తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రూటు మారుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీ కన్ను ఆంధ్రప్రదేశ్ మీద పడింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తనను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో పడింది. అంతేకాదు, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే తాపత్రయం కూడా పార్టీలో పెరిగింది. ఆ పథకంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వై.ఎస్. షర్మిలను పార్టీలో చేర్చుకుంది. నిజానికి, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఆశ్చర్యకర విషయమేమీ కాదు. అయితే, తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆమె ప్రకటించడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కంపన ప్రకంపనాలు సృష్టించింది.
వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించి, పాదయాత్ర కూడా చేసి, తాను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అవుతానని శపథం చేసిన షర్మిలను ఒప్పించి ఆంధ్ర ప్రదేశ్ కు పంపించిన కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుని తీరాలి. తెలంగాణలో ఆమె ఎక్కడా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించడమంటే, తన సోదరుడిని ఎదుర్కోవడమేనని షర్మిలకు తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆమె మీద అనేక ఆశలు పెట్టుకుంది కానీ, ఆమె ఆ ఆశలకు తగ్గుట్టుగా పార్టీని పునరుద్ధరించగలుగుతారా అన్నది ప్రశ్న. షర్మిల రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఆమె ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పాదయాత్ర నిర్వహించి 2014లోనూ, ఆ తర్వాత 2019లోనూ తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి విజయానికి కారకులయ్యారు. 2009లో తమ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దగ్గర నుంచి అనేక కష్టనష్టాల్లో ఆమె తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు పొటమరించి విడిపోవడం జరిగింది.
జగన్ ఆమెకు తన మంత్రి వర్గంలో ఏదో ఒక పదవిని అప్పగించి ఉంటే సరిపోయేది కానీ, ఏ కారణంగానో ఆయన ఆ పని చేయలేదు. ఆయన తన కుటుంబ సభ్యుల్ని పాలనకు వీలైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించారు. తెలంగాణలో బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు మాదిరిగా తన కుటుంబ సభ్యులకు పెత్తనం ఇచ్చి మాటలు పడదలచుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడానికి షర్మిల గట్టి ప్రయత్నాలే సాగించే అవకాశం ఉంది కానీ, దాదాపు పూర్తిగా అడుగంటిపోయిన కాంగ్రెస్ కు జవజీవాలు అందించడం అంత తేలికైన విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి, హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో బాగా నాటుకు పోయి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు వస్తామని చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వై.ఎస్.ఆర్ పాలనను తీసుకు వస్తామని చెప్పి, వై.ఎస్.ఆర్.సి.పి నుంచి కొందరు శాసనసభ్యులను తమ పార్టీలోకి తీసుకు రావడం తప్ప ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేయగలిగిందేమీ లేదు. షర్మిల ఆ పని చేయడమంటే తన సోదరుడి భవితవ్యాన్ని దారుణంగా దెబ్బతీయడమే అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుని, తెలుగు దేశం పార్టీ ఓట్లను కూడా చీల్చవలసి ఉంటుంది. ఆమె విజయం సాధించడమంటే, వై.ఎస్.ఆర్.సి.పి, తెలుగుదేశం పార్టీలు పరాజయాల పాలుకావడం అని అర్థం చేసుకోవాలి. అది జరుగుతుందా, లేదా అన్నది మున్ముందు తేలిపోతుంది. అయితే, ఆమె రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకు రావడం మాత్రం ఖాయంగా జరుగుతుంది.