చైనా ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా క్షీణించిపోతుండడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు నిజంగా ఒక వరమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శూన్యం ఏర్పడుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థ బలీయంగా ఉండి ఉంటే, ప్రపంచ దేశాలకు ఒక విధంగా సహాయకారిగా ఉండేది. అయితే, ఈ మధ్య కాలంలో దాని పరిస్థితి దిగజారుతుండడంతో ఇతర దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. తమ ఉత్పత్తులకు మార్కెట్ కోసం నిత్యం ఎదురు చూసే ప్రపంచ దేశాలు ఇప్పుడొక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ మీద ఆధారపడేందుకు అనేక రకాలుగా సిద్ధపడుతున్నాయి. ఈ అవకాశాన్ని భారత్ సద్వి నియోగం చేసుకోవాల్సి ఉంది. భారతదేశంలో ఇందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయి. చైనా కారణంగా ఏర్పడుతున్న శూన్యాన్ని భర్తీ చేయడానికి అవకాశాలు కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. ఈ సమయంలో భారత్ కొద్దిగా తనను తాను సరిదిద్దుకోగలిగితే, ప్రపంచ దేశాలకు తగ్గట్టుగా మారగలిగితే ఇక ఈ దేశానికి తిరుగుండదని చెప్పవచ్చు. చైనా తన విధానాలను సమూలంగా మార్చుకోవడం వల్ల, దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి పోతుండడం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన ఏర్పడింది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో దూకుడుగా, వేగంగా, చురుకుగా విధానాలను చేపట్టడం జరుగుతోంది. ఇప్పుడు ఏ దేశమూ ఇతర దేశాలపై ఆధారపడే ఉద్దేశంలో లేవు. ముఖ్యంగా చైనా మీద ఆధారపడడానికి ఏ దేశమూ సిద్ధంగా లేదు. చైనాతో పాటు మరే దేశమైనా తమకు ఆలంబనగా ఉంటుందా అని అనేక దేశాలు అన్వేషిస్తున్నాయి. ఈ దేశాల వ్యూహాలకు, ఆలోచనలకు భారత్ ఓ కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ ఇప్పుడు ఈ అవకాశాన్ని రెండు చేతులతోనూ అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంలో తమకు ఉపయోగపడే విధంగా తమ విధానాలను రూపొందించుకోవాల్సిన అగత్యం ఉంది. కొన్ని స్వల్ప విషయాల్లో భారత్ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. చైనా పట్టు నుంచి కొన్ని దేశాలను తమ వైపునకు తిప్పుకోవడంలోనూ, చిన్నాచితకా సహాయాలు అందించడంలోనూ భారత్ ముందంజ వేసింది. అయితే, చైనా దేశానికి ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రపంచ దేశాలకు చూపించ గల విధానాలకు ఇంకా చాలా దూరంలోనే ఉందనడంలో సందేహం లేదు. నిజానికి భారత్ ప్రస్తుతం చేపడుతున్న కొన్ని విధానాలు ఇతర దేశాలను ఆశ్చర్యంలో ముంచుత్తుతున్నాయి. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అంటూ కొత్త కార్యక్రమాలు సృష్టించిన భారత్ మధ్య మధ్య 1960, 1970ల నాటి విధానాలను ఆచరిస్తోంది. ఉదాహరణకు, నిత్యావసర వస్తువులపై భారీగా లెవీ విధించడం, ఎగుమతులపై నిషేధాలు విధిం చడం. దిగుమతుల మీద కూడా భారీగా సుంకాలు విధించడం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే తిరోగమన విధానాల కింద గుర్తింపు పొందుతు న్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న అనేక వస్తు పరికరాలు భారత్ కు ముడి వస్తువులుగా ఉపయోగపడుతున్నాయి. ఉత్పత్తులను పెంచడానికి ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది కానీ, అవి పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. అంతేకాదు, ఈ ఉత్పత్తుల విలువ 2022లో జీడీపీలో 13 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తరచూ విధా నాలను మార్చుకోవడం, లోపభూయిష్టమైన పన్నుల వ్యవస్థ వగైరాల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వ్యవస్థకు ఆమడ దూరంలో ఉంది.
China recession: చైనాలో మాంద్యం భారత్‌కు వరం
అన్ని దేశాల చూపు భారత్ వైపు