Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Controversy on Protem speaker: ప్రోటెం స్పీకర్‌ వివాదంపై చర్చ

Controversy on Protem speaker: ప్రోటెం స్పీకర్‌ వివాదంపై చర్చ

కొత్త లోక్‌ సభ సమావేశాల ప్రారంభం రోజునే పాలక, ప్రతిపక్షాల మధ్య సరికొత్త వివాదానికి బీజం పడింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొడికున్నిల్‌ సురేశ్‌ను ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించే బదులు బీజేపీకి చెందిన భర్తృహరి మెహతాబ్‌ను ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించడంపై తీవ్ర స్థాయిలో వివాదం చేసుకుంది. సురేశ్‌ అత్యంత సీనియారిటి కలిగిన సభ్యుడని, ఆయన ఎనిమిది పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారని కాంగ్రెస్‌ పార్టీ వాదించింది. మెహతాబ్‌ ఏడవ పర్యాయం లోక్‌ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఏ పార్టీకి సంబంధించిన సభ్యుడైనప్పటికీ సీనియారిటి కలిగిన సభ్యుడిని ప్రోటెమ్‌ స్పీకర్‌ గా నియమించాల్సి ఉంటుంది. కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా, కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకూ ప్రోటెమ్‌ స్పీకర్‌ ఇదే బాధ్యతలో కొనసాగుతారు. ఇది తాత్కాలిక పదవి. ఇది మొత్తం మీద మూడు రోజుల మాత్రమే కొనసాగుతుంది. సీనియర్‌ సభ్యుడిని ప్రోటెమ్‌ స్పీకర్‌ గా ఎంపిక చేయడమన్నది లాంఛనం మాత్రమే.
ప్రోటెమ్‌ స్పీకర్‌ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త రూలింగ్‌ లు జారీ చేయడానికి అధికారం లేదు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకూ ఆ పదవిలో కొనసాగడం మాత్రమే ఆయన బాధ్యత. సభ్యుల సీనియారిటీ విషయంలో నిర్ణయం తీసుకునే బాధ్యత, అధికారం పాలక పక్షానికి ఉండడమనేది సహజం. అయితే, ప్రోటెమ్‌ స్పీకర్‌ నియామకంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం వివాదాస్పదంగా ఉందని, ఆ నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందని కాంగెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. మెహతాబ్‌ వరుసగా ఏడు పర్యాయాలు అవిచ్ఛిన్నంగా లోక్‌ సభకు ఎన్నికవుతుండగా, సురేశ్‌ మధ్య మధ్య ఓడిపోతూ ఎనిమిది పర్యాయాలు పూర్తి చేయడం జరిగిందని బీజేపీ వివరించింది. లోక్‌సభ దీర్ఘకాల అనుభవం ఉన్న వ్యక్తిని ప్రోటెమ్‌ స్పీకర్‌గా నియమించాల్సి ఉండగా బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సముచితంగా, సమంజసంగా కనిపించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడుతోంది. ఆ విధంగా చూస్తే లోక్‌ సభ సభ్యుడిగా మెహతాబ్‌ కంటే సురేశ్‌ కే అనుభవం ఎక్కువగా ఉంది. 2019లో బీజేపీ ప్రోటెమ్‌ స్పీకర్‌ గా మేనకా గాంధీని ఎంపిక చేసింది. ఆమె కూడా మధ్య మధ్యలో ఓడిపోయినప్పటికీ, ఆమెకే ఎక్కువ అనుభవం ఉందని అప్పట్లో బీజేపీ వాదించింది. తీరా ఆమెను కాదని, ఆ తర్వాత బీజేపీకి చెందిన వీరేంద్ర కుమార్‌ ను ప్రోటెమ్‌ స్పీకర్‌ గా ఎంపిక చేయడం జరిగింది. కాగా, ప్రస్తుతం మెహతాబ్‌ ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వదలచుకున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వదలచుకోలేదన్నది స్పష్టమవుతూనే ఉంది. కాంగ్రెస్‌ కూటమికి లోక్‌ సభలో సంఖ్యాబలం పెరిగినప్పటికీ బీజేపీ దానిని గుర్తించే ఉద్దేశంలో లేదు. సురేశ్‌ దళితుడైనందువల్లే ఆయనకు ఈ పదవిని ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీపడే ఉద్దేశంలో లేదు.
అంతేకాదు దీని ద్వారా బీజేపీ ప్రభుత్వం మున్ముందు లోక్‌ సభలోనే కాక, బయట కూడా కాంగ్రెస్‌ పట్లా, కాంగ్రెస్‌ ను సమర్థించే పార్టీలు, సంస్థలు, వ్యక్తుల పట్ల ఏ విధంగా వ్యవహరించబోతోందన్నది కూడా స్పష్టమవుతోందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

నిజానికి, 18వ లోక్‌ సభ 17వ లోక్‌ సభ కంటే మెరుగ్గా పనిచేస్తుందనే ఆశలు వ్యక్తమయ్యాయి కానీ, అటు కాంగ్రెస్‌ ఇటు బీజేపీ అందుకు తగ్గట్టుగా వ్యవహరించే అవకాశాలు కనిపించడం లేదు. లోక్‌ సభ సమావేశాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ సవ్యంగా ముందుకు సాగనిచ్చేది లేదంటూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా దాదాపు అదే విధమైన ప్రకటన జారీ చేసింది. ఫలితంగా బీజేపీ కూడా దాడికి, ఎదురు దాడికి సిద్ధపడే అవకాశం ఉంటుంది. ప్రోటెమ్‌ స్పీకర్‌ కు సహాయ సహకారాలు అందించడానికి సంబంధించిన ఒక బృందంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా సభ్యులు. వారిప్పటికీ తమ విధుల నుంచి తప్పుకోవడం జరిగింది. దీనినంతటినీ బట్టి, మున్ముందు లోక్‌ సభ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నదీ అంచనా వేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News