దసరా పండుగ వచ్చిందంటే ఒకప్పుడు గ్రామాల్లో ఉపాధ్యాయులు తమ విద్యార్థులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పాటలు పాడి, బడి అభివృద్ధికి కానుకలు సేకరిం చేవారు. ఆ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన దసరా పాటలు నేటికీ మన సంస్కృతిని గుర్తుచేస్తాయి.
“ఏ దయా మీదయ మామీద లేదు!
ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు!
దసరాకు వస్తిమని విసవిసలాడక! చేతిలో లేదనక, ఇవ్వలేమనక!”
అంటూ సాగిన ఈ పాటలో బడి కోసం పిల్లలు చేసే అభ్యర్థన, ఉపాధ్యాయుల అంకితభావం ప్రతిబింబిస్తాయి. పాట చివరలో “జయీభవ! విజయీభవ! దిగ్విజయీభవ!” అంటూ గ్రామ పెద్దలకు ఆశీస్సులు అందించేవారు. దసరాను ‘గిలకల పండుగ’గా కూడా పిలిచేవారు. పిల్లలు కొత్త దుస్తులు ధరించి, వెదురుతో చేసిన విల్లంబులు పట్టుకుని, రంగుల పొడులు, పూలతో ఆనందంగా ఆడుతూ పాడుతూ ఊరంతా తిరిగేవారు. ఉపా ధ్యాయుల వెంట వరుసగా సాగుతూ ప్రతి ఇంటి ఎదుట పాటలు పాడి దసరా కానుకలు స్వీకరించేవారు.
ఆ రోజుల్లో విద్యను సమాజ అభివృద్ధికి పునాదిగా భావించిన గ్రామ పెద్దలు బడుల నిర్వహణకు తమ వంతు సహకారం అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామా ల్లో బడుల ఏర్పాటుకు స్థలాలను సైతం దానం చేసేవారు. ఉపాధ్యాయులు ఏడాది పొడవునా పిల్లలకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కథలను దసరా సంద ర్భంగా గ్రామ పెద్దల ఎదుట ప్రదర్శించేవారు. పిల్లల ప్రతిభను చూసి ఆనందించిన పెద్దలు బడి అభివృద్ధికి కానుకలు అందించేవారు. ఇది కేవలం కానుకలు సేకరించే ఆచారం మాత్రమే కాదు. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యానికి, విద్యా ర్థుల ప్రతిభకు, సమాజం విద్య పట్ల చూపిన గౌరవానికి నిదర్శనం. ఉపాధ్యాయులు జ్ఞానాన్ని పంచుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తే, గ్రామ పెద్దలు ఆ విద్యా దీపం నిరంతరం వెలిగేందుకు తోడ్పడేవారు. కాలక్రమంలో ఈ సంప్రదాయం కనుమరుగవుతున్నా, దాని వెనుక ఉన్న విద్యా విలువలు, సామాజిక బాధ్యత, గురుశిష్య సంబంధం మరువ రానివి. ఆనాటి దసరా పాటల్లో దాగిన గొప్ప సందేశాన్ని నేటి తరానికి అందిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు పదిలంగా అందిద్దాం.
ఉమారాణి వైద్య
లింగాపూర్, కామారెడ్డి జిల్లా

