Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Children literature: మన ఊరు మన చెట్లు బాలల కథలు

Children literature: మన ఊరు మన చెట్లు బాలల కథలు

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా

పర్యావరణ పరిరక్షణ అనేది శతాబ్దాలుగా ప్రపంచంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా ఉద్భవించింది. ప్రకృతి పట్ల మానవుడు చేయు తప్పిదాలు పర్యావరణ క్షీణతపై పెనుప్రభావాన్ని చూపుతున్నాయి. పర్యావరణ విధ్వంసం మరియు సహజ వనరుల క్షీణత ఎప్పటికీ కనిపించే ముఖ్యమైన సమస్యలు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది నేటి సమాజంలో అంతర్భాగంగా ఉండాలి. కానీ చాలా మందికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఏమి చేయాలో కనీస ప్రాథమిక జ్ఞానం కూడా ఉండటం లేదు. అందుకే నేటితరం పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించి నట్లయితే భవిష్యత్తులో కాలుష్య రహిత సమాజం నిర్మించడానికి అవకాశం ఉంటుంది.
అందుకే పిల్లలకు చిన్నప్పటినుండే పర్యా వరణస్పృహ కల్పించాలనే ధృడ సంకల్పంతో తెలంగాణ సాహిత్య అకాడమీ గత సంవత్సరం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమి వారు ఒకే రోజు, ఒకే సమయం, ఒకే అంశంపై విద్యార్థులకు కథల పోటీ నిర్వహించింది. ‘మన ఊరు – మన చెట్లు‘ అన్న అంశంపై సాహిత్య అకా డమి పిల్లల కోసం నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి 6 నుండి 10వ తరగతి చదువుతున్న సుమారు 5 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అలా వచ్చిన వాటిలో సుమారు వెయ్యికి పైగా కథలను ఎంపిక చేసి 33 జిల్లాల పుస్తకాలను సాహిత్య అకాడమీ ముద్రించింది.
పెద్దపల్లి జిల్లా నుండి అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కథల పోటీలో పాల్గొన్నారు. అలా వచ్చిన వాటిలో నుండి 42 కథలను ఎంపిక చేసి ‘మన ఊరు – మన చెట్లు’ బాలల కథల పుస్తకాన్ని సాహిత్య అకాడమి ప్రచురించింది. ఈ పుస్తకానికి ప్రధాన సంపాదకుడిగా జూలూరు గౌరీశంకర్‌, సంపాదకుడిగా గరిపెల్లి అశోక్‌ వ్యవహరించారు. పెద్దపల్లి జిల్లా బాలల కథల పుస్తకంలో పిల్లలు తమ ఆలోచనలను, అనుభూతులను తమదైన శైలిలో చక్కగా వ్యక్తపరిచారు. పచ్చదనం, పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తూ భవిష్యత్‌ భారత్‌ ఎలా ఉండాలో, వారు ఏమో కోరుకుంటున్నారో తమ కలాలకు పదునుపెట్టి విద్యార్థులు చక్కటి కథలను రాశారు.
వాణి అనే అమ్మాయికి వచ్చిన ఒక చిన్న ఆలోచన, దేశమంతా పచ్చదనంగా మార్పు చెందడానికి కారణమైన విధానాన్ని అనుదీపిక ‘కల’ అనే కథలో రాసింది. ఎవరో ఎదో అన్నారని బాధ పడకూడదని ప్రతిఒక్కరూ చెట్లు పెంచడానికి స్ఫూర్తిగా నిలవాలని ‘స్నేహితులు’ కథ ద్వారా బానుతేజ తెలియజేయగా, చెట్లు నరికే మహేష్‌లో ‘తాత మాట’తో వచ్చిన మార్పును సహనా తెలిపింది. అడవులు మానవ మనుగడకు జీవనాధారం అని శ్రావ్య తెలుపగా, ప్రకృతి వనాల ప్రాధాన్యత గురించి విష్ణు వర్ధన్‌ రాశాడు. ఊరి మర్రి చెట్టు గురించి సహస్ర, వేప చెట్టు, చింత చెట్టు గురించి అక్షిత కథలు రాయగా వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని వైష్ణవి ‘మంచి పని’ కథ ద్వారా తెలియజేసింది.
చెట్టు చేసిన సహాయం గురించి గోపిక, సేంద్రియ ఎరువుల వాడకం గురించి శ్రీరాం, ప్రజలందరి కోసం చెట్లు నాటాలని మాధవి రాసిన కథలు బాగున్నాయి. చెట్ల ఉపయోగాల గురించి త్రిష, చైతన్య , ఆశ్విని రాయగా, చెట్లు లేకపోతే కలిగే నష్టాల గురించి మధుమిత, ప్రణీత కథలు రాశారు. సోము తను చేసిన తప్పును ఏవిధంగా సరిదిద్దుకున్నాడో తెలియజేస్తూ సహజ, పల్లెటూరు – పట్నం వాతావరణానికి గల తేడాలను అనిల్‌, భవిష్యత్‌ ఆలోచనతో సుప్రియ, చెట్ల పెంపకం ద్వారానే అందం, ఆనందం కలుగుతుందని సాత్వి క, చెట్టు యొక్క స్వగతాన్ని తెలియజేస్తూ రమ్య రాసిన కథలు ఆకట్టుకున్నాయి. ఇలా ఈ పుస్తకంలోని కథలన్నీ ఊరు గురించి, చెట్ల గురించి, ప్రకృతి పచ్చదనం గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి రాసినవే కావడం విశేషం.
ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఒకే సమయంలో ఒకే అంశంలో కథల పోటీలో పాల్గొనడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారిగా జరిగింది. ఈ బృహత్‌ సంకల్పం కొరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖతో పాటు సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూ రు గౌరీశంకర్‌, ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్‌ మరియు వివిధ స్థాయిల్లో ఉన్న విద్యాశాఖ అధికారులు విశేష కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యా ర్థులు తమ చిట్టి చేతులతో కలం పట్టి చెట్ల గురించి, తమ ఊరి ప్రకృతిని గురించి అద్భుతమైన రీతిలో కథలుగా మలిచారు.
ఇవి పిల్లలు వారి స్థాయిలో రాసిన కథలు. ఇందులో కొన్నిటికీ పూర్తి కథా లక్షణాలు లేక పోయినప్పటికీ, అక్కడక్కడ కొన్ని దోషాలు కనబడి నప్పటికీ, పిల్లలు చేసిన ఈ ప్రయత్నం ప్రశంసనీయం. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమి చేసిన కృషి అభినందనీయం. కథల రచనల్లో పాల్గొన్న ఈ విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప కవులుగా, రచయితలుగా, పర్యావరణ పరిరక్షకులుగా తయారవుతారని ఆశిస్తూ వారందరికీ అభినందనలు.

  • సమీక్షకుడు
    కందుకూరి భాస్కర్‌,
    9441557188.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News