Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్China should learn lessons: పాఠాలు నేర్చుకోని చైనా నాయకత్వం

China should learn lessons: పాఠాలు నేర్చుకోని చైనా నాయకత్వం

సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్ లకు భారతదేశానికి అడపా దడపా సమస్యలు సృష్టించడమనేది వాటి విదేశాంగ విధానంలో అత్యంత ముఖ్యమైన భాగం. దక్షిణాసియా సరిహద్దులో తిష్టవేయడంతో పాటు, భారత్ కు ప్రధాన శత్రు దేశమైన పాకిస్థాన్ తో కలిసి కవ్వింపు చర్యలకు దిగుతుండడం చైనాకు పరిపాటి అయిపోయింది. అయితే, భారత్ పై ఈ రకమైన ఒత్తిళ్లు తీసుకు రావడమనేది ఎంతో కాలం సాగదని, ఈ వ్యవహారంలో విజయం సాధించలేమని ఆ దేశం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. నిజానికి ఈ విషయం చైనా నాయకత్వానికి తెలియకపోలేదు. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారత, అమెరికా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు జరపడం చైనా దేశానికి ప్రస్తుతం కంటగింపుగా తయారైంది. ఈ విన్యాసాలకు చైనా అభ్యంతరాలు చెప్పడం 1993, 1996 చైనా, భారతదేశ సరిహద్దు ఒప్పందాలకు పూర్తిగా విరుద్ధం. వాస్తవానికి, 2020 ఏప్రిల్ లో తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా సైనికులు ముందుకు చొచ్చుకు రావడంతోనే ఆ ఒప్పందాలను చించి బుట్ట దాఖలు చేసినట్టయింది. ఆ ఒప్పందాలనే కాదు, 2005, 2012, 2013 నాటి ఒప్పందాలను కూడా చైనా తోసిరాజన్నట్టయింది.

- Advertisement -

చైనా, భారతదేశ సరిహద్దులకు సంబంధించి ఏ రకమైన సమస్య తలెత్తినా దానిని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆ ఒప్పందాలన్నీ సూచిస్తున్నాయి. ఇందులో ఏ దేశమూ దౌర్జన్యంగానో, భయపెట్టో, యుద్ధం ద్వారానో ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకూడదని కూడా ఈ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, 2020లో చైనా తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత సరిహద్దుల్లోకి చొచ్చుకు రావడం వల్ల ఇరు బలగాల మధ్య యుద్ధం లాంటిది చోటు చేసుకోవడం, అందులో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సరిహద్దు సమస్యను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా ఏమాత్రం సిద్ధంగా లేదు. ఆ మాటకొస్తే భారత్ తో ఏ సమస్యనూ అది శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేదు. భారత్ ను ఏదో విధంగా బలహీనపరచాలన్నదే, ఆసియాలో తాను తిరుగులేని మహాశక్తిగా, ఏకైక శక్తిగా అధికారం చలాయించాలన్నదే ఆ దేశ ఏకైక లక్ష్యం. అందుకు అది భారతదేశానికి మొట్టమొదటి శత్రువైన పాకిస్థాన్ ను కూడా ఓ అస్త్రంగా వాడుకుంటోంది.

ఇక సరిహద్దు సమస్యలను గానీ, ఇతర ద్వైపాక్షిక సమస్యలను గానీ చైనా శాంతియుతంగా పరిష్కరిస్తుందనే నమ్మకం భారత్ కు కూడా లేదు. వివాదాస్పద ప్రాంతాలలో భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించినా, చైనాతో వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను మరింతగా పెంచినా చైనా తీరులో అణువంత మార్పు కూడా రాలేదు. భారత, చైనాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడానికి 1989 నుంచి దాదాపు ప్రతి ప్రభుత్వమూ తమ వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలేవీ చైనా వైఖరిలో మార్పు తీసుకు రాలేకపోయాయి. చివరికి ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ దగ్గర సైనిక బలగాల మోహరింపు తప్పడం లేదు. ‘ఆపరేషన్ యుధ్ అభ్యాస్’ పేరుతో ఉత్తారాఖండ్ దగ్గర భారత, అమెరికా సైన్యాలు ఉమ్మడి విన్యాసాలు చేపట్టాయి. ఈ విన్యాసాలు ఉత్తరాఖండ్ వద్ద వాస్తవాధీన రేఖకు 100 కిలోమీటర్ల దూరంలో ఔలి అనే ప్రాంతంలో జరుగుతున్నాయి. చైనా వీటికి అభ్యంతరం చెబుతోంది. 1993, 1996 సంవత్సరాల నాటి ఒప్పందాలను తోసిరాజన్న చైనా నాయకత్వానికి ఇప్పుడు భారత్ ను తప్పుబట్టే హక్కుందా అన్నది ఆలోచించాల్సిన విషయం.

సరిహద్దులో సైనిక బలగాల విన్యాసాలు జరగాలన్నా, బలగాలను మోహరించాలన్నా కనీసం నెల రోజుల ముందు తెలియజేయాలన్న ఒప్పందాన్ని కూడా చైనా అనేక పర్యాయాలు ఉల్లంఘించింది. తన ఇష్టానుసారం ఈ ఒప్పందాలను అతిక్రమిస్తున్న చైనా ఇప్పుడు భారత్ విన్యాసాలను మాత్రం తీవ్రంగా తప్పుబడుతోంది. లడఖ్ ప్రాంతంలో చొచ్చుకు వచ్చి యుద్ధ వాతావరణం కల్పించిన చైనా ఇప్పుడు ఔలి విన్యాసాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే, ఔలి అనే ప్రాంతం భారత్, చైనా దేశాలకు సంబంధించిన వివాదాస్పద ప్రాంతం కానే కాదు. వివాదాస్పద ప్రాంతాల జాబితాలో ఔలి లేదు. భారత్ తీరులో తప్పులు వెతికే చైనా ముందుగా తన తప్పులను సరిదిద్దుకోవడం మంచిది అని విదేశాంగ మంత్రి జయశంకర్ జయశంకర్ స్పష్టం చేశారు. భారత్, చైనా దేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా పునరుద్ధరించుకుని, వాస్తవాధీన రేఖకు సంబంధించిన సమస్యలను ఇప్పటికైనా శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం సృష్టించి భారత్ ను లొంగదీసుకోవాలనో, భయపెట్టాలనో ప్రయత్నించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సమస్యలను పొడిగిస్తూ, నానుస్తూ పోవడం అనేది చివరికి చైనాకే నష్టం కలిగించే ప్రమాదం ఉంది. అమెరికాతో భారత్ సన్నిహితంగా ఉండడం, క్వాడ్ కూటమిలో భారత్ సభ్యురాలిగా ఉండడం చైనాకు ఇష్టం లేకపోవచ్చు. కానీ, ప్రస్తుత భారత్ వెనుకటి భారత్ కాదని, దానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని చైనా ఎంత త్వరగా గ్రహించుకుంటే అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News