Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్democracy index 2023: బలహీనపడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు

democracy index 2023: బలహీనపడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్య సూచి’ని నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకుంటున్న దేశాలలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో పనిచేస్తున్నదీ ప్రత్యేకంగా అధ్యయనం చేయడం జరిగిందన్న మాట. ఈ అధ్యయన ఫలితాలను బట్టి వివిధ దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చారు. బ్రిటన్‌కు చెందిన ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈ.ఐ.యూ) తరచూ ఈ ప్రజాస్వామ్య సూచిని నివేదిక రూపంలో ప్రచురిస్తుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు పురోగతి ఏ విధంగా ఉందనే విషయంపై ఈ అధ్యయనం జరుగుతుంది. అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం జరుగుతుంది. ఎన్నికల తీరుతెన్నులు, ప్రభుత్వ పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులను బేరీజు వేసుకుని లేదామదింపు చేసి, ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తారు. ఈ అంశాలను బట్టి, ఇది పరిపూర్ణ ప్రజాస్వామ్యమా, లోపభూయిష్ఠమైన ప్రజాస్వామ్యమా, సంకర పాలనా, నిరంకుశ పాలనా అన్నది నిర్ధారిస్తారు.
వాస్తవానికి, 2022లో కూడా ప్రజాస్వామ్య సూచికి సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించడం జరిగింది.అప్పటి నివేదిక ప్రకారం, కేవలం 8 శాతం మంది మాత్రమే పరిపూర్ణ ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నారు.మూడు వంతుల కంటే ఎక్కువ మంది నిరంకుశ పాలనలో బతుకుతున్నారు. ఆసక్తికర విషయమేమిటంటే, పరిపూర్ణ ప్రజాస్వామ్యంలో ఉన్న అమెరికాను 2016లో లోపభూయిష్ఠమైన ప్రజాస్వామ్యానికి దించేయడం జరిగింది.ఇదొక రకంగా అమెరికాకు ‘డిమోషన్‌’ అన్న మాట. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అమెరికా లోపభూయిష్ఠమైన ప్రజాస్వామ్యంగానే కొనసాగుతోంది. ఇక భారతదేశం విషయానికి వస్తే, ఇది 2006 నుంచి లోపభూయిష్ఠమైన ప్రజాస్వామ్యంగానే కొనసాగుతోంది.విచిత్రమేమిటంటే, 2022 నుంచి అనేక ప్రజాస్వామ్య దేశాలలో ప్రజాస్వామిక పురోగతి ఎక్కడిదక్కడ ఆగిపోయిందని ఈ ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ పేర్కొంది. ప్రజాస్వామ్య దేశాలన్నీ ఉదారవాద వ్యతిరేక ప్రజాస్వామ్యాల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఇటలీ, స్వీడెన్‌ వంటి ప్రజాస్వామ్య దేశాలలో సైతం ప్రజాస్వామ్య వ్యవస్థలు పురోగతి లేకుండా స్తంభించిపోతున్నాయి.
రాజకీయ సంస్కృతికి గ్రహణం
మధ్య ఐరోపా దేశాలలో అయితే, ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ సంస్కృతి నెమ్మది నెమ్మదిగా బలహీనపడిపోతున్నాయి. ఈ విషయాన్ని ఈ దేశాలే ఒప్పుకోకపోవచ్చు. ఉదాహరణకు,న్యాయ సంస్కరణలకు సంబంధించి యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో పోలెండ్‌ తీవ్రస్థాయిలో విభేదిస్తోంది. పోలెండ్‌ చేపడుతున్న న్యాయ సంస్కరణలు ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా లేవని యూరోపియన్‌ యూనియన్‌ భావిస్తోంది. తమ సార్వభౌమత్వం జోలికి రావద్దంటూ పోలెండ్‌ అభ్యంతరాలను తెలియజేయడాన్ని బట్టి, అది ప్రజాస్వామ్య విలువలను బేఖాతరు చేయడం లేదనీ, ఒంటెద్దు పోకడ పోతోందనీ అర్థమవుతోంది. దీని ప్రభావం ఇతర దేశాల మీద పడే అవకాశం ఉంది. ఇక చాలా దేశాలలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలమధ్య ఏమాత్రం సమన్వయం ఉండడం లేదు. వీటి మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొని ఉంది. తమ న్యాయ సంస్కరణలను యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వ్యతిరేకించడానికి కారణం ఇందులోని అంశాలు కాదని, ఈ దేశాలు దురుద్దేశపూర్వకంగానే వీటిని వ్యతిరేకిస్తున్నాయని పోలెండ్‌ ఆరోపిస్తోంది.
ఇది ఇలా ఉండగా, బ్రిటన్‌ మాజీ విదేశాంగ మంత్రి డేవిడ్‌ మిలిబాండ్‌ గత ఫిబ్రవరిలో ‘అట్లాస్‌ ఆఫ్‌ ఇంప్యూనిటీ’ అనే ఒక కొత్త సూచిని విడుదల చేశారు. అంటే, ఏయే దేశాలు ప్రజాస్వామ్య దేశాలు ప్రజా స్వామ్య సూత్రాలకు, విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి, వాటికి ఎటువంటి శిక్ష విధించాలన్నది ఈ అట్లాస్‌ను బట్టి నిర్ణయిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల కారణంగానే ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతోందని కొన్ని దేశాలు వాదిస్తున్నాయి. అయితే, ఈ అట్లాస్‌ మాత్రం, శిక్షార్హతకు, జవాబుదారీతనానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా ప్రభుత్వాల పనితీరు ప్రజాస్వామ్య విలువలకు, సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది కూడా పరిశీలిస్తుంది. జవాబుదారీతనం లేకుండా అధికారాన్ని చెలాయించడాన్ని ఈ అట్లాస్‌ శిక్షార్హమైనదిగా భావిస్తుంది. అంతేకాదు, ఈ శిక్షార్హతను అయిదు అంశాల ప్రకారం పరిశీలిస్తారు. ఇవి జవాబుదారీతనం లేని పాలన, ఘర్షణ-హింసాకాండ, మానవ హక్కుల దుర్వినియోగం, ఆర్థిక దోపిడీ, పర్యావరణ క్షీణత.
శిక్షార్హ ప్రజాస్వామ్య దేశాలు
ఎక్కువగా ఆసియా, ఆఫ్రికాదేశాల్లోనే ఈ శిక్షార్హత పరిస్థితులు కనిపిస్తున్నాయని అట్లాస్‌ వెల్లడించింది. అంతర్గత ఘర్షణలు, ఆర్థిక దోపిడీ, ఇతర దేశాల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు తలవంచడం వంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని అది తెలిపింది. ఇక అనేక పశ్చిమ ఐరోపా దేశాలలో ఉదారవాద ప్రజాస్వామిక దేశాలు సైతం శిక్షార్హ దేశాల స్థాయికి మళ్లుతున్నాయి. శిక్షార్హమైన దేశాల జాబితాలో భారతదేశం 46వ స్థానంలో ఉంది. ఇక్కడ తరచూ హింసా విధ్వంసకాండలు చోటు చేసుకోవడం కూడా ఇందుకు సంబంధించిన కారణాల్లో ఒకటి. మయన్మార్‌, పాకిస్థాన్‌, సూడాన్‌, ఎథియోపియా వంటి దేశాలలో పౌర హక్కుల పరిస్థితి పరమ అధ్వానంగా ఉంది. ఇక అనేక పశ్చిమాసియా, మధ్య ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అధ్వాన దశలో ఉన్నాయి. పర్యావరణ క్షీణతలో భారత్‌, చైనా, అమెరికా, రష్యాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక్కడి కాలుష్యం క్రమంగా ప్రమాదకర స్థాయికి వెడుతోంది.
వాస్తవానికి, శిక్షార్హమైన దేశాల జాబితాలో అమెరికా, చైనా, రష్యా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు ఎప్పుడు చూసినా ఇతర దేశాల్లో సమస్యలు సృష్టించడం, హింసను ప్రేరేపించడం వంటివి జరుగుతుంటుంది. అంతేకాక, ఎక్కువగా ఈ దేశాల నుంచే ఆయుధాల సరఫరా కూడా జరుగుతుంటుంది. ఈ దేశాలకు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు కూడా పట్టవు. ఇతర దేశాలతో కుదర్చుకున్న ఒప్పందాలకు ఇవి కట్టుబడి ఉంటాయన్న నమ్మకం లేదు. పైగా, ఆంక్షల పేరుతో ఇతర దేశాలను శిక్షించడం మాత్రం జరుగుతుంటుంది. ఇతర దేశాల బలాలను తగ్గించడానికి, ఇతర దేశాల అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇవి కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటాయి. మొత్తం మీదప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజా ప్రాతినిధ్యం పెరగడం, సమానత్వ భావన అభివృద్ధి చెందడం వంటివి జరిగితే తప్ప ప్రజాస్వామిక వ్యవస్థలు బలపడే అవకాశం లేదు. సమీప భవిష్యత్తులో ఇటువంటివి జరిగే సూచనలు కనిపించడం లేదు.

- Advertisement -

జగదీశ్వర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News