PM Modi’s degree controversy : ఈ దేశం ఓ శవాగారం. ప్రశ్నల్ని చంపి, సత్యాన్ని పాతరేసి, ఆ సమాధులపై అధికార సౌధాల్ని నిర్మించుకున్న శవాగారం. ఇక్కడ ప్రతి పౌరుడూ బట్టలిప్పి బజార్లో నిలబెట్టబడ్డ ఓ అనాథ. అతని గోళ్ళ నుంచి గోత్రం దాకా, అతని మెదడు పొరల్లోని ఆలోచనల దాకా ప్రతిదీ రాజ్యం ఎక్స్‌రే కళ్ళ కింద నగ్నంగా ప్రదర్శించబడాలి. కానీ, ఆ రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి చొక్కా కింద ఉన్న ఒక్క కాగితం ముక్క మాత్రం పరమ పవిత్రమైన దేవరహస్యం. దాన్ని చూడాలనుకోవడం మహా పాపం. దాన్ని ప్రశ్నించడం దేశద్రోహం. దాని ఉనికిని శంకించడం… క్షమించరాని నేరం.
“Secrecy is the linchpin of tyranny.”
ప్రధానమంత్రి డిగ్రీపై ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు, ఈ శవాలగారపు గోడలపై చెక్కబడిన కొత్త శాసనం. అది తీర్పు కాదు, అధికార పీఠంపై న్యాయవ్యవస్థ సమర్పించిన భక్తి నివేదన. “అది వ్యక్తిగతం” అనే ఒక్క మాటతో, ఈ గణతంత్రపు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ప్రజాస్వామ్యం అనే పదానికి పట్టిన దరిద్రం పరాకాష్టకు చేరింది.
చట్టం ముసుగులో లొసుగు : న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టారని మనకు చెప్పారు. కానీ ఆ గంతల చాటున ఆమె కళ్ళు అధికార కేంద్రం వైపు మాత్రమే చూస్తాయని చెప్పలేదు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లనే మంత్రాలుగా జపిస్తూ, “ప్రజా ప్రయోజనం” అనే పదాన్ని బూచిగా చూపిస్తూ, న్యాయస్థానం తన విధిని ఎంత సులభంగా నిర్వర్తించిందో కదా! చట్టం అధికారానికి దాసి అయినప్పుడు, అది ధర్మశాస్త్రం కాదు, దమనకాండకు రాసిన ముందుమాట.
“The law, in its majestic equality, forbids the rich as well as the poor to sleep under bridges, to beg in the streets, and to steal bread.”
ప్రజాస్వామ్యంలో పాలకుడి ప్రతి శ్వాస పౌరుడి ఆస్తి. అతని ఆరోగ్యం, అతని ఆస్తి, అతని విద్య… అన్నీ పౌరుడి సమీక్షకు నిలబడాల్సినవే. ఎందుకంటే ఆ పీఠం పౌరుడి భిక్ష. అలాంటిది, పాలకుడి అర్హత పౌరుడికి “వ్యక్తిగత సమాచారం” ఎలా అవుతుంది? ఇది అక్షరాలతో ఆడుకోవడం కాదు, ప్రజాస్వామ్య ఆత్మతో ఆడుకుంటున్న జూదం. విశ్వవిద్యాలయం ఒక “నమ్మకమైన హోదా”లో ఆ కాగితాన్ని దాచిందట.! ఎవరికి నమ్మకంగా..? పీఠానికా..? ప్రజలకా..? ఈ ప్రశ్న అడిగిన రోజే, ఈ వ్యవస్థ కుళ్ళిపోయిన పునాదులు బయటపడతాయి. అధికార రాజదండం ముందు రాజ్యాంగం మోకరిల్లిన దృశ్యమిది.
పౌరుడు గాయపడిన పక్షి.. పాలకుడు గూడు కట్టిన గద్ద : ఈ తీర్పులోని దగాను, మోసాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం బతుకుతున్న కాలాన్ని దాని అసలు స్వరూపంలో చూడాలి. ఇది పౌరుడిని అనుక్షణం వేటాడే రాజ్యం. నీ వేలిముద్రలు, నీ కనుపాపలు, నీ రక్త నమూనాలు… అన్నీ రాజ్యానికి సమర్పించుకోవాల్సిన హారతులు. నీ ఫోనులో నీవు పంపే సందేశం, నీ బ్యాంకులో నీవు దాచుకున్న చిల్లర, నీ ఇంట్లో నీవు తినే తిండి… అన్నీ రాజ్యం భూతద్దం కింద ఉంటాయి. నిన్ను నిలువెల్లా తనిఖీ చేసి, నీ అస్తిత్వానికి డజను రుజువులు అడిగే ఈ రాజ్యం, తన యజమాని అర్హతకు సంబంధించిన ఒక్క రుజువును మాత్రం ఏడు సముద్రాల అవతల దాస్తుంది.
“Visibility is a trap.”
పౌరుడి జీవితమే ఒక తెరిచిన గాయం. ఆ గాయాన్ని కెలికి ఆనందించడమే రాజ్యానికి వినోదం. కానీ పాలకుడి అర్హత మాత్రం అంటరానిది, ప్రశ్నించరానిది. ఇది ఆధునిక ఫ్యూడలిజం కాక మరేమిటి? “మేము అడుగుతాం, మీరు చెప్పాలి. మీరు అడగకూడదు, మేము చెప్పము.” ఇదే కదా ఈ నయా ధర్మసూత్రం.
ఆ చీకటి గదిలో దాగి ఉన్నదేమిటి : ఈ దాపరికం వెనుక ఉన్నది కేవలం ఒక కాగితం ముక్క కాదు. దాని వెనుక భయాలున్నాయి, అహంకారాలున్నాయి, కుట్రలున్నాయి.
అసత్యం అస్థిపంజరం: ఒకవేళ ఆ సర్టిఫికెట్ పునాదుల్లోనే మోసం ఉంటే? ఆ ఒక్క దొంగ సంతకంపై నిర్మించిన “విశ్వగురువు”, “56-అంగుళాల ఛాతీ” అనే ఇమేజ్ భవనం పేకమేడలా కూలిపోతుందనే భయమా..? అసత్యంపై ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించినా, అది ఎప్పుడూ ఒక చిన్న నిజం పిడుగుపాటు కోసం వణుకుతూనే ఉంటుంది. ఆ వణుకే ఈ గోప్యతకు కారణమా..?
అల్పత్వం అహంకారం: ఒకవేళ సర్టిఫికెట్ నిజమే అయినా, అందులోని అక్షరాల వెనుక దాగి ఉన్న అల్పత్వం భయపెడుతోందా..? మూడో శ్రేణి మార్కులు, అరకొర హాజరు… ఈ నిజాలు బయటపడితే, ఇంతకాలం నిర్మించుకున్న అజేయమైన ప్రతిష్ట మసకబారుతుందనే అహంకారమా..? కిరీటం కింద దాచుకున్న బట్టతలను ఎవరైనా చూస్తారేమోనన్న భయం లాంటిదా ఇది..? సామాన్యమైన గతం, అసాధారణమైన వర్తమానానికి మచ్చ తెస్తుందనే భావనా..?
అధికారం అసహ్యం: అసలు ఆ కాగితం నిజమో, అబద్ధమో అనవసరం. “నేను చూపించను. ప్రశ్నించే హక్కు నీకు లేదు. నా అధికారాన్ని మౌనంగా అంగీకరించడం మాత్రమే నీ విధి” అని పౌరుడి ముఖం మీద ఉమ్మేయడమే అసలు రాజకీయ సందేశం. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పౌరుడిని బానిసగా చూస్తున్న ధిక్కారం. ఇది సమాధానం చెప్పకపోవడం కాదు, అసలు ప్రశ్ననే అణచివేసే ఫాసిజం.
“We’re an empire now, and when we act, we create our own reality.”
చివరికి మిగిలేది : కాబట్టి, ఆ డిగ్రీ కోసం ఇకపై వెతకడం అనవసరం. అది దొరకదు. ఆ కాగితాన్ని మనం “అధికార రహస్యాల చట్టం” కింద జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన పత్రంగా గుర్తిద్దాం. దానికోసం రాజ్యాంగాన్ని సవరిద్దాం. కొత్త పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌లో, రాజదండం పక్కనే దానికి ఒక బంగారు పీఠాన్ని ఏర్పాటు చేద్దాం. రోజూ దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పిద్దాం. దాని దర్శన భాగ్యం మాత్రం కోరుకోవద్దు.
“ఎందుకంటే, భక్తికి రుజువులు అడగకూడదు. ప్రశ్నలు లేని చోటే భక్తి పుడుతుంది.
ప్రశ్నలు లేని చోటే అధికారం వర్ధిల్లుతుంది. ప్రశ్నలు లేని చోటే ప్రజాస్వామ్యం చచ్చి,దాని శవంపై నియంతలు నాట్యం చేస్తారు. చివరిగా ఈ నిశ్శబ్దం… ప్రజాస్వామ్యం కుళ్ళిపోతున్న పచ్చి నెత్తురు వాసన.”


