జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోతున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ నాటి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ నాటి కాంగ్రెస్ పార్టీకి మధ్య హస్తిమశకాంతరం తేడా వచ్చింది. ఇప్పటి కాంగ్రెస్ దశ, దిశ అతి వేగంగా మారిపోతోంది. ఏదో ఒక విధంగా అధికారం చేజిక్కించుకోవాలని, దాని కోసం ఎటువంటి ఎత్తులు, జిత్తులకైనా పాల్పడవచ్చనేది సరికొత్త కాంగ్రెస్ సిద్ధాంతంగా మారిపోతోంది. నిజానికి ఇది ప్రాంతీయ పార్టీల సిద్ధాంతం. దాన్ని జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఒంటబట్టించుకుంటోంది. దేశ భవిష్యత్తుకు సంబంధించి కాంగ్రెస్ విజన్ ఏమిటన్నది అర్థం కావడం లేదు. ప్రాంతీయ పార్టీల మాదిరిగా అది స్వల్పకాలిక ప్రయోజనాల కోసమే ఆరాటపడుతోంది కానీ, ఒక జాతీయ పార్టీగా దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను కోరుకోలేకపోతోంది.
దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ ఒకటో రెండో విజయాలను చేజిక్కించుకుంటుంది. ఎక్కువ పర్యాయాలు అపజయాల పాలవుతుంటుంది. ఈ కారణంగా
ఎన్నికలు సమయంలో ప్రతిసారీ దేశ ప్రజలకు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. ఈ
కాంగ్రెస్ పార్టీ దేని కోసం పోరాడుతోంది? దీని సిద్ధాంతమేమిటి? దీని ఆశయాలేమిటి? నిజానికి ఇవి అంతుబట్టని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇటీవల అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఓటర్లలో ఇవే ప్రశ్నలు ఉదయించాయి. భారతీయ జనతా పార్టీ విషయంలో ఇటువంటి ప్రశ్నలకు, సందేహాలకు అవకాశమే లేదు. ఆ పార్టీ హిందుత్వకు, సనాతన ధర్మానికి కట్టుబడిన విషయం అందరికీ తెలుసు. దాని ఆశయాలు, ఆశల గురించి తెలియనివారెవరూ లేరు. దాని సిద్ధాంతాల గురించి నిరుపేదలు, నిరక్షరాస్యులు, చిన్నా, పెద్దా అందరికీ క్షుణ్ణంగా తెలుసు. అభివృద్ధికి సంబంధించి ఆ పార్టీ విధానాలు, అభిప్రాయాలు కూడా అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ గురించి తెలిసినట్టుగా, కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ విధానాల గురించి, సిద్ధాంతాల గురించి ఎవరైనా చెప్పగల స్థితిలో ఉన్నారా?
ఒక సాధారణ ఓటర్ దృష్టిలో కాంగ్రెస్ పార్టీని గురించిన అభిప్రాయం ఏమిటి? దాదాపు ప్రతి పార్టీ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు గుప్పిస్తూ ఉంటుంది. అనేక వరాలను ప్రకటిస్తూ ఉంటుంది. బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా అవే చేస్తుంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ప్రజల మనసుల్లో పాతకుపోయే విధంగా, ప్రజల మనసులను ప్రభావితం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏదైనా స్పష్టమైన, నిర్దిష్టమైన అంశం ఉందా అని ఆలోచిస్తే లేదనే చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే లౌకికవాదానికి కట్టుబడిన పార్టీ అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ
అనుసరించే లౌకికవాదం ఒక కుహానా లౌకిక వాదమనీ, లౌకికవాదమంటే కాంగ్రెస్ దృష్టిలో అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగించడం మాత్రమేనని, పైగా ఇది కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వచ్చే అంశమనీ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యాపించిపోతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థీ లౌకిక వాదానికి కట్టుబడి ఉంటున్నట్టు కనిపించదు.
లౌకికవాదం పేరుతో సరికొత్త ఎత్తులు, జిత్తులకు పాల్పడడం మాత్రమే కనిపిస్తుంటుంది. ఏ విధంగానూ అల్ప సంఖ్యాక వర్గాలను ఇబ్బంది పెట్ట కూడదని, వారిని ఏదో విధంగా సంతృప్తి పరచాలని వారు తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. మెజారిటీ వర్గాలను నిర్లక్ష్యం చేసినా పరవాలేదన్న భావన కూడా ద్యోతకమవుతుం టుంది. దేశ ప్రజలందరినీ, కుల మత వివక్ష లేకుండా, సరిసమానంగా చూడాలన్న అలనాటి కాంగ్రెస్ మహదాశయం ఎక్కడైనా మచ్చుకైనా కనిపించదు.
ఎన్నికలకు ప్రత్యేక సిద్ధాంతం
అందరినీ సరిసమానంగా చూడడమన్న లౌకికవాదం వల్ల తాము విజయాలు సాధించడం కల్ల
అని ఆ పార్టీ భావిస్తోందనిపిస్తుంది. లౌకికవాదం గురించి తమకున్న కాలం చెల్లిన భావాలను మార్చుకోవాలన్న ఉద్దేశమే ఆ పార్టీలో ఎక్కడా కనిపించదు. లౌకికవాదం విషయంలో తమకున్న అభిప్రాయాలు, స్వార్థ ఆలోచనల కారణంగానే తాము దాదాపు ప్రతి ఎన్నికల్లో పరాజయాల పాలవుతున్నామన్న దృష్టి కూడా ఈ పార్టీలో ఎక్కడా కనిపించదు. తాము హిందుత్వకు, సనాతన ధర్మానికి, జాతీయవాదానికి కట్టుబడి ఉన్నామని ధైర్యంగా చెప్పి బీజేపీ మూడు రాష్ట్రాలను చేజిక్కించుకున్న వాస్తవం కాంగ్రెస్ పార్టీకి పట్టినట్టు లేదు. తప్పో
ఒప్పో తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, ధైర్యంగా ఆ సిద్థాంతంతోనే ఎన్నికల్లో పోరాడడం వంటి గుణాలు ప్రజలకు, ఓటర్లకు నచ్చుతాయనే విషయం కాంగ్రెస్ పార్టీకి పట్టినట్టు లేదు. మతాలతో సంబంధం లేకుండా, కేవలం సామాజిక న్యాయం ద్వారా రాష్ట్రాలలో భావోద్వేగపరంగా ప్రజలతో మమేకం కావడానికి కూడా ఈ పార్టీ ప్రయత్నించడం లేదు. ఎప్పటికి ఏది అవసరమో, ఏది అవకాశంగా ఉంటుందో దాన్ని బట్టి కాంగ్రెస్ సిద్ధాంతాలు మారిపోతుండడం ఇటీవలి ఎన్నికల్లో కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది.
ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ హఠాత్తుగా వెనుకబడిన తరగతుల ప్రయోజనాలకు కొమ్ము కాయడం ప్రారంభించారు. కుల గణన అనే భావోద్వేగపూరితమైన అంశాన్ని భుజాలకెత్తుకు న్నారు. బీహార్ రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం కుల గణన చేపట్టే వరకూ కాంగ్రెస్ పార్టీకి కుల గణనను గురించిన ఆలోచనే లేదు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లోగానీ, ఆశయాల్లో గానీ ఒక భాగమే కాదు. చివరికి ఆ కుల గణన అంశం కూడా అయిదు రాష్ట్రాల ఎన్నికల వరకే నినాదం అయింది. ఆ తర్వాత దాని ఊసే లేదు. లోక్ సభ ఎన్నికల వరకూ దాని గురించిన ప్రస్తావనే ఉండదు. మతం గురించి మాట్లాడే బీజేపీకి పోటీనివ్వాలన్న పక్షంలో
తాము కులం గురించి ప్రస్తావించాలని ఆయన ఎందుకనుకున్నారో తెలియదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా అస్తిత్వ సంక్షోభంలో పడిపోయింది. తానెవరో, ఎక్కడున్నానో ఇప్పుడు ఆ పార్టీకి కూడా తెలియదు.
విచ్ఛిన్నకర వ్యవహారాలు
ముందూ వెనుకా చూడకుండా కాంగ్రెస్ పార్టీ ఈ కుల గణనను తలకెత్తుకోవడంతో ప్రతిపక్షాలతో ఏర్పడిన ఇండియా కూటమి సైతం ఈ పార్టీ ఉద్దేశాలను అనుమానించడం ప్రారంభించింది. 1990లలో కొన్ని పార్టీలు మండల్ కమిషన్ సిఫారసులను తలకెత్తుకున్నప్పుడు కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. చివరికి అధికారాన్ని కూడా కోల్పోయింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ కుల గణనకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం ప్రారంభించాయి. ఒక కాలు మతం మీదా, మరో కాలు కులం మీదా పెట్టి ప్రయాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో దేనితో ఓటర్లు మమేకం అవుతారో తెలియక అయోమయంలో పడిపోయింది. ఏతావతా అర్థమవుతున్నదేమిటంటే, ప్రస్తుతం ఈ పార్టీకి ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయింది. ఒక ఆశయమంటూ లేకుండా పోయింది. దేశాభివృద్ధికి సంబంధించి తన పంథా ఏమిటో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సాంస్కృతికంగా ఈ పార్టీకి తన పంథా ఏమిటన్నది అంతు
బట్టకుండా పోయింది. ఈ కీలకమైన అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పదేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసుకుంది. ఈ పార్టీ ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తుండడం ఆ పార్టీనే కాక, ప్రజలను సైతం అయోమయంలో పడేస్తోంది.
దేశాన్ని పీడిస్తున్న సమస్యలు, పరిణామాల విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటన్నది ప్రజలకే కాదు, ఇండియా కూటమి పక్షాలకూ అంతు బట్టడం లేదు. నిజానికి మతాల గురించి, కులాల గురించి ఆలోచించడమన్నది ఒకప్పుడు కాంగ్రెస్ నైజమే కాదు. ఇవన్నీ చాలవన్నట్టు, కాంగ్రెస్ ఇటీవలి కాలంలో రాష్ట్రాల సమాఖ్య (ఫెడరలిజమ్) అనే మాటను తలకెత్తుకుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకుంటోందనే ఒక అభిప్రాయాన్ని వ్యాప్తి చేస్తూ దానికి ప్రతిగా తాము సమాఖ్య భావనను పైకి తెస్తున్నట్టుగా కాంగ్రెస్ పైకి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. భారతదేశం ఒక దేశం కాదని, అదొక రాష్ట్రాల కూటమి అని చెప్పడానికి ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ విశ్వప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడుకు ఏదో ప్రత్యేకత ఉందంటూ ద్రవిడ పార్టీలు ఒకప్పుడు ఇటువంటి ప్రచారాన్నే లేవనెత్తాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ద్రవిడ విధానాన్నే తాను పుణికి పుచ్చుకున్నారు. ఇటువంటి వాదన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వర్తించదు. దీనివల్ల ప్రజలు కొత్తగా దీన్ని అనుసరించే అవకాశం లేదు. అయినా, ఈ అభిప్రాయాన్ని ఏ కారణంగానో రాహుల్ గాంధీ ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి అప్పట్లో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగానే ద్రవిడ పార్టీలు ఈ వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చాయి.
అలవికాని వాగ్దానాలు
ఇక ఇవన్నీ పనిచేయడం లేదని గ్రహించిన కాంగ్రెస్ తాజాగా గ్యారంటీలను ప్రకటించడం ప్రారంభించింది. ఈ గ్యారంటీలను కర్ణాటకలో ప్రవేశపెట్టి విజయం సాధించినందువల్ల తెలంగాణ లోనూ ఇదే విధమైన ప్రయోగం చేసింది. ఇవి విజయం సాధించాయా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా, ఏమాత్రం అధ్యయనం చేయకుండా 2024 ఎన్నికల్లో కూడా ఇదే పంథాను అనుసరించే ఉద్దేశంలో కూడా ఉంది. నిజానికి, ఈ గ్యారంటీలను అమలు చేయలేక కర్ణాటక ఇప్పటికే నానా అవస్థలూ పడుతోంది. ఏది ఏమైనా, హిందుత్వతో బీజేపీ హిందీ రాష్ట్రాలలో ప్రజలను ఆకట్టుకున్నట్టుగా ఇటువంటి సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకోలేకపోతోంది. ఆర్థిక వ్యవహారాల కంటే సాంస్కృతిక అంశాలే ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయన్నది కాంగ్రెస్ పార్టీకి పట్టడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ సరికొత్త ప్రయోగాలు చేయడం, సిద్ధాంతాలను మార్చడం, కొత్త పథకాలు ప్రకటించడం వంటి కారణాల వల్ల ఆ పార్టీలో ఎంతగా అభద్రతాభావం నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ పద్ధతులను చూసి అయోమయంలో పడుతున్న ఓటర్లు స్పష్టమైన సిద్ధాంతంతో ముందుకు వెడుతున్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ రెండవ పర్యాయం గెలవలేదు. రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు కొత్త అవతారాలె త్తడం వల్ల కాంగ్రెస్ స్పష్టమైన సిద్ధాంతాలను, లక్ష్యాలను అనుసరించలేకపోతోంది. భారత్ యాత్రి, శివభక్తుడు, సామాజిక న్యాయ ఉద్యమకారుడు, సమాఖ్యకు అనుకూలుడు, ప్రజాస్వామ్యవాది, లౌకికవాది ఇలా రకరకాల పాత్రలతో ఆయన కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ
పట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. మధ్య మధ్య తన వంశం పేరును ఉపయోగించుకోవడం కూడా జరుగుతోంది.
– వి. వెంకటేశ్వర రావు