అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా అధికారికంగా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఆదివారం నాడు ఒక ప్రకటన చేస్తూ, 11 ప్రాంతాల పేర్లను తాము ‘ప్రామాణికం’ చేస్తున్నట్టు, వీటిని దక్షిణ టిబెట్‌లోనో, జంగ్నాన్‌లోనో భాగాలుగా పరిగణిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాంతాలు కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశ అధీనంలో ఉన్నాయి. చైనా గుర్తించిన అక్షాంశ రేఖలు, అయనాంశలను బట్టి అవి అరుణాచల్ ప్రదేశ్‌లోని భాగాలుగా అర్థం చేసుకోవడం జరిగింది. చైనా గుర్తించిన ప్రాంతాలలో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఐతానగర్‌కు బాగా సమీపంలో ఉంది. నిజానికి చైనా 2017 తరువాత వరుసగా మూడు పర్యాయాలు ఈ అకృత్యానికి పాల్పడుతూ వచ్చింది. భారతదేశ సార్వభౌమత్వానికి ఇది పూర్తిగా విరుద్ధమని, దేశ సరిహద్దుల్లోకి చైనా ప్రవేశిస్తోందనడానికి ఇది ప్రబల సాక్ష్యమని భారత ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా కనిపెట్టిన పేర్ల కారణంగా వాస్తవాన్ని మసి పూసి మారేడు కాయ చేయడం సాధ్యం కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ అంతర్భాగమనే సత్యాన్ని ఎవరూ కాదనలేరని కూడా అది పేర్కొంది.
చైనా ఈ విధంగానే 2017లో ఆరు ప్రాంతాలకు, 2021లో 15 ప్రాంతాలకు కొత్తగా పేర్లు పెట్టి, ఈ ప్రాంతాలు చైనాకు చెందినవేనని ప్రకటించింది.కొత్తగా ఈ పేర్లు పెట్టడానికి చైనా ఎంచుకున్నసమయం, సందర్భాన్ని బట్టి ఆ దేశం ఉద్దేశపూర్వకంగానే భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోందని, దీనిని వెనుకటి చర్యలనే పునరావృతం చేయడంగా భావించలేమని విదేశాంగ శాఖ భావిస్తోంది. 2017లో దలైలామా తైవాంగ్‌ను సందర్శించినప్పుడుఅందుకు ప్రతీకారంగా చైనా ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లను ప్రకటించింది.ఇక 2021లో చైనా ఒకకొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం పేరు ‘భూమి, రాష్ట్ర సరిహద్దు చట్టం.’ చైనా తన భూభాగాలను తిరిగి తనలో విలీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే చట్టం ఇది. ఈ చట్టం ప్రకారం తాము అవసరమైతే పూర్తి అరుణాచల్ ప్రదేశ్‌ను స్వాధీనం చేసుకోవచ్చని కూడా ప్రకటించింది.
తాజాగా చైనా ఈ చర్య తీసుకోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. గత డిసెంబర్‌లో వాస్తవాదీన రేఖ దగ్గరగా ఉన్న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సే సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నించినప్పుడు భారత సైన్యం తిప్పికొట్టింది. ఐతానగర్‌లో జి-20కి సంబంధించిన ఒక సమావేశాన్ని నిర్వహించడానికి భారత ప్రభుత్వం తలపెట్టినప్పుడు చైనా దానిని బహిష్కరించింది.ఈ రెండు చర్యలతో చైనా ప్రతీకారానికి దిగినట్టు కనిపిస్తోంది. చైనాతో 2020 నుంచి చర్చలకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ దేశం నుంచి ఎటువంటి స్పందనా లభించకపోవడం, ఆ తర్వాత నుంచి ఈ రెండు దేశాల సంబంధాలు మరింతగా క్షీణించడం వంటివి చైనా భావి వ్యూహాలకు అద్దం పడుతున్నాయి.గాల్వన్ దగ్గర తీవ్రస్థాయి ఘర్షణలు చోటు చేసుకోవడం కూడా చైనా దురుద్దేశాలను బయటపెడుతున్నాయి. చర్చల ద్వారా గతంలో కొన్ని ప్రాంతాలలో పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, రాజకీయంగా ఈ రెండు దేశాల మధ్య సఖ్యత గానీ, సయోధ్య గానీ ఇంతవరకూ సాధ్యం కావడం లేదు.
విదేశాంగ మంత్రుల స్థాయిలో ఒకసారి, రక్షణ మంత్రుల స్థాయిలో మరొకసారి చైనాతో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇండొనీషియాలో జి-20 దేశాల సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కూడా చర్చలు జరిగాయి.అయితే, ఈ చర్చలకు చైనా ప్రభుత్వం ఏ దశలోనూ, ఏ స్థాయిలోనూ కట్టుబడి ఉండడం లేదు. చైనా కొత్త వ్యూహాన్ని ఖండించడంతో పాటు, మరోసారి ఆ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించడం వల్ల ఉపయోగం ఉంటుందేమో పరిశీలించాల్సి ఉంటుంది. చైనా ఉద్దేశాలు పూర్తిగా అర్థమైతే తప్ప భారత ప్రభుత్వం తన కార్యాచరణను రూపొందించుకోవడం కొద్దిగా కష్టమే అవుతుంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వడమనేది ఏదో ఒక కారణంపై చైనా కొనసాగిస్తూనే ఉంటుందని కూడా భావించాల్సి ఉంటుంది.