Saturday, June 29, 2024
Homeఓపన్ పేజ్Children literature: కథ రాయటం ఎలా?

Children literature: కథ రాయటం ఎలా?

వార్తలు, కథలు రాయటంలో తేడాలు ఏంటి?

మనం ఒక సంఘటనను ఉన్నది ఉన్నట్టు రాస్తే అది ‘వార్త’ అవుతుందని, ఆ సంఘటనకే కల్పన జోడిస్తే ‘కథ’ అవుతుందని తెలుసుకున్నాం. నేడు చాలా మంది బాలలు కథలు రాయటానికి ప్రయత్నిస్తున్నారు. కొద్దిమంది సంఘనలనే కథ అని భ్రమపడి రాస్తున్నారు.పైగా వాటిని పుస్తకాలుగా ముద్రిస్తున్నారు. అవి కేవలం వార్తలే అవుతాయి తప్పా వాటిని కథలు అని ఎవరూ అనరు.ఎందుకంటే కథా రచనకు కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాలు లేకుంటే అది కథ కానే కాదు. అయితే ఒక సంఘటను తీసుకుని కథగా ఎలా రాయవచ్చో గమనిద్దాం !
ఈక్రింది కథను ఒకసారి చదవండి. కథ పేరు ‘ ఆటోలో ఆ రాత్రి !’.
అది హైదరాబాదులోని మలక్ పేట చౌరస్తా. నేను ఆఫీసు పని చూసుకుని ఫ్రెండ్ దగ్గర మూడువేలు, నావి రెండు వేలు నా ప్యాంటు సీక్రెట్ పాకెట్లో పెట్టుకుని ఆటో కోసం ఎదురు చూస్తున్నాను. అది అసలే రాత్రిపూట. అందులోనూ ఆటోలు ‘జిల్లెల్గూడ’ ప్రాంతానికి ఎక్కువగా రావు. కాని నేను తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. హైదరాబాద్ లోని పత్రికాఫీసులో పనిచేసే నాతో “ఒరేయ్… అర్జంటుగా మీ బావగారికి ఐదువేలు అవసరమ య్యాయి. ఎలాగైనా సాయంత్రంలోగా ఇంటికి వచ్చి సర్దిపో..” అంటూ మా కజిన్ సిస్టర్ తన ప్రాబ్లం చెప్పుకుంది. దాంతో నాదగ్గరున్న రెండువేలు.. సాయంత్రం ఆఫీసు అయిన తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్లి విషయ చెప్పి వాని దగ్గర మూడువేలు అడిగి తీసుకునే సరికి రాత్రయింది. నాకు మొదటి నుంచి ఆటో వాళ్లంటే భయమే. ‘డబ్బు దగ్గరుందని తెలిస్తే మోసం చేసి చేజిక్కించుకుంటారు. అందులో హైదరాబాదు ఆటోవాళ్ళు మరీనూ’ అన్న ఆలోచన ఉండేది. అందుకే ఆటోలో ఉన్న డ్రైవరును చూసి మరీ ఎక్కుతాను. చూపులకి ‘రౌడీ’లా ఉంటే అస్సలు ఎక్కను. ఇంతలో ఒక ఆటో వచ్చి నా ముందు స్లో అయింది. ‘ జిల్లెల గూడా ‘ అన్నాను. ఎక్కమన్నాడు. అతను బక్కగా అమాయకంగా కనిపించాడు. చాలా సంతోషం కలిగింది. ఆ రూట్లో అక్కడక్కడా మార్గం మధ్యలో ప్రయాణికులను రాత్రిపూట ఎక్కించుకుంటుంటారు. అసలే ఆటోలు తక్కువ.. దాంతో దొరికిన ఆటో ఎక్కక తప్పదు ప్రయాణికులకి,
ఆటో వేగంగా జిల్లెల గూడ వైపు దూసుకుపోతోంది. అయినా ఒంటరిగా, జేబులో డబ్బుతో ఉన్న నాకు ఆటోవాడిపై కొంచెం అనుమానంగానే ఉంది.
కానీ భయాన్ని పైకి కనిపించకుండా జాగ్రత్తపడుతున్నాను. మనసులో ‘భగవంతుడా! దార్లో ఇంకో ప్రయాణికుడిని తోడుగా ఎక్కేలా చూడు’ అనుకున్నాను. అంతే అనుకుందే తడువు ఆటో ఆగింది.
ముగ్గురు యువకులు ఎక్కి కూర్చు న్నారు. నాకు తోడుగా ప్రయాణికులు దొరికినందుకు గుండె భారం తగ్గినట్లయింది. అప్పటివరకు నుదిటిన పట్టిన చెమటలు కర్చీఫ్ తో చిన్నగా తుడుచుకొని అలా రోడ్డుమీదకు చూస్తున్నాను. అంతా చీకటిగా వుంది. అయినా నాలో భయం ఏ కోశానా లేదు. నాకు తోడుగా ముగ్గురు యువకులు ఉన్నారులే అనుకున్నాను. ఆటో జిల్లెల గూడ సమీపంలోని నిర్మా నుష్యనైన ప్రాంతాన్ని గేరుకుందో లేదో.. ఉన్నట్టుండి ఆ ముగ్గురు యువకులు ఆటో ఆపమన్నారు. వారు దిగలేదు. కానీ ..నన్ను దిగమన్నారు. నాకు అర్ధంకాక చూస్తుంటే ” ఛల్ ! ఛల్..!! ” అంటూ బలవంతంగా దింపారు.
సర్రున కత్తులు తీసి ఆటో డ్రైవర్ను బెదిరించి ఆటో వాడినీ దిగమన్నారు. దాంతో డ్రైవర్ ఎదురు తిరగబోతుంటే వాడిని చితకబాది అతని వద్ద వున్న డబ్బులు లాక్కుని ఆటోతో సహా పారిపోయారు.
అసలే భయస్తుడినైన నేను ఏమీ చేయలేక మరింత భయంతో దృశ్యాన్ని అలా చూస్తుండిపోయాను.
అంతలో అటుగా వస్తున్న కారుని ఆపించి వారికి విషయం చెప్పి గాయపడ్డ డ్రైవర్ని హాస్పిటల్కు తీసుకుపొమ్మని నచ్చచెప్పి అతన్ని కారు ఎక్కించాను.
ఆ ప్రదేశం నుండి మా కజిన్ వాళ్ళ ఇల్లు నడిచిపోయే దూరమే. వణుకుతున్న పాదాలు ఒక్కో అడుగు రెండడుగుల సమానంగా, వేగంగా ముందుకు పడుతుంటే ‘కథ అడ్డం తిరిగినందుకు ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో…’ అర్థంకాక ె అవస్థపడుతూ ఉండగా మా కజిన్ ఇల్లు రానే వచ్చింది. పై కథ అక్టోబరు 1999 బాలమిత్ర (బాలల మాస పత్రిక) లో ప్రచురితమైంది. అంటే 25 సంవత్సరాల క్రితం నేను ఉత్తమ పురుషలో (నేను /మేము) రాసిన కథ. అప్పటి పరిస్దితులకు అనుకూలంగా రాసుకున్నది. ఇప్పుడు జిల్లేల గూడాలో నిర్మానుష్య ప్రదేశమే లేదు. ఐదు వేలు పెద్ద ఎమౌంటు కాదు.కాకుంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక ‘వార్త’ ను కథగా ఎలా మలిచాము అనేదే ! అందుకే కథను ఏమాత్రం మార్చకుండా ఉన్నది ఉన్నట్టు పైన యిచ్చాను. ఇక్కడ నిజానికి .. ‘ రాత్రిపూట ప్రయాణికుల నుంచి కొందరు ఆటో వారు బెదిరించి డబ్బు కాజేస్తున్నారు !’ అనేది వార్త. ఐతే కథ రాసుకునేటప్పుడు మనం రొటీన్ కు భిన్నంగా ఆలోచించి రాసి మెప్పించ గలగాలి. పాఠకుడి ఊహకు అందకుండా రాయగలిగితే అది మంచి కథగా నిలిచిపోతుంది. చదివిన వారు గొప్ప అనుభూతికి లోనవుతారు. పై కథలో అదే జరిగింది. మనం సాధారనంగా ఆటో వారు ప్రయాణికులను దోచుకున్న సంఘటనలు చదువుతుంటాం కానీ.. ప్రయాణికులే ఆటో అతన్ని దోచుకుంటే.. ఇది వింటానికే వింతగా ఉంటుంది.ఆ కథా వస్తువు తీసుకుని అక్కా, బావ, ఆటో, ప్రయాణికులు పాత్రలుగా కల్పన జోడించి రాసిన కథే ‘ ఆటోలో అ రాత్రి ! ‘.పై కథలో కథకు ఉండవలసిన లక్షణాలన్నీ మనం గమనించవచ్చు.
(వచ్చేవారం మనం ఒకే కథా వస్తువు తీసుకుని ఎన్ని రకాలుగా కథలు రాయవచ్చో తెలుసుకుందాం.)

- Advertisement -

పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
సెల్ : 92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News