులో పెట్టుకోవటం కంటే ఒక మొబైల్‌ ఫోన్‌ చేతిలో ఉంటే సరిపోతుందనే అభిప్రాయం దేశపౌరుల్లో అన్ని స్థాయిల్లో నాటుకుపోయింది.  

- Advertisement -

ఇటువంటి సమయంలో యూపీఐ లావాదేవీలపై మళ్లీ చార్జీల భారాన్ని మోపేందుకు కేంద్రం సిద్ధమవుతోందని దేశంలో విపరీతమైన చర్చ జరుగుతోంది.  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత మంగళవారం పార్లమెంట్‌ లో  “టాక్సేషన్స్​‍ అండ్‌ అదర్‌ లాస్ (సవరణ) బిల్లు-2026” ప్రవేశపెట్టాక ఈ చర్చ మొదలైంది.  గురువారం లోక్‌ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది కూడా. పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్‌ సిస్టమ్స్​‍ యాక్ట్‍ 2007లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం..యూపీఐ, రూపే డెబిట్‌ కార్డ్‍ చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్ ప్రొవైడర్లు చార్జీలు వసూలు చేయడానికి చట్టపరమైన అనుమతి లభిస్తుంది.  పెద్దమొత్తంలో జరిగే యూపీఐ చెల్లింపులపై “మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌” (ఎండీఆర్‌) ను మళ్లీ తీసుకురావటానికి ఈ సవరణ ఉపయోగపడుతుంది.  ఈ సవరణ మూలంగా చెల్లింపులపై వేసే చార్జీలు కేవలం ఒక ఆర్థిక సంస్కరణల నిర్ణయం మాత్రమేనా? లేక డిజిటల్‌ ఇండియా ప్రయాణంలో మరో మలుపా? అనే ప్రశ్న సామాన్యుడిని వేధిస్తోంది.  దీని గురించి మనం చర్చించే ముందు కాస్త గతంలోకి వెళ్దాం.  

ఢిల్లీ సుల్తాన్‌ మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ఒకప్పుడు కాకతీయ రాజు ప్రతాపరుద్రుని ఓడించటం ద్వారా కాకతీయ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ విజయ ఉత్సాహంతో రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దేవగిరి (దౌలతాబాదు)కు మార్చాడు.  దీనిపై వ్యతిరేకత రావటంతో మళ్లీ దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చాడు.  అలాగే వెండి నాణాలతో సమానమైన విలువతో ఇత్తడి, రాగి నాణాలను ప్రవేశపెట్టాడు.  ఈ సంస్కరణ ఘోరంగా విఫలమైంది.  ప్రజలు చాలామంది ఇత్తడి, రాగి నాణాలను ఇంట్లోనే తయారు చేసుకోవటం మొదలుపెట్టారు.  ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.  విదేశీ వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  దీంతో తుగ్లక్‌ మళ్లీ వెండి నాణాలనే చెలామణిలోకి తెచ్చాడు.  చరిత్రకారులు ఈ రెండు సంఘటనలతో సమకాలీన పరిపాలనను పోలుస్తూ సమీక్షిస్తుంటారు.  ప్రభుత్వ చర్యలు పైవిధంగా ఉన్నట్టైతే వారిని తుగ్లక్‌ పాలనగా అభివర్ణించటం రాజకీయ విమర్శలో పరిపాటి.  ఇప్పుడు తుగ్లక్‌ ప్రస్తావన రావటానికి డిజిటల్‌ లావాదేవీలపై చార్జీల మోతనే కారణంగా చెబుతున్నారు.  

మన దేశంలో డిజిటల్‌ చెల్లింపుల అసలు విప్లవం కరోనా మహమ్మారి సమయంలో జరిగింది.  పేటీఎం రూటులో గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యాప్‌ లు ప్రజల నిత్యజీవితంలో భాగమయ్యాయి.  వైరస్ భయంతో నోట్లను తాకడానికి వెనుకంజ వేసిన రోజుల్లో క్యూఆర్‌ కోడ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చెల్లింపుల భాషగా మారాయి. అలా మార్కెట్లోకి వెళ్లి అరకప్పు టీ తాగినా, ఖరీదైన దుస్తులు కొన్నా ఆఖరుకి కొత్తిమీర కట్ట కొన్నా క్యూఆర్‌ కోడ్‌ తో చెల్లింపులు చకచకా జరుగుతున్న రోజులివి.  యూపీఐ ద్వారా ఇలా చెల్లింపులను ఒక విధానంగా మాత్రమే చూడలేం.  దేశ సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పునకు ఇదొక ప్రతీక.  నగరాల్లోనే కాదు మారుమూల గ్రామాల్లో సైతం చిరు వ్యాపారులు స్పీకర్‌ తో కూడిన క్యూఆర్‌ కోడ్‌ ను ఏర్పాటు చేసుకున్నారు.  ఐదు వందలు అందాయి, ఐదు రూపాయలు అందాయి అని వినిపించే ఆ స్వరం ఇప్పుడు లక్షలాది చిరు వ్యాపారుల నమ్మకంగా మారింది.  ఒకప్పుడు చిల్లర కోసం పడ్డ కష్టాలకు డిజిటల్‌ చెల్లింపుతో చెక్‌ పడింది.  ఈ మార్పు వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల విశ్వాసం, సాంకేతికత నింపిన నమ్మకం ఉంది.  

ఇలా అంతా సక్రమంగా జరుగుతున్న సమయంలో యూపీఐ లావాదేవీలపై మళ్లీ చార్జీలు విధించే బిల్లును ప్రభుత్వం ఆమోదించటం విమర్శలకు దారితీస్తోంది.  డిజిటల్‌ చెల్లింపులు అలవాటు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థపై అదనపు భారాన్ని ఎందుకు మోపుతోంది? మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌-ఎండీఆర్‌ పేరును పదేపదే వల్లెవేయటంతో సాధారణ పౌరులను కూడా గందరగోళానికి గురిచేస్తోంది.  వాస్తవానికి ఈ ఎండీఆర్‌ అనే పదం కొత్త కావచ్చు కానీ ఇది బ్యాంకింగ్‌ వ్యవస్థలో చాలా పాత విధానం.  డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించినందుకు బ్యాంకుకు లేదా చెల్లింపు సేవల సంస్థకు వ్యాపారి చెల్లించే రుసుమే ఈ మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌.  గతంలో డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలపై ఈ ఛార్జీలు ఉండేవి. ఐతే డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2020లో యూపీఐ, రూపే డెబిట్‌ కార్డులపై ఈ చార్జీలను కేంద్రం తొలగించింది.  ఆ నిర్ణయమే దేశ డిజిటల్‌ చెల్లింపుల చరిత్రను అతి పెద్ద మలుపు తిప్పింది. ఇదే యూపీఐ విస్తరణకు బలమైన పునాది అయింది.  ఈ పరిస్థితికి భిన్నంగా ప్రభుత్వం చట్ట సవరణ చేస్తూ బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్ ప్రొవైడర్లకు మళ్లీ ఎండీఆర్‌ వసూలు చేసే చట్టబద్ధ అవకాశాన్ని కల్పించటంపై విమర్శలు వస్తున్నాయి.   అధికారికంగా పెద్ద వ్యాపార లావాదేవీలకే ఎండీఆర్‌ వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ బిల్లులో పేర్కొన్న సూక్ష్మ అంశాలు మరిన్ని వర్గాలకు కూడా దీని విస్తరణ కొనసాగుతుందని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈరోజు పెద్ద వ్యాపారులకు.. రేపు మధ్యతరహా వ్యాపారులకు రాబోయే రోజుల్లో సాధారణ లావేదేవీలకు ఇది వర్తించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.  

సిద్ధాంతపరంగా చూస్తే ఎండీఆర్‌ అనేది వ్యాపారి చెల్లించే చార్జీలు.  కానీ ఆర్థిక వ్యవస్థలో సిద్ధాంతం ఒకటి చెబితే వాస్తవం మరోలా ఉంటుంది.  ఒక వ్యాపారి మీద ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి ఖర్చు పెంచినా అతను దాన్ని భరించడు.  వస్తువు లేదా సేవల ధరలో ఆ భారాన్ని బదిలీ చేసి తనపైపడ్డ భారం దింపుకుంటాడు.  అంటే పన్ను చెల్లించేది వ్యాపారి అయినా చివరికి భారం మోసేది వినియోగదారుడే.  ఇదేమీ కొత్త విషయం కాదు.  ఇదే ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తెచ్చిన జీఎస్టీని వినియోగదారుడే భరిస్తున్నాడు.  జీఎస్టీని తెచ్చినప్పుడు దీని లక్ష్యం పన్ను వ్యవస్థను పారదర్శకంగా మార్చటమేనని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది. పన్ను వసూళ్లు క్రమబద్ధమయ్యాయి.  వినియోగదారుడి ప్రతి బిల్లులో రాష్ట్ర జీఎస్టీ, కేంద్ర జీఎస్టీ పేరుతో కనిపించే ఆ మొత్తాన్ని చివరికి చెల్లిస్తున్నది ప్రజలే.  ఇక్కడ వ్యాపారి కేవలం ప్రభుత్వం తరపున మొత్తాన్ని వసూలు చేస్తున్న మధ్యవర్తి మాత్రమే.  ఇదే పరిస్థితి రేపు యూపీఐలోనూ తలెత్తుతుందనే ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. 

ఒక కుటుంబం ఆదివారం రెస్టారెంట్‌ వెళ్లిందనుకుంటే బిల్లు రూ.4,500 వచ్చిందనుకుందాం.  ఇప్పుడు ఫోన్‌ తీసి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, ఆ బిల్లు చెల్లించేయచ్చు. కానీ రేపు ఆ బిల్లుపై ఆ రెస్టారెంట్‌ వ్యాపారి అదనపు చార్జీ వేసి మరీ చెల్లించమని అడుగుతాడు.  మీరు క్యాష్‌ ఇస్తే మంచిది యూపీఐ అయితే అదనంగా చెల్లించాల్సి వస్తుందనే మెలిక రెస్టారెంట్‌ యజమాని పెట్టడం ఖాయం. ఈ కారణంగా డిజిటల్‌ వ్యవస్థ ప్రజలకు భారమవుతుంది. దీంతో తప్పని పరిస్థితుల్లో సామాన్యుడు నగదు చెల్లింపుల వైపు మళ్లుతాడు. డిజిటల్‌ చెల్లింపుల కోసం కేంద్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు నడిపించింది. డిజిటల్‌ ఇండియా అంటూ ఓ పెద్ద ఉద్యమమే ప్రభుత్వం చేసింది. డిజిటల్‌ రూపంలో చెల్లిస్తే అదనపు చార్జీలు పడతాయనే సంకేతం అదే ప్రభుత్వం ఇస్తే సామాన్యులకు మళ్లీ నోట్ల కష్టాలు మొదలవుతాయి.  

యూపీఐ..అనేది ఒక చెల్లింపు విధానం మాత్రమే కాదు.  గత పదేళ్లలో ప్రపంచానికి భారత దేశం అందించిన అతిపెద్ద సాంకేతిక-ఆర్థిక వనరు.  ఇది కేవలం డబ్బు పంపే యాప్‌ కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నడిపించే ఒక మౌలిక సదుపాయం.  ఒకప్పుడు డిజిటల్‌ చెల్లింపులంటే నగరాలకే పరిమితం అని భావించేవారు.  నేడు సుదూర గ్రామాల్లో కూడా కూరగాయలు అమ్మే రైతుల నుంచి పట్టణంలో ఆటో నడిపే డ్రైవర్‌ వరకు ఈ యాప్‌ ను విస్తృతంగా నిత్యం వినియోగిస్తున్నారు.  చేతిలో నగదు లేకపోయినా వ్యాపారం ఆగడం లేదు.  యూపీఐ వ్యవస్థ నిర్వహణ ఖర్చు గురించి కూడా ప్రభుత్వం చర్చిస్తోంది.  సర్వర్లు, సైబర్‌ భద్రత, బ్యాంకుల అనుసంధానం, సాంకేతిక నిర్వహణ ఇవన్నీ వ్యయంతో కూడుకున్నవే.  కానీ ఈ ఖర్చులు మాత్రమే పరిగణలోకి తీసుకుని యూపీఐ సేవలను విశ్లేషిస్తే మనకు అర్థంకాదు.  ఒకసారి ఊహించండి యూపీఐ సేవలు లేవనుకుందాం.  అప్పుడు ప్రభుత్వం ఏంచేయాల్సి ఉంటుంది?  నోట్లు ముద్రించి, చిల్లర నాణేల ఉత్పత్తి పెంచాలి అదికూడా అవసరానికి సరిపడా ఉత్పత్తి చేయాలి. ఇలా తయారైన కరెన్సీని దేశమంతా రవాణా చేయాలి.  బ్యాంకులకు పంపాలి, మళ్లీ అదనంగా పాడైపోయిన నోట్లను తిరిగి తీసుకుని, వాటి స్థానంలో కొత్తవి మార్కెట్లోకి పంపాలి.  ఇవన్నీ ఒకెత్తైతే నకిలీ నోట్ల గుర్తింపు, వాటి ప్రవాహాన్ని అడ్డుకోవటం వంటి సవాళ్లు కీలకమైనవి.  అంటే నగదు వ్యవస్థ నిర్వహణకు ఖర్చు ఉంది, అలాగే డిజిటల్‌ వ్యవస్థకు ఖర్చు ఉంది.  ఇక్కడ ప్రశ్న దేనికి ఎంత ఖర్చన్నది కాదు కానీ ఏ సదుపాయం దేశానికి ఎక్కువ ప్రయోజనం ఇస్తుందన్నది ముఖ్యం.  డిజిటల్‌ లావాదేవీల వల్ల ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా కనిపిస్తోంది.  ఇదే ప్రపంచాన్ని ఆకట్టుకున్నది, ఈ విషయాన్ని ప్రభుత్వం నమ్మింది కానీ ఎందుకో మళ్లీ తుగ్లక్‌ తీరులో అకారణంగా నగదు చెల్లింపుల విధానానికి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ప్రభుత్వం పెట్టే ఖర్చును ప్రతిసారి పెట్టుబడిలా చూడలేం, ఆ ఖర్చుకు లాభాల లెక్కలు వేయలేం.  అదే ప్రజాస్వామ్య దేశంలో, మిశ్రమార్థిక వ్యవస్థలోని గొప్పతనం.  ఒక జాతీయ రహదారి నిర్మించినప్పుడు మొదటిరోజే టోల్‌ రూపంలో మొత్తం ఖర్చును తిరిగి రాబట్టాలని ప్రభుత్వం ఆశించదు ఎందుకంటే ఆ రహదారి నిర్మాణం వల్ల పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయి, ఉపాధి పెరిగి, ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఇలా ఈ రోడ్డు పరోక్షంగా ఆ ప్రాంత అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, చివరికి దేశాభివృద్ధికి బాటలు వేస్తుంది.  యూపీఐ కూడా అలాంటిదే. ఇక్కడ ఒక డిజిటల్‌ వసతి ఉంది.  దీని ద్వారా పన్ను ఎగవేత తగ్గుతుంది, నగదు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది, లావాదేవీలు వేగవంతమై, ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా మారుతుంది.  అందుకే యూపీఐ నిర్వహణకు అయ్యే ఖర్చును వ్యయంగా కాకుండా భవిష్యత్‌ కు పెట్టుబడిగా చూడాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.  ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు మన యూపీఐ నమూనాను అధ్యయనం చేస్తున్నాయి, ఇది మనకు గర్వకారణం, ఇలాంటి సమయంలో యూపీఐకి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం చేపడుతున్న ఈ చార్జీల ప్రతిపాదనలు దేశ ప్రగతికి అడ్డుగా నిలుస్తాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  యూపీఐ నిర్వహణ కోసం ఒక ప్రత్యేక డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్షన్‌ నిధిని ఏర్పాటు చేసుకోవటం, రిజర్వు బ్యాంకు మిగులు నిధుల్లో కొంత భాగాన్ని ఇందుకు కేటాయించటం, డిజిటల్‌ చెల్లింపు ద్వారా వచ్చిన పరోక్ష ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవటం ద్వారా దీన్ని నిలబెట్టవచ్చు.  ప్రభుత్వం చర్యలు ఈదిశగా ఉండాలని సోషల్‌ మీడియా వేదికగా సర్వత్రా కేంద్రానికి సూచనలు  చేరుతున్నాయి.  

ప్రభుత్వం త్వరలోనే రూ.10, రూ.20 నోట్లను కాగితం పేపర్‌ లో కాకుండా ప్లాస్టిక్‌ కరెన్సీ రూపంలో తేవాలని నిర్ణయించింది.  ఈమేరకు ఇప్పటికే రిజర్వ్‍ బ్యాంక్‌ ఓ ప్రకటన కూడా జారీచేసింది.  ఇలా ఒక్కొక్క నోటు వంద కోట్ల చొప్పున ముద్రిస్తారు.  అయితే ప్రస్తుతం ఇలా పది, ఇరవై రూపాయలు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే వాటికి బదులు మనం యూపీఐ చేస్తున్నాం.   ఈ ప్లాస్టిక్‌ నోట్ల వినియోగంతో యూపీఐని నివారించి, మళ్లీ నగదును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.  యూపీఐ లావాదేవీలను నిరుత్సాహపరచి కరెన్సీ వాడకాన్ని మళ్లీ అలవాటు చేయాలనుకుంటున్నట్టు ఈ బిల్లును పరిశీలిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.  దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.  “మోడీ మీ జేబులు గుల్ల చేయడానికి ప్లాన్‌ చేశారు, త్వరలోనే రెండు వేల కంటే ఎక్కువ చేసే యూపీఐ చెల్లింపులపై అదనపు వసూళ్లు మొదలవుతాయి, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ప్రజలు అల్లాడుతున్నారు, మోడీకి ఇవేం పట్టడం లేదు, కొత్త ప్లాన్‌ తో సామాన్యుల డబ్బును గుంజుకోవాలని చూస్తున్నారు.  ప్రజలు ఏమైపోయినా ఫర్లేదు, వసూళ్లు మాత్రం ఆపద్దన్నదే మోడీ విధానం” అంటూ సోషల్‌ మీడియా హోరెత్తుతోంది.  

ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలనుకుంటోందా? లేక మళ్లీ నగదు వినియోగాన్ని పెంచాలనుకుంటోందా? అనే సందేహం రాక మానదు.  మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు తుగ్లక్‌ చేపట్టిన చర్యలు ప్రస్తుత ప్రభుత్వ ధోరణికి దగ్గరగా ఉన్నాయి.  ప్రజల జీవితాన్ని సులభతరం చేసే విధానాలే కాల పరీక్షను తట్టుకుని నిలబడతాయి, ప్రజల జీవితాన్ని సంక్లిష్టం చేసే నిర్ణయాలు ఎంత ఘనమైన మోడీలు చేసినా ప్రజల ఆమోదం పొందటం కష్టం.  యూపీఐని నిర్వీర్యం చేసేముందు ప్రభుత్వం దాని ఉపయోగాన్ని మరోమారు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.  డిజిటల్‌ ఇండియా కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు అది కోట్లాది భారతీయుల దైనందిన జీవన విధానం. ఆ విధానాన్ని బలపరచే నిర్ణయాలు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి.  వీటిని బలహీనపరిచే నిర్ణయాలు మనల్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్తాయి. డిజిటల్‌ విప్లవాన్ని నిర్మించటానికి ప్రపంచంలోని గొప్ప దేశాలకే చాలాకాలం పడుతోంది. దాన్ని బలహీనం చేసేందుకు ఒక తప్పు నిర్ణయం చాలు. ఒక తప్పు నిర్ణయం మొత్తం ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసే ప్రమాదం పొంచిఉంది.  సో.. మోడీజీ తస్మాత్‌ జాగ్రత్త.

సమయమంత్రి చంద్ర శేఖర శర్మ

ఎడిటర్, తెలుగు ప్రభ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News