Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Corona alert: ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి

Corona alert: ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి

కోవిడ్‌ మహమ్మారికి సంబంధించిన వేరియంట్‌ ఒకటి మళ్లీ విజృంభి స్తోందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి కోవిడ్‌ వేరియంట్‌ వ్యాపిస్తే దీనికి చికిత్సలు, మందులు భారతదేశం వద్ద పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యోగ క్షేమాలను దృ ష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయ స్థాయి ఔషధ పరిశ్రమల సృష్టి మాత్రమేనని, దీని గురించి ఇదివరకటి మాదిరిగా భయపడాల్సిన పని లేదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం. అయితే, ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ఆస్పత్రులలో వేలాది కేసులు నమోదవుతున్న వాస్తవాన్ని తీసిపారేయలేం. కోవిడ్‌కు పుట్టినిల్లయిన చైనాలో ఇప్పటికే కోవిడ్‌ కేసులు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా నుంచి ఇది క్రమంగా అమెరికా తదితర దేశాలకు వ్యాపిస్తున్న విషయం కాదనలేనిది. ఫలితంగా, ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు పది లక్షల కేసులు నమోదయ్యాయని, పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాల అంచనా.
చైనాలో ఒమెక్రాన్‌ బి.ఎఫ్‌7 అనే కోవిడ్‌ వేరియంటే ప్రస్తుతం అతి వేగంగా వ్యాపి స్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది ప్రాణాంతక వేరియంట్‌ అని కొందరు వైద్య, ఆరోగ్య నిపుణులు సోషల్‌ మీడియా ద్వారా చెబుతున్నారు. ఇది భారతదేశంలో కూడా అడుగు పెట్టిందని కూడా చెబుతున్నారు. ఇది ప్రాణాంతక వేరియంట్‌ కాదని, దీన్ని ఎదుర్కోగల స్థితిలో ఉన్నామని అధికారులు చెబుతున్నప్ప టికీ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం జరిపి, ఈ వేరియంట్‌ వ్యాప్తిపై సమీక్ష జరిపింది. మళ్లీ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందని, సామాజిక దూరం పాటించడం ప్రారంభించాలని, శానిటైజేషన్‌ చేసుకుంటూ ఉండాలని ప్రజ లకు, ప్రభుత్వాలకు చెప్పడంతో పాటు, ఆస్పత్రులలో కోవిడ్‌ కిట్స్‌ తదితర సరంజామాను సర్వసన్నద్ధంగా ఉంచుకోవాలని కూడా ఆదేశించింది.
వ్యాక్సిన్‌ నిల్వలు రెడీ
కొత్త వేరియంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సరైన చర్యలే తీసు కుంటోంది. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగలు రానున్న నేప థ్యంలో ప్రభుత్వాలన్నీ సర్వసన్నద్ధంగా ఉండాలని, ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రం అందజేయడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య , వైద్య శాఖ మంత్రి మనస్సుఖ్‌ మాండవీయా ప్రకటించారు. వ్యాక్సిన్‌ నిల్వలను సరిచూసుకో వాలని, అవరసరమైతే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆయన సూచించారు. అంతేకాదు, ఈ వేరియంట్‌ను అదుపు చేయడానికి నాసికలో వేసే మం దును తయారు చేసిన భారత్‌ బయోటెక్ను దీనిని భారీ ఎత్తున తయారు చేయడానికి అనుమతించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించడం, అవసరమైతే క్వారంటైన్లలో ఉం చడం మొదలుపెట్టింది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఒక కన్ను వేసి ఉంచింది.
నిజానికి, ఈ బి.ఎఫ్‌7 వేరియంట్‌ రెండు నెలల క్రితమే భారతదేశంలో ప్రవేశిం చింది. అయితే, గతంలో కోవిడ్‌ విజృంభించిన సమయంలో 85 శాతానికంటే మించి జనాభాకు వ్యాక్సిన్‌ వేయడం జరిగింది. వ్యాక్సినే ఈ వేరియంట్‌ను కూడా అదుపు చేస్తోందని, ఆ కారణంగానే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అతి స్వల్పంగా ఉందని ప్రభుత్వం తెలియజేసింది. మూడవ డోసు కింద సుమారు 20 శాతం మంది ప్రజలకు వేసిన బూస్టర్‌ కూడా దీన్ని నిరోధిస్తోందని కేంద్రం తెలిపింది. ఈ కొత్త వేరియంట్‌ భారత్‌లో విజృంభించే అవకాశమే లేదని, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ లేదని కూడా అధికారులు చెబుతున్నారు. మౌలికమైన జాగ్రత్తలలో యథాప్రకారం జీవితాలను సాగించవచ్చని కూడా వారు చెప్పారు. అయినప్పటికీ, దీని విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగానే ఉండడం మంచిది. ప్రస్తుతం మందకొడిగా ఉన్న ఈ వేరియంట్‌ మున్ముందు ప్రమాదకంగాను, ప్రాణాం తకంగానూ మారదని చెప్పలేం.
చైనా, జపాన్‌, కొరియా, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఇప్పటికే తమ వ్యాక్సి న్లను కొత్త వేరియంట్‌కు తగ్గట్టుగా అభివృద్ధి చేయడం జరిగింది. చాలా దేశాలు తమ ప్రజలకు అయిదవ డోసు కూడా ఇవ్వడం పూర్తయింది. భారతదేశం బూస్టర్‌ డోసు లను మరింతగా ప్రజలకు అందజేయడానికి చర్యలు తీసుకుంటోంది. దేశంలోని చాలా ఆస్పత్రులలో వ్యాక్సిన్లు అందు బాటులో ఉన్నాయి కానీ, బూస్టర్‌ నిల్వలు దాదాపు ఖాళీ అయిపోయాయి. ప్రజలకు మరో వ్యాక్సిన్‌ డోసు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుం టున్న స్థితిలో మరోసారి లాక్‌ డౌను, నిషేధాలకు వెళ్లడం దేశానికి మంచిది కాదు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News