Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Delhi Municipal Elections 2022: ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి షాక్ ఇచ్చిన చిన్న పార్టీ!

Delhi Municipal Elections 2022: ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి షాక్ ఇచ్చిన చిన్న పార్టీ!

Delhi Municipal Elections 2022: గతంలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిపోయాయి. దీనికంతా కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ రాజకీయ ప్రవేశం చేసి, జాతీయ పార్టీలను సవాలు చేయటమే. పైపెచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ బాగా బలపడటంతో బీఎంసీ స్థాయిలో ఎంసీడీ ఎన్నికలు ఆసక్తిని కలిగించాయి. బీజేపీయేతర, కాంగ్రెస్సెతర పార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయమంటూ రాజకీయ తెరపైకి పుట్టుకొచ్చిన ఏఏపీ ఇప్పుడు రాజధాని ఢిల్లీ స్థానిక ఎన్నికలను గెలవటం అన్ని సంప్రదాయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చాయి. చూస్తుండగానే ఢిల్లీలో రెండవసారి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పార్టీ అటు పంజాబ్ లో పాగా వేసి, మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో బలపడే ప్రయత్నంలో జోరుగా దూసుకుపోతోంది.

- Advertisement -

ఎన్ని సీట్లు సాధిస్తారు? ఎంతశాతం ఓట్లు సొంతం చేసుకుంటారు? అనే ప్రశ్నలకంటే ముందు ప్రజలను చేరుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ పెడుతున్న పరుగులు, ఫాలో అవుతున్న అజెండా అన్నది ముఖ్యమైన విషయం. ప్రజలపై ప్రభావం ఎంతమేర చూపుతోంది? ప్రజలను ప్రత్యామ్నాయం వైపు ఆలోచింపజేస్తోందా ?లేదా? అన్నదానిపైనే రాజకీయ పార్టీల విజయం దాగుంటుంది. ఈ ఎన్నికల్లో కాకపోయినా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపేలా పునాదులు మాత్రం బలంగా వేసుకోవడంలో ఆప్ భవిష్యత్ వ్యూహం దాగుందనే విషయాన్ని సామాన్య ప్రజలు, రాజకీయ పండితులు డీకోడ్ చేస్తున్నారు.

స్థానిక సంస్థలే కదా అంత సీరియస్ గా పార్టీలన్నీ ఎందుకు అంతర్మథనం చేసుకోవాలి అంటే ఢిల్లీలో
చారిత్రాత్మక విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అసలు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) స్థాయిలో ఎంసీడీ ఎన్నికలను ఖాతరు చేయరు కానీ ఆప్ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. అంటే కేజ్రీవాల్ దెబ్బ పార్టీ సుప్రిమోలపై చాలా గట్టిగా పడిందని అర్థం. 15 ఏళ్లపాటు ఎంసీడీలో రాజ్య చేసిన ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. అలాంటి బీజేపీ సర్వం ఒడ్డి.. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ పాలిత సీఎంలు, ఆఖరుకి బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ అయిన సెలబ్రిటీలు రంగంలోకి దిగినా ఎంసీడీని ఆప్ పాలు కాకుండా కాపాడుకోలేక పోవటం అంటే రాజధాని నగర వాసులపై కేజ్రీవాల్ పట్టు బిగిస్తున్నారని అర్థం. మొత్తానికి కేజ్రీవాల్ దూకుడుకు బీజేపీ మూకుతాడు వేయలేకపోయింది.

మొట్టమొదటిసారి బీజేపీతో ప్రత్యక్షంగా ఢీకొట్టి మరీ గెలిచిన ఎంసీడీ ఎన్నికలు ఆప్ లో సరికొత్త జోష్ ను నింపాయి. సుమారు 17 మంది సీఎంలు, 100 మంది ఎంపీలు, మరోవైపు ఈడీ-ఐటీ-సీబీఐ రైడ్స్, ఇంకోవైపు ఆప్ పై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ ..ఇలా చెప్పుకుంటూపోతే వీటన్నింటినీ పూచిక పుల్లల్లా కేజ్రీవాల్ బృందం తమ ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేసాయి. ఇదే విషయాన్ని ఆప్ నేతలు పదేపదే బల్లగుద్ది మీడియాకెక్కి చెబుతున్నాయి.

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయింది. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఇంకోటి అధికార పక్షంలో ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో ఆప్ తిష్టవేసుకుని కూర్చుంది. అంటే కాంగ్రెస్ కంటే ఆప్ కు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామనే స్థాయిలో కేజ్రీవాల్ పార్టీ ఓటరుపై ప్రభావం చూపుతోంది. ఇదే లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ అయితే ! ఇది కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద ఛాలెంజ్ .

ఇప్పటి వరకూ బీజేపీ చెప్పిందంతా చరిత్రగా మారిపోయింది. ఆప్ వల్ల రాజకీయంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్, సీట్ షేర్ మాత్రమే ఆప్ లాగేసుకుందని, కాంగ్రెస్ ను ఆప్ ఓడించిందని బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసింది. ఇప్పుడు ఏకంగా బీజేపీకే షాక్ ఇచ్చిన ఆప్.. కమలనాథులను చిత్తుగా ఓడించేసి, ఢిల్లీని హస్తగతం చేసుకుంది. ఏ ఎన్నికలు జరిగినా మోడీ-షా టీం ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అని ఊదరగొడుతుంటే దానికి కౌంటర్ గా ‘ఏఏపీ కేజ్రీవాల్స్ గవర్నమెంట్, కేజ్రీవాల్స్ కార్పొరేటర్’ అనే నినాదాన్ని తెచ్చి విజయం సాధించారు. ఏఏపీ ట్రాన్స్ జెండర్ అభ్యర్థి బోబి విజయం సెన్సేషనల్ గా మారింది.

మనమంతా గమనించాల్సింది ఒకటే. కేజ్రీవాల్ తన ఎన్నికల వ్యూహాలను చాలా పకడ్బందీగా, శరవేగంగా, జనరంజకంగా మార్చుకుంటున్నారు. పోలింగ్ ముందు రోజు కూడా ఏఏపీ అభ్యర్థిపై మీరు ఏమైనా క్రిమినల్ ఆరోపణలు చేస్తే నేను నా పార్టీ అభ్యర్థిని తప్పించేస్తానన్న కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్, గుజరాత్, ఎంసీడీ ఎన్నికల్లో 20 శాతానికి పైగా నేరారోపణలున్నవారిని టికెట్ ఇచ్చి బరిలోకి దింపేశారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా కేజ్రీ మాత్రం కేర్ చేయలేదు. మరి ఇవన్నీ సంప్రదాయ రాజకీయ పార్టీల సమీకరణాలే కదా.

‘పాజిటివ్ రాజకీయాలపై ఫోకస్’ అంటూ సరికొత్త నినాదాన్ని ఎత్తుకుంది ఆప్. రాజధానిలోని 2 కోట్ల మంది ప్రజలు తమకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వటాన్ని ‘పాజిటివ్ పాలిటిక్స్’ గా ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ సూత్రీకరించటం గొప్ప ఎత్తుగడగా మారింది.

తమది ‘షాన్ దార్ ప్రభుత్వమ’ని, బీజేపీ చేస్తున్న బోగస్ ఆరోపణలు తమ పార్టీపై ప్రభావం చూపవని కేజ్రీవాల్ టీం ఈ గెలుపుతో తమ సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తుందన్న కేజ్రీవాల్ ఆరోపణలు ఢిల్లీవాసులపై గట్టి ప్రభావం చూపుతున్నట్టైంది. 24 ఏళ్లలో బీజేపీ ఎప్పుడూ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా కేవలం ఎంసీడీపై పట్టును మాత్రం 15 ఏళ్లపాటు గట్టిగా చూపింది. కానీ ఆప్ బీజేపీ కోటను బద్ధలు కొట్టింది. అయితే ఇదే సందర్భంలో కేజ్రీవాల్ మరో స్ట్రాటెజీని చాలా బలంగా చూపుతూ దేశంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. “అతిగా గర్వాన్ని ప్రదర్శించకండి” అంటూ క్యాడర్ కు ఆయన దిశానిర్దేశం చేస్తూ సందేశం ఇచ్చారు. అంతేకాదు తమ పార్టీ ఓటమిపాలైన వార్డులకే తమ తొలి ప్రాధాన్యత అంటూ ఆప్ ఓడిపోయిన ప్రాంతాల్లోనే ముందు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వెరైటీగా పేర్కొనటం హైలైట్. ‘ఆప్ కా విధాయక్ ఆప్ కా పర్షద్’ అంటూ ఆప్ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేద ప్రజలను ఆకట్టుకోగలిగింది. సంవత్సరం నుంచి ఆప్ ప్రజల్లో ఉంటూ, తమ రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ఊదరగొడుతూ, క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనింది.

విజయ గర్వంతో ఊగిపోతున్న బీజేపీకి క్షేత్రస్థాయి విషయాలు బుర్రకెక్కటం లేదు. పదేపదే కాంగ్రెస్ ఫార్ములాను అనుసరిస్తూ నాయకత్వాన్ని మార్చడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలను మార్చడమైనా, ఢిల్లీ నగరంలో బీజేపీ అధ్యక్షుడిని మార్చడమైనా అంతే. దీంతో నాయకత్వ లేమి అన్నది అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యగా మారిపోయింది. పాత తరం నేతలను పక్కనపెట్టి, వారిని కాదంటూ తాము సొంతంగా కొత్త తరం నాయకులను తయారు చేసుకునే పనిలో పడిన మోడీ-షాలు.. పార్టీకి దశాబ్దాలుగా విశ్వాసపాత్రులుగా, విధేయులుగా ఉంటున్న వారికి తమ పార్టీలో స్థానం లేదని చెప్పినంత పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ వంటి నేతలకు ఢిల్లీ బీజేపీలో దక్కుతున్న గౌరవం, స్థానం ఏమిటో హస్తిన ప్రజలంతా చూశారు. తాజాగా ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తాను కూడా మార్చే పనిలో బీజేపీ హైకమాండ్ ఉంది.

ఆఫ్టరాల్ సివిక్ పోల్స్ తో పోయేదేం లేదనే నిర్లక్ష్యం చూపటం అస్సలు తగని పని. ఎందుకంటే ఢిల్లీ మహానగరంలో క్యాడర్ ను బ్రహ్మాండంగా నిర్మించుకుంది ఆప్. ఇదే విజయ సూత్రాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ అనుసరిస్తే ఇక కాంగ్రెస్ తో పాటు బీజేపీకి చెక్ పెట్టడం స్టార్ట్ అయినట్టే. అంతేకాదు ఢిల్లీ నగరంలోని లోక్ సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీల మధ్య ఏమాత్రం సయోధ్య లేకపోవటం వీరికి ఒకరంటే ఒకరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తయారు కావటం ఇవన్నీ బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా మారాయనేది బహిరంగ రహస్యం.

ఇక ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సర్కారుకే కేంద్రం నుంచి సరైన సహకారం, నిధులు అందక అల్లాడుతోంది. ఎంసీడీ పనులు సాగాలంటే కేంద్రం నుంచే నిధులు విడుదల కావాలి. మరి ఎన్నో సమస్యలకు నెలవుగా ఉన్న ఢిల్లీలో పాగా వేయటం సరేకానీ ఒకటిన్నర దశాబ్దంగా పెండింగ్ లో ఉన్న గార్బేజ్ సమస్యలు, రోడ్లను బాగుచేయటం, స్మాగ్-కాలుష్యం, అవినీతి వంటి సమస్యలతో నిత్యం పోరాడి, ఎంసీడీని గాడిన పెట్టాలంటే కేజ్రీవాల్ పార్టీకి అతి పెద్ద సవాలనే చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News