Homeఎడిటోరియల్ / బహుళప్రజలను అనుసరించండి చాలు..!

ప్రజలను అనుసరించండి చాలు..!

ప్రపంచీకరణ నాలుగోదశలో చాలా పరిణా మాలు చూస్తున్నాం. అందులో ప్రజల ఆకాంక్షలు- ప్రభుత్వాల పని తీరు ఒక ప్రధాన అంశం. కారణాలు ఏవైనా కావొచ్చు. ప్రజా సమూహాల ఆలోచ నను పాలకులు పరిగణలోకి తీసుకోవడం లేదు. గెలుపోటముల కోణంలోనే పార్టీల ఆచరణ ఉంటూ ఉన్నది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. తమదైన కోణంలో అభివృద్ధి నమునా ఉండాలని పట్టుబడుతున్నారు. తాము కోరుకున్న విధంగా పాలన లేదని అంటు న్నారు. భారత ఉప ఖండ దేశాల్లో ఇటీవల జరిగిన ఆందోళనల వెనుక ఉన్నది ఇదే. 1820ల నుండి నేటి వరకు నాలుగో దశకు ప్రపంచీకరణ చేరుకున్నది. గతం కంటే ఉత్పత్తి పెరిగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. దేశాల మధ్య సరిహద్దుల్లేని వ్యాపారం జరుగుతున్నది. స్టాక్‌ మార్కెట్ల సూచీలు చుక్కలను తాకుతున్నాయి. ఇదే సందర్భంలో ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. సాపేక్ష పేదరికం పెరుగుతున్నది. దీని పర్యవసానాలు చాలా రూపాల్లో వ్యక్తం అవుతున్నాయి. మన దేశం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మిగతా వారి కంటే భిన్న మైనది. అభివృద్ధి నమునా మన దగ్గర సంక్షేమ పథకాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ పథకాలే గెలుపోటములను నిర్ధేశిస్తాయని పార్టీలు భావి స్తాయి. లేదంటే సోషల్‌ మీడియాను నమ్ముకుంటే చాలు అదే చూసుకుం టుందనే భావన 2014 నుండి మన దేశ రాజకీయాల్లో చాలా బలంగా కన్పిస్తున్నది. కానీ వీటికి ఆవల కూడా ప్రజల ఆలోచన ఉన్నదనే విష యాన్ని పార్టీలు, నాయకులు ఇంకా గుర్తిస్తున్నట్లు లేదు.

- Advertisement -

ఇటీవల జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళన చాలా విషయాలను దేశం దృష్టికి తీసుకొచ్చింది. నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం అందుకే ప్రధాన కేంద్ర స్థానం అయింది. ప్రజల ఆలోచనలను, ఆకాంక్ష లను ప్రభుత్వం గుర్తించడం లేదనే అసలు విష యాన్ని ఈ ఆందోళన స్పష్టం చేసిందని రాజ కీయ పండితులు చెప్తున్న మాట. పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగ, ఉపాధి కల్పన, మెరుగైన జీవన ప్రణామాలు, గౌరవప్రదమైన జీవితం.. ఇట్లా చాలా అంశాలు ఆందోళనలో అంతర్లీ నాంశాలుగా ఉన్నాయనుకోవచ్చు. ఈ ఆందో ళన చుట్టూ చాలా చర్చ జరుగుతున్నది. కానీ అధికారంలో ఉన్నవారు సహజంగా కొన్ని విష యాలను విస్మరిస్తుంటారు. రాష్ట్ర స్థాయిలో అయినా, జాతీయ స్థాయిలో అయినా. ప్రజల ఆలోచన ఏమిటీ? తమ పాలన గురించి వారు ఏమనుకుంటున్నారు? అనే విషయాల జోలికి వెళ్లడం లేదు. తాము చెప్పిన భావోద్వేగ ఉపన్యా సాలకు చప్పట్లు కొడుతున్నారు కాబట్టి సరిపో తుందని భావిస్తున్నారు. లేదంటే తాము అమలు చేస్తున్న పథకాలు జనాలను సమ్మోహితులను చేస్తున్నాయని అనుకుంటున్నారు. వీటికి భిన్నంగా ప్రజల ఆలోచన ఉన్నది. ఎన్నికల ముందు నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నారు. ఒకర్ని చూసి మరొకరు పోటీలు పడుతున్నారు. అన్ని సందర్భాల్లో ఇవి కూడా పనికి రావనే విషయాన్నీ ప్రజలే రుజువు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని చూడాలి. అందులో ఒకటి పార్టీల వ్యూహాలు. రెండోది వాస్తవిక ఆచరణ. ఎన్నికల్లో గెలిచేందుకు సామాజిక సమతూకం. ఏ రాష్ట్రంలో, లేదా ఏ జిల్లాలో ఎవరు ప్రభా వితం చేయగల నాయకులు. ఎవరికి ప్రజలతో నిత్య సంబంధాలున్నాయి. ఎవరు తమ వాదనకు అనుకూలంగా జనామోదాన్ని పొందగలరు -అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నది కాబట్టే బీజేపీ వరుసగా రెండుసార్లు లోక్‌ సభలో మంచి మెజార్టీ తెచ్చుకున్నది. మూడోసారి మిత్రుల మద్దతు అనివార్యం అయింది. కానీ ఎవ్వరూ ఊహించని స్థితికి భారతీ జనతా పార్టీ చేరుకున్నది. ఇప్పుడు ఎదుర్కొంటున్న స్థితికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ రాజకీయంగా వారు అనుసరిస్తున్న వ్యూహం బాగా పనిచేసింది. వర్తమాన రాజకీయ పరిణామాలను బట్టిచూస్తే మరి వారి భవిష్యత్తు ఏమిటనేదానికి ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పలేం. భారత ప్రజల నిజవేతనాలు, జీవన నాణ్యత గురించిన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ గోధుమలు, బియ్యం తక్కువ ధరకు ప్రభుత్వం ఎందుకివ్వాల్సి వస్తోంది? ఇదీ కదా ఆలోచించాల్సింది. ఈ విషయాల గురించి బీజేపీ క్షేత్ర స్థాయి స్థితిని తెలుసుకోవాల్సిన అనివార్యత ఉన్నది. ప్రధానంగా కొత్త తరం ఆలోచనలను అది గుర్తించాల్సి ఉంది.

సరే ఇక రాష్ట్రాల విషయానికి వద్దాం. కొత్త, పాత తరం ఆలోచనలను కొన్ని ప్రాంతీయ పార్టీలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. సంప్ర దాయ రాజకీయాలకు భిన్నంగా ముందుకెళ్తూ వర్తమాన రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్న నాయకులూ ఉన్నారు. తమిళ నాడులో యువత ఏం కోరుకుంటున్నది, విద్యా, ఉపాధి, సామాజికాంశాల పట్ల ప్రభుత్వం ఎట్లా ఆలోచించాలి, ఏ ప్రణాళికలు తయారు చేయాలనే దానిపై టీవీకే ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తున్నది. తమిళనాడు రాష్ట్ర మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ గెలుపు చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. డీఎంకే నేత స్టాలిన్‌ గెలుపు నల్లేరు మీద నడక అనుకున్నారు అంతా? కానీ పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది. డీఎంకే ప్రభుత్వం పట్ల తమకు వ్యతిరేకత ఉందనిప్రజల బాహాటంగా చెప్ప లేదు. కానీ ఆచరణలో చూపించారు. మార్పు కోసం ఓట్లేశారని చాలామంది అంటున్నారు? మరి ఆ మార్పు ఎందుకు కోరుకున్నారు? ఇది అస్సలు ప్రశ్న. అతి సాధారణమైనవారు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అదో చరిత్ర. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ మోహన్‌ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా ఓటమి పాలయ్యారని చాలామంది అంటున్నారు. అంటే అమలు చేసిన పథకాలే కాదు ఏ నియోజకవర్గంలో ఎవరు సమర్థులో సరైన అంచనా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడే ఆయన రాంగ్‌ స్టెప్‌ వేశారని అప్పట్లో చాలామంది విశ్లేషించారు. అంతేకాదు, తమ విధానాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సి ఉండే.

తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి యువత ప్రధాన కారణం. అంతేకాదు అధికారంలో ఉన్నవారు తాము అమలు చేసిన పథకాలనే నమ్ముకున్నారు తప్ప క్షేత్ర స్థాయి వాస్తవాలను వారు గుర్తిం చలేదని ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. నిరుద్యోగుల సమ స్యనే కాదు, సామూహికంగా ప్రజల ఆలోచన ఏమిటీ? పాలన పట్ల వారి అభిప్రాయం ఎట్లా ఉందనే విషయాలను గ్రామ స్థాయి నుండి వారు పరిగణలోకి తీసుకోలేదు. భారీ ఎత్తున ఆందోళనలు రాలేదు. కానీ అసంతృప్తి అంతర్లీనంగా బలంగా ఉన్నది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తెలం గాణ ఉద్యమంలో ప్రధాన భాగ స్వామ్యం ఏ జిల్లాలో ఏ నాయకునికి ఉన్నది, ఏ సామాజిక వర్గం వారు ప్రభా వితం చేస్తారనే దానికంటే మారుతున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఎవ రికి ప్రధాన్యత నివ్వాలనే విషయం గమ నంలో ఉంచుకోవాలి. అంతేకాదు, తెలంగాణలో కుల గణన జరిగింది. సహజంగానే ఆశావ హులు పెరుగుతారు. పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంప్రదాయ రాజకీయాల కోణం ఆధారంగా ప్రాబల్య కులాల వారికే ప్రాధాన్యతనిస్తే ప్రజల ఆలోచన లకు భిన్నంగా వెళ్తున్నట్లే.

కేవలం మన దేశంలోనో, మన రాష్ట్రంలోనో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆలోచనా తీరు మారుతున్నది. కొత్త తరం పాత తరాన్ని ప్రభావితం చేస్తున్నది. విస్మరణకు గురైనవారు తమకూ గుర్తింపు కావాలని పట్టుబడు తున్నారు. కాబట్టి జెన్‌ జీ ఆందోళన అయినా, ఆల్ఫాల ఆవేదన అయినా మెరుగైన జీవితం, బాధ్యాతయుత ప్రభుత్వ పని విధానం, రాజకీయ ప్రాతినిధ్యం ఈ అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ అధికార, విపక్షాలు ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాలి. గతంలో మాదిరిగా ప్రాబల్య కులాలే ఒపీనియన్‌ మేకర్లు అనే విషయాన్ని పక్కన పెట్టాలని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రజలే మంచి ఆలోచ నాపరులు. వారిని అనుసరిస్తే సరిపోతుంది. మార్పును గుర్తించాల్సింది పాలకులు, పార్టీలే.

గోర్ల బుచ్చన్న, జర్నలిస్ట్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News