Homeఎడిటోరియల్ / బహుళDemocracy: తలబడితేనే నిలబడే ప్రజాస్వామ్యం

Democracy: తలబడితేనే నిలబడే ప్రజాస్వామ్యం

విశ్వ విఖ్యాత తత్వవేత్త సోక్రటీసు ఒక ఆసక్తికరమైన ఎన్నికను ఊహించాడు. ఒక వైద్యుడు, మరొక మిఠాయి దుకాణదారుడి మధ్య ఎన్నికల పోటీ జరుగుతుంది. “మీకు నచ్చినా నచ్చకపోయినా, మీ ఆరోగ్యానికి అవసరమైనదే చేస్తాను” అని వైద్యుడు ప్రకటిస్తాడు. “మీకు ఇష్టమైనదంతా వడ్డిస్తాను; చేదు మందు అవసరం లేదు” అని మిఠాయి దుకాణదారుడు హామీ ఇస్తాడు. ప్రజలు డాక్టరును ఎందుకు అనుమా నంగా, మిఠాయి దుకాణదారుడిని ఎందుకు ఆప్యాయంగా చూస్తారో సోక్రటీసుకు తెలుసు. ఎన్నికల్లో ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ కంటే తీయటి మెనూ చూపించడం సులభం. రెండున్నర వేల ఏళ్ల తర్వాత కూడా రాజకీయాల రెసిపీ పెద్దగా మారలేదు. పేర్లు, మైకులు, సోషల్‌ మీడియా మారాయి కానీ ఓటరుకు నచ్చే ‘మిఠాయి’ అలాగే ఉంది. ఉచిత హామీ, తక్షణ ప్రయోజనం, మందిర్‌, మటన్‌, మస్జిద్‌, మంగల్సూత్ర వంటి భావోద్వేగ నినాదాలు ఆ మిఠాయిలే. ఉపాధి, విద్య, ఆరోగ్యం, ధరలు, ప్రజా సంస్థలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలు మాత్రం ఎన్నికల వేదికలపై అంతగా అమ్ముడుపోవు. ఎన్నికల బజారులో ప్రజలు సమర్థవంతమైన పాలనను కోరుకుంటున్నారా, లేక హామీల మెరుపు ప్యాకే జీకి ఆకర్షితులవుతున్నారా అనేదే ప్రశ్న? ప్రజాస్వామ్యాన్ని మానవ నాగరికత సాధిం చిన మహత్తర విజయంగా కొనియాడుతాం. ఏథెన్స్​‍ను దాని జన్మస్థలంగా స్మరిస్తాం. కానీ అదే ఏథెన్సుకు చెందిన సోక్రటీసు ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమైన అర్థం ఇచ్చాడు. ఓటు వేయడం హక్కు; ఏం చూసి ఓటు వేయాలో తెలుసుకోవడం విద్య. నేటి ఎన్నికల్లో అభ్యర్థి ఐదేళ్ల పాలన గురించి మాట్లాడటం కంటే ఐదు నిమిషాల ప్రసంగంతో ప్రజలను ఉర్రూతలూగించడం ప్రాధాన్యమైంది. విధానాల కంటే వాగ్దానాలు, పనితీరు కంటే ప్రచారం మెరుస్తున్నాయి. సమస్య ఓటు వేయ డంలో లేదు; ఓటు అడిగేవాడు మిఠాయి అమ్ము తున్నాడా, రోగానికి మందు ఇస్తున్నాడా, లేక రెండింటినీ ఒకే ప్యాకెట్లో అమ్ముతున్నాడా గుర్తించడంలో ఉంది. తుఫానులో ఓడను ఎవరు నడపాలో శిక్షణ లేని ప్రయాణికులే ఓటు వేసి నిర్ణయిస్తే, శస్త్ర చికిత్స ఎవరు చేయాలో కూడా ఓటుతోనే తేలిస్తే ఏమవుతుంది? సోక్రటీసు ప్రజాస్వామ్యం విష యంలో హెచ్చరిక ఇదే. ప్రతి నిర్ణయానికి జ్ఞానం, విచక్షణ అవసరం అంటాడు సోక్రటీస్. విమర్శ నాత్మక ఆలోచన, పౌర విద్య బలహీనంగా ఉన్న సమాజం పాలనా పనితీరు కంటే వాగ్దాటి, ఆక ర్షణ, హామీల వైపే మొగ్గుతుంది. అప్పుడు నాయకత్వం సమర్థుల చేతుల్లోకి కాకుండా ప్రజల కోరికలను తీయటి తేనె పలుకులు పలికేవారి చేతుల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మూకపాలన, చివరికి జనాకర్షక నియంతృత్వానికి దారి తెరుచుకుంటుంది.

- Advertisement -

చరిత్ర దీనికి సాక్ష్యం. ప్రజాస్వామ్య ఎన్నికలు నియంతృత్వానికి అడ్డుగోడలే కావు; కొన్నిసార్లు అవే అధికార కేంద్రీకరణకు మెట్లవు తాయి. హిట్లర్‌, ముస్సోలినీ ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారానే అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత వాటినే బలహీనపరిచారు. హ్యూగో చావెజ్‌, రెషెప్‌ తయ్యిప్‌ ఎర్దవాన్‌, విక్టర్‌ ఓర్బాన్‌ వంటి నాయకులు కూడా ఎన్నికల విజయాన్ని ఉపయోగించి అధికారాన్ని క్రమంగా కేంద్రీకరిం చిన ఉదాహరణలుగా రాజకీయ శాస్త్రంలో చర్చించబడుతున్నారు. చేదు నిజాల బదులు తీపి హామీలు, పరిష్కారాల బదులు భావోద్వేగాలు, వైఫల్యాల చర్చకు బదులు “మనది-వాళ్లది” విభ జన వీరి రాజకీయాల్లో కనిపిస్తుంది. రాజకీయ మిఠాయి దుకాణదారుడు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలు, అవినీతి, సంస్థల వైఫల్యాలపై ప్రశ్నలు రాకుండా ప్రజలను ఎవరు ఏం తింటున్నారు, ఏం ధరిస్తున్నారు, ఏ దేవుడిని పూజిస్తున్నారు అనే విషయాలపై పోట్లాడిస్తాడు. కోపం పాలకుడిపై కాకుండా పక్కవాడిపైకి మళ్లు తుంది. ద్వేషం, భయం, అహంకారం, మతం అతని అంగడి సరుకులవుతాయి. ఇటువంటి దృష్టాంతాలు భారతదేశానికీ ఉన్నాయి. 1966లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ, 1967, 1971 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకు న్నారు. కానీ 1975 జూన్‌ 25 రాత్రి “అంతర్గత అలజడి” పేరుతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించి, అదే ప్రజాస్వామ్య వ్యవస్థను నియంతృ త్వం వైపు మళ్లించింది. జయప్రకాశ్‌ నారాయణ్‌, మొరార్జీ దేశాయ్‌, వాజ్‌పేయి, అద్వాణీ సహా వేలాది మంది విచారణ లేకుండా జైళ్ల పాల య్యారు. పత్రికలపై ఆంక్షలు విధించారు. ఏడీఎం జబల్పూర్‌ కేసులో అక్రమ నిర్బంధాన్ని కూడా ప్రశ్నించలేమని సుప్రీంకోర్టే ప్రకటించింది. అయినా 21 నెలల తర్వాత ప్రజలు అదే బ్యాలె ట్‌తో ఆ అధికారాన్ని తిరస్కరించారు. ఎన్నికలతో అధికారాన్ని గెలుచుకుని, నిరంకుశత్వంగా మార్చిన ఆ ప్రయోగం చివరకు ప్రజల ఓటుతోనే ముగిసింది.

ప్రస్తుత ముప్పు మరింత కుటిలమైనది. అది రాజ్యాంగాన్ని రద్దు చేయదు; దాని అర్థాన్నే మార్చేస్తుంది. అత్యవసర పరిస్థితిలో ప్రజాస్వా మ్యాన్ని బహిరంగంగా బంధించారు. నేడు సంకెళ్లు కనిపించవు కానీ నడిచే స్వేచ్ఛ క్రమంగా మాయమవుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కుదిస్తూ, న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచుతూ, స్వతంత్ర సంస్థలను అధికారానికి అనుకూలంగా మలుస్తోందన్న విమర్శలు పెరుగు తున్నాయి. 2023లో ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్రమంత్రిని చేర్చడం కీలక ఉదాహరణ. దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులు, ఉద్యమకారులపై రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వి-డెం 2026 నివేదిక భారత్‌ లో ప్రజాస్వామ్య సంస్థల బలహీనత, భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రత, ప్రతి పక్షం- పౌర సమాజంపై ఒత్తిళ్లను ప్రస్తావించింది. ఆర్‌ఎస్ఎఫ్‌ 2026 వరల్డ్​‍ ప్రెస్ ఫ్రీడమ్‌ ఇండెక్స్​​‍ లో 180 దేశాల్లో భారత్‌ 157వ స్థానంలో ఉంది. న్యాయమూర్తుల బదిలీలు, నియామకాల విష యంలో ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు న్యాయ మూర్తులే ప్రశ్నలు లేవనెత్తారు.

వీటన్నిటి అర్థం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలన సాగించడం కాదు. దాన్ని కాపాడాల్సిన సంస్థల స్వతంత్రతను క్రమంగా కుదించడమే అసలు ప్రమాదం. పత్రికలు ఉంటాయి కానీ ప్రశ్నించే స్వేచ్ఛ తగ్గుతుంది. కోర్టులు ఉంటాయి కానీ స్వతంత్రతపై ప్రశ్నలు పెరుగుతాయి. సంస్థలు ఉంటాయి కానీ వాటి నిర్ణయాధికారంపై విశ్వసనీయత తరుగుతుంది. ఇదే అప్రకటిత అత్యవసర పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయ కుండా, దాని వెన్నెముకను నెమ్మదిగా వంచడం లోనే మరింత ప్రమాదం దాగి ఉంది. సోక్రటీసు భయాలకు సమాధానం ఓటు హక్కును రద్దు చేయడం కాదు; ఓటరును జాగృతం చేయడం. ఆ చైతన్యానికి రెండు స్తంభాలు – అధికారాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం, అసౌకర్యమైన నిజాలను చెప్పే వివేకవంతమైన పౌరసమాజం. బలమైన ప్రతిపక్షం పార్లమెం టులో ప్రశ్నిస్తుంది, చట్టాలను సవాలు చేస్తుంది, ప్రత్యామ్నాయం ఉందని ప్రజలకు గుర్తుచేస్తుంది. స్వతంత్ర పత్రికలు, విద్యార్థులు, న్యాయవాదులు, రచయితలు, పౌరసంఘాలు ఆ ఆలోచనకు స్వరం ఇస్తాయి. ఎమర్జెన్సీని ఎదుర్కొన్నదీ ఇలాంటి పౌరచైతన్యమే.

పాలకులు ప్రజాస్వామ్యాన్ని హతమార్చా మని ప్రకటించడం ఒక విషయం. దాని ఆన వాళ్లను కూడా చెరిపేశామని ప్రజలను నమ్మిం చడం మరో విషయం. రెండోది మరింత ప్రమా దకరం. 2015లో వచ్చిన స్పానిష్‌ థ్రిల్లర్‌ “ద కార్ప్స్​‍ ఆఫ్‌ అణా ఫ్రిట్జ్‍”లో, చనిపోయిందని భావించిన ఒక యువతి మృతదేహం కూడా కొందరి దురాశకు బలవుతుంది. ఆ భయానక రూపకాన్ని ప్రజాస్వామ్యానికి అన్వయిస్తే, ప్రజా స్వామ్యం బలహీనపడిన తర్వాత దానిపై జరిగే దాడులు అక్కడితో ఆగవు; దాన్ని నిలబెట్టే సంస్థలు, విలువలు, జ్ఞాపకాలను కూడా నిర్వీర్యం చేయా లనే ప్రయత్నం మొదలవుతుంది. కానీ చరిత్ర అక్కడితో అంతం కాదు. న్యాయ స్థానాలు జోక్యం చేసుకున్నప్పుడు, ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు, పౌరసమాజం అప్రమత్తంగా నిలబడినప్పుడు, మరణించినట్టుగా కనిపించిన ప్రజాస్వామ్యం మళ్లీ కదలడం మొదలుపెడు తుంది. అందుకే పాలకులు ప్రజాస్వామ్యాన్ని చంపడం కంటే, అది చనిపోయిందని ప్రజలను నమ్మించే మాయ చేయడం ప్రమాదకరం. కానీ ఆ మాయ ఎక్కువకాలం నిలవదు. ప్రజాస్వామ్యం పార్లమెంటు భవనంలోనో, రాజ్యాంగం పుస్తకం లోనో ఉండదు. అది ప్రశ్నించే పౌరుడిలో, అధికారాన్ని నిలదీసే ప్రతిపక్షంలో, నిజాన్ని చెప్పే స్వతంత్ర స్వరంలో, అన్యాయాన్ని చూసి మౌనం వహించని పౌరసమాజంలో, చివరికి మిఠాయి మాటలకంటే చేదు నిజాన్ని ఎంచుకునే ఓటరులో జీవిస్తుంది. ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారం జరిగిందని అధికారం ప్రకటించినా, ఆ ప్రకటనను నిజం కాకుండా చేసేది ప్రజల అప్రమత్తతే. ప్రజా స్వామ్యాన్ని లేపి నిలబెట్టడం ఒక ఎత్తు అయితే, అది మళ్లీ శవంగా మారకుండా బతికించుకోవడం మరో ఎత్తు. ఆ బాధ్యత ప్రజలదే. నియంతృత్వ, విఘాత శక్తులతో తలబడటమూ మన కర్తవ్యమే.

దొన్నగంటి క్రిష్ణ
తెలంగాణ విద్యావంతుల వేదిక
9493212313

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News