Friday, November 8, 2024
Homeఓపన్ పేజ్Children rhymes writing tips: బాలగేయాలకి లయ ముఖ్యం

Children rhymes writing tips: బాలగేయాలకి లయ ముఖ్యం

” బాలగేయాలు సరళంగా పాడుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ముగింపులో చిన్న చమత్కారం వుంటే ఆ గేయం నిలిచి పోతుంది..బాలగేయానికి లయముఖ్యం “
అంటారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని డమ్మాయపాలెం గ్రామంకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త
గుండాల నరేంద్రబాబు.
శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీ నరసయ్య దంపతులకు జన్మించారు.
బాలలకోసం అనేక గేయాలు రాశారు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయులు.బాలసాహితావేత్తగా,
వ్యాఖ్యాతగా, సామాజిక సేవకునిగా, ఎన్ సి సి అధికారిగా గాయకునిగా గుర్తింపు పొందారు.
ఈవారం మనం గుండాల నరేంద్రబాబు రాసిన గేయాలు, కొత్తగా రాసేవారికి వారిచ్చే సూచనలు గమనిద్దాం.

- Advertisement -

గుండాల ప్రకృతిలో కనిపించే ప్రతి జీవిమీద, వస్తువు మీద గేయాలు రాశారు. పిచ్చుక,పిల్లి, పువ్వులు, పిల్లలు, నవ్వులు,కుక్క,బొమ్మలు, మామిడి ఇలా ఒక్కటేమిటి తన చుట్టూ కనిపించే ప్రతీదీ గేయ వస్తువుగా తీసుకుని బాలగేయాలు రాశారు.

బుల్లి బుల్లి పిచ్చుక


పిచ్చుకమ్మా పిచ్చుక
ముచ్చటైనా పిచ్చుక
మచ్చిక చేయు పిచ్చుక
కిచ కిచ లాడు పిచ్చుక

స్వచ్ఛమైనా పిచ్చుక
మచ్చలేనీ పిచ్చుక
ముచ్చట్లాడు పిచ్చుక
మంచి చేసే పిచ్చుక

బుల్లి బుల్లీ పిచ్చుక
అల్లీబిల్లి పిచ్చుక
మల్లి మనసే పిచ్చుక
పల్లె తల్లీ పిచ్చుక

ఓ ప్రకృతీ ప్రేమిక
వికృత పనులు మానిక
అరుదైనదీ పిచ్చుక
కరుణతో కాపాడిక

పల్లెతల్లి పిచ్చుక అనటం గుండాల నరేంద్రబాబుకే చెల్లింది. బుల్లి, బిల్లి, మల్లి,తల్లి …వంటి ప్రయోగాలు, అక్షరాలతో ఆటలు ఆటలు ఆడుతూ లయాత్మకంగా గేయాన్ని నడిపారు.

మరోగేయం
అందాలు చిందే బొమ్మలు


బొమ్మలమ్మా బొమ్మలు
గమ్మతైనా బొమ్మలు
అమ్మ లాంటీ బొమ్మలు
కమ్మని కోకిలమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు
కనువిందైన బొమ్మలు
బుడి బుడి నడకల బొమ్మలు
తడబడు అడుగుల బొమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు
రక రకాలా బొమ్మలు
రంగు రంగుల బొమ్మలు
హంగు హంగుల బొమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు
పలు జంతువుల బొమ్మలు
పలు పక్షులా బొమ్మలు
పలు ప్రాణులా బొమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు
అమ్మ నాన్న బొమ్మలు
అవ్వా తాత బొమ్మలు
అక్క తమ్ముడు బొమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు
అందాలు పెంచే బొమ్మలు
బంధాలు వేసే బొమ్మలు
గంధాలు చిందే బొమ్మలు

పై గేయం ఒక అలలా పొంగింది.

అందాలు,బంధాలు, , గంధాలు వంటి పద ప్రయోగాలు లయాత్మకంగా హృదయాత్మకంగా,
వీనుల విందుగా , పిల్లలకు పసందుగా సాగింది.
ఇంకో గేయం
కుక్క పిల్ల


కుక్కపిల్లా కుక్కపిల్లా
చక్కనైనా కుక్క పిల్లా
ముచ్చటైనా కుక్కపిల్లా
మచ్చికైనా కుక్క పిల్లా

ఆటలాడే కుక్కపిల్లా
పాటపాడే కుక్కపిల్లా
ముద్దులొలికే కుక్కపిల్లా
పొద్దు పొడుపే కుక్కపిల్లా

మనసు దోచే కుక్కపిల్లా
మన చుట్టమే కుక్కపిల్లా
మరపురానిది కుక్క పిల్లా
మరులు గోల్పే కుక్క పిల్లా

అరుదైనదే కుక్కపిల్లా
ఆరోగ్యమే కుక్క పిల్లా
విశ్వాసంలో కుక్కపిల్ల
విశ్వవీధిలో కుక్కపిల్ల
ముద్దులొలికే కుక్కపిల్ల, పొద్దు పొడుపే కుక్క పిల్ల అనటం ఎంతో బాగుంది.
ఇక చివరగా
వరాల మామిడి


వచ్చిందమ్మా వచ్చింది
వేసవికాలం వచ్చింది
నోరూరించే తియ్యనీ
వరాల మామిడి తెచ్చింది

భగ భగ మండే వేళలో
ధగ ధగ సెగల మంటల్లో
బంగినపల్లీ పందిరై
వేగిరమే రా రమ్మంది

బంగారు మేని ఛాయతో
సింగారాల బుగ్గలతో
సిగ్గుల మొగ్గలు వేసింది
మాగిన మధువే చిలికింది

ఉలవపాడు మామిడి పండ్లు
తలచుకుంటే తేనెలూరు
గిజి గాడి ఊయలే ఊగు
నూజివీడు రసాలె త్రాగు
వేసవిలో వచ్చే మామిడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.గుండాల నరేంద్రబాబు గేయాలు కూడా తియ్యటి మామిడి పళ్లలా ఉంటాయి.

( వచ్చేవారం మరో బాలసాహితీవేత్త గేయరచనల గురించి పరిశీలిద్దాం)

– పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News