Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Communal harmony need of the hour: మతాల మధ్య సామరస్యం అనివార్యం

Communal harmony need of the hour: మతాల మధ్య సామరస్యం అనివార్యం

ఏ మతం వారైనా తమ సంకుచిత భావాల నుంచి బయటపడాలి

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరిగిన తర్వాత దేశ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వివిధ పార్టీలలోనే కాకుండా వివిధ మతాల్లోనూ సరికొత్త ఆలోచన ప్రారంభమైంది. భారతదేశ అతి పురాతన నాగరికత విషయంలో వివిధ వర్గాల మధ్య పునరాలోచన ప్రారంభం అయింది. ఈ నాగరికతను చులకనగా చూడడం వల్ల తామెంత నష్టపోతున్నదీ అర్థమైంది. అయితే, కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకపోలేదు. నిజానికి, అయోధ్యలో ప్రధానమంత్రి రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మిశ్రమ స్పందన లభించింది. చాలా మంది దృష్టిలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమనేది హిందువులను ఒక మతంగా సంఘటితం చేయడమే. వారు ఆశించిన విధంగానే హిందూ మతం ఒక రాజకీయ మతంగా కూడా మారిపోయింది. మరికొందరి దృష్టిలో ఇది ఒక కొత్త భారతావనికి నాంది పలికింది. భారతదేశంలో సరికొత్త రాజకీయ, సామాజిక, మతపరమైన సమీకరణాలు ప్రారంభమయ్యాయని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. అనేక విదేశీ పత్రికలు రామ మందిర నిర్మాణం మీద వ్యాసాలు, సంపాదకీయాలు రాస్తూ, బాబ్రీ మసీదును నేలమట్టం చేసి రామ మందిరాన్ని నిర్మించారనే రాశాయి.

- Advertisement -

ఆసక్తికర విషయమేమిటంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) అధినేత మోహన్ భాగవత్ ప్రాణ ప్రతిష్ఠ రోజున ఒక వ్యాసం రాస్తూ, మత ప్రదేశాలను విధ్వంసం చేయడం జరిగిందనే సంగతిని అనేక పర్యాయాలు ప్రస్తావించారు. విదేశీ మూకలు భారతదేశంపై దాడి చేసి ఏ విధంగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాయో ఆయన వివరించారు. భారతదేశాన్ని ఏదో విధంగా ధ్వంసం చేసి, దోచుకుని, దీన్ని నిర్వీర్యం చేయాలని విశ్వప్రయత్నం చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయాన్ని ధ్వంసం చేయడం కూడా ఇదే ఉద్దేశంతో, ఇదే లక్ష్యంతో జరిగిందని కూడా భాగవత్ పేర్కొన్నారు.

కొందరు ముస్లిం రాజులు భారతదేశంపై దండయాత్రలు చేసి, సంపదను కొల్లగొట్టిన మాట నిజమే. ఇక్కడి దేవాలయాలను నేలమట్టం చేసిన మాట కూడా నిజమే. అయితే, ఒక దేవాలయాన్ని కూల్చేసి దాని మీద బాబ్రీ మసీదు కట్టారనడానికి ఆధారాలు లేవంటూ 2019 డిసెంబర్ లో సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, 1934లో బాబ్రీ మసీదుపై దాడిచేయడం, 1949లో దాన్ని ధ్వంసం చేయడం, ఆ తర్వాత 1992లో దాన్ని పూర్తిగా నేలమట్టం చేయడం వంటి చర్యలన్నీ చట్టవిరుద్ధమైన చర్యలేనని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా, గతంలో ఎప్పుడో దేవాలయాలను ధ్వంసం చేయడం, ఈ మధ్య బాబ్రీ మసీదును కూలగొట్టడం వంటి సంఘటలను గతం గతః అన్న దృష్టితో చూడడం మంచిది. ఇటువంటి వివాదాస్పద అంశాలను పదే పదే లేవనెత్తుతూ ఉండడం వల్ల కలహాలు, కార్పణ్యాలు పెరుగుతూనే ఉంటాయి తప్ప వీటివల్ల ఇతరత్రా మరే ప్రయోజనమూ ఉండదు.

కలసి ఉంటేనే కలదు సుఖం
వీటిని పక్కనపెట్టి ముందుకు పోతూ ఉండడం అనేది దేశానికి చాలా అవసరం. ఇందుకు మూడు కారణాలను చెప్పుకోవచ్చు. ఒకటి-వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఇప్పటి ముస్లింలు బాధ్యులు కారు. రెండు-సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా లేకపోయినా ముస్లింలు సుప్రీంకోర్టు తీర్పుకు గౌరవమిచ్చారు. దాని నిష్పాక్షికత విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మూడు-రామ మందిర నిర్మాణం అనేది ఇప్పుడు ఓ వాస్తవం. దీనిని ఎవరూ ఏమీ చేయలేరు. రామ మందిర నిర్మాణం వివాదాస్పద పరిస్థితుల్లోనే జరిగి ఉండవచ్చు. అయితే, శ్రీరామచంద్రుడిని దేశంలోని ముస్లింలు మొదటి నుంచి ఉన్నతంగానే చూస్తున్నారు. అల్లామా ఇక్బాల్ అనే ప్రసిద్ధ ముస్లిం కవి శ్రీరాముడిని ఒక ఆధ్యాత్మిక గురువు (ఇమామ్ ఏ హింద్)గా అభివర్ణించారు. ఆయన శౌర్య ప్రతాపాలను షూజత్ గా కీర్తించారు. ఆయనను పరమ పవిత్రుడు (పాకీజ్గీ)గా పేర్కొన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే, బాబ్రీ మసీదు కేసు శ్రీరాముడికి వ్యతిరేకం కాదు. అదొక ఆస్తి వివాదం మాత్రమే.

హిందువులు, ముస్లింలు ఈ దేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ, నైతికంగా, సామరస్యంగా, స్నేహంగా కలిసి మెలిసి జీవించడం అనేది అనివార్యం. భాగవత్ తన వ్యాసంలో ‘‘సమాజంలోని వివేకవంతులు ఈ వివాదానికి ఇంతటితో స్వస్తి చెప్పడం చాలా మంచిది’’ అని రాయడం గమనార్హం. సమాన న్యాయంతో పటిష్టమైన సమాజాన్ని సృష్టించడానికి సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత అవసరమని. ఒకరినొకరు హింసించడం, విధ్వంసాలకు పాల్పడడం, కక్షలు, కార్పణ్యాలతో వ్యవహరించడం సమాజానికి శ్రేయస్కరం కాదని భాగవత్ తన వ్యాసంలో రాసిన విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జనవరి 22 నాటి తన ప్రసంగంలో ‘‘దీన్ని ఒక వేడుకగా మాత్రమే చూడకూడదు. దీన్ని ఒక ఆత్మవిమర్శగా, గ్రహింపుగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడు ఒక వివాదం కాదు. ఆయనొక పరిష్కారం’’ అని వివరించడాన్ని గుర్తుంచుకోవాలి. తమ సమిష్టి బలంతో, శక్తితో దేశ నిర్మాణానికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైంది.

సామరస్యానికి మొదటి మెట్టు
ఇటువంటి అభిప్రాయాలతో చాలామంది ఏకీభవించకపోవచ్చు. రామ మందిర ప్రారంభోత్సవం రోజున, ఆ తర్వాత కూడా ఈ రెండు వర్గాలు కొన్ని హింసా విధ్వంసకాండలకు పాల్పడ్డాయి. కొందరు హిందువులు ఆగ్రాలోని ఒక మసీదు మీదకు ఎక్కి కాషాయ జెండాను ఎగరేయడం జరిగింది. ముంబైలో కొందరు హిందువులు మసీదు ముందు నిలబడి జై శ్రీరామ్ అని నినాదాలు చేయడంతో మత ఘర్షణలు చెలరేగాయి. హరిద్వార్ లో ఒక మత సమ్మేళనం సందర్భంగా కొందరు హిందువులు దేశంలో ముస్లింలను సర్వనాశనం చేస్తామంటూ నినాదాలు చేయడం జరిగింది. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చే పక్షంలో హిందువులను మిగలకుండా చేస్తామని ముస్లిం నాయకులు కూడా ప్రకటించడం జరిగింది. దేశాన్ని హిందూ దేశంగా మార్చడం జరుగుతుందంటూ పలువురు నాయకులు ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉన్నారు.

అదృష్టవశాత్తూ, బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ దేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మత రాజ్యంగా మార్చబోమని ప్రకటించారు. దేశం ఇప్పటికీ ఎప్పటికీ మత రాజ్యంగా మారదంటూ 2016లో ఆర్.ఎస్.ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ కూడా స్పష్టం చేశారు. అయితే, కొన్ని వర్గాలు వ్యవహరిస్తున్న తీరు ప్రధాని చెబుతున్న వసుధైక కుటుంబానికి విరుద్ధంగా ఉంటోంది. దేశంలో అన్ని వర్గాలు కలిసి మెలిసి జీవించడానికి కావలసిన పరిస్థితులను కల్పించడం జరుగుతుందంటూ ఆయన అనేక పర్యాయాలు చెప్పారు. అన్ని వర్గాలూ కలిసి ఉన్నప్పుడే దేశం ఒక ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లుతుందని కూడా మోదీ చెప్పడం జరిగింది. ప్రధాని మాటలకు వివిధ వర్గాలు విలువ నిచ్చి, ముస్లింల హక్కులను గుర్తించి వారు హిందువులతో కలిసి మెలిసి జీవించడానికి వీలైన పరిస్థితులను కల్పించాల్సి ఉంటుంది.

ముస్లింలు కూడా హిందువులతో కలిసి మెలిసి జీవించడాన్ని అలవరచుకోవాలి. ముస్లిమేతరులు దీపావళి, క్రిస్మస్ వంటి పండుగల సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేయకూడదని, వారిని ఏ విషయంలోనూ గౌరవించాల్సిన అవసరం లేదని, వారితో కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం లేదంటూ కొందరు ముస్లిం మత పెద్దలు చెప్పే సలహాలు, సూచనలు, హితోక్తుల నుంచి ముస్లింలు బయటపడాల్సి ఉంది. భారతదేశం ఒక బహుళ సంస్కృతుల, బహు భాషల సమాజం అన్న విషయాన్ని ముస్లింలు ఏనాడూ విస్మరించకూడదు. ఇక్కడ అన్ని మతాల వారూ అనేక వేల సంవత్సరాలుగా ఐక్యంగా జీవించడం జరుగుతోంది. తాము ఏదో ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వారమన్న దురభిప్రాయం నుంచి ముస్లింలు ఇప్పటికైనా బయటపడడం మంచిది. దేశంలో ఒకే ఒక మతం, ఒకే ఒక సంస్కృతి ఉండాలన్న ప్రయత్నాలు విజయవంతం కావడం అసాధ్యాల్లో కెల్లా అసాధ్యం. ఏ మతం వారైనా తమ సంకుచిత భావాల నుంచి బయటపడాలి. మూర్ఖపు పట్టుదలల స్థానంలో సామరస్యం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరగాలి. భారతదేశం శాంతి సౌభాగ్యాలతో సుస్థిరంగా పురోగతి చెందడానికి హిందువులు, ముస్లింలు చేతులు కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

– ఖాజా మొయినుద్దీన్, సీనియర్ జర్నలిస్టు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News