సీఆర్‌రావుగా పేరొందిన కల్యంపూడి రాధాకృష్ణా రావు అంతర్జాతీయంగా ఖ్యాతిగడించిన శతా ధిక గణిత మరియు గణాంక శాస్త్రజ్ఞుడు. తెలుగు సంతతికి చెందిన 102 సంవత్సరాల భారతీయ-అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు, కల్యంపూడి రాధాకృష్ణ రావు, 75 సంవత్సరాల క్రితం చేసిన విశేష కృషి, గణాంకాల గణన విధానంలో విప్లవాత్మక ఆలోచనకు తెరలేపడమే కాక ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి తో సరిసమానంగా పరిగణింపబడే అంతర్జాతీయ గణాంక బహుమతిని జూలై లో కెనడా, ఒంటారియోలోని ఒట్టావాలో జరిగే ద్వైవార్షిక ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో 80,000 అమెరికా డాలర్ల నగదు పారితోషి కంతో పాటు పురస్కారం అందుకుంటారు.
సీవీ రావు ఆవిష్కరణలు
సీఆర్ రావు చేసిన కృషి నాటి గణాంక గణన విధా నంలో విప్లవాత్మక ఆలోచనలకు శ్రీకారం చుట్టడంతో పాటు నేటికీ అనేక రకాల విభాగాలలో సైన్స్ పట్ల మాన వుల అవగాహనపై అపారమైన ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు గై నాసన్ అభిప్రాయపడ్డారు. 1945లో కల కత్తా మ్యాథమెటికల్ సొసైటీ యొక్క బులెటిన్‌లో ప్రచురిం చబడిన తన విశేషమైన పరిశోధనా పత్రంలో రావు ఆధు నిక గణాంకాల రంగానికి మార్గం సుగమం చేసిన మూడు ప్రాథమిక ఫలితాలతో పాటు ఈ రోజు సైన్స్‌లో ఎక్కువగా ఉపయోగించే గణాంక సాధనాలను అందించారు అని ఫౌండేషన్ ఏప్రిల్ 1, 2023న విడుదల చేసిన ఒక ప్రక టనలో తెలిపింది. అవి, 1. క్రామెర్-రావ్ లోయర్ బౌ్‌ండ సిద్ధాంతం 2. రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం (ప్రముఖ గణాం కవేత్త డేవి్‌డ బ్లాక్‌వెల్ ద్వారా స్వతంత్రంగా కనుగొన బడింది) మరియు 3. ‘సమాచార జ్యామితి’. ప్రపంచం లోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన కణ యాక్సిలరేటర్ అయిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ వద్ద హిగ్స్ బోసాన్ కొలతలను అర్థం చేసుకోవడానికి మరియు సర్వో త్తమీకరణం చేయడానికి ఇటీవల సమాచార జ్యామితి ఉపయోగించబడింది. ఈ సిద్ధాంతం రాడార్లు మరియు యాంటెన్నాలపై జరిపిన పరిశోధనలతో పాటు కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఆకార వర్గీకరణ మరియు ఇమేజ్ సెగ్రిగేషన్‌లో పురోగతికి గణనీయంగా దోహదపడింది.
విద్య మరియు ఉద్యోగం
1920 సెప్టెంబరు 10న కర్ణాటక రాష్టం బళ్ళారి లోని హడగళిలో తెలుగు దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం ఆంధ్ర ప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ మరియు విశాఖపట్నంలలో కొన సాగింది. కేవలం 5 సంవత్సరాల వయస్సులోనే ఆయన 16 నుండి 16 వరకు ఉన్న గుణకార పట్టికలను అవలీలగా చెప్పేవారు. స్వాతంత్య్రానికి పూర్వం, ఆయన ఈ తెలివి తేటలు ఇరుగుపొరుగున ఉండే వ్యాపారులకు తమ రోజు వారీ ద్రవ్య లావాదేవీలను సరిచూసుకోవడానికి ఎంత గానో ఉపకరించేది. విశాఖపట్నంలో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసారు. ఆయన ప్రతి తరగతిలోనూ మొదటి ర్యాంకును సాధించారు. బి ఎ (ఆనర్స్) పూర్తి చేసిన ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందారు. విశా ఖపట్నం నుండి కలకత్తాకు వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరి 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందిన మొదటి ఐదుగురు విద్యార్థులలో ఆయన ఒకరు. అంతేకాక ప్రపం చంలో గణాంకశాస్త్రంలో మొట్టమొదట మాస్టర్స్ డిగ్రీ పొం దిన అతి కొద్దిమంది వ్యక్తులలో కూడా ఆయన ఒకరు. అత ను కలకత్తా విశ్వవిద్యాలయం నుండి స్టాటిస్టిక్స్‌లో మాస్ట ర్స్ డిగ్రీని పొందిన మొదటి ఐదుగురు విద్యార్థులలో ఒకడు. అంతే కాక ఆయన విశ్వవిద్యాలయ ఫస్టు ర్యాంకు సాధించడం విశేషం. నాటి బ్రిటీష్-ఇండియా పాలనలో ఆయన సైనిక సేవలలో చేరడానికి ప్రయత్నం విఫలం కావడంతో అన్యమనస్కంగానే ఆయన గణాంక శాస్త్రాన్ని ఎంచుకున్నారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లోనే లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి పరిశోధనలు ప్రారంభిం చారు. పరిశోధనలతో భాగంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాల యంలో పరిశోధనలు కొనసాగించే అవకాశం పొందారు. ఆయన పరిశోధనాంశములను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రెస్ వారు ప్రచురించారు. అప్పటికి ఈయన వయస్సు కేవలం 26 యేండ్లు మాత్రమే. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క కింగ్స్ కాలేజ్ లో ఆయన పిహెచ్‌డి పూర్తి చేసారు. ఆ తరువాత 1965లో ఆయన కేంబ్రిడ్జ్ నుండి డిఎస్‌సి పూర్తి చేసారు. తొలుత ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్‌ట్యూట్‌లో మరియు ఆ తరువాత కేంబ్రిడ్జ్‌లోని ఆంథ్రో పాలజికల్ మ్యూజియం లలో పని చేసారు. ఆ తరువాత ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ సంచాలకు లుగా, జవహర్లాల్ నెహ్రూలో ప్రొఫెసర్‌గా, జాతీయ ప్రొఫె సర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ మరియు ఎబర్లీ ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ గణాం కాల అధ్యక్షుడిగా మరియు సెంటర్ ఫర్ మల్టివేరియేట్ ఎనాలిసిస్ సంచాలకులుగా ఎన్నో కీలక పదవులు నిర్వ హించారు. ఆయన ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూని వర్సిటీ ప్రొఫెసర్ ఎమెరిటస్ గా మరియు బఫెలో యూని వర్సిటీ రీసెర్చ్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు.
చిన్ననాటినుండే తనలో క్రమశిక్షణను పెంపొందించి నందుకు ఆయన తన తల్లికి కృతఙ్ఞతలు చెబుతారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన తాను రాసిన ఒకానొక పుస్తకాలలో ‘నా చిన్నతనంలో మా అమ్మ నన్ను ప్రతిరోజూ తెల్లవారుఝామున 4 గంటలకు నిద్రలేపి ప్రభాత వేళలో మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదువుకొమ్మని చెప్పి నూనె దీపం వెలిగించేది అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ గణాంక బహుమతి నేపథ్యం
ఐదు ప్రముఖ అంతర్జాతీయ గణాంకాల సంస్థల సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంట ర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ద్వారా అంతర్జా తీయ గణాంక బహుమతి అందజేస్తారు. గణాంకాల రం గంలో ఒక వ్యక్తి లేదా బృందం సాధించిన ప్రధాన విజ యాన్ని గుర్తించడం, ప్రత్యేకించి ఇతర విభాగాలలో ఆచర ణాత్మక అనువర్తనాలు మరియు పురోగతికి దారితీసిన శక్తివంతమైన ఆలోచనలపై ఈ సంస్థ ప్రత్యేక దృష్టి సారి స్తుంది. నోబెల్, అబెల్, ఫీలడ్స్ మెడల్ మరియు ట్యూరింగ్ అవార్డుల తరహాలో ఈ బహుమతి రూపొందించబడింది. 2017 లో మొదటగా డేవిడ్ ఆర్ కాక్స్‌కు అంతర్జాతీయ గణాంక బహుమతి సంక్లిష్ట అధ్యయనాలలో రోగి మను గడ రేటును పరిశోధించడానికి పరిశోధకులను అనుమ తించే కాక్స్ అనుపాత ప్రమాదాల నమూనాను అభివృద్ధి చేసినందుకు గాను ప్రదానం చేయడం జరిగింది. 2019 లో బ్రాడ్లీ ఎఫ్రాన్ అనువర్తిత గణాంకాలలో అనిశ్చితిని అంచనా వేయడానికి బూట్‌స్ట్రాప్ అని పిలువబడే ఒక తెలివైన గణన పద్ధతిని ఆవిష్కరించినందుకు గాను ఈ అవార్డును అందుకున్నారు. 2021లో నాన్ లైర్డ్ సంక్లిష్ట రేఖాంశ అధ్యయనాల విశ్లేషణను సాధ్యం చేసిన శక్తివంత మైన పద్ధతులను అభివృద్ధి చేసినందుకు గాను ఈ అవా ర్డును అందుకున్నారు. ఈ అంతర్జాతీయ పురస్కారం అందుకోనున్న నాల్గవ వ్యక్తి సివి రావు మన తెలుగు వారు కావడం మన తెలుగు వారందరికీ గర్వకారణం.
పురస్కారాలు
సివి రావు గణితం మరియు గణాంకాల రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయ నను 1968 పద్మభూషణ్ మరియు 2001లో పద్మవి భూషణ్ బిరుదులతో సత్కరించింది. 2010లో ఆయన భారత ప్రభుత్వం సైన్స్ రంగంలో ప్రదానం చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం సైన్స్ అవార్డును అందుకున్నారు. 2013లో ఆయన ఇంటర్నేషనల్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ స్టాటిస్టికల్ సైన్స్‌కు చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ పొందారు. గణాంక శాస్త్రంలో అంతర్జాతీయ అవార్డు పొందిన మూడవ మరియు మొదటి భారతీయ సంతతి గ్రహీత అయిన ఆయన 19 దేశాలలోని విశ్వ విద్యాలయాల నుండి 38 గౌరవ డాక్టరల్ డిగ్రీలను పొం దారు. అతను భారతదేశం, యునైటెడ్ కింగ్డం, అమెరికా మరియు ఇటలీలోని జాతీయ అకాడమీలలో సభ్యుడు. అంతేకాక ఆయన నెదర్లాండ్స్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కి మరియు వాషింగ్టన్ డిసిలో ప్రధాన కార్యాలయం ఉన్న ఇంటర్నేష నల్ బయోమెట్రిక్ సొసైటీకి కూడా అధ్యక్షుడు. ప్రస్తుతం, ఆయన దక్షిణాసియా ప్రజలకు హృదయ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటైన లాభా పేక్షలేని సంస్థ ఇండియన్ హార్ట్ అసోసియేషన్‌కి సీనియర్ పాలసీ మరియు స్టాటిస్టిక్స్ అడ్వైజర్‌గా ఉన్నారు.
ఆయన ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు, గౌరవాలు అందుకున్నారు. వాటిలో 2002 లో ఆయన అందుకున్న యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకో దగినది. ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ఆయనను ఒక చారిత్రక వ్యక్తిగా అభివర్ణించింది. ఆయన నైపుణ్యం గణాంక శాస్త్రాన్నే కాక అర్థ శాస్త్రం, జన్యుశాస్త్రం, భూగర్భ శాస్త్రం, జాతీయ ప్రణాళిక, ప్రజా సమూహాల స్థితిగతుల అధ్యయనం, జీవగణ ప్రమాన శాస్త్రం, వైద్య శాస్త్రం వంటి శాస్త్రాలను సైతం ప్రభావితం చేస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇం డియా ఆయనను భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞు లలో ఒకరుగా అభివర్ణించడం, ఆయన విశిష్టమైన ప్రజ్ఞకు అద్దం పడుతుంది.
భగవంతుడు శతాధిక గణిత మరియు గణాంక శాస్త్ర వేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు (సి వి రావు) కు దీర్ఘా యువు ప్రసాదించి ఆయన జ్ఞానసముపార్జన ప్రపంచ మానవాళికి మరింత ఉపయోగపడేలా సేవలందించేం దుకు తగు శక్తిని ప్రసాదించాలని నిండు మనసుతో కోరుకుందాం.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్, గైడ్స్, తెలంగాణ
8885050822