Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Congress yatras: భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది?

Congress yatras: భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది?

మరికొన్ని రోజుల్లో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. మరి యాత్ర ముగిశాక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళిక సరికొత్తగా ఉంటుందా లేదా అన్న విషయాలపై ఒక్కొక్కటే స్పష్టత వస్తోంది. మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత ఆయనపైనే పడినా, ఇంటర్నల్ గా గాంధీ కుటుంబమే పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తోంది. ఈమేరకు సోనియా, రాహుల్ కోటరి గతంలో ఎన్నడూ లేనంత చురుగ్గా స్పందిస్తోంది.

- Advertisement -

ఇప్పటికే 2,500 కిలోమీటర్ల పాదయాత్రను రాహుల్ పూర్తి చేయగా 7 రాష్ట్రాల గుండా భారత్ జోడో యాత్ర సాగింది. మరో 1,100 కిలోమీటర్లు పూర్తి చేస్తే భారత్ జోడో తుది అంకానికి వచ్చేస్తుంది. అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ తలపెట్టిన ప్రోగ్రాం ముగుస్తుంది.

భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అత్యంత బలమైన ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన అధికారంలోని బీజేపీని ఎలా ఎదుర్కొంటుంది? ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది? రాహుల్ ఇప్పుడైనా ప్రధాని అభ్యర్థిగా అర్హతను, ఆమోదాన్ని సంపాదించుకున్నారా? భారత్ జోడో యాత్రతో పార్టీ ఇమేజ్ మారిందా? కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే ఏమేం చేయాలి? ఖర్గే వల్ల పార్టీ గాడిలో పడే ఛాన్సు ఉందా? ఇలాంటి ఎన్నో క్లిష్టమైన ప్రశ్నల చిక్కు ముడి వీడుతోందా? చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో కదలిక మాత్రం వచ్చిందని కచ్ఛితంగా చెప్పేలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కొత్త సంవత్సరంలో సరికొత్తగా రాజకీయాలు చేసేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈమేరకు ప్లీనరీని జరిపేందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సన్నాహకాలు ప్రారంభించింది. మూడు రోజులపాటు సాగే కాంగ్రెస్ ప్లీనరీకి ఫిబ్రవరి రెండవ వారాన్ని ముహూర్తంగా ఫిక్స్ చేశారు.

భారత్ జోడో యాత్ర తరువాత వరుసపెట్టి యాత్రలు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా ”హాత్ సే హాత్ జోడో అభియాన్” అంటూ జనవరి 26 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. ఓ రెండు నెలలపాటు ఈ రాజకీయ సందడి చేయటాన్ని ముఖ్యమైన పనిగా హైకమాండ్ భావిస్తోంది. ఈ కార్యక్రమం కూడా పాదయాత్రనే. బూత్ లెవెల్, బ్లాక్ లెవెల్, స్టేట్ లెవెల్ లో ఈ పాదయాత్ర భారీ ఎత్తున దేశవ్యాప్తంగా సాగనుంది. మోడీ సర్కారుపై చార్జ్ షీట్ తోపాటు రాహుల్ గాంధీ లేఖను కూడా ఈ యాత్రలో ముఖ్యమైన ఘట్టంగా హై ఓల్టేజ్ పొలిటికల్ డ్రామాగా మార్చనున్నారు.

ఈ పాదయాత్రలో యువతను పార్టీతో కనెక్ట్ చేస్తూ ఉత్సాహవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగానే ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర సాగనుంది. అంతేకాదు బ్లాక్ లెవెల్, జిల్లా స్థాయిలో జరిగే ఈ యాత్రల్లో భారత్ జోడో యాత్రలో తాను సాధించిన విషయాలను రాహుల్ స్వయంగా వివరిస్తారు.

రాష్ట్రాల విషయానికి వస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా యాత్రలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. అంటే వజ్రాన్ని వజ్రంతో కోయాలి అన్నట్టు యాత్రలకు యాత్రలతోనే సమాధానం చెప్పేలా తన అస్త్రాలకు పదును పెడుతోంది. ఈమేరకు కర్నాటకలో బీజేపీ చేపట్టనున్న “జన్ సంకల్ప యాత్ర”కు గట్టి కౌంటర్ ఇచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా “రథ యాత్ర”ను చేపట్టేందుకు కర్నాటక కాంగ్రెస్ రెడీ అవుతోంది. మరోవైపు తెలంగాణలోనూ బస్సు యాత్ర లేదా పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది.

ఇలా రాష్ట్రాలను పక్కనపెడితే నిజానికి రాహుల్ గాంధీకి పాజిటివ్ పొలిటికల్ వైబ్స్ బ్రహ్మాండంగా వచ్చేలా చేసిన భారత్ జోడో యాత్రకు పార్ట్ 2 ఉండేలా కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. “భారత్ జోడో యాత్ర 2.0” అనే పార్ట్ 2 పాదయాత్రలో ఈసారి రాహుల్ గాంధీ భారతదేశం తూర్పు ప్రాంతం నుంచి పడమర ప్రాంతం వరకూ కవర్ చేసే రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇదంతా 2024 సాధారణ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగానే సాగుతోన్న ప్రత్యేక షెడ్యూల్.

ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలి అనే సామెతలా ఎట్టకేలకు పోయినచోటే వెతుక్కునే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమవ్వటం క్యాడర్ లో ఉత్సాహం నింపుతోంది. ప్రజలతో తెగిపోయిన సంబంధ బాంధ్యవ్యాలను పునర్నిర్మించుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉండటం శ్రేణులకు పెద్ద వార్తే. పశ్చిమ బెంగాల్ లో పార్టీని పునరుత్తేజం చేసేందుకు కాంగ్రెస్ రూట్ మ్యాప్ రెడీ చేస్తోందంటే నమ్మశక్యం కాని విషయమే. కానీ గంగాసాగర్ లోని కపిల ముని ఆశ్రమం నుంచి కలింపాంగ్ వరకూ భారత్ జోడో యాత్ర కోసం 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. డిసెంబర్ 28 నుంచి రాహుల్ యాత్ర రాష్ట్రంలో సాగనుంది.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే యాత్ర విజయవంతమైతే తప్పకుండా రెండవదశ భారత్ జోడో యాత్ర ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ ఇచ్చిన స్పష్టత మేరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఈ రెండవ దశ యాత్ర సాగటం ఖాయంగా మారింది. సెలబ్రటిలు మొదలు అన్ని రంగాలకు చెందిన వారు, అన్ని వయసులవారు రాహుల్ భారత్ జోడో యాత్రకు తరలి వస్తుండటం కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ తెస్తోంది. ఈ జోష్ ను ఇలాగే కొనసాగిస్తూ, 2024 వరకు రాజకీయ వేడిని కొనసాగిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందటం నిశ్చయమైనట్టేనని అధిష్టానం విశ్వాసం వ్యక్తంచేస్తోంది. అందుకే రాహుల్ పాదయాత్ర పూర్తయిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిని అలాగే రగిలించేలా రాష్ట్ర నాయకత్వాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామం, జిల్లా స్థాయిలో పలు యాత్రలు ప్రారంభించి, కొనసాగేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇలా మూడంచెల్లో జరిగే పాదయాత్రతో పార్టీ గడపగడపనా బలపడుతుందని అధిష్టానం పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తోంది. ఈమేరకు 47 మంది సభ్యులుకల స్టీరింగ్ కమిటీలోనూ సరికొత్త ఉత్సాహం తొణికిసలాడుతుండటం ఇక్కడ చెప్పుకోదగ్గ పరిణామం.

ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి వచ్చిన కష్ట-నష్టాలను వివరించే పనిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఫిబ్రవరిలో జరిగే రాయ్ పూర్ ప్లీనరీ సమావేశాల తరువాత తన దశ దిశను పార్టీ పూర్తిస్థాయిలో మార్చుకోనుంది. అంశాలవారిగా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేలా పార్టీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.

మరి పార్టీని వీడి పోయిన వారిని మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు ఏమైనా ప్రత్యేక కసరత్తు చేపడతారా అన్న విషయంపై మాత్రం పార్టీకే స్పష్టత లేదు. కొత్తవారికి టికెట్లు ఇస్తూ, పార్టీకి చాలా ఏళ్లుగా లాయల్ గా ఉంటూ వచ్చిన వారిని ప్రోత్సహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ అండ్ టీం సర్వం ఒడ్డాలని భావిస్తోంది. వీరవిధేయులకు పార్టీలో కొదవే లేదు, వారిలో కొత్త ఉత్సాహం నింపి, సీనియర్లు, జూనియర్లను ఐక్యమత్యంతో మెలిగేలా సయోధ్య కుదుర్చి, దేశవ్యాప్తంగా బలపడాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. ఇక యూపీఏ కూటమి విషయంపై ప్రస్తుతానికి ఎటువంటి కొత్త ఆలోచనలు చేయకపోయినా పార్టీ బలపడటం అంటూ జరిగితే చాలా ప్రాంతీయ పార్టీలు తమవద్దకు పొత్తుకోసం వస్తాయని సంపూర్ణ విశ్వాసంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈనేపథ్యంలో 2024లో జరగబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని అధికారికంగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే ఆలోచన కూడా చేస్తోంది పార్టీ. ఇదే జరిగితే ఇక పార్టీ శ్రేణుల్లో పూనకాలు వస్తాయని, పార్టీకి మంచి పొలిటికల్ మైలేజ్ వస్తుందనేది ఢిల్లీ పెద్దల అంచనా.

మొత్తానికి ఓవైపు బీజేపీ 2024 ఎన్నికల సన్నాహకాలు జోరుగా చేస్తుంటే మరోవైపు బీజేపీకి ధీటుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ కాంగ్రెస్ కూడా దూసుకుపోయే కసరత్తులు చేస్తుండటం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. బలమైన ప్రతిపక్షాలే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. ప్రజల పక్షపాతి అయిన ప్రతిపక్షం బలపడేకొద్దీ ప్రజాస్వామ్యం పనాదులు మరింత పటిష్టమవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News