లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దేశ రాజకీయాల్లో సంకీర్ణానికి సంబంధించిన పోటీలు క్రీడారంగాన్ని తలపిస్తున్నాయి. ఎవరి మిత్ర పక్షాలను వారు కూడగట్టుకోవడంలో, ఎవరి కూటమిని వారు ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్యంగా రెండు వర్గాలు క్షణం కూడా తీరిక లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటి దాకా తేలిన లెక్కలను బట్టి, యునైటెడ్ ప్రోగ్రెసివ్ (యు.పి.ఏ) వైపున 26 పార్టీలు చేరగా, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్.డి.ఏ) వైపున 38 పార్టీలు చేరాయి. ఈ విషయంలో ఎన్.డి.ఎ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ రెండు కూటములు పోటాపోటీగా సభలు, సమావేశాలను నిర్వహించడం కూడా జరుగుతోంది. ఇందులో యు.పి.ఏ బెంగళూరులో సమావేశం నిర్వహించగా ఎన్.డి.ఏ ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాగా. లోక్ సభలో అత్యధిక సంఖ్యాక బలం ఉన్నప్పటికీ, బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ఎందుకు అకస్మాత్తుగా ఈ విధంగా మిత్రపక్షాల వేటలో పడిందనే విషయం మాత్రం అంతుబట్టడం లేదు.
ఢిల్లోలో ఎన్.డి.ఏ నిర్వహించిన సమావేశాన్ని బట్టి ఈ కూటమికే ఎక్కువ బలం ఉన్నట్టు, ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఒక అభిప్రాయం ఏర్పడుతోంది. బహుశా ఇటీవలి కర్ణాటక పరాజయం తర్వాతే బీజేపీలో ఈ రకమైన ఆలోచన వచ్చి ఉంటుంది. ప్రతిఫక్షాలన్నీ కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్ (ఇండియా) పేరుతో కూటమిని ఏర్పాటు చేయడం కూడా ఇందుకు కొద్దిగా కారణం అయి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ రెండు కారణాల వల్లే బీజేపీ తన ఎజెండాను మార్చుకుంటూ పోతోంది. తమ కూటమిలో యోధానుయోధులు, అతిరథ మహారథులు ఉన్నట్టు ప్రతిపక్ష కూటమి చెప్పుకుంటోంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, అనుభవజ్ఞులు తమ కూటమిలో ఉన్నట్టు కూడా ఇది ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఈ నాయకులెవరికీ ప్రజాబలం గానీ, కార్యకర్తల బలం గానీ ఉన్నట్టు కనిపించడం లేదు.
ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లు ప్రస్తుతం చీలిక వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు. వారి పార్టీల నుంచి చీలిన వర్గాలు శక్తివంతమైనవి. అవి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. బీజేపీకి మద్దతునివ్వాలంటూ శరద్ పవార్ పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తున్నప్పటికీ, శరద్ పవార్ లౌకికవాద కూటమికే మద్దతునివ్వాలనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రతిపక్ష కూటమి ప్రధాన లక్ష్యం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’, ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి’. తమ పైకి సి.బి.ఐ, ఇ.డి, ఆదాయ పన్ను, ఎన్.ఐ.ఏ తదితర కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతున్న బీజేపీపై పోరాటం జరపాలని, ఈ పార్టీని అధికారం నుంచి ఏదో విధంగా దించేయాలన్నది కూడా ఈ కూటమి ప్రధాన ధ్యేయం. ఇది ఇలా ఉండగా, ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఏ.ఏ.పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజీ కుదరిన తర్వాత పరిస్థితి మరింతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ కూటమికి జనతా దళ్-ఎస్ దూరంగా ఉంది. ఈ పార్టీకి కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా, తన లౌకికవాద ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ, బీజేపీకి మద్దతునిచ్చే అవకాశం ఉంది.
నిజానికి 2018 నాటి ఎన్నికల్లో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. ఈ పార్టీ తన అస్తిత్వానికి ఏదో ఒక పార్టీకి మద్దతునివ్వాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. ఈసారి బీజేపీకే మద్దతునిచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారం అనేది తమ ఎజెండాలో ప్రాధాన్యం లేని అంశమని పార్టీలు చెబుతున్నప్పటికీ, ప్రతిపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నది మాత్రం మున్నుందు ఒక వివాదాస్పద అంశంగా మారబోతోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడం, భారత్ జోడో యాత్ర కూడా విజయవంతం కావడం వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూల అంశాలుగా ఉన్నాయి. అయితే, ఈ కూటమిలో ప్రధాని అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్న విషయం జగమెరిగిన సత్యం. ఎన్నికల్లో పార్టీల పనితీరు చూసిన తర్వాత ఈ వివాదాస్పద అంశానికి తప్పకుంగా ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశించవచ్చు. వీటి ఎజెండా గానీ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు గానీ ప్రస్తుతానికి బీజేపీని భయాందోళనలకు గురి చేయకపోవచ్చు. అయితే, ఈ ప్రతిపక్ష కూటమికి ఆయుర్దాయం ఉందా లేదా అన్న సంగతి మాత్రం తేలాల్సి ఉంది.
Coalition competitons: ఎన్నికల సమయంలో సంకీర్ణ పోటీలు
ఈ నాయకులెవరికీ ప్రజాబలం గానీ, కార్యకర్తల బలం గానీ లేదు