Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Congress revival: ఇంటా బయటా కాంగ్రెస్ కొత్త ఎత్తులు, ఎట్టకేలకు రైట్ ట్రాక్ లోకి రాహుల్...

Congress revival: ఇంటా బయటా కాంగ్రెస్ కొత్త ఎత్తులు, ఎట్టకేలకు రైట్ ట్రాక్ లోకి రాహుల్ గాంధీ

మోడీపై మాటల దాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలకు పదును పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. అంబేద్కర్ జన్మస్థలాన్ని వేదికగా మార్చుకుని అక్కడి నుంచే ఈ అస్త్రాలను ప్రయోగించటం మొదలుపెట్టేందుకు రాహుల్ సేన సిద్ధమైనట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజాసంబంధాల శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈమేరకు భారత్ జోడో యాత్రలో అతి పెద్ద చాప్టర్ ఆవిష్కృతం కావటం ఖాయంగా కాంగ్రెస్ పీఆర్ విభాగం క్యాంపెయిన్ చేసుకుంటోంది. డా.బీఆర్ అంబేద్కర్ జన్మస్థలి అయిన మధ్యప్రదేశ్ లోని మౌలో ఈనెల 26వ తేదీని కాన్ స్టిట్యూషన్ డేగా భారీ ఎత్తున జరిపేందుకు పార్టీ సన్నాహకాలు పూర్తి చేసింది.

- Advertisement -

‘సేవ్ కాన్ స్టిట్యూషన్, సేవ్ డెమాక్రసీ’ నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాటల దాడిని తారాస్థాయికి తీసుకెళ్లనున్నట్టు ఢిల్లీలో ఫీలర్లు జోరుగా వదులుతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన గుజరాత్ పర్యటనను సైతం వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే రాహుల్ సోదరి ప్రియాంక భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. స్వయంగా దళితుడైన ఖర్గే అంబేద్కర్ జన్మస్థలిలో జరుగుతున్న పెద్ద కార్యక్రమంలో తన వాగ్భాణాలను సరికొత్తగా ప్రయోగిస్తారని పార్టీ వర్గాలు లీకులు ఇస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరికళ్లూ ఈ సభపైనే ఉన్నాయి.

ఖర్గే కూడా పార్టీపై తనదైన మార్కును సృష్టించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకుంటున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్న ఖర్గే కొత్తగా నలుగురిని నియమించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి, తనకు మధ్య వీరు అనుసంధానకర్తలుగా, రాయబారులుగా ఉంటూ విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసే బాధ్యతలను వీరికి అప్పగించారు. ఈ నలుగురిని ఏఐసీసీ కోఆర్డినేటర్స్ గా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు వీరు కొత్త పవర్ సెంటర్స్ గా మారుతున్నారనే టాక్ అప్పుడే పార్టీలో స్టార్ట్ అయింది. ఓవైపు సోనియా, మరోవైపు రాహుల్ ఇంకోవైపు ప్రియాంక గ్రూపులతో పాటు, అసమ్మతి వర్గం, తాజాగా ఖర్గే సొంత టీం ఇలా చాలా కుంపట్లు పార్టీపై పైచేయి సాధించేందుకు ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తున్నాయి.

నాసిర్ హుసేన్, ప్రణవ్ ఝా, గురుదీప్ సప్పాల్, గౌరవ్ పంఢి అనే ఈ నలుగురు కొత్త కోఆర్డినేటర్స్ మెప్పు పొందేందుకు ఇక పీసీసీలు, పార్టీ నేతలంకా కొత్త ఫీట్లు మళ్లీ మొదటి నుంచీ మొదలు పెట్టాల్సిందే. అయితే అసలు ఈ నలుగురు ఎవరు, వీరి వివరాలేంటని చాలా మంది కాంగ్రెస్ నేతలే ఆరా తీస్తుండటం హైలైట్. బ్రిడ్జిగా వ్యవహరించనున్న ఈ నలుగురు ఏఐసీసీ కోఆర్డినేటర్లుగా ఖర్గేకు కళ్లు, చెవులు, భుజాల్లా పనిచేయనున్నారు.

గత నెల్లో ఖర్గే పార్టీ పగ్గాలు చేపట్టాక ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ అయిన24 అక్బర్ రోడ్ లో పెద్ద మార్పు ఒకటి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ కు కేటాయించిన గది బయట ఫుల్ టైం ఆకుపెంట్ గా వచ్చిన మల్లికార్జున్ ఖర్గే, ప్రెసిడెంట్ అనే కొత్త బోర్డు తళతళలాడుతూ అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే చాలాకాలంపాటు ఫుల్ టైం ఇంఛార్జీ లేక తాత్కాలిక అధ్యక్షుడి పేరుతోనే పార్టీ వ్యవహారాలన్నీ సాగాయి.

ఇక కోఆర్డినేటర్స్ రూపంలో పార్టీ కార్యకలాపాలు చక్కదిద్దేందుకు ఓ బృందం రంగంలోకి దిగుతోందన్న చిన్న ప్రెస్ నోట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకే మింగుడపడకుండా మారింది. అసలు ఎవరు వీరు, వీరి గొప్పతనం ఏంటి.. వీరికి పార్టీపై ఉన్న పట్టేంటి..వీరు మాపై రిపోర్టులిస్తే దాన్ని ఆధారం చేసుకుని మాపై చర్యలు తీసుకుంటారా అంటూ కాంగ్రెస్ సీనియర్లు ఆలోచనలో పడ్డారు.

కాకపోతే ప్రస్తుతానికి వీళ్లు నలుగురు కేవలం విషయాలను ఖర్గేకి బ్రీఫ్ చేసి, అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసి, ఖర్గే స్పీచు కాపీలను రాసి, సంస్థాపరమైన మిగతా విషయాలను అనుసంధానం చేసుకుంటారని పార్టీ వర్గాలు పైకి సింపుల్ గా వివరిస్తున్నాయి. ఇక ఈ నలుగురు వ్యక్తుల వివరాలు ఏంటో తెలుసుకుందాం.

నాసిర్ హుసేన్: రాజ్యసభ సభ్యుడిగా 2018 నుంచి పనిచేస్తున్న నాసిర్, ఖర్గేకు క్యాంపెయిన్ మేనేజర్ గా ఉంటూవస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల కోసం దేశమంతా ఖర్గే పర్యటిస్తున్నప్పుడు వెంట ఉన్నది నాసిర్ హుసేనే. వీరిద్దరి అనుబంధం నేటిది కాదు. నాసిర్ స్వస్థలం బళ్లారి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఈయన పీహెచ్డీ చేశారు. ఆతరువాత కర్నాటకలో మంత్రిగా పనిచేస్తున్నప్పటి నుంచీ ఖర్గేకు నాసిర్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. యూపీఏ హయాంలో కార్మికశాఖా మంత్రిగా ఖర్గే ఉన్నప్పుడు కూడా ఆయనకు తోడుగా నిలిచింది నాసిరే. చైల్డ్ లేబర్ బోర్డ్ కు వైస్ చైర్మన్ గా నాసిర్ పనిచేశారు. 22 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న నాసిర్ హుసేన్, స్టూడెంట్ లీడర్ గా, యూత్ పొలిటీషియన్ గా వివిధ స్థాయిల్లో పనిచేశారు. కర్నాటకకే చెందిన ఆస్కార్ ఫెర్నాడెంజ్ వద్ద నాసిర్ మంచి రాజకీయ శిక్షణ పొంది, పార్టీ వ్యవహారాలు నేర్చుకుని, పార్టీపై పట్టుసాధించారు. 2004లో సునామీ తరువాత అండమాన్ నికోబార్ దీవులను పునర్మించే కార్యక్రమాల్లో నాసిర్ సేవలను ఆస్కార్ ఫెర్నాండెజ్ ఉపయోగించుకున్నారుకూడా. ఇప్పుడు అర్థమైందా నాసిర్ వెయిటేజ్ ఏస్థాయిలో ఉందో. తెరవెనుక కోఆర్డినేషన్ చేయటంలో నాసిర్ దిట్ట. ఖర్గే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పార్టీ విప్ గా బాధ్యతలు నిర్వహించారు నాసిర్. ఎంపీలతో తరచూ కోఆర్డినేట్ చేసుకోవటం, వివిధ రాజకీయ పార్టీలతో పార్లమెంట్ లో ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసుకుంటూ పలు విషయాలను సైలెంట్ గా చక్కదిద్దారు నాసిర్. అందుకే ఈయనకు పార్టీలో ఒకరకంగా ‘ట్రబుల్ షూటర్’ అనే ఇమేజ్ వచ్చిందికూడా.. 2006లో ఎయిమ్స్ లో జరిగిన యాంటీ రిజర్వేషన్ నిరసనల్లో యూపీఏ సర్కారుకు-విద్యార్థులకు మధ్య సమన్వయాన్ని కుదిర్చింది నాసిరే.

ప్రణవ్ ఝా: ఏఐసీసీ సెక్రెటరీగా కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ లో ఝా పేరు తెలియనివారుండరు. నిత్యం జరిగే ఏఐసీసీ బ్రీఫింగ్స్ లో ప్రణవ్ ఝా ముఖం బాగా సుపరిచితం. టెలివిజన్ డిబేట్లలో కూడా ఈయన పార్టీ స్పీకర్స్ తో చాలాకాలంగా సమన్వయం నడుపుతూ వస్తున్నారు. ప్రణవ్ ఝా బేసిక్ గా ఓ ఫిలిం మేకర్ కూడా. అడ్వర్టయింజింగ్ ప్రొఫెషనల్, కాలమిస్ట్. ఝార్ఖండ్ కు చెందిన ఝా 16 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అప్పట్లో వ్యవహరించిన భన్వర్ జితేంద్ర సింగ్ కు సన్నిహిత ఆంతరంగికుడు కూడా. తనకు అవసరమైన అన్ని పొలిటికల్ అనాలసిస్ పై గ్రౌండ్ రిపోర్టులు తయారు చేయమని ఝాకు పని అప్పజెప్పేవారు భన్వర్. అంతేకాదు ఝార్ఖండ్ ఎన్నికల్లో ఎలక్షన్ అబ్జర్వర్ గా కూడా 2019లో ప్రణవ్ ఝా సేవలందించారు. యూత్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు చేసింది ప్రణవ్ ఝానే. ఖర్గేతో ఈయనకు చాలాకాలంగా అనుబంధం ఉంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఖర్గే పనిచేస్తున్నప్పుడు కూడా ఎక్కువ విషయాలను ఝానే బ్రీఫ్ చేసేవారు. పార్లమెంట్ సమావేశాలున్నప్పుడు ప్రతిరోజు ఉదయమే ఈ పని చేయటం ఝాకు రొటీన్ అట. హిందీ, ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాడగలిగే ఝా సాధారణంగా పార్టీలో చాలా లో ప్రొఫైల్ లో ఉంటూ వస్తున్నారు. జర్నలిస్టుల నుంచి వచ్చే అన్ని కాల్స్, మెసేజీలకు చాలా ఓపికగా రిప్లై ఇచ్చే వ్యక్తిగా మీడియాకు ఝా బాగా సుపరిచితం కూడానూ. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మార్గరెట్ ఆల్వాతోపాటు ఆయన ప్రచారాల్లో పాల్గొన్నారు.

గురుదీప్ సప్పాల్: గురుదీప్ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారికి ఓఎస్డీగా పనిచేశారు. రాజ్యసభ టీవీ ఛానెల్ కు సీఈఓగా కూడా గుర్దీప్ వ్యవహరించారు. ఆతరువాత 2020లో ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. నిజానికి నలుగురు కోఆర్డినేటర్స్ లో ఈయనే పార్టీకి కాస్త కొత్త అని చెప్పాలి. రాజ్యసభ ఛానెల్ నుంచి బయటికి వెళ్లాక స్వరాజ్ ఎక్స్ ప్రెస్ అనే టెలివిజన్ చానెల్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే గుర్దీప్ ను నేషనల్ స్పోక్స్ పర్సన్ గా నియమించారు. సో.. బ్యూరోక్రాట్ టర్న్డ్ జర్నలిస్ట్ టర్న్డ్ పొలిటీషియన్ గా ఆయన పార్టీలో తన పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కు అదిరిపోయే స్క్రిప్టులు రాసివ్వగల సత్తా ఉన్న నేతగా ఈయన పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

గౌరవ్ పాంఢి: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొబిలైజర్ గా గౌరవ్ కు చాలా పాపులారిటీ ఉంది. 2013లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గౌరవ్ అంతకుముందు .. సోషల్ మీడియాలో అనధికారికంగా కాంగ్రెస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసేవారు. లోక్పాల్ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ కు సోషల్ మీడియాలో అండగా నిలిచింది గౌరవ్ పాంఢీనే. బ్యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈయన ఆతరువాతి కాలంలో కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్ గా మారి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి 2013లో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంను ప్రారంభించారు. నేషనల్ మీడియా కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ సోషల్ మీడియా ప్రచారాన్ని చూసింది ఈయనే. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర సోషల్ మీడియా డిపార్ట్మెంట్ హెడ్ అయిన ప్రముఖ రచయిత పవన్ ఖేరా టీంలో ఈయన పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ ఖర్గేతో కలిసి ఈయన డైరెక్ట్ గా పనిచేయకపోయినా ఇలా సమన్వయకర్తగా చాలా లోతైన అనుభవం ఉండటం పార్టీలో ఈయన స్థానాన్ని మరింత పదిలం చేస్తుంది.

మొత్తానికి ఇలాంటి సమన్వయ దిగ్గజాలను, కోఆర్డినేషన్ లో సుదీర్ఘమైన బ్యాంక్ గ్రౌండ్ ఉన్నవారిని నియమించుకున్న ఖర్గే పార్టీ నేతలతో ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీని మళ్లీ ప్రజలకు చేరువగా చేసేందుకు..కాంగ్రెస్ పార్టీకి-ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ పూడ్చటంలో ఈ నలుగురు ఎటువంటి పాత్ర పోషిస్తారన్నదానిపైనే పార్టీ మనుగడ ఆధారపడి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News