Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్హెచ్‌ఐవి-ఎయిడ్స్ భూతం ఇంకా తొలగలేదు

హెచ్‌ఐవి-ఎయిడ్స్ భూతం ఇంకా తొలగలేదు

1 డిసెంబర్‌ 'ప్రపంచ ఏయిడ్స్ దినం' సందర్భంగా..

విపత్తుల విజృంభనతో నిన్న స్తంభించిన మానవాళి నేడు వాతావరణ ప్రతికూల మార్పులు, పెరిగిన ద్రవ్యోల్బణంతో విశ్వ మానవాళి భయపడుతున్న వేళ‌ మరో నివురు కప్పిన నిప్పులాంటి ప్రాణాంతక హెచ్‌ఐవి/ఎయిడ్స్ అంటువ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తూ ప్రజలను భయపెడుతోంది. హె‌ఐవి1, హెచ్‌ఐవి2 వైరస్‌లు జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తున్నాయి. 5 జూన్‌ 1981న తొలిసారి అమెరికాలో ఐదు హెచ్‌ఐవి/ఎయిడ్స్ కేసుల గుర్తించారు. ఇండియాలో తొలి హెచ్‌ఐవి/ఏయిడ్స్ కేసుగా 1986లో చెన్నైలో మహిళా సెక్స్ వర్కర్‌ను గుర్తించారు.

- Advertisement -

భారత్‌లో హెచ్‌‌ఐవి – ఎయిడ్స్‌:
గత నాలుగు దశాబ్దాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన హుమన్‌ ఇమ్యూనో-డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవి) సోకిన కారణంగా సంక్రమించే ఎయిడ్స్ వ్యాధితో 37.6 మిలియన్లు బాధపడడం (35.9 మిలియన్ల పెద్దలు, 1.7 మిలియన్ల 15-ఏండ్ల లోపు పిల్లలు), 40 మిలియన్ల ప్రజలు మరణించడం ఇప్పటి వరకు జరిగిపోయింది. 2020 ఏడాదిలో 1.5 మిలియన్ల ప్రజలకు హెచ్‌ఐవి సోకిందని అంచనా. 2010 వివరాలతో పోల్చితే 2020లో 30 శాతం తక్కువ కేసులు బయట పడ్డాయి. ప్రతి యేటా ఎయిడ్స్ వ్యాధితో 2 మిలియన్ల ప్రజలు, అందులో 2.5 లక్షల పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ప్రస్తుతం ఏడాదికి 63,000 కొత్త హెచ్‌ఐవి సోకిన కేసులు, 42,000 మరణాలు నమోదు అవుతున్నట్లు 2021 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 24 లక్షల మంది హెచ్‌ఐవి సోకిన వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. భారత్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, ఆంధ్ర, కర్నాటక లాంటి) అధిక కేసులు బయట పడుతున్నాయి.

నిశ్శబ్దాన్ని వీడుదాం-ఎయిడ్స్‌ గూర్చి చర్చిద్దాం:
నేటికీ ఎలాంటి ప్రత్యేక మందు, చికిత్స, వ్యాక్సీన్‌ కూడా అందుబాటులో లేని కారణంగా సంపూర్ణ అవగాహన, జీవనశైలిలో మార్పులు, నిశ్శబ్దాన్ని వీడి సామాన్యుల నడుమ విస్తృత చర్చలు, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మన ముందున్న ఏకైక మార్గంగా కనిపిస్తున్నది. హెచ్‌ఐవి వైరస్‌ సోకిన వ్యక్తి రక్తంతో పాటు శరీర ద్రవాల్లో వైరస్‌ మనగలుగుతుందనే విషయాన్ని అందరికీ చేరేలా అవగాహన కల్పించారు. వైరస్‌ సోకిన వ్యక్తుల్లో 84 శాతం మాత్రమే నిర్థారణ చేయబడ్డాయని, అందులో 73 శాతానికి పైగా ఆంటీ-రెట్రో వైరల్‌ థెరపీ తీసుకున్నారని, 66 శాతం చికిత్సకు సానుకూలంగా స్పందించారని 2020 ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ దినం-2023:
హెచ్‌ఐవి వైరస్‌ కారణంగా సంక్రమించే “అర్జిత వ్యాధి నిరోధకత లోపంతో కలిగే బహువ్యాధి లక్షణాన్ని ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిసియన్సీ సిండ్రోమ్‌) వ్యాధి” అంటున్నాం. భయంకరమైన ప్రాణాంతక హెచ్‌ఐవి/ఏయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతియేటా 01 డిసెంబర్‌ రోజున 1988 నుంచి విశ్వవ్యాప్తంగా ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’ నిర్వహిస్తున్నాం. ఎరుపు రంగు నిబ్బన్‌ను సూచికగా తీసుకొని హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సంఘీభావం తెలుపడం, రక్తం, వ్యాధి పట్ల హెచ్చరిక, సోకిన వారి పట్ల ప్రేమ, సహనం ప్రకటించుట జరుగుతోంది. ప్రపంచ ఎయిడ్స్ దినం-2023సందర్భంగా ‘గ్లోబల్‌ సాలిడారిటీ, షేర్డ్‌ రెస్పాన్సిబుటీ’ లేదా ‘విశ్వ సంఘీభావం, భాద్యతలు పంచుకోవడం‌’ అనే నినాదాన్ని తీసుకున్నారు.

హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ వ్యాప్తికి కారణాలు:
హెచ్‌ఐవి వైరస్‌‌ సోకిన వ్యక్తి రక్తం ఆరోగ్యవంతుడి రక్తంతో కలిసే అవకాశం ఉన్నపుడే హెచ్‌ఐవి సంక్రమిస్తుంది. అసురక్షిత లైంగిక సంబంధాలే వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణమని గుర్తుంచుకోవాలి. శుద్ధి చేయని సూదులతో పచ్చబొట్టు, ఒకే రేజర్‌ బ్లేడ్లను ఇద్దరు వాడడం, అజాగ్రత్తగా రక్త మార్పిడి, అపరిశుభ్ర సిరంజ్, సూదుల ద్వారా వైరస్‌ సంక్రమించవచ్చు. హెచ్‌ఐవి సోకిన మహిళ బిడ్డకు జన్మనిచ్చినపుడు, శరీర ద్రవాలు కలిసినపుడు, ప్రసూతి సమయంలో, రొమ్ము పాలు పట్టినపుడు శిశువుకు హెచ్‌ఐవి సోకవచ్చు. ఇండియాలో అసురక్షిత లైంగిక సంబంధాలతో 85.6 శాతం, తల్లి నుండి శిశువుకు 5.9 శాతం, స్వలింగ సంపర్కంతో 1.4 శాతం, రక్తమార్పిడితో 1.1 శాతం, అపరిశుభ్ర సూదులతో 1.3 శాతం మందికి హెచ్‌ఐవి వైరస్‌ సోకుతోందని తెలుస్తున్నది. లాలాజలం, చెమట, మూత్రంలో అత్యల్ప పరిమాణంలో హెచ్‌ఐవి వైరస్‌ ఉన్నందున వీటి ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం దాదాపు ఉండదు.

హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ వ్యాధి లక్షణాలు:
ప్రాథమిక హెచ్‌ఐవి దశలో రోగ లక్షణాలు కనిపించవు. తరువాత స్టేజ్‌1 నుండి స్టేజ్‌4 వరకు రోగం ముదిరి ప్రాణం కూడా పోతుంది. హెచ్‌ఐవి సోకిన వ్యక్తిలో తొలుత ఎలాంటి రోగ లక్షణాలు కనిపించక పోవచ్చు లేదా మరికొన్ని సమయాల్లో జ్వరం, డయేరియా, కీళ్ళ నొప్పులు, గొంతు మరియు ఒంటి నొప్పులు, బరువు తగ్గడం, టి-లింఫోసైట్స్ ప్రభావితం కావడం, శోషరస గ్రంథుల వాపు లాంటి రోగ లక్షణాలు రావచ్చు. హెచ్‌ఐవి సోకిన వ్యక్తిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతూ రక్తంలో సిడి 4 కణాల సంఖ్య తగ్గుతుంది. ఈ స్థితిలో ఎయిడ్స్ రోగికి టిబి, న్యుమోనియా లాంటి బహువ్యాధి లక్షణాలు కలుగవచ్చు.

హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ చికిత్సలు:
హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధికి ఎలాంటి సరైన ఔషధ చికిత్స లేదు, కాని ఆంటీ-రెట్రో వైరల్‌ థెరపీ (ఏఆర్‌టి) చికిత్స ద్వారా వైరస్‌ పునరుత్పత్తి రేటును (రిప్లికేట్‌) తగ్గించ్చవచ్చని తెలుస్తున్నది. హెచ్‌ఐవి సోకిన వ్యక్తి జీవనశైలి మార్పులతో కనీసం 10 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా బతకవచ్చు. హెచ్‌ఐవి/ఏయిడ్స్ నిర్థారణ పరీక్షల్లో రాపిడ్‌, ఎలీసా, పిసిఆర్‌ లాంటి ఆంటీబాడీ మరియు ఆంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ నివారణ మార్గాలు:
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పేదరికం, అవిద్య, అసమానతలు, అధిక జనాభా వంటి కారణాలే హెచ్‌ఐవి-ఎయిడ్స్‌కు ప్రధాన కారణాలని నిపుణుల నిర్థారణకు వచ్చారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, న్యాయ అసమానతలను తగ్గిస్తేనే ఎయిడ్స్‌, కరోనా లాంటి ప్రజారోగ్య సమస్యలు సమసిపోతాయి. 2030 నాటికి హెచ్‌ఐవి-ఎయుడ్స్‌కు చరమగీతం పాడాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజారోగ్య వసతుల కల్పన, ఔషధాల అందుబాటు, వైరస్‌ నిర్థారణ సౌకర్యాలు, నిశ్శబ్దాన్ని వీడి అందరికీ అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ఎయిడ్స్‌ రోగులకు సామాజిక భరోసా లాంటి చర్యలు తీసుకోవాలి. హెచ్‌ఐవి/ఎయిడ్స్ నివారణ పట్ల అవగాహన కల్పించడం, డిస్పోసబుల్‌ సూదులు, బ్లేడులు వాడడం, సురక్షిత (కండోమ్‌లు వాడడం) లైంగిక సంబంధాలు, వేశ్యలు/అపరిచితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం, హెచ్‌ఐవి పాజిటివ్ గర్భిణి మహిళకు ప్రసూతి వరకు తగు వైద్య సూచనలు అందించడం, పరీక్షించిన తరువాతనే రక్తమార్పిడి చేయించుకోవడం లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
చికిత్సతో పాటు టీకాలు అందుబాటులో లేని హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒక్కటే ఏకైక మార్గమని, సీతారాముల జీవితాలే మనకు ఆదర్శమని, సంపూర్ణ అవగాహన కలిగి, తగు జాగ్రత్తలతో ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాదిద్దాం. విశ్వ సంఘీభావం, సమాజిక చర్చలు, బాధ్యతలను పంచుకోవడమనే లక్ష్యంతో ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చని అందరూ నమ్మినపుడే హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ లేని సమాజ స్థాపన సుసాధ్యం అవుతుంది. హెచ్‌ఐవీ వైరస్‌ మహమ్మారిని మనదరికి రాకుండా అడ్డుకుందాం. చికిత్స కన్న నివారణే మిన్న అని నమ్ముదాం. హెచ్‌ఐవి-ఎయిడ్స్‌ వ్యాధికి సరైన టీకా సత్వరమే రావాలని కోరుకుందాం.

                    డా: బి ఎం ఎస్‌ రెడ్డి
                        9949700037
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News