కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో ఒక కనీవినీ ఎరుగని సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన రాష్ట్ర హైకోర్టును సైతం ఒక కుదుపు కుదిపింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదార్లు ఒక కేసును ఆన్ లైన్ లో విచారణ సాగిస్తుండగా, గుర్తుతెలియని దుండగులు ఆ వీడియో కాన్ఫరెన్సును హ్యాక్ చేసి, అశ్లీల చిత్రాలను ప్రవేశపెట్టారు. విచారణ వివరాలు రావాల్సిన తెర మీద హఠాత్తుగా అశ్లీల చిత్రం వస్తుండడం చూసి అంతా నిర్ఘాంతపోయారు. న్యాయ మూర్తులు వేరే వేరే గదుల్లో వాద ప్రతివాదనలు వింటుండగా ఇది జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. ప్రసన్న వరాలే ఈ బహిరంగ విచారణకు వెంటనే స్వస్తి చెప్పడమే కాకుండా, దీన్ని మరో అయిదు రోజులకు వాయిదా వేయడం జరిగింది. కొందరు దుండగులు సాంకేతికపరంగా ఎంత ముందడుగు వేస్తున్నారో, డిజిటల్, టెక్నాలజీ ప్రక్రియలను ఎంతలా దుర్వినియోగం చేస్నున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సైబర్ దుండగులు న్యాయవ్యవస్థలోకి కూడా జొరబడుతున్నారంటే వీరు ఏ స్థాయిలో తెగిస్తున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇది జరగడానికి మూడు రోజుల ముందు మరో సంఘటన కూడా జరిగింది. బెంగళూరు నగరంలోనూ, చుట్టుపక్కలా ఉన్న 68 స్కూళ్లకు ఆన్ లైన్ లో బాంబు బెదరింపు సందేశాలు వచ్చాయి. మత సంబంధమైన వ్యాఖ్యలు, రాతలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్కూళ్లను బాంబులతో పేల్చేస్తామని, ఒక్కరు కూడా బతికే అవకాశం ఉండదని ఆ సందేశాలు తెలిపాయి. వెంటనే ఆ పాఠశాల యాజమాన్యాలు స్కూళ్లను మూసేశాయి. తల్లితండ్రులకు ఈ విషయం తెలిసి, భయాందోళనలకు గురై, పరుగు పరుగున స్కూళ్లకు వచ్చి పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లడం జరిగింది. పోలీసులు బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లతో రంగప్రవేశం చేసి, ఈ స్కూళ్లన్నిటినీ సోదా చేశారు. చివరికి ఇవి బూటకపు సందేశాలని తేలింది. దుండగులెవరో ఇంతవరకూ తెలియరాలేదు. డిజిటల్, టెక్నాలజీలపరంగా ఇటువంటి బెదరింపులకు, ముప్పులకు ఉన్న అవకాశాలు రానురానూ విస్తరిస్తున్నట్టు, కొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఈ రెండు సంఘటనల్లోనూ దుండగులను గుర్తించి, వాళ్లను పట్టుకోవడం పోలీసులకు సాధ్యంకావడం లేదు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, దేశవ్యాప్తంగా 2022లో 65,893 సైబర్ నేరాలు చోటుచేసుకున్నాయి. 2021 కంటే ఇవి 24.4 శాతం ఎక్కువ. సైబర్ నేరమనేది కేవలం బ్యాంకు ఖాతాలలోంచి డబ్బు తస్కరించడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది దాదాపు అన్ని రంగాలకు విస్తరించాయి. కాన్ఫరెన్సులు, అధికార పత్రాలు, రహస్య సంభాషణలు, చర్చలు, వ్యాపార లావాదేవీలు, రోగుల వివరాలు, పరిశోధనలు, ఆవిష్కారాలు వగైరాలన్నిటిలోకీ సైబర్ నేరాలు ప్రవేశించడం జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించినంత వరకూ కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దుండగులు సాధారణంగా ప్రైవేట్ నెట్ వర్కులను, బోగస్ సర్వర్లను ఉపయోగిస్తుండడం వల్ల వీరిని పట్టుకోవడం, శిక్షలు విధించడం అన్నది పోలీసులకు సాధ్యపడడం లేదు. వీరిని గుర్తించడమూ సాధ్యం కాదు, వీరిని పట్టుకోవడమూ సాధ్యం కాదు. సైబర్ భద్రతకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి సర్వే జరిపినప్పుడు రోజుకు కనీసం 2,229 సైబర్ దాడులు జరుగుతున్నట్టు వెల్లడైంది. అంటే ప్రతి 39 సెకన్లకు ఒక సైబర్ దాడి జరుగుతోందన్న మాట.
ఇక ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి సైబర్ నేరాల వల్ల నష్టమైన సొమ్ము దాదాపు 10.5 ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. ఇటువంటి దుండగులను గుర్తించి, పట్టుకోవాలన్న పక్షంలో కేంద్ర ప్రభుత్వమే కాక, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ టెక్నాలజీలను అత్యంత ఆధునికంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేరాలకు శిక్ష విధించడం కూడా అత్యధికం కావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచడమే కాదు, వారికి అవగాహన కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా సైబర్ నేరాల తీరుతెన్నులను గురించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంతో పాటు ఇటువంటి కేసులను ఎదుర్కునే విషయంలో కూడా వారిని సమాయత్తం చేయాల్సి ఉంటుంది.
Cyber crime on rise: ప్రతి 39 సెకన్లకు ఒక సైబర్ దాడి
సైబర్ దొంగలున్నారు జాగ్రత్త