Friday, July 5, 2024
Homeఓపన్ పేజ్Climate change and problems: వాతావరణంతో ముప్పుతిప్పలు

Climate change and problems: వాతావరణంతో ముప్పుతిప్పలు

విపరీతమైన మార్పులుంటాయి, మనమే అలవాటు పడాలంటున్న సైంటిస్టులు

ఇక ప్రతి ఏటా వాతావరణ మార్పులు తప్పవనీ, వర్షాలు, ఎండలు, చలి కాలం వగైరాలు తారుమారు కావడం తథ్యమనీ, ప్రజలు వీటికి అలవాటు పడడం నేర్చుకోవాలని వాతావరణ శాస్త్రవేత్తలు మరీ మరీ చెబుతున్నారు. ఈ ఏడాది కూడా వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కురుస్తాయన్నది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాస్త్రవేత్తలు సైతం ఈ మార్పులను సకాలంలో అంచనా వేయలేకపోతున్నారు. నైరుతి రుతు పవనాలు నిష్క్రమించిన తర్వాత తేలిందేమిటంటే, వర్షాలు ఆశించిన స్థాయిలో పడలేదు. మున్ముందు పడే అవకాశం కూడాలేదు. కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగానూ, మరికొన్ని ప్రాంతాల్లో మరీ తక్కువగానూ వర్షాలు పడిన మాట నిజమే కానీ, మొత్తం మీద ‘వర్షాభావ’ పరిస్థితులు మాత్రం తప్పలేదు. జూన్‌, సెప్టెంబర్‌ నెలల మధ్య కనీసం 94.4 శాతం నమోదు కావాల్సిన సాధారణ వర్షాలు ఈసారి 82 శాతం కూడా నమోదు కాలేదనే విషయం నిర్ధారణ అయింది.
వర్షాలను ప్రభావితం చేస్తున్న ఎల్‌ నీనో కారణంగా ఈ ఏడాది మహా అయితే 4 శాతం వర్షాలు తగ్గవచ్చని ఇండియన్‌ మెటిరియొలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ అంచనా వేసింది.ఎల్‌ నీనో ప్రభావమే కాకుండా ఇతరత్రా కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడం కేవలం వర్షాల మీదే కాక, ఇతర రుతువుల మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తోందని ఈ ఏడాది అనుభవంతో అర్థమైపోయింది. ఎల్‌ నీనో ప్రభావం వల్ల ఒక్క డిగ్రీ వేడి పెరిగినా అది వర్షాలపై ఏడు శాతంప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడిప్పుడే బయటికి స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తోందని వారు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వాతావరణంలో ప్రబలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణ వర్షపాతమనేది గతకాలపు మాటగా మారిపోయింది. ఎప్పుడు ఎలా వర్షాలు పడతాయో తెలియనట్టే, సాధారణానికి, ఒక మోస్తరుకి తేడా తెలియకుండాపోతోంది. ఆగస్టులో భారీగా వర్షాలు పడాల్సి ఉండగా, ఉత్తర భారతదేశంలో మాత్రమే భారీగా వర్షాలు పడి, దేశంలోని ఇతర ప్రాంతాలలో పొడి వాతావరణం నెలకొంది. గత వందేళ్ల కాలంలో ఈ విధంగా ఎన్నడూ వర్షపాతం నమోదు కాలేదు. హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా వంటి రాష్ట్రాలు వరదలు, తుపాన్లతో అవస్థలుపడడం జరిగింది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, బీహార్‌ తదితర రాష్ట్రాలను వరుణ దేవుడు ఏమాత్రం కరుణించలేదు.
వర్షపాత పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే, జూన్‌లో 9 శాతం తక్కువ, జూలైలో 13 శాతం ఎక్కువ, ఆగస్టులో 36 శాతం తక్కువ, సెప్టెంబర్‌లో 13 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల మధ్య దేశంలో ప్రవేశించే ఈశాన్య రుతుపవనాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఉండకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు సాధారణ వర్షపాతానికి తగ్గట్టుగా ఒక విధమైన జీవన శైలికి అలవాటు పడి ఉన్నాయి. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా ప్రజానీకం అతలాకుతలం అయిపోతుంటుంది. ఈ అనిశ్చిత పరిస్థితులను తట్టుకోవడం వ్యవసాయ రంగానికి మరీ గగనంగా ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారాలను, సర్దుబాట్లను కనుగొనాల్సివస్తోంది. వ్యవసాయ రంగం తప్పనిసరిగా కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవడం, కొత్త పద్దతులతో సర్దుకుపోవడం చేయాల్సి ఉంటుంది. సాగునీటి సౌకర్యాలను విస్తరించడం, నీటిని పొదుపుగా వాడడం, నీటి నిల్వ వ్యవస్థలను పెంచడం, నీటి మీద తక్కువగా ఆధారపడే విధంగా పంటలను పండించడం, పంట కాలాలను మార్చడం, వినిమయ పద్ధతుల్లో కూడా మార్పులు చేయడంవంటివి జరగాల్సి ఉంది.
వర్షాల మీదా, వ్యవసాయంమీదా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఇది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ సైతం మారాల్సి ఉంటుంది. వాతావరణంలో యథేచ్ఛగా మార్పులు జరుగుతున్నందువల్లే బియ్యం, గోదుమ, చక్కెర వంటి నిత్యావసర వస్తువుల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా దేశంలోని అనేక వ్యవస్థలలో మార్పులు జరగాల్సి ఉంది. వాతావరణ విభాగాలు స్వల్పకాలంలో వాతావరణ మార్పుల గురించి తెలియజేయాల్సి ఉంటుంది. గ్రామీణ స్థాయిలో కూడా మార్పుల గురించి తెలియజేయాల్సి ఉంటుంది. నిజానికి వాతావరణ పరిస్థితి, దాని ప్రభావం అయోమయంగా, గందరగోళంగా ఉంటోంది. ప్రజలకు అలవాటైన వాతావరణ పరిస్థితులుదారుణంగా మారిపోతున్నందువల్ల కొత్త వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలు, వ్యవస్థలు తప్పనిసరిగా మారాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News