కేసీఆర్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారు
మోడీ, ఒవైసీ దోస్తీలో ఆశ్చర్యం లేదు
రాష్ట్రంలో నడుస్తున్నది కాంట్రాక్టర్ క్లాస్
మూసీ బాధితులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి
తెలుగుప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్
రాజకీయ పార్టీల పునాది ఇప్పుడు కాంట్రాక్టర్ క్లాస్. అంటే.. ఒకే భూమిని పదేపదే అమ్మడం కొనడం, దాని నుంచి పిచ్చిగా డబ్బులు తీసుకోవడం. ఉత్పత్తి రాదు, సంపద పెరగదు కానీ.. అదే భూమి చేతులు మారి రేటు పెరుగుతుంది. మన దగ్గరున్న మూడు మేజర్ పార్టీలదీ ఇదే వ్యవహారం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇదే మోడల్ నడుస్తుంది. కార్పొరేటైజేషన్, ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్..రూలింగ్ పార్టీలన్నింటిలో సైద్ధాంతికపరంగా, సమాజాన్ని చూసే పద్ధతిలో గుణాత్మకమైన మార్పేమీ లేదు. అక్కడక్కడా చిన్నచిన్న తేడాలుండవచ్చు. కానీ బేసిక్ మోడల్ ఆఫ్ డెవలప్‌మెంట్ విషయంలో ఏ రాజకీయ పార్టీ అయినా పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టు ఇదే మోడల్‌లో సాగుతుంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అమలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా లేరు. కేసీఆర్ ప్రాజెక్టులు, భవనాలు కడితే.. రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. రాజకీయాలలో క్వాలిటీ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. కానీ ప్రమాణం.. కాంట్రాక్టర్ క్లాస్ మాత్రమే.
కాంగ్రెస్‌కు అసలు పాలసీనే లేదు
ప్రభుత్వం ఏదైనా ప్రాధాన్యాలు చాలా స్పష్టంగా ఉండాలి. రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించి పాలసీ డిజైన్ జరగాలి. అసమానతలను తగ్గించడం, బస్తీలు, మురికివాడల ప్రజలకు, పేదలకు, భూమి లేని వారికి, నిరుద్యోగులకు ఏం చేయబోతున్నారనేది స్పష్టమైన అవగాహనతో ఉండాలి. రేవంత్ సర్కార్‌కు ఇంకా రెండున్నరేళ్లు ఉంది. మరో టర్మ్ కూడా తానే సీఎం అని చెబుతున్నాడు. గడిచిన రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ ఏమున్నదో వెల్లడించలేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. క్వాలిటీ వైద్యం అందడం లేదు. ఉద్యోగాల విషయంలో ఎలా ఉంటారు? ఒక పద్ధతనేదే లేదు. విద్య అనేది అఫర్డబుల్‌గా లేదు. విద్యా కమిషన్ సూచించిన ప్రధానమైన సమస్యలను ఏం పరిష్కరించారు? నిజానికి కమిషన్ ప్రధానమైన సమస్యలనే ఎత్తిచూపలేదు. సమానమైన విద్య, క్వాలిటేటివ్ విద్య లాంటి విషయాలు కమిషన్ అసలు పట్టించుకోలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ గొప్ప పని చేశాడు, ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిటేటివ్ విద్య అందించాడు. ఇక్కడ కూడా.. మీరు నవోదయ స్కూల్ పెడితే, గురుకుల స్కూల్ పెడితే.. పిల్లలు వెళ్తున్నారు కదా! ప్రభుత్వ పాఠశాలలున్నాయి కదా! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీరే నడుపుతున్నారు కదా! కాబట్టి చేయాలనుకుంటే అసాధ్యమేమీ కాదు. కానీ ఆ ఆలోచన ఉండాలి కదా..
తలోమాట ఎందుకు? కమిట్‌మెంట్ ఎందుకు లేదు?
ఎన్టీ రామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానన్నాడు. దానివల్ల జనం ఆహారం దొరుకుతుందని, అన్నం తింటున్నామని సంతోషపడ్డారు. ఒక్కటే పాలసీ అది. డైరెక్ట్‌గా ప్రజలకు అందింది. అందరికీ ఉపయోగంగా మారింది. అట్లాగే ఇందిరాగాంధీ సబ్‌ప్లాన్ అంటూ సపరేట్ ప్లాన్ పెట్టింది. గరీబీ హఠావో నినాదం తీసుకుంది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఏమయింది? రాష్ట్ర స్థాయిలో ఏదైనా పాలసీ తీసుకోవచ్చు కదా. పొరుగున ఉన్న కర్ణాటకలో సమస్యలను పరిష్కరిస్తున్నారు. వాళ్లు అనవసరమైనవేవీ నెత్తిన వేసుకోవడం లేదు. అక్కడి ప్రజలు కొంత సంతృప్తిగా ఉన్నారు. కానీ, ఇక్కడ రోజూ ఒక కొత్త పాలసీ డైరెక్షన్‌తో వస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడికి మన పార్టీ ఐడియాలజీ ఇది, మన పార్టీ ఈ పని చేయబోతున్నదని ఒక స్పష్టత ఉంటే.. ఆ నమ్మకంతో ఆ పార్టీలో ఉంటాడు. బీజేపీ వాళ్లకు ఒక పాలసీ ఉంది. అది తప్పోఒప్పో, ఆ పాలసీని నమ్మినవాళ్లు ఆ పార్టీలో క్రమశిక్షణతో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ అంటూ ఏమున్నది? కాంగ్రెస్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి.. ఎవరి ఆలోచన వారిదే. సభ్యులకే పార్టీ ఐడియాలాజికల్ డైరెక్షన్ ఇవ్వకపోతే ఎలా? ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే కిందిదాకా వెళ్లింది. పేదరిక నిర్మూలన కోసం మేం పని చేస్తున్నాం. దళితులు, ఆదివాసుల కోసం పనిచేస్తున్నామని కాంగ్రెస్ వాళ్లు అప్పట్లో చెప్పుకునేవారు. ఇప్పడెందుకు తలో మాట మాట్లాడుతున్నారు? ఇదొక అనార్కిక్ పార్టీ అయిపోయింది. ప్రజల కోసం ఏం చేద్దామనే కమిట్మెంట్ తీసుకోవాల్సింది. మేనిఫెస్టో రాసుకొని తీరా గెలిచాక దాన్ని పక్కన పెట్టి.. ఇదంతా ఏమిటి? మేనిఫెస్టోలో రాసుకున్నారా, మూసీ గీసీ లాంటివి? ఆర్‌ఆర్‌ఆర్ ఉందా మీ మేనిఫెస్టోలో? ఫలానా సిటీ ఉందా?
గురువు చంద్రబాబు మాట వింటున్నాడన్నది కరెక్ట్ కాదు
రేవంత్ చంద్రబాబు శిష్యుడని, ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాడు అని వినిపిస్తున్న మాట కరెక్ట్ కాకపోవచ్చు. ఇది విమర్శ మాత్రమేనని నా అభిప్రాయం. కాకపోతే బీజేపీ విషయంలో కొంత అనుమానించవచ్చు. చంద్రబాబు వల్ల ఆయనకేం ప్రయోజనం లేదు. ఒక ముఖ్యమంత్రి పాత రిలేషన్స్ వల్ల మరో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వింటాడని, పనులు చేస్తాడని అనుకోడానికి లేదు. చంద్రబాబు డెవలప్‌మెంట్ మోడల్‌ను రేవంత్ అనుకరించవచ్చు. హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఇలా అభివృద్ధి ముఖ్యమంత్రి అనే ఇమేజ్ చంద్రబాబుకు వచ్చింది. అలాంటి ఇమేజ్ తనకు కూడా రావాలని రేవంత్ రెడ్డి అనుకోవచ్చు.
ప్రజలు మరిచిపోతారనే..
రాజకీయ పార్టీలన్నీ హామీలిస్తున్నాయి. మోడీ మొదట పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంక్ అన్నడు. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామన్నాడు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నడు. ప్రజలకు మతిమరుపు ఉంటుందని, మనం మాట్లాడిన ప్రతిదీ రేపటికి మరిచిపోతారని రాజకీయ నాయకుల విశ్వాసం. ఎవరో ఒక ప్రతిపక్ష నాయకుడు అప్పుడప్పుడు గుర్తు చేయడమే తప్ప ప్రజలు ఆ హామీల గురించే పట్టించుకోవడం లేదు. మేనిఫెస్టో పెట్టుకొని దాని ప్రకారం నడిచే రాజకీయ పార్టీ దేశంలో ఏదీ లేదు. ఎన్నికలప్పుడు చేసే వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక చేసే దానికి చాలా తేడాలుంటున్నాయి.
స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే పరిశ్రమలు వచ్చి ఏం లాభం?
ఒకసారి కేటీఆర్‌కు చెప్పాను. మీరు పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. వంద కోట్లు పెట్టినప్పుడు వెయ్యి ఉద్యోగాలు ఇమ్మనండి. మీరు భూమితో పాటు ఇవ్వాల్సినవి ఇవ్వండి అని.. కండీషన్లు పెడితే వాళ్లు రారు సర్ అన్నాడు. వచ్చినవాళ్లతోనే పెట్టండి. ఇండస్ట్రీ వస్తే అభివృద్ధి పెరుగుతుంది కానీ జనానికేం లాభం? వారికి కావలసిన ఉద్యోగాలు ఇవ్వాలి కదా! ఇప్పుడు హైదరాబాద్‌లో ఎంతో డెవలప్‌మెంట్ కనిపిస్తోంది. కానీ ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు కదా.. ఉద్యోగాలన్నీ బయటివాళ్లకు ఇస్తున్నారు. ఇక్కడివాళ్లకు ఏం లాభం? మా షాద్‌నగర్‌లో ఒక ఇండస్ట్రీ పెట్టారు. దానిలో పనిచేసే వారందరూ బిహార్ నుంచి వచ్చిన వారే. చుట్టుపక్కల గ్రామాల వారిలో ఒక్కరికైనా అందులో ఉద్యోగం ఇవ్వలేదు. ఏం డెవలప్‌మెంట్ ఇది? ఊర్లలోని వారంతా పని లేకుండా ఉన్నారు. సబ్సిడీ ఇస్తున్నప్పుడు లోకల్ వాళ్లకు ఇంత పర్సెంటేజీ ఉద్యోగాలు ఇవ్వాలని కండీషన్ పెట్టండి. తప్పేముంది. అలా చేయకపోతే ఏం లాభం?
కాంగ్రెస్ తప్పులతోనే గెలుస్తామన్న భ్రమలో కేసీఆర్, కేటీఆర్
అధికారం కోల్పోయాక.. కేసీఆర్, కేటీఆర్ ఆలోచనలో ఏముందంటే.. మనమేం తప్పు చేయలేదు, ప్రజలే పొరపాటు పడ్డారు అనుకున్నారు. ప్రజలే తప్పు చేశారు అని అనుకున్నారు కానీ.. మనం తప్పు చేశాం, ఇలా చేయాల్సింది కాదు, మరో అవకాశమిస్తే ఇలాంటివేమీ మళ్లీ చేయం అని బీఆర్ఎస్ నాయకత్వం ఇంతవరకు అనలేదు. అలా అని ఉంటే నష్టం జరిగేది కాదు, తప్పకుండా ప్రజలు కొంత అర్ధం చేసుకునేవారు. ప్రజల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నమే జరగడం లేదు. కాంగ్రెస్ వాళ్లు తప్పులు చేస్తారు, ప్రజలు విసిగిపోతారు, మనల్నే గెలిపిస్తారు అన్న భ్రమలో ఉంటున్నారు.
రాజకీయ పార్టీలన్నీ ఇంతే. మేం పొరపాటు చేశాం.. మళ్లీ మాకొక అవకాశమిస్తే మెరుగైన పాలన అందిస్తామనే మాటే మాట్లాడటం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివాళ్లు కూడా తమ పాలన కాలంలో జరిగిన పొరపాట్లను మళ్లీ అవకాశమిస్తే సరిదిద్దుకుంటామని చెప్పలేదు. అంటే.. అలా చెప్పడాన్ని కన్ఫెషన్ అని అనుకుంటున్నారు. కొన్ని తప్పులు చేసినం అని ఒప్పుకుంటే అదే ఫైనల్ అవుతుందేమో, మీరే ఒప్పుకున్నారు కదా తప్పులు చేశారని అని ప్రజలు ఎక్కడ అంటారో అని భయపడుతున్నారు. ఎస్.. మేము తప్పులు చేశాం, వాటిని సరిదిద్దుకుంటాం అనే ధైర్యం, విశ్వాసం, నిజాయితీ మన రాజకీయాల్లో ఇప్పుడు లేవు.
కవిత వల్ల ప్రయోజనమేనని అన్ని పార్టీల భావన
కేసీఆర్ కుమార్తె కవిత వల్ల ఎవరికి నష్టం కలుగుతుందో తెలియడం లేదు. మన మనిషే కదా, మన ఓట్లే కదా తనకు వచ్చేది అని బీఆర్ఎస్ అనుకుంటుంది. ఆమె ఎక్కడికి పోతుంది? ముఖ్యమంత్రి అయితే సరేసరి. మన మనిషే ముఖ్యమంత్రి అవుతుంది కదా అనుకోవచ్చు. తక్కువ సీట్లు వస్తే.. ఆ సీట్లు తీసుకొని ఎక్కడికి పోతుందామె? మళ్లీ రమ్మంటే పార్టీలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతల విశ్వాసం. కాంగ్రెస్సేమో.. వాళ్ల ఓట్లే చీలుస్తుంది కదా, మన ఓట్లేం చీల్చదు కదా అని బిందాస్‌గా ఉన్నారు. బీజేపీ వాళ్లేమో.. మన ఓటు బ్యాంకు మనకుంది, దాన్నెవరూ డిస్టర్బ్ చేయరన్న ధీమాలో ఉన్నారు. కొత్త ఓటుబ్యాంకు కోసం వాళ్ల ప్రయత్నం..పోనీ ఆమె ఎవరి ఓట్లనైనా చీలిస్తే మనకేమైనా లాభం జరగొచ్చని బీజేపీ అనుకుంటుంది. కవిత రావడం వల్ల అన్ని పార్టీల వాళ్లూ తమ పార్టీలకు అడ్వాంటేజీ అనుకుంటున్నారు తప్ప తమకు నష్టం జరుగుతుందని భావించడం లేదు.
కవితకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి రెండు కారణాలు
వెలమ సామాజికవర్గంలో పురుషాధిక్యత కొంత ఎక్కువే. అందుకే కేటీఆర్‌కు ఇచ్చినంత ప్రాధాన్యం కవితకు ఇవ్వలేదు కేసీఆర్. మన దేశంలో ఇంకా అమ్మాయిని అబ్బాయితో సమానంగా చూడాలనే విలువ ఇంకా పెరగలేదు. కేసీఆర్ అయినా, కాంగ్రెస్ అయినా అంతే. కాంగ్రెస్‌లో రాహుల్, ప్రియాంక ఉన్నారు. సోనియాగాంధీ రాహుల్‌గాంధీనే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటోంది. నెహ్రూకు అబ్బాయిలు లేరు కాబట్టి ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయింది. రాజశేఖర్‌రెడ్డి ఇంట్లోనూ అంతే. ఇది వారసత్వంగా వస్తున్న పరిణామం. రెండో విషయమేమిటంటే.. కరప్షన్ కేసులో కవితను అరెస్టు చేసి జైల్లో పెట్టినపుడు స్పందించాల్సినంతగా పార్టీ రియాక్ట్ కాలేదని, బలమైన ప్రయత్నమేదీ తన కుటుంబం నుంచి జరగలేదని, తనను కావాలనే లెడ్ డౌన్ చేశారనే ఫీలింగ్ ఆమెకు చాలా బలంగా ఉంది. కేటీఆర్ అప్పుడప్పుడు వెళ్లి చూశాడు గానీ, కేసీఆర్ పట్టించుకోలేదు. కన్సర్న్ చూపిస్తే ఆ కేసు ప్రభావం తమ మీద ఎక్కడ పడుతుందో అనుకొని వెనుకడుగు వేశారు. దాంతో ఆమెకు సహజంగానే పార్టీ మీద ఆగ్రహం కలిగింది.
భవిష్యత్తు కోసం సొంత మార్గం వెతుక్కుంది
మరో విషయమేమిటంటే.. ఆమె తన దారి చూసుకోవాలని అనుకుందో, కేటీఆరే నెక్స్ట్ అనుకుందో తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆమె కూడా రాజకీయ ఆశయం ఉన్న వ్యక్తే కదా! రేపు కేటీఆరే కేసీఆర్ స్థానంలోకి వస్తే ఈమెను మినిస్టర్ కూడా చేయకపోవచ్చు. కనుక తన భవిష్యత్తు కోసం తన సొంత మార్గం వెతుక్కుంది. కనీసం పబ్లిక్ లైఫ్‌లో యాక్టివ్‌గా ఉండి రాజకీయంగా ఈమె కూడా పరిగణలోకి తీసుకోవలసిన వ్యక్తి అనే ప్రచారం జరుగుతున్నది. మీడియా కూడా కవరేజీ ఇస్తోంది. ఆమెకు ధైర్యం కూడా ఉంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోతున్నది. ఖమ్మం భూమి గొడవలో అక్కడికి వెళ్లి కూర్చున్నది. అంబేడ్కర్ హాల్‌లో కూర్చున్న ఆమెను పోలీసులు తీసుకొచ్చి హైదరాబాద్‌లో వదిలేశారు. ఖమ్మంలో బాధితులకు.. ఆమె మన కోసం పోరాడుతున్నదనే విశ్వాసం కలిగించగలిగింది. తనను జైల్లో పడేసే అవకాశం లేదని ఆమె ధైర్యం. కవితకు పబ్లిసిటీ వస్తున్నది. చాలామంది ఆమె దగ్గరికి పోతున్నారు. అన్యాయం జరిగినవాళ్లు కవితమ్మ దగ్గరికి పోతే మనకేదైనా న్యాయం జరగడానికి ఆమె పోరాడుతుందనే నమ్మకం ఏర్పడుతున్నది. ఎందుకంటే ఖమ్మంలో కొంత రిజల్ట్ కనిపించింది. ముగ్గురు మంత్రులు అక్కడికి పోవాల్సి వచ్చింది. ఆమె పోరాటం వల్ల బాధితులకు పట్టాలిచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి అప్పులిచ్చారు. ఆ క్రెడిట్ కొంత ఆమెకు వచ్చింది. ఎవరు మాట్లాడినా, ఎందరు మాట్లాడినా ఆమెకు వచ్చిన పబ్లిసిటీ మిగతావాళ్లకు రాలేదు.
నిరంకుశ ధోరణి వీడితేనే కేసీఆర్‌పై విశ్వాసం
బీఆర్‌ఎస్ వాళ్లు చాలా డెమోక్రటిక్‌గా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే చాలా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. మళ్లీ అదే నిరంకుశ ధోరణి ఉందంటే జనానికి విశ్వాసమైతే కలగదు. కాంగ్రెస్ మీద కోపం వచ్చి జనం బీఆర్‌ఎస్‌కు ఓటేయవచ్చు కానీ, వ్యవహార తీరులో మార్పు వచ్చినట్టు ప్రజలకు నమ్మకం కలిగించాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన పాలసీలు అమలు చేయడం కూడా కష్టం. తెలంగాణ ప్రైడ్, తెలంగాణ కల్చర్, తెలంగాణ సంప్రదాయం లాంటివి కూడా వారు మాట్లాడటం మానేశారు కదా! భారతీయ రాష్ట్ర సమితి అని పేరు మార్చడమెందుకు? నేషనల్ పార్టీ ఎట్లవుతది? ఏ ప్రాంతీయ పార్టీ అయినా తమ రాష్ట్ర ప్రయోజనాలను చూసుకోవాలి. తమిళనాడును చూడండి. ప్రతి పార్టీ తమిళ ఐడెంటిటీ చుట్టే తిరుగుతుంటుంది. దాంతో నేషనల్ పార్టీకి ఎవడూ ఓటేయడు. ప్రాంతీయ పార్టీకి అంత అడ్వాంటేజీ ఉంటుంది. తెలంగాణ ఐడెంటిటీ మీద గెలిచినవాళ్లు ఆ ఐడెంటిటీని వదిలేశారు కదా! తెలంగాణనే ఇతర పార్టీలకు వదిలేశారు కదా! ప్రైడ్, ఐడెంటిటీ ఏమయ్యాయి? తెలంగాణ అస్తిత్వం ఏమైంది? చేంజ్ యువర్ అప్రోచ్. బ్రింగ్ బ్యాక్ ది సెన్స్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ ప్రైడ్. దాన్ని తిరిగి తేగలిగితేనే, తిరిగి ఎత్తిపడితేనే బీఆర్ఎస్‌కు అవకాశం వస్తుంది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అది. తెలంగాణను వదిలేసిన తర్వాత ప్రజలు కేసీఆర్‌ను వదిలేశారు!
హైదరాబాద్ యూటీ సాధ్యం కాదు
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతం చేయడమనేది సాధ్యం కానేకాదు. తెలంగాణ ప్రజలు దానికి అసలే అంగీకరించరు. యూనియన్ టెర్రిటరీ (యూటీ) చేయడమంటే తెలంగాణ ప్రాసెస్‌నే రివర్స్ చేసినట్టు. ఇట్ ఈజ్ ది ఆల్‌మోస్ట్ రివోల్ట్. బీజేపీ ఆ రిస్క్ తీసుకోదు. యూటీ చేయాలనే నిర్ణయం తీసుకుంటే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలూ ఊడ్చుకుపోతాయి. దక్షిణాదిలో బేస్, తెలంగాణలో సీట్లు కోరుకుంటున్న ఆ పార్టీ ఈ పని చేయలేదు. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ సిటీలో ఉండే జనం కూడా ఒప్పుకోరు. హైదరాబాద్‌ను వదులుకుంటే వెంటనే రాష్ట్రం ప్రకటిస్తామని కేంద్రం అన్నపుడు తెలంగాణ ప్రజలు దానికి అస్సలు ఒప్పుకోలేదు. తెలంగాణ పోరాటమంతా హైదరాబాద్‌తో కలుపుకొనే కదా! యూటీ అయిన కాశ్మీర్‌ను చూస్తున్నాం కదా! ఢిల్లీని చూశాం. యూటీ ఉన్న చోటనే రాష్ట్రం కావాలనే డిమాండ్ వస్తున్నది.
రెండో రాజధాని.. సులభం కాదు
హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయడం కూడా కష్టమే. అంబేడ్కర్ అన్నాడని ఒక చర్చ వచ్చింది. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఉత్తర భారతదేశం వాళ్లు కూడా ఒప్పుకోవాలి కదా! ఇక్కడ ఆఫీసులు, పార్లమెంటు పెట్టుకోవాల్సి వస్తుంది. రాజధానికి ఉండాల్సిన చాలా ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ ఒక్కోసారి పార్లమెంటు సమావేశాలు నడవాలంటే ఎంతటి ఏర్పాట్లు చేయవలసి వస్తుంది? ఎండాకాలం వస్తామంటే కుదరదు. తప్పకుండా రాజధానికి ఉండవలసిన లక్షణాలన్నీ క్రియేట్ చేయవలసి వస్తుంది. పైగా వీళ్లకుండే బడ్జెట్‌లో వీళ్లకుండే ఆర్థిక వెసులుబాటులో అంత పెద్ద ఇన్‌వెస్ట్‌మెంట్ చేసి ఆ స్ట్రక్చర్స్ కట్టడం.. అదంత సులభమైన పనికాదు.
మోడీతో ఒవైసీతో క్లోజ్‌గా ఉంటారు
కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మైనారిటీ డిక్లరేషన్ అమలు కావడానికి.. దానికి మొదట శ్రీకారం చుట్టిన తెలంగాణ ముస్లిం జేఏసీతో పాటు ముస్లింల నుంచి బలమైన లాబీ వత్తిడి తేవాలి. ఒవైసీ లాంటివారి ఆసక్తులు వేరు. ఆర్థిక ఆసక్తులు తప్ప ఇలాంటి విషయాలు ఆయన పట్టించుకోవడం లేదు.
వాళ్ల భూములు, విద్యా సంస్థలు, అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ఇవే వారి ప్రాధాన్యాలు. రాష్ట్రంలో అధికార పార్టీతో, కేంద్రంలో మోడీతో ఉంటారు. ఓసారి మోడీ.. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. ఒవైసీని కూడా పిలిచారు. మీటింగ్ అయిపోయాక బయట సీపీఐ అప్పటి సెక్రటరీ సురవరం సుధాకర్‌రెడ్డి, ఒవైసీ మాట్లాడుకుంటున్నారట. మోడీ అటువైపుగా వెళ్తూ సుధాకర్‌రెడ్డిని పలకరించకుండా ఒవైసీతో.. ‘‘అరె ఒవైసీ సాబ్! ఆజ్ కల్ మిల్‌రయ్ నై.. క్యా హోగయే యార్! మిల్తే రహో!’’ అని షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లాడట. సుధాకర్‌రెడ్డి ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ వ్యాసంలో ప్రస్తావించాడు. అదీ పరిస్థితి.
ముస్లింల ఓట్లు చీల్చడానికే ఒవైసీ పోటీ
ఒవైసీ బెంగాల్‌లో పోటీ చేసినా ముస్లిం ఓట్లను చీల్చడానికే. ముస్లిం ఓట్లు ఎట్టి పరిస్థితిలోనూ బీజేపీకి పడవు. వాళ్ల ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకో, ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకో పడతాయి. కనుక ఒవైసీని అక్కడ వెళ్లి పోటీచేయి, ఓట్లు చీల్చు అని పురమాయించారు మోడీ. ఈయన గెలిచేది చాలా తక్కువ. అవతలి పార్టీ ఓడిపోయి బీజేపీకి లాభమవుతుంది. ముస్లింలేమో మన సమస్యల గురించి ఎవరూ మాట్లాడరు. ఒవైసీ అయితే బాగా మాట్లాడగలడు, మనవాడు, ముస్లిం అని ఓటు వేస్తుంటారు. కానీ అక్కడున్న ఓట్లు ముస్లిం అభ్యర్థులను గెలిపించే స్థాయిలో ఉండవు. ఇక ఎంపీ స్థానాలకైతే అవకాశమే ఉండదు. రెండు మూడు చోట్ల గెలుస్తున్నారు అంతే.
ముస్లింలు నిర్లక్ష్యానికి గురయ్యారు
ఇక ముస్లింల పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. వాళ్ల గురించి మాట్లాడితే హిందూ ఓట్లు పడవని ఫిక్సయిపోయారు అన్ని రాజకీయ పార్టీల వారు. బుజ్జగింపు అంటారు, ఇంకా ఏవేవో అంటారు.. కాంగ్రెస్ పార్టీ ఏం బుజ్జగింపు చేస్తున్నది? ఏం చేశారు వాళ్లు ముస్లింల కొరకు? ముస్లింలకు రిజర్వేషన్లు సరిగా లేవు. అసలు రాజ్యాంగం రాసేటప్పుడే ముస్లింల గురించి జాగ్రత్త పడాల్సి ఉండే. అప్పుడు దేశవిభజన జరగడంతో ఇక్కడి ముస్లింలు డిఫెన్స్లో పడిపోయారు. అపాలజెటిక్ స్టాండ్ అయిపోయింది వారిది. ఏం అడగలేకపోయారు. అడిగిందంతా కల్చరల్ ఫ్రీడమ్. మా మతం, మా కల్చర్ వీటిలో ఎవరూ వేలుపెట్టకూడదు.. అన్నారంతే. ఆర్థిక పరిస్థితిని బట్టి మనకేం కావాలి, జనాభాకు తగ్గట్లు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కావాలి అని అడిగే పరిస్థితులు అప్పుడు లేవు. దురదృష్టవశాత్తు ఒక్కసారి అవి జారిపోయాక ఈ 80 ఏళ్ల చరిత్రలో ముస్లింలు నిర్లక్ష్యానికి గురయ్యారు.
ఇవాళ ముస్లింలను నిలబెట్టడానికి భయపడుతున్నారు. పార్లమెంటులో వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇవి చాలా బాధాకరమైన విషయమిది.
కాంగ్రెస్ విజయం కొనసాగకపోవచ్చు
ఇంకా ఏడాది గడిస్తే కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది మనం అంచనా వేయలేం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్లు పంచాయతీ ఎన్నికల్లో గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు. బై ఎలక్షన్‌లో గెలిచారు. కానీ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోవచ్చు. మూసీ ప్రాజెక్టు అనీ, హైడ్రా అనీ, భూముల గొడవలు, అదనీ ఇదనీ వ్యతిరేకత పోగయ్యింది. పైగా మార్వాడీలు, వర్తకుల మద్దతు పూర్తిగా బీజేపీకే కదా!
మూసీ బాధితులకు భరోసా ఇవ్వాలి
మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను తరలించవలసిందే. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడల్లా వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాసన, చెత్త, అనారోగ్యం లాంటివున్నాయి. కానీ, తరలించే ముందు వారికి ఆర్థిక సెక్యూరిటీ కావాలి. ఆరు నెలల నుంచి ఏడాది వరకు వారికి క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా చూడాలని మేం ప్రభుత్వానికి సూచించాం. మూసీ గట్టున దాదాపు 20 వేల కుటుంబాలున్నాయి. కూరగాయలు అమ్ముకునేవాళ్లు, ఇండ్లల్లో పనిచేసే ఆడవాళ్లను తరలిస్తే వాళ్లకు పని దొరకాలి కదా! వాళ్లంతా హైదరాబాద్‌కు వచ్చింది ఇంటి కోసం కాదు, పని కోసం వచ్చారు. ఎక్కడ జాగా ఉంటే అక్కడ గుడిసెలు వేసుకున్నారు. ముందు పునరావాసం ప్లాన్ లేకుండా మేం మూసీ ప్రక్షాళన చేస్తామంటే అది ఆ పేద ప్రజలకు నరకయాతన లాంటిదే. అక్కడ ముస్లిం జనాభా కూడా ఎక్కువే. ఆ ప్రాంతాలలో ఉన్న స్కూళ్లు, దగ్గరగా ఉన్న స్కూళ్లు మారినచోట ఉండవు కదా! ఎక్కడి స్కూల్‌కు పోవాలి ఆ పిల్లలు? డబ్బులు పెట్టి చదివించే పరిస్థితి ఉండదు, ప్రభుత్వ స్కూళ్లు అక్కడ అందుబాటులో ఉండాలి కదా! ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలి. మరో విషయమేమిటంటే.. మూసీని డెవలప్ చేశాక.. వారికి అక్కడే పునరావాసం కల్పించాలి. కొత్త వ్యాపారాలు, హోటళ్లు వస్తాయి. అక్కడే వారికి మంచి ఇండ్లు ఇవ్వాలి. వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చినట్లవుతుంది కదా!
ప్రతి ప్రాజెక్టులో ఇలానే జరగాలి
మూసీ మాత్రమే కాదు.. ప్రతీ పెద్ద ప్రాజెక్టులో ఇలాంటి ఏర్పాటు ఉండాలి. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. హరీశ్‌రావుతో అప్పుడు నేను చెప్పాను. మీరు ప్రాజెక్టు కట్టేప్పుడు ఎవరి భూములైతే పోతున్నాయో వారికి లాభపడుతున్న వారి భూముల్లో వాటా ఇప్పించాలి. లాభపడుతున్న వారి భూములు అప్పటిదాకా పంట పండని భూమే కదా! అలా చేయడం ద్వారా ఇద్దరికీ మేలు జరుగుతుంది. నష్టపోయినవారు నష్టపోవడం, లాభపడినవారు ఎక్కువగా లాభపడడం జరుగుతుంది కదా! దానిని ఇలా పూడ్చవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది కూడా.
డ్రైవింగ్ ఫోర్స్ ముఖ్యం
రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తల మాట త్వరగా వింటారు. క్వాలిఫికేషన్ లేకపోయినా మహేంద్రా టెక్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఆ సంస్థ చైర్మన్ సిఫారసుతో రాత్రికిరాత్రే కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయ్యాడు. ఒక పవర్‌ఫుల్ మ్యాన్ చేయమంటున్నాడు కదా, మనకేదైనా సాయం చేస్తాడు కదా అని వెంటనే చేసేస్తారు. ఒక టాటా వచ్చి ఒక సలహా చెబితే, టాటా వల్ల ప్రయోజనాలనే చూస్తారు కదా! డ్రైవింగ్ ఫోర్స్ బికమ్స్ ఎకనామిక్స్. ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్లకు. దాంతో వాళ్ల మాటే వింటారు.
ఇవాళ బీజేపీకి 85 శాతం ఫండింగ్ వస్తున్నది. కాంగ్రెస్‌కు 10 శాతమే. ఎన్నికలలో పోరాడాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఎవరి మీద ఆధారపడతారో వాడు చాలా ఇంపార్టెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం కాంగ్రెస్ ఏమైనా చెప్పాలంటే వాళ్లకు ఏ ఇబ్బంది కలగనంత వరకు వింటారు. కార్పొరేట్ విద్య దెబ్బతింటుందనుకుంటే ఆ విషయం వినరు. ఫలానా వ్యక్తిని వైస్ ఛాన్సలర్ చేయండి అంటే.. ఎవరూ పోటీ లేకపోతే మాట వింటారు. సార్ చెప్పాడు కదా వేసేద్దాం అని. చాకలి ఐలమ్మ పేరు పెట్టమని ఐలయ్య చెబితే పెట్టేశాడు. దాని వల్ల వచ్చే నష్టం లేదు పేరే కదా అని. ఆర్థిక వ్యవహారాలు ఇలా ఉంటాయి.
ఆరెస్సెస్ మాట బీజేపీ వినేది అందుకే..
ఆరెస్సెస్ కార్పొరేట్‌తో లింక్ అయి ఉంటుంది కాబట్టే బీజేపీ వారి మాట వింటుంది.లేకపోతే కార్పొరేట్లు ప్రభుత్వాన్ని దించేస్తారు. మీడియా అంతా వాళ్లదే కదా! ఇన్ని చానళ్లు, పొద్దున లేస్తే మోడీ మోడీ అంటున్నాయంటే అక్కడ వాడు చెప్తున్నాడు, అనమంటే యాంకర్స్ అంటున్నారు. కారణం.. వాడి ప్రాణం కార్పొరేట్ల చేతిలో ఉంది.

