Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Death penalty: మరణశిక్ష విధించడం సమంజసమేనా?

Death penalty: మరణశిక్ష విధించడం సమంజసమేనా?

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ హత్య కేసులో దోషిగా తేలిన బల్వంత్‌ సింగ్‌ రాజోనాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాజోనా మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బల్వంత్‌ సింగ్‌ రాజోనా క్షమాభిక్ష పిటి షన్‌పై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 1995లో చండీగఢ్‌ సచివాలయం ముందు జరిగిన పేలుడులో అప్పటి పం జాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడు సంఘటనలో కాని స్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌ సింగ్‌ రాజోనా ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. గత 26 ఏళ్లుగా రాజోనా జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ 2012లో రాజోనా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. అప్పటి నుంచి అతడి పిటి షన్‌ పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలోనే తన మరణ శిక్షను జీవితఖైదుకు తగ్గించాలని కోరుతూ 2020లో రాజోనా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ నేప థ్యంలో తాజాగా విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం మరణ శిక్షను జీవితఖైదుగా తగ్గించే ముచ్చటేలేదని తేల్చి చెప్పింది.
మరణశిక్ష అమలుకు వ్యతిరేకంగా ఉద్యమం
భారతదేశంలో ప్రస్తుతం మరణశిక్ష అమలులో ఉంది. అయితే అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తున్నారు. మరణశిక్షకు గురైనవారిని సహజంగా ఉరి తీస్తారు. అయితే మరణశిక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌ మనదేశంలో కొంతకాలంగా వినిపిస్తోంది. శిక్ష అనేది మనుషుల్లో పరివర్తన తీసుకువచ్చేదిగా ఉండాలి. ఈ మేరకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం. కంటికి కన్ను సిద్ధాంతాన్ని అవలంబిస్తే…. ప్రపంచమంతా అంధులతో నిండిపోతుంది అన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆధునిక సమాజంలో మరణశిక్షకు తావుండకూడదు. అనేక దేశాల్లో ఇప్పటికే మరణశిక్షను రద్దు చేశారు. మరణశిక్షకు బదులు జీవితఖైదు విధిస్తున్నారు. మానవ విలువలకు పట్టంకట్టే ఆధునిక సమాజంలో మరణశిక్షను అమలు చేయడాన్ని మించిన దారుణం మరొకటి ఉండదు. నేరా లను నియంత్రించడానికి ఆయా నేరాల తీవ్రతను బట్టి శిక్షలు విధించవచ్చు. మరణశిక్ష విధించడం అలాగే అమ లు చేయడం వల్లనే నేరాలు తగ్గుముఖం పడతాయన్నది ఒక భ్రమే. మరణశిక్షను రద్దు చేసిన దేశాల్లో విచ్చలవిడిగా నేరాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మరణ శిక్షను కొనసాగించాలనే వాదనకు మద్దతుగా ఎలాంటి గణాంకాలు కూడా లేవు. ఈ ఆధునిక సమాజంలో చివ రకు మరణశిక్ష, మానవహక్కుల సమస్యగా మారింది. మరణశిక్షను అమలు చేయడం అంటే మానవ హక్కులను కాలరాచడమే.ఎందుకంటే మనుషులకు జీవించే హక్కు అత్యంత ముఖ్యమైనది. కొన్ని దేశాల్లో నేరాలకు సంబంధించిన కేసుల విచారణ అత్యంత వేగంగా జరుగు తుంటుంది. దోషులుగా తేలినవారికి హడావిడిగా మరణ శిక్ష విధిస్తారు. ఆ తరువాత అంతే స్పీడుగా అమలు చేస్తారు. ఆ తరువాత కీలకమైన విచారణలో మరణశిక్షకు గురైనవారు అసలు దోషులే కారని, అమాయకులని తేలు తుంది. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అనేకం జరిగాయి. అంటే మరణశిక్ష పేరుతో అమాయకులను పాలకవర్గాలు ఉరికొయ్యకు వేలాడదీశాయని అర్థం చేసుకోవాలి.
చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో క్షమాభిక్ష
మనదేశంలో మరణశిక్ష పడ్డవారు క్షమాభిక్ష కోరు తూ రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించే వెసులుబాటు ఉంది. కేసు పూర్వాపరాలను పరిశీలించి సదరు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే హక్కు రాష్ట్రపతికి ఇచ్చింది రాజ్యాం గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసు సంచలనం సృష్టించింది. 1993 మార్చి ఎనిమిది తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన యావత్‌ భారత దేశాన్ని ఓ కుదుపు కుదిపింది.ఈ సంఘటనలో 23మంది సజీవ దహనమయ్యారు. సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్థన రావు అనే ఇద్దరు యువకులు ఈ ఘటనకు కారణమని కోర్టులో నిరూపణ అయింది. ఈ ఇద్దరికీ గుంటూరు సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అప్పీల్‌ చేసుకోగా అక్కడ కూడా చుక్కెదురైంది. 1995 నవంబరు రెండో తేదీన ఇద్దరికీ ఉరిశిక్ష ధృవీకరించింది హైకోర్టు. బస్సును తగల బెట్టడం చలపతి, విజయ్‌వర్ధన్‌ ఉద్దేశం కాదంటూ సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు డిఫెన్స్‌ న్యాయవాదులు. అయితే చలపతి, విజయవర్థన్‌లకు కింది కోర్టు విధించిన మరణ శిక్షనే 1996 ఆగస్టు 28న సుప్రీం కోర్టు ఖరారు చేసింది. దీంతో చివరి అవకాశంగా చలపతిరావు, విజయవర్థన్‌ క్షమాభిక్ష కోసం అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మకు అర్జీ పెట్టుకున్నారు. బస్సు దగ్ధం, ఉద్దేశపూర్వకంగా జరిగిన నేరం కాదన్నారు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా మనీ, క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మను వేడుకున్నారు. అయితే వారి వినతిని 1997 మార్చి 14న శంకర్‌ దయాళ్‌ శర్మ తిరస్కరించారు. ఆ తరువాత హై డ్రామా నడిచింది. చలపతి, విజయవర్థన్‌లను రాజ మండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. మరికొన్ని గంటల వ్యవధిలో ఆ ఇద్దరినీ ఉరితీస్తారనగా ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో శంకర్‌ దయాళ్‌ శర్మ స్థానంలో కొత్త రాష్ట్రపతిగా కేఆర్‌ నారాయణన్‌ వచ్చారు. దీంతో ప్రజాస్వామ్యవాదులు, హక్కుల సంఘాల నాయ కులు కేఆర్‌ నారాయణన్‌ను కలిశారు. దోషులకు క్షమా భిక్ష పెట్టాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు. దోషు లుగా తేలిన చలపతి, విజయవర్థన్‌ వృత్తిరీత్యా నేరస్తులు కారని, కాయకష్టం చేసుకుని బతుకుబండి నడుపుకునే పట్టణ ప్రాంత దళితులని రాష్ట్రపతికి వివరించారు.
ఈ నేపథ్యంలో మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తు న్నట్లు అప్పటి రాష్ట్రపతిగా కేఆర్‌ నారాయణన్‌ ప్రకటిం చారు. అంతిమంగా మరణం అంచులదాకా వెళ్లి తిరిగి వచ్చారు చలపతిరావు, విజయవర్ధన్‌.
ప్రజల సెంటిమెంట్లే ముఖ్యమా?
అత్యంత క్రూరమైన నేరాలు జరిగినప్పుడు ప్రజల ఆవేశాలను చల్లార్చడమే ముఖ్యమన్న ధోరణిలో అప్పుడ ప్పుడు న్యాయస్థానాలు వ్యవహరిస్తుంటాయి. అయితే ఇది సరైన పద్ధతి కాదు. మరణశిక్షలు విధించడం ద్వారా నేరాలు తగ్గుతాయన్నది ఒక భ్రమ మాత్రమే. కంటికి కన్ను, పంటికి పన్ను సహజ న్యాయమని సామాన్య ప్రజలు అనుకోవచ్చు. అయితే ఈ భ్రమకు వ్యవస్థలన్నీ కలిసి ఆమోదముద్ర వేయాలా అన్నదే ప్రశ్న. సమాజాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడమే న్యాయస్థానాల లక్ష్యం కావా లి. మనదేశంలో కొన్ని దశాబ్దాలుగా మరణశిక్ష అమలులో ఉంది. అయినప్పటికీ సమాజంలో నేరాలు, ఘోరాలకు ఫుల్‌స్టాప్‌ పడలేదు. కనీసం తగ్గుముఖం కూడా పడలేదు. పైపెచ్చు నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణశిక్ష కేవలం దోషుల ప్రాణాలు తీయడానికే పనికివస్తుంది. అసలు నేరాలు జరగడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి అనేదానిపై మౌలికంగా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. మరణ శిక్షల్లాంటి అత్యంత కఠిన శిక్షలు విధించినంతమాత్రాన నేరాలు తగ్గుతాయన్న గ్యారంటీ ఎక్కడా లేదు. గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు కూడా. నేరాలు జరిగే పరిస్థితులను, అవకాశాలను నిరోధించే దిశగా వ్యవస్థాపరంగా ఏర్పాట్లు జరగాలి. దోషుల్లో పరివర్తన దిశగా శిక్షలు ఉండాలి. అప్పుడే నేరాలకు తావులేని సమాజం ఏర్పడుతుంది.
ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News