ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రస్థాయికి చేరుకుంది. ఢిల్లీకి వాయు కాలుష్యం కొత్తేమీ కాదు. అయితే వాయు నాణ్యత సూచీ ఇంతగా పడిపోవటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. హస్తినకు ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను ఇష్టం వచ్చినట్లు తగలబెట్టడమే కాలుష్యం ఈ రేంజ్‌లో పెరగడానికి కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ఒకదశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్‌లో ఉన్నట్లేనని సాక్షాత్తూ ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించిందంటే పొల్యూషన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ ఎపిసోడ్‌తో మరోసారి వాయుకాలుష్యం తెరమీదకు వచ్చింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ నగరం వాయుకాలుష్యానికి మారుపేరుగా మారింది. కొన్నేళ్లుగా ఢిల్లీ నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. ఢిల్లీ ఒక్కటే కాదు మనదేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. గాలి కాలుష్యానికి ఒకటి కాదు, రెండు కాదు అనేక కారణాలున్నాయి. వాతావరణంలోకి పెద్ద ఎత్తున విడుదలయ్యే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ప్రధాన కారణంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గాలి కాలుష్యం, ఆరోగ్యంపై చూపే ప్రభావం అంతాఇంతా కాదు. కాలుష్యం దెబ్బకు మనిషి అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నాడు.
శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా మెదడుపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటుందంటారు వైద్యరంగ నిపుణులు. కాలుష్యం ఫలితంగా వచ్చే పొగ, కీలకమైన మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్యరంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మెదడుకు సహజంగా స్వంత రక్షణ వ్యవస్థ ఉంటుంది. అయినప్పటికీ మెదడును కూడా దెబ్బతీసే స్థాయిలో కాలుష్యం పెరిగిపోతోందని అంటున్నారు వైద్యరంగ నిపుణులు. ఆ తరువాత కాలుష్య ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా కనిపిస్తోందంటారు డాక్టర్లు.
ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్
వాయు కాలుష్యం కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్య సమస్య ఉంది. ప్రధానంగా అనేక వర్థమాన దేశాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్ చాలా తీవ్రంగా ఉంది. ఈ భూగోళంపై ప్రతి పదిమందిలో ఎనిమిది మంది కలుషిత గాలి పీలుస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మంది వరకు కేవలం పొల్యూషన్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రో కార్బన్‌లు, సీసం …ఇవన్నీ గాలి కాలుష్యానికి దారితీసే ప్రధాన కారకాలు అంటున్నారు సైంటిస్టులు. సహజంగా మనుషులు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా కాలుష్యానికి గురవుతుంటారు. అర్బన్ ఏరియాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆగినప్పుడు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతుంటారు. చుట్టుపక్కల వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు వాహనాల ఎయిర్ ఫిల్టర్ల పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు నిపుణులు.
ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్‌లో ఉన్నట్లే
గాలి కాలుష్యం అనగానే మనదేశంలో అందరికీ వెంటనే గుర్తుకువచ్చేది ఢిల్లీ నగరం. ఇబ్బడిమబ్బడిగా పెరిగిన గాలికాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం పది సంవత్సరాలు తగ్గిపోతోందని అమెరికాకు చెందిన ఒక రీసెర్చ్ గ్రూప్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. దీంతో, హస్తినలో గాలి కాలుష్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలికాలుష్యం హానికర స్థాయిని మించిపోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. ఒకదశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్‌లో ఉన్నట్లేనని సాక్షాత్తూ ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించిందంటే పొల్యూషన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక సమష్టి కృషి. దీనికి ముందుగా ప్రజలు, అధికారులు అందరికీ పర్యావరణ స్పృహ ఉండాలి. కాలుష్యానికి చెక్ పెట్టాలన్న మైండ్ సెట్ ఉండాలి. కాలుష్య తీవ్రతను తగ్గించడానికి పర్యావరణవేత్తలు అనేక సూచనలు చేశారు. రోడ్లపై వాహనాల రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నది పర్యావరణవేత్తల ప్రధాన సూచన. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించాలంటే స్వంత వాహనాల్లో ప్రయాణాలు చేయడం సాధ్యమైనంత వరకు మానుకోవాలన్నది పర్యావరణవేత్తల సూచన. ప్రజా రవాణాను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంతగా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చంటున్నారు పర్యావరణవేత్తలు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కొత్త విషయం కాదు. అనేక సంవత్సరాలుగా రాజధాని నగర ప్రజల ఆరోగ్యంతో పొల్యూషన్ చెలగాటమాడుతోంది. తొలిసారిగా 2018 నవంబరులో ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యధిక స్థాయిలో నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాదకర స్థాయికంటే 2018 లో ఎక్కువ రేంజ్‌లో కాలుష్యం నమోదైంది. దీంతో, ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక దశలో అక్కడి ప్రభుత్వం సరి -బేసిల సంఖ్యల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చింది.
కాలుష్యానికి చెక్ పెట్టే చెట్లు
వాయుకాలుష్యాన్ని నియంత్రించడంలో చెట్లది ప్రధాన పాత్ర. గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి చెట్లు. అంతిమంగా వాతావరణంలో గ్రీన్ హౌస్ ప్రభావాన్ని చెట్లు తగ్గిస్తాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత ఎడాపెడాగా సాగుతోంది. అభివృద్ధి ముసుగులో అడవులను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అడవులను నరికివేస్తామంటే చట్టాలు ఊరుకోవు. ఇందుకు సంబంధించి కఠిన చట్టాలున్నాయి. అడవుల నరికివేతపై ఆంక్షలున్నాయి. అయితే చట్టాలను, ఆంక్షలను పాలకులు పట్టించుకోవడం లేదు. పైపైచ్చు అభివృద్ధి కోసం అడవుల నరికివేత తప్పదంటూ తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. అంతటితో ఆగడం లేదు. పర్యావరణం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పర్యావరణం, అభివృద్ధి ఈ రెండూ వేర్వేరు అంశాలు కావు. ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న అంశాలే. ప్రగతి ముసుగులో దీర్ఘకాలంలో వినాశనానికి దారితీసే అభివృద్ధి మన లక్ష్యం కాకూడదు. పర్యావరణవేత్తలు చెబుతున్నది ఇదే. పాలకులు ఈ విషయాన్ని గమనించాలి. ఇందుకు అనుగుణంగా సర్కార్ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
-ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్, 63001 74320