Palamuru Rangareddy Lift Irrigation: కొన్ని తీవ్రమైన సమస్యలు సమాజానికి చాలా చిన్న సమస్యలుగా కనిపించవచ్చు. కానీ ఆ సమస్యల బాధితులకు అవి ప్రాణాంతక సమస్యలు. వాటిని సమస్యలుగా గుర్తించడం, పరిష్కారానికి కృషి చేయడం అనేది ఆ పౌర సమాజ చైతన్యం మీద, ఆ సమాజంలో క్రియాత్మకంగా ఉన్నవారి న్యాయ దృష్టి మీద ఆధారపడి ఆ తీవ్రమైన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాకపోతే అనేక కారణాలవల్ల వెనుకబడిన లేక వివక్షతో వెనకకు నెట్టిన ప్రాంతాల ప్రజలు విద్యలో, ఉపాధి అవకాశాలలో, సాగునీటి వసతుల అనుభవంలో మరింతగా వెనకకు నెట్టబడతారు. బతుకు వేటలో వలసబాట పడతారు.
శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా ఆ ఫలాలు వివక్షకు గురైన ప్రజలకు అందుబాటులోకి రావు. పాలనలో వివక్ష, బలం ఉపయోగించి ప్రయోజనాలు చక్కబెట్టుకునే వారి పోకడలు, వారు ముందుకు తెచ్చే తప్పుడు విధానాలు, ఆ విధానాలకే ప్రభుత్వాల తోడ్పాటు దొరికినప్పుడు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఆ ధాటిని తట్టుకోలేక మరింతగా కృంగిపోతారు. నష్టపోతారు. వలసల పాలవుతారు. ఇలాంటి పరిస్థితిలోనే పౌర సమాజంలోని న్యాయాన్యాయ వివేచనాపరులు జోక్యం కల్పించుకోవలసి ఉంటుంది. బలాబలాల ప్రాతిపదికన కాక న్యాయం ప్రాతిపదికన పనిచేయవలసి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి డిండి ఎత్తిపోతల అనే అన్యాయమైన ఒక సాగునీటి పథకం రద్దు ఆవశ్యకతను మరోసారి చర్చించాల్సిన అవసరముంది.
డిండి ఎత్తిపోతల పేరుతో 156 జీవో తో 2007లో సర్వేలు ప్రారంభించినప్పటి నుండి ఈ పథకాన్ని మేము చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాము. మా ఆందోళన వ్యక్తపరుస్తూ మహబూబ్ నగర్ రైతాంగానికి జరిగే కష్టనష్టాలను చర్చకు పెడుతున్నాము. మహాబల అనే ఒక సర్వే కంపెనీ వారు ఏడుసార్లు సర్వేలు చేశారు. ఏదీ సరిగా చేయలేకపోయారు. ఒకటికి ఎక్కువసార్లు తప్పుడు సర్వేలు చేసి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన ఆ కంపెనీకి మళ్లీ మళ్లీ ఎందుకు అవకాశాలు ఇస్తూ వచ్చారో ప్రభుత్వాలు మారుతూ వచ్చినా అదే సర్వే కంపెనీ ఎట్లా సర్వేలు చేయగలిగిందో విజ్ఞులు ఆలోచించాలి. ఆ డిండి ఎత్తిపోతల పథకం ఎంత నష్టదాయకమైందో అర్థం కావడానికి మహా ఇంజనీరింగ్ పరిజ్ఞానం అవసరం లేదు. చిన్నపాటి న్యాయదృష్టి చాలు.
డిండి ఎత్తిపోతల ఆలోచన ఎట్లా మొదలైంది?
నల్లగొండ జిల్లా సాగునీటి వసతుల కోసం మహబూబ్ నగర్ దుందుభి నది నీరు డిండి ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా మూసీపై (గతం లో అత్రాఫ్ బల్దా హైదరాబాద్) మూసీ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ నిర్మాణం తరువాత ఎడమ కాలువ ఉన్నాయి. స్థానిక చెరువులు, కుంటలు తెలంగాణ అంతటా ఎలాగూ ఉన్నాయి. శ్రీశైలం ఏడవ కాలువ కోసం కాలువలు తవ్వారు కానీ టన్నెల్ పనులు చేపట్టలేదు. అటువైపు శ్రీశైలం కుడి కాలువ పనులు వేగంగా జరిగిపోయాయి. నల్లగొండ రైతాంగం తమకు జరిగిన అన్యాయంపై పోరాడారు. ఫ్లోరైడ్ సమస్యను ముందుకు తెచ్చారు. ఈ విషయంలో యావత్తు తెలంగాణ స్పందించింది.
మేము ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నాం. ఈ ఉద్యమాల వెలుగుగా పుట్టంగండి లిఫ్ట్ పథకపు పనులు రూపు దాల్చాయి. ఈ లిఫ్ట్ విజయం తెలంగాణ సాగునీటి ఉద్యమాలకు ఒక దారిదీపమైంది. నీరు దుంకిన తరువాత తీవ్ర ఫ్లోరైడ్ బాధితులను వదిలేశారు. ఆ నీటిని తవ్విపెట్టిన శ్రీశైలం ఎడమ కాలువలో పారించారు. హైదరాబాదుకు కొంత నీరిచ్చారు. తిరిగి ఫ్లోరైడ్ బాధితుల సమస్య కొనసాగే దుస్థితి కలిగించారు. ఈ పథకం జయప్రదమైంది కనుక దీని పక్కనే మరో రెండు పైపులతో నీరు లిఫ్ట్ చేసి ఆ ఫ్లోరైడ్ బాధితులకు ఇచ్చే కృషి చేసి ఉంటే ఎప్పుడో సమస్య తీరేది.
2007లో ప్రారంభించి అనేక సర్వేలు చేసినప్పుడైనా నాగార్జునసాగర్ నీరు తీసుకునే విధంగా, పలువురు ఇంజనీర్ల సూచనలను పాటించి వున్నా డిండి ఎత్తిపోతల అనే ద్రోహం మహబూబ్‌నగర్‌కు చుట్టుకునేది కాదు. ఇంతలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రారంభమై కొంత వేగం పుంజుకున్నాయి. అప్పుడు టన్నెల్ బయటికి వచ్చే నీటిని ప్రస్తుత డిండి ప్రాజెక్టు ద్వారా తరలించడానికి రెండు లిఫ్టులతో డిండి ఎత్తిపోతల ప్రతిపాదన చేశారు. దీని స్వరూపం ఎట్లా ఉంటుందంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ బయట మన్నెవారిపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కడతారు. దీనిని లోయర్ డిండి అని పిలుస్తారు.
దీనికి ఎగువన మిడ్ డిండి అనే పేరుతో మరొక రిజర్వాయర్ కడతారు. మిడ్ డిండికి ఎగువన ప్రస్తుత డిండిని భారీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి అప్పర్ డిండి అంటారు. ఈ మూడింటిలో మహబూబ్‌నగర్ భూములు పెద్ద మొత్తంలో మునుగుతాయి. ఇలా కాకుండా చాలా సింపుల్‌గా ఎస్ఎల్బీసీ నీరు యధావిధిగా ఆ కాలువలో పారించి పుట్టంగండి లిఫ్టును దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు ఇవ్వవచ్చు. ఒక్క లోయర్ డిండి దగ్గర తప్ప మహబూబ్ నగర్ రైతులు నిర్వాసితులయ్యే ముంపు సమస్య తల ఎత్తదు. ఇలాంటి మంచి ఆలోచన ఆచరణకు తేలేదు.
ఈ డిండి లిఫ్టుతో మహబూబ్‌నగర్‌లో ముంపు వ్యతిరేకత వెల్లువలాగా వస్తుందని, ఆందోళనను డైవర్ట్ చేయడానికి మిడ్ డిండి నుండి అమరాబాదుకు నీటిని ప్రతిపాదించి మహబూబ్ నగర్‌లో వైరుధ్యాలకు తెర తీశారు. తీరా శ్రీశైలం ఎడమ కాలువ కింది రైతులు వారి రాజకీయ నాయకత్వం ఎస్ఎల్బీసీ నీటిని ఫ్లోరైడ్ ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకించారు. తమ నీరు తమకే కావాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పటి అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు వంశీకృష్ణ రైతులతో ర్యాలీలు చేశారు. అసెంబ్లీలో కల్వకుర్తి శాసనసభ్యుడు వంశీచందర్ రెడ్డి దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ కాలానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జూరాల నుండి 70 మీటర్ల దిగువకు శ్రీశైలం ప్రాజెక్టులోకి మార్చాడు. తెలంగాణ స్వతంత్ర ప్రాజెక్టును, తొలి వరద నీరు తీసుకునే అవకాశాన్ని వదిలి వివాదాస్పదమైన అంతర్రాష్ట్ర ప్రాజెక్టులోకి మార్చాడు. ఈ మార్పును అవకాశంగా తీసుకున్న డిండి ఎత్తిపోతల ప్రతిపాదకులు పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ నుండి నీటిని తరలించుకుపోయే దుష్టత్వానికి తెగబడ్డారు. అపుడు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాగ్రహం తీవ్రమైంది.
ఇది తమ రాజకీయ భవిష్యత్తును భంగపరుస్తుందని అప్పటి తెరాస ప్రజాప్రతినిధులు 12 మంది ఎ.పి. జితేందర్ రెడ్డి, ఎం.పి. మహబూబ్‌నగర్, జూపల్లి కృష్ణారావు కేబినెట్ మంత్రి; డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కేబినెట్ మంత్రి, ఎస్.నిరంజన్ రెడ్డి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు; గువ్వల బాలరాజు అచ్చంపేట శాసనసభ్యులు, వి. శ్రీనివాస గౌడ్ మహబూబ్‌నగర్ శాసనసభ్యులు, కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనమండలి సభ్యులు, ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర శాసనసభ్యులు, మర్రి జనార్ధన రెడ్డి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు, ఎస్.రాజేందర్ రెడ్డి నారాయణపేట శాసనసభ్యులు, వై.అంజయ్యయాదవ్ షాద్‌నగర్ శాసనసభ్యులు, బి.భాస్కర్ జిల్లా పరిషత్ మహబూబ్ నగర్ అధ్యక్షులు అప్పటి కేబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు లెటర్ హెడ్‌పై సంతకాలు చేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. ఈ లేఖ చాలా సమంజసమైన వాదన చేసింది. పాలమూరు రంగారెడ్డిని డిండి పథకంతో అనుసంధానం చేయడం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు నష్టమని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతుల మధ్య నిరంతర వైరుధ్యాలకు, వైషమ్యాలకు దారితీస్తుందని, సాగునీటికి నోచుకోని ఈ జిల్లాలకు శాశ్వత నష్టం చేస్తుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం నోటితో ఈ పథకం పనులు సాగవు అని చెబుతూనే నొసటితో వెక్కిరించినట్లు దిగువ నుండి పనులు చేస్తూ వచ్చింది.
ఈ దుర్మార్గానికి నిరసనగా అప్పటి ప్రతిపక్ష పార్టీలు పాలమూరు అధ్యయన వేదికతో గొంతు కలిపి వీధులలో పోరాటాలకు వచ్చాయి. జిల్లెల్ల చిన్నారెడ్డి మాజీ మంత్రి శాసనసభ్యులు, డి.కె. అరుణ మాజీ మంత్రి శాసనసభ్యులు, దామోదర్ రెడ్డి శాసనమండలి సభ్యులు, నాగం జనార్ధన రెడ్డి మాజీ మంత్రి, సూదిని జయపాల్ రెడ్డి కేంద్రంలో మాజీమంత్రి, ఉబేదుల్లా కొత్వాల్ ఇలా 14 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాస్వామిక వాదులందరూ ధర్నాలలో పాల్గొన్నారు. ఇది తెలంగాణ ఉద్యమకాలంలో ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే “మహబూబ్‌నగర్ ప్రజల ధర్మాగ్రహం– లక్ష మందితో సత్యాగ్రహం” పేరున ఒకేరోజు 80 కేంద్రాలలో నాలుగున్నర లక్షల మందితో జరిగిన ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చింది. ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ప్రధాన, ఏకైక డిమాండ్ మహబూబ్‌నగర్‌కు సాగునీటి సాధన. డిండి లిఫ్టును వ్యతిరేకించడం కూడా టీర్‌ఎస్ రెండోసారి ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి కలిసి వచ్చింది. అధికారం చేపట్టి అన్నీ మరిచిపోవడంతో ఆ పార్టీకి మూడోసారి అధికారం దక్కలేదు. తమకు రాజకీయంగా సమస్య వచ్చినప్పుడల్లా పార్టీలు మహబూబ్ నగర్ నీటి సమస్యను, తెలంగాణ నీటి వాటాను చర్చకు తెస్తున్నాయి. ఈ రెండు సమస్యల పరిష్కారానికి అర్థవంతంగా న్యాయంగా కృషి చేయడం లేదు.
పాలమూరు– రంగారెడ్డి లిఫ్టుకు పేరు అదే ఉంచారు. పాత 72 జీవోను పక్కన పడేసి కొత్తగా 105 జీవో విడుదల చేసి పనులు చేశారు. కొత్త డిజైన్‌తో పనులు చేసి రీడిజైన్ అన్నారు. అప్పుడు 72 జీవోతో మొదటి భాగాన్ని కూడా చేపట్టమని రెండు భాగాలుగా చేపడితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు అనేక విధాలుగా జరుగుతూ వచ్చిన నష్టాలు తీరతాయని మహబూబ్ నగర్ ప్రజలు, ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేశారు. 8.8.2013న 72 జీవో వెలువడిన తరువాత ఒక టీఎంసీ నీటితో 15 వేల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చును అనే ప్రాతిపదికను ముందుకు తెచ్చి బీమా పథకంలో 20 టీఎంసీలతో రెండు లక్షల ఎకరాలని చూపినారని ఆ నీటితో మూడు లక్షల ఎకరాలు సాగు చేయవచ్చని అందుకు ఏడు టీఎంసీల నీటితో బీమా విభజన వల్ల నష్టపోయిన నారాయణపేట ప్రాంతం కోసమని పాత చెరువులు నింపడం కోసం 69 జీవోను ఏప్రిల్ 2014లో గవర్నర్ నరసింహన్ పాలనలో ఇచ్చారు.
72 జీవో అమలు చేస్తే 69 అమలు అవసరం ఉండేది కాదు. 72ను పక్కన పడేయడంతో 69 జీవో అమలు కోసం ప్రతిపక్ష పార్టీలు 11 రోజులు పాదయాత్ర చేశాయి. టీఆర్‌ఎస్ వాళ్లు 69 జీవో అమలు అవసరం లేదన్నారు. దిగువకు మార్చి 105 జీవో అమలు చేయడంవల్ల తొలుత సాగునీటి ప్రయోజనం పొందవలసిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు పక్కన పడేయడం వల్ల షాద్‌నగర్, పరిగి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాలన్నీ నష్టపోయాయి. ఇది ఆ ప్రభుత్వం నమ్మించి చేసిన మోసం. రీడివిజన్ పేరిట 105 జీవోతో చేపట్టిన పనుల వల్ల ఎప్పటికి నీళ్లందుతాయో తెలియని విషాదంలో రైతులు ఉండగా ఈ పథకానికి డిండి లిఫ్టును జత చేయడం తొలి అడుగు నుండే 30 టీఎంసీల నీరు తరలించే కాలువలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు ఎనిమిది నిర్మాణం చేయడం ఏ విధమైన న్యాయం కాగలదు?
ఇంతకాలం డిండి లిఫ్ట్‍కు నీరు ఎక్కడి నుండి తీసుకుంటారో చెప్పలేదు. లోలోపల ఏదుల నుండి తీసుకోవాలని పన్నాగాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నీటిపారుదలశాఖ మంత్రి చిన్నపాటి సమీక్ష కూడా జరపకుండా మహబూబ్‌నగర్ రైతుల సమస్యను ప్రజాస్వామికవాదుల ఇంజనీర్ల లేఖలను పరిశీలనకు తీసుకోకుండా ఏకపక్షంగా ఏదుల నుండి నీరు తీసుకోవడానికి నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఇప్పుడు నీటిపారుదల మంత్రి, ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టు పూర్తి చేయడం గురించి పదేపదే మాట్లాడుతుంటే డిండి లిఫ్ట్‍కు నీరు తరలించే తొందరలో ఉన్నారనిపిస్తుంది. పాలమూరు పథకాన్ని 72 జీవోతో కాకుండా 105 తో చేపట్టిన తరువాత ఆ చర్య తప్పని, డిండి లిఫ్ట్‍తో దానిని జత చేయడం తప్పని ఆనాటి వివిధ జిల్లాల జేఏసీ పెద్దలతో పర్యటన ఏర్పరచి వారికి సాకల్యంగా వివరించాము. వారందరూ అన్యాయమని మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, టీపీఎఫ్, ప్రజాస్వామిక వాదులందరూ వ్యతిరేకించిన తరువాత ఈ పనులు ఎందుకు జరుగుతున్నాయి. అందరూ అడగాలి కదా అని మేం కోరుతున్నాం.

