Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Chnadrayan: చంద్రయానంలో అనేక కోణాలు

Chnadrayan: చంద్రయానంలో అనేక కోణాలు

చంద్రయాన్‌-3ని ఇక్కడే దింపనున్న ఇస్రో

మానవ రహిత చంద్రయాన్‌-2 విఫలం కావడం భారతదేశానికి నిజంగా నిరుత్సాహం కలిగించింది. 2019 సెప్టెంబర్‌ 7వ తేదీన చంద్రమండలంలోని దక్షిణ ధృవం వద్ద ఇది లాండ్‌ కాబోయి, విఫలం అయింది. అయితే, ఆ నిరుత్సాహం నుంచి బయటపడిన భారత్‌ ఇప్పుడు అదే లక్ష్యంతో చంద్రయాన్‌-3ను ప్రయోగించి, ఇది విజయం కావడం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. చంద్రయాన్‌-ఆర్బిటర్‌ పంపించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని, దాని వైఫల్యానికి దారి తీసిన కారణాలను లోతుగా, నిశితంగా పరిశీలించి, పొరపాట్లను సరిదిద్దుకుని, భారతీయ అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) అధికారులు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ధైర్యంతో ప్రయోగించిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23 లేక 24 తేదీలలో చంద్ర మండలం మీద దిగబోతోంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఒక్క భారతదేశమే కాదు, అమెరికాలోని నాసా, ‘ఆర్టెమిస్‌ ఒప్పందం’పై సంతకాలు చేసిన దేశాలన్నీ ప్రార్థిస్తున్నాయి. జూలై 14న చంద్రయాన్‌-3 ప్రయోగించడానికి ముందు జూన్‌ 21న ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల వరుసలో భారత్‌ 27వ దేశం కావడం కేవలం యాదృచ్ఛికం కావచ్చు.
ఇప్పటికే రెండు ప్రయోగాత్మక పరీక్షలు జరిపిన నాసా 2025 నాటికి చంద్రుడిపై మళ్లీ మానవుడు కాలుపెట్టే విధంగా ఆర్టెమిస్‌ 111ను ప్రయోగించడానికి ఏర్పాటు చేసుకుంటోంది. 1972లో, అంటే 53 ఏళ్ల క్రితం నాసా చివరిసారిగా మానవుడితో చంద్రమండలానికి అపోలో-17ను పంపించడం జరిగింది. ఇప్పుడు చంద్రయాన్‌-3 ల్యాండ్ కాబోయే దక్షిణ ధృవ ప్రదేశంలోనే ఆర్టెమిస్‌ 111ను దించాలని కూడా నాసా భావిస్తోంది. ఈ ప్రాంతం ఎప్పుడూ నీడకప్పే ఉంటుంది. ఈ ప్రాంతమంతా సహజ వనరులతో నిండి ఉంటుందని, భవిష్యత్తులో మానవ సహిత రోదసీ నౌకలు దిగడానికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని నాసా అంచనా వేస్తోంది. ఆ ప్రాంతంలోనే చంద్రయాన్‌-3 తన రోవర్‌ ను దింపి, 14 రోజుల పాటు పరీక్షలు, ప్రయోగాలు నిర్వహించడం, ఆ ప్రాంతాన్ని వివిధ కోణాల నుంచి అధ్యయనం చేయడం జరుగుతుంది.
ఈ దక్షిణ ధృవ ప్రాంతంలోనే నాసా 13 ప్రదేశాలను ఎంపిక చేసింది. ఈ ప్రదేశాల్లోనే ఆర్టెమిస్‌ 111 తన వ్యోమగాములను దింపుతుంది. చంద్రమండలం చుట్టూ పరిభ్రమిస్తూ నాసాకు చెందిన లూనార్‌ రికనైజాన్స్‌ ఆర్బిటర్‌ పంపించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాక, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా, వివిధ గ్రంథాల ద్వారా సేకరించిన సమాచారాన్ని కూడా క్రోడీకరించడం జరిగింది. అయితే, నాసాతో సహా ఇతర దేశాలన్నిటికన్నా ముందు ఈ దక్షిణ ధృవ ప్రాంతం గురించి అధ్యయనం చేసిన ఇస్రో తన చంద్రయాన్‌-3ని ఇక్కడే దింపడానికి నిర్ణయం తీసుకుంది. ఇదే గనుక జరిగితే, ఈ ప్రాంతంలో రోదసి నౌకను దింపిన మొట్టమొదటి దేశం భారతదేశమే అవుతుంది. ఈ ప్రాంతంలోని రసాయనిక, భౌతిక లక్షణాలను ఇది లోతుగా అధ్యయనం చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News