చత్తీస్ గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం ప్రారంభించారో లేదో నాయకుల ఫిరాయింపుల పర్వానికి తెరలేచింది. చివరి క్షణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గంతు వేయడమనే వ్యవహారం ఊపందుకుంది. దేశంలో ఎన్నికలనేవి రాను రానూ భారీ వ్యయంతో కూడుకున్నిపోతున్నాయి. వామపక్షాలను మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ అభ్యర్థుల పనితీరును, వారికి ప్రజల్లో ఉన్న పలుకుబడినీ కాకుండా, వారిలోని వనరులను కూడగట్టగల సామర్థ్యం ఆధారంగా వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎంపక చేయడం జరుగుతోంది. అభ్యర్థుల సైద్ధాంతిక నిబద్ధతను బట్టి వారిని ఎన్నికలలో పోటీ చేయించే వ్యవహారం ఏనాడో ముగిసిపోయింది. కేవలం పార్టీ అగ్రనాయకత్వం ఇష్టాయిష్టాల మీద, వారి ప్రాపకం మీదా ఆధారపడి అభ్యర్థులను ఎంపిక చేయడమన్నది సర్వసాధారణమై పోయింది. సిద్ధాంతాల ఆధారంగా పార్టీల్లో చేరడం కాకుండా, నాయకులను నమ్ముకుని పార్టీల్లో చేరడం జరుగుతోంది. దాంతో వారు గాలివాటం ఎటుంటే అటు వెళ్లిపోవడం జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడ్డాయంటే చాలు, తమకు ఏ పార్టీ ఉపయోగపడితే ఆ పార్టీలోకి గంతు వేయడమన్నది జరిగిపోతోంది.
ఫిరాయింపుదార్లు సంఘ విద్రోహ శక్తులు
తమ పార్టీ తమకు మళ్లీ అవకాశం ఇవ్వకపోయినా, తమను ప్రోత్సహించకపోయినా, తమ స్వేచ్ఛకు భంగం కలిగించినా పార్టీ ఫిరాయించడానికి ఏమాత్రం వెనుకాడని నాయకులే ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఎక్కువగా కనిపిస్తున్నారు. తమ నియోజకవర్గాల ప్రయోజనాలను నెరవేర్చడానికి, తమ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, తమ నియోజకవర్గానికి చట్టసభల్లో ప్రతి నిధులుగా ఉండడానికి కృషి చేయాల్సిన అభ్యర్థులు చివరికి వివిధ మార్గాల్లో ఓటర్లతో ఒప్పందాలు, బేరసారాలు కుదర్చుకునే స్థాయికి దిగజారడం జరిగింది. శాసనసభకు లేదా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి తన నియోజకవర్గంలోని ఓటర్లకు ప్రలోభాలు, ప్రతిఫలాలను అందజేసే పక్షంలో ఓటర్లు ఆ అభ్యర్థిని గెలిపించడం జరుగుతుంది. అప్పుడు ఆ అభ్యర్థి విజయం సాధించి ఆ తర్వాత నుంచి ఆర్థికంగా, సామాజికంగా తన స్థాయిని మరింత పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ రంగంలో జరుగుతున్నది ఇదే. మరీ ఎక్కువగా ప్రజాస్వామికీకరణ జరుగుతున్నందు వల్ల తమ పార్టీ ప్రయోజనాలకు, నియమ నిబంధనలకు అతీతంగా కూడా అభ్యర్థులు వ్యవహరించడం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం రాజకీయాలనేవి సేవాధర్మాలుగా కాకుండా వృత్తిగా మారిపోతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ప్రజాసేవకు, సిద్ధాంతాలకు ఆస్కారం లేదు. ఈ రంగం పూర్తిగా ఇచ్చిపుచ్చుకునే ధోరణికి అంకిత మైపోయింది. విలువలు, ప్రమాణాలు, నైతిక ధర్మాలు, నిస్వార్థం వంటి గుణగణాలు ఏనాడో అంతరించిపోయాయి. రెండు ఎన్నికల నుంచి కాంగ్రెస్ తన ప్రాభవాన్ని, ప్రాబల్యాన్ని పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం తమ నాయకుల్లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోకి ఫిరాయించడం. బీజేపీ తమకు సైద్ధాంతికంగా వ్యతిరేకమైన పార్టీ అయినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు కేవలం పదవుల కోసమే, ప్రాపకం కోసమే ఫిరాయించడం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ నాయకుల స్వార్థపూరిత ఆశయాలు, లక్ష్యాల సంగతి పూర్తిగా తెలిసిన బీజేపీ కూడా ఈ ఫిరాయింపులను ఇతోధికంగా ప్రోత్సహించి రాజకీయంగా లబ్ధిపొందడం జరిగింది. తాను లౌకికవాదానికి కట్టుబడి ఉన్నానని, ప్రజా సంక్షేమానికి అంకితమయి ఉన్నానని, తాను బీజేపీ కంటే విభిన్నమైన పార్టీనని ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు కూడా ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా బీజేపీతో మమేకం కావడం జరుగుతోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలలో చివరి క్షణపు ఫిరాయింపులను గమనించిన వారికి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బీజేపీ నుంచి, ప్రాంతీయ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం, కాంగ్రెస్ నుంచి బీజేపీతో సహా ఇతర పార్టీలకు ఫిరాయించడం వింతగానూ, విడ్డూరంగానూ కనిపిస్తుందనడంలో సందేహమేమీ లేదు. శాసనసభ్యులను తమ పార్టీలో ఉంచు కోవడమన్నది ఏ పార్టీకైనా అసాధ్యమైపోతోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో ఉన్నా, ప్రజలకు తమ అంతిమ లక్ష్యం అర్థమైపోయే అవకాశం ఉందనే అవహాహన ఉన్నా శాసన సభ్యులు యథేచ్ఛగా పార్టీలు ఫిరాయించడం నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఒకప్పుడు ఎక్కడో చెదురు మదురుగా ఫిరాయింపులు జరిగేవి. ఇప్పుడవి చేయి దాటిపోయాయి. అడ్డూ ఆపూ లేకుండా విస్తరించిపోతున్నాయి. వీరిని శిక్షించడం అనేది పార్టీలకు, శాసనసభలకు, చట్టాలకు, న్యాయస్థానాలకు కూడా సాధ్యం కాదు. వీరికి శిక్ష వేయాల్సింది ఓటర్లే. సిద్ధాంతాలు మార్చుకోవడమంటే విలువలకు, ప్రమాణాలకు, నైతికతకు తిలోదకాలిచ్చినట్టే. ఒక విధంగా ఫిరాయింపుదార్లు సంఘ విద్రోహ శక్తులు. వీరి విషయంలో ఓటర్లు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది.