CM Revanth Two years Rule: ఆరు దశాబ్దాలకు పైగా సాగిన అవిశ్రాంత పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. యువత, విద్యార్థుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుధీర్ఘంగా సాగింది. దీంతో 2014 నాటి యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశయాలను గౌరవించింది. ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విభజించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అలా 2014 జూన్ 02న ఊపిరి పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాటు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ (పూర్వపు టీఆర్‌ఎస్) పాలించింది. 2023లో జరిగిన చారిత్రక పరిణామాల అనంతరం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ‘ప్రజల ప్రభుత్వం’ అంటూ ఆరు గ్యారెంటీలతో కొత్త శకానికి నాంది పలికిన రేవంత్ రెడ్డి పాలనకు ప్రస్తుతం రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల కాలంలో పారదర్శకతతో కూడిన సంక్షేమం, అభివృద్ధితో పాటుగా అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడం వంటి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ మార్పుల ప్రయాణంలో.. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముక అయిన పల్లె రైతులు రేవంత్ రెడ్డి పాలనపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? రైతులు మళ్లీ కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారా? ప్రజలు పెట్టుకున్న భారీ అంచనాలకు అనుగుణంగా రేవంత్ పాలన సాగుతోందా? స్థానిక ఎన్నికలపై రేవంత్ రెండేళ్ల పాలన ప్రభావం ఏమైనా పడనుందా అనే అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది.
సంక్షేమ పథకాల అమలు.. పట్టణ, మహిళా వర్గాల్లో సంతృప్తి: రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలైన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టింది.’మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది.’గృహ జ్యోతి’ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళా వర్గాల్లో ఈ పథకాలు సంతృప్తిని నింపాయి. నిత్యావసర ఖర్చులు తగ్గడం, మహిళా సాధికారతకు దోహదపడటం వంటి సానుకూల అంశాల కారణంగా రేవంత్ పాలనపై కొంత వరకు మహిళలు సానుకూలంగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అనేది పట్టణ మహిళలను సైతం ఆకర్షించింది. రేవంత్ పాలన తీరు పట్టణ ప్రాంతాల్లో సానుకూల దృక్పథాన్ని పెంచాయి. పరిపాలనలో పారదర్శకత, అవినీతిపై కఠిన వైఖరి కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెరిగిందని నగరాల్లోని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందుకే నువ్వా నేనా అంటూ హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అప్పుల భారం.. పౌర సమాజం నుంచి విమర్శలు: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ రేవంత్ రెడ్డికి ఆర్థిక సవాళ్లు అతిపెద్ద ప్రతిబంధకంగా మారాయి. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన తలకు మించిన అప్పుల భారం పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం నిధుల సమీకరణలో ముఖ్యమంత్రి సతమతం అవుతున్నారు. పథకాల అమలు కోసం నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అప్పులు తేవడం, అలాగే భూములు అమ్మడం వంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కంచన్‌బాగ్‌లోని భూముల విక్రయం, ‘హిల్ట్ పాలసీ’ వంటి ఆదాయ సమీకరణ మార్గాలపై ప్రతిపక్షం నుంచి, పౌర సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇలాంటి చర్యలతో కొన్నిసార్లు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్థిక సవాళ్లు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల అంచనాలను దాదాపు అందుకున్నారనే చెప్పవచ్చు. గ్యారెంటీలను అమలు చేయడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. అయితే ఆరు గ్యారెంటీల్లో భాగమైన సామాజిక పింఛన్లు పెంచకపోవడం, తులం బంగారం హామీ వంటి అంశాలు రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించడానికి, విమర్శించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రణాళికలు ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం డిసెంబర్ 8, 9తేదీల్లో గ్లోబల్ సమిట్ నిర్వహించినా.. దాని ఫలితం ఇప్పుడే అంచనా వేయలేం. దీంతో రేవంత్ రెడ్డి ఆలోచనలకు.. ప్రస్తుత పాలనకు కొంత వ్యత్యాసం ఉందనేది నగ్నసత్యం.
పల్లెలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నాయా?: రేవంత్ పాలనపై మహిళల్లో, పట్టణ ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ.. వ్యవసాయ రంగంపై ఆధారపడిన పల్లె ప్రజల నుంచి మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ దశాబ్ద కాలపు పాలనలో రైతుల కోసం ప్రవేశపెట్టిన కొన్ని పథకాల అమలు ప్రస్తుత పాలనలో సన్నగిల్లుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందించింది. ఈ హామీ బీఆర్‌ఎస్ పాలనకు అతిపెద్ద బలం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు అలవాటు పడిన రైతులకు ఇది తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ‘కేసీఆర్ పాలనలో కరెంటు ఎప్పుడూ పోయేది కాదు.. ఇప్పుడు మళ్లీ పాత రోజులు వచ్చినట్లు ఉంది’ అని కొందరు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో స్థానిక ఎన్నికలపై రేవంత్ రెండేళ్ల పాలన ప్రభావం పడనుంది.
రుణమాఫీ, రైతుబంధుపై ఆలస్యం: కేసీఆర్ పాలనలో రైతుబంధు పథకం పెట్టుబడి సాయాన్ని ప్రతి సీజన్‌లో సకాలంలో అందించేవారు. ప్రస్తుత పాలనలో రైతు రుణమాఫీ హామీ అమలులో జాప్యం జరిందనేది వాస్తవం. అలాగే రైతుబంధు నిధుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ వాగ్దానం ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరకపోవడంతో ఆర్థిక భారం అధికమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం, సాగునీటికి కొరత లేకుండా చేసింది. రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టుల పునఃసమీక్షకు ఆదేశించడం, నిర్వహణలో కొంత అలసత్వం కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి విడుదల ఆలస్యం కావడం వంటి అంశాలు కూడా బీఆర్ఎస్ పాలనపై రైతులకు సానుకూల వైఖరిని పెంచుతున్నాయి. అయితే పల్లె రైతులు కేసీఆర్ పాలనను పూర్తిగా సమర్థించడం లేదనేది మాత్రం నగ్నసత్యం.
రాజకీయంగా బలపడిన రేవంత్: కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల వల్ల తిరుగులేని నేతగా ఎదగడానికి అవకాశం శూన్యం. ఎప్పటికప్పుడు అధిష్ఠానంతో పాటుగా సమాన స్థాయినేతలతో ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అయినా రేవంత్ తన పట్టు నిరూపించుకుంటూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడల్లా అండగా ఉన్నారు. వ్యూహాలను అందించడం ద్వారా జాతీయ నాయకత్వానికి చేరువయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయటంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. రెండేళ్ల పాలనలో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడం రేవంత్ రాజకీయ చాకచక్యాన్ని నిరూపించింది.
ముగింపు: సీఎంగా రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనను సమీక్షిస్తే ఇది కట్టా-మీఠా (చేదు- తీపి) మిశ్రమంగా సాగిందని చెప్పవచ్చు. ఆర్థిక సవాళ్లు, రాజకీయ పరిమితులు అనేకం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల (ముఖ్యంగా మహిళల కోసం) అమలులో ఆయన ప్రజల అంచనాలను అందుకున్నారు. అయితే రైతుల్లో మాత్రం కొంత నిరాశ ఉందనేది వాస్తవం. యువతలో ఇక చెప్పక్కర్లేదు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అద్భుతమైన విజయాలు లేవు. అలా అని భయపడాల్సిన పరాజయాలు లేవు. అయితే రాబోయే మూడేళ్లలో అభివృద్ధి ఎజెండాను నెరవేర్చగలిగితేనే.. ప్రజల ఆశలను పూర్తిస్థాయిలో నెరవేర్చిన నాయకుడిగా రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

