Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్INDIA Alliance: ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం

INDIA Alliance: ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం

కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను అర్థం చేసుకుంటున్న విపక్షాలు

తమకు ఇండియా కూటమి పట్ల నమ్మకం ఉందని, తాము ప్రతిపక్షాల ఐక్యతా ప్రయత్నాలకు చిత్తశుద్ధిగా కృషి చేస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించడం ఈ ఐక్యతా ప్రయత్నాలకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఊరట కలిగించి ఉండాలి. ఇండియా కూటమి సమావేశాలకు తాము హాజరు కాబోమంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతో ఈ కూటమి కొనసాగే అవకాశాలపై సందేహాలు తలెత్తాయి. గత బుధవారం జరిగిన ఇండియా కూటమి సమావేశం కొందరు కీలక ప్రతిపక్ష నాయకులు హాజరు కాని కారణంగా చాలావరకు వెలాతెలాపోయింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రధానమైన, కీలకమైన పార్టీ అనడంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీదారు ఎవరైనా ఉన్నారా అంటే అది కాంగ్రెస్ పార్టీయేనని కచ్చితంగా చెప్పవచ్చు. హీనపక్షంలో అది దేశవ్యాప్తంగా 200 స్థానాలు చేజిక్కించుకునే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏపై ఇండియా కూటమి ఒకే ఒక అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

- Advertisement -

అయితే, తమకు పరిస్థితి అర్థమైందని, తాము ఇందుకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరిస్తామని కాంగ్రెస్ ఒక పట్టాన ఇండియా కూటమి పక్షాలకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలతో క్షణం కూడా తీరిక లేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోక్ సభ ఎన్నికల గురించి, తాము బీజేపీతో పోటీ పడాల్సిన అవసరం గురించి పూర్తిగా మరచిపోయిందన్న అభిప్రాయం ప్రతిపక్షాలలో కలుగుతోంది. అంతేకాక, ఇండియా కూటమి గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈ కూటమితో నిమిత్తం లేకుండానే తాము ఎన్నికల్లో విజయం సాధించగలమనే గట్టి నమ్మకంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారనే అభిప్రాయం కూడా కొందరు ప్రతిపక్ష నాయకుల నుంచి వ్యక్తమవుతోంది.

అయిదు రాష్ట్రాలలో మూడు ప్రధాన రాష్ట్రాలను కోల్పోయినందువల్ల దిగ్భ్రాంతికర పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్రమంగా ఇండియా కూటమి ప్రాధాన్యం అర్థమవుతున్నట్టు కనిపిస్తోంది. కొందరు కాంగ్రెస్ అగ్రనేతల ప్రకటనలను బట్టి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిని బలోపేతం చేసి, బీజేపీని గద్దె దించాలనే పట్టుదల పెరుగుతోందని అర్థమవుతోంది. అంతేకాక, మిత్రపక్షాల సలహాలు, సూచనలకు విలువనివ్వాలని, పూర్తి స్థాయిలో 2024 లోక్సభ ఎన్నికల మీద దృష్టి పెట్టాలని కూడా కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నట్టు కొందరు నాయకుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఇండియా కూటమిలోని ప్రతి
పార్టీ తమ తమ ప్రాంతాలలో తిరుగులేని పార్టీగానే చెలామణీ అవుతోందని, ఈ పార్టీలను నిర్లక్ష్యం చేయడం వల్ల మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. వీటిని కాకుండా, వీటితో నిమిత్తం లేకుండా ఎటువంటి చర్య తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అది తప్పకుండా బెడిసికొడుతుందనే విషయం కూడా ఈ పార్టీకి అవగాహన అయింది.

గత మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మాదిరిగా తాము ఏకపక్షంగా వ్యవహరించినా, సమాజ్ వాదీ పార్టీ లాంటి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు సీట్లు పంచకపోయినా భంగపాటు తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. మున్ముందు ఈ విధంగా వ్యవహరించే పక్షంలో ఇండియా కూటమి ఏర్పాటు ఉద్దేశమే దెబ్బతింటుందని, ఇంతకాలంగా తాము చేస్తున్న ఐక్యతా ప్రయత్నాలు నీరుకారిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి అర్థం చేసుకోవడం ప్రారంభం అయింది. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా, ఇండియా కూటమిని బలోపేతం చేసే దిశగా ఒక పటిష్టమైన, పకడ్బందీ అయిన, ఆచరణాత్మకమైన ఫార్ములాను లేదా వ్యూహాన్ని రూపొందించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం గట్టి నిర్ణయంతో ఉంది. ఇండియా కూటమిలోని ప్రతి భాగస్వామ్య పక్షాన్ని కూడగట్టుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. భాగస్వామ్య పక్షాలను సమస్యలను, సందేహాలను పరిష్కరించడంతో పాటు, జాతీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు కదలాలని కూడా ఈ పార్టీ భావిస్తోంది. అయితే, వీటన్నిటికీ సమయం చాలా తక్కువగా ఉందనే విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గమనించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News