భారతదేశం అంటే కేవలం మ్యాప్ మీద గీసిన సరిహద్దులు కాదు. అది కోట్లాది గుండె చప్పుళ్ల కలయిక. ఈ దేశ చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే, ప్రతి శతాబ్దంలోనూ ఒక అగ్ని కిరణం లాంటి యువ తరం ఉద్భవించి, దేశం కోసం, ధర్మం కోసం తమ సర్వస్వాన్ని ధారపో సిన ఉదంతాలు కనిపిస్తాయి. స్వాతంత్య్ర సమరంలో ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తి నుండి, గ్రామీణ భారతంలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన వివేకానంద శిష్యుల వరకు యువత ఎప్పుడూ ఈ దేశానికి వెన్నెముకగా నిలిచింది. కానీ, నేటి ఆధునిక కాలంలో ఆ ఆదర్శాల మంటను తమ గుండెల్లో మోస్తున్న యువత ఒక వింతైన, బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదే గుర్తింపు లేని త్యాగం. నేటి సమాజం వారిని అభినందించడానికి బదులు అనుమా నించే స్థితికి చేరుకుంది. ఈ సామాజిక వైకల్యంపై మనం లోతుగా మథనం చెందాల్సిన సమయం ఇది. నేటి యువత అంటే కేవలం సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే తరం అని మనం పొరపాటు పడుతున్నాం. ఆ పైపైన కనిపించే తెర వెనుక ఒక అద్భుతమైన చైతన్యం ఉంది, ఒక పవిత్రమైన జ్వాల రగులుతోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం మండుటెండలో మొక్కలు నాటే యువకులు, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ గళమెత్తే విద్యార్థులు, మురికివాడల్లోని పిల్లలకు అక్షర జ్ఞానాన్ని పంచుతున్న తరుణులు వీరంతా మన మధ్యే తిరుగుతున్న నిశ్శబ్ద విప్లవకారులు. రైతుల కన్నీళ్లు తుడవడానికి సిద్ధపడే యువ నాయకులు, మహిళా హక్కుల కోసం నిర్భయంగా పోరాడే వీరవనితలు నేటి భారతానికి నిజమైన ఆస్తి. వీరు వట్టి వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులు కాదు, క్షేత్రస్థాయిలో మార్పును తీసుకొచ్చే కార్యాచరణా శూరులు. అయినప్పటికీ, వీరి కృషి సమాజపు అట్టడుగు పొరల వరకు ఎందుకు చేరడం లేదు? ఎందుకు వీరి అరుపులు అరణ్య రోదనలుగా మిగిలిపోతున్నాయి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం దేశ హితం కోసం నిస్వార్థంగా పనిచేసే యువకుడు ఈ సమాజంలో ఒక అపూర్వమైన వజ్రం. ఆ వజ్రపు మెరుపును గుర్తించి, దానికి సానబట్టాల్సిన బాధ్యత మన సమాజానిదే. మన సమాజం గత కొన్ని దశాబ్దాలుగా ఒక కృత్రిమమైన మూసలో ఇరుక్కుపోయింది. ఏ పని చేసినా అందులో నాకేంటి లాభం? ఎంత డబ్బు వస్తుంది? ఎంత పేరు వస్తుంది? అనే వ్యాపార దృక్పథం మనుషుల ఆలోచనలను కలుషితం చేసింది. ఈ నేపథ్యంలో, ఒక యువకుడు తన స్వార్థాన్ని వదులుకుని సమాజం కోసం పని చేస్తున్నాడంటే, జనం ఆశ్చర్యపోతున్నారు. మొద టి ప్రశ్నగా ‘దీని వెనుక వీడి స్వార్థం ఏముంటుంది?’ అని అడుగుతు న్నారు. ఈ ప్రశ్న వేయడమే సామాజిక పతనానికి నిదర్శనం. నిస్వార్థా నికి అర్ధం తెలియని స్థితికి మనం చేరుకున్నాం. ఆదర్శాలను ఆచరించే యువతను అక్కున చేర్చుకునే విశాల హృదయం నేటి సమాజానికి కరువైంది. రెండవ అతిపెద్ద అడ్డంకి భయం. నిజం మాట్లాడే యువకుణ్ణి చూసి సమాజం గర్వపడటం లేదు, పైగా భయపడుతోంది. ‘ఎందుకురా నీకు ఈ అనవసరమైన గొడవలు? నీ ఉద్యోగం నువ్వు చూసుకోకూ డదా?’ అని తల్లిదండ్రులే వారిని వెనక్కి లాగుతున్నారు. మధ్యతరగతి భద్రతా భావం ఎంతగా వేళ్లూనుకుందంటే, దేశం నాశనమైపోతున్నా పరవాలేదు కానీ నా బిడ్డ సురక్షితంగా ఉండాలి అనే స్వార్థం పెరిగిపో యింది. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం సంపాదన యంత్రాలుగా చూడటం మానేయాలి. కుటుంబ బాధ్యత ముఖ్యం కాదనలేం, కానీ ఆ బాధ్యతతో పాటు సామాజిక స్పృహ లేకపోతే ఆ చదువుకు, ఆ సంపాద నకు విలువేముంటుంది?
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో వేలమంది యువకులు తమ ఇళ్లను వదిలారు, బంగారు భవిష్యత్తు ఉన్న ఉద్యోగాలను త్యజించారు. అప్పటి సమాజం వారందరినీ పూలమాలలతో ఆహ్వానించిందా? లేదు. అప్పుడు కూడా వీళ్లకేదో పిచ్చి పట్టింది, ఈ కొద్దిమంది వల్ల బ్రిటీష్ వారు వెళ్ళిపోతారా? అని ఈసడించుకున్న వారు ఉన్నారు. కానీ, ఆ యువత లోని దేశభక్తి జ్వాల ఆ విమర్శలను దహించివేసింది. నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు వారి త్యాగాల ఫలితమే. మరి నేడు కూడా అదే రకమైన దేశభక్తితో, సామాజిక స్పృహతో పనిచేస్తున్న యువతను మనం నిరుత్సాహపరిస్తే, రేపు మన భవిష్యత్ తరాలు చీకటిలో మగ్గిపోవాల్సి వస్తుంది. ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులు సమాజంలోని నిరాశను లెక్క చేయకుండా ముందుకు సాగారు. ఆ పోరాట పటిమ ఉన్న నేటి యువతను ప్రోత్సహించాలి.
ఇక్కడ ధర్మం అంటే పూజలు, పునస్కారాలు కాదు, ధర్మం అంటే న్యాయం, సత్యం, మానవత్వం. ఒక అణగారిన వ్యక్తికి అండగా నిలబ డటం ధర్మం. అవినీతిని ఎదిరించడం ధర్మం. ప్రకృతిని కాపాడుకోవడం ధర్మం. చదువుకోలేని పేద విద్యార్థికి చేయూతనందించడం ధర్మం. ఈ పనులన్నీ చేస్తున్న యువత ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, వారు సమాజానికి ఎంత ఇస్తున్నారు అన్నది ముఖ్యం. వారిని లోకం తెలియని అమాయకులు అని పిలవడం మన మూర్ఖత్వం. నిజానికి లోకం మొత్తం నిద్రపోతుంటే, మేల్కొన్న ఏకైక తరం వారిదే! సమాజం తన దృక్పథాన్ని మార్చుకోవడానికి కొన్ని కీలకమైన అడుగు లు వేయాలి. మన పరిసరాల్లో ఎవరైనా యువకుడు సమాజ సేవలో ఉంటే, అతడిని ప్రోత్సహించండి. ఒక చిన్న ప్రశంస, ఒక చిరునవ్వు అతడిలో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపుతాయి సేవను ఎప్పుడూ డబ్బుతో కొలవకండి. ప్రపంచంలో అత్యంత విలువైనవి ఉచితంగా లభిస్తాయి- గాలి, నీరు, నిస్వార్థమైన ప్రేమ. యువత చేసే సేవకు వెల కట్టడం మానేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం ర్యాంకుల గురించి మాత్రమే కాకుండా, ఈ సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యతల గురించి కూడా నేర్పాలి. నీ స్వప్నాలు సాధించు, కానీ నీ ఎదుటివారి కన్నీళ్లు తుడవడం మర్చిపోకు అని చెప్పే తల్లిదండ్రులే రేపటి దేశ నిర్మా తలను తయారు చేస్తారు. విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులు రావాలి. పుస్తకాల్లోని పాఠాలు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, విద్యార్థుల ప్రవర్తనలో ప్రతిబింబించాలి. నీవు దేశానికి ఏమి ఇస్తు న్నావు? అనే ప్రశ్న ప్రతి క్లాస్రూమ్‌లో ప్రతిధ్వనించాలి. సోషల్ సర్వీస్ అనేది కేవలం సర్టిఫికెట్ల కోసం కాకుండా, హృదయం లోతుల్లోంచి వచ్చే బాధ్యతగా మారాలి.
యువ హృదయాలకు ఒకటే విన్నపం, సమాజం మిమ్మల్ని గుర్తిం చడం లేదని, మీ పనులను ఎగతాళి చేస్తోందని నిరాశ పడకండి. చరిత్రలో ఏ గొప్ప మార్పు కూడా అందరి ఆమోదంతో మొదలవ్వలేదు. మీరు ఒంటరిగా అడుగు వేయవచ్చు, కానీ మీ వెనుక ఒక నిశ్శబ్ద సైన్యం తయారవుతూనే ఉంటుంది. మీరు నాటే ప్రతి విత్తనం, రేపటి తరానికి ప్రాణవాయువునిచ్చే మహావృక్షం అవుతుంది. లోకం నిందించినా, కాలం మిమ్మల్ని తప్పక గౌరవిస్తుంది. మీరు చేస్తున్న పనిలో సత్యం ఉంటే, ఆ సత్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. లోకం మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు, కానీ మీరు చేసే ప్రతి నిస్వార్థ చర్య చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.
చివరగా, దేశం కోసం పరితపించే యువత మన కళ్లముందే ఉన్నారు. వారు బహుశా టీవీ కెమెరాల ముందు కనిపించకపోవచ్చు, లేదా పేపర్ హెడ్ లైన్స్‍లో ఉండకపోవచ్చు. కానీ వారు మారుమూల గ్రామాల్లో, నగరాల మురికివాడల్లో నిశ్శబ్దంగా మార్పును నిర్మిస్తు న్నారు. వీడేదో పిచ్చి పని చేస్తున్నాడు అనే మన చూపు మారాలి. వీడు మనందరి భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నాడు అనే గౌరవం మనలో కలగాలి. దేశానికి కావాల్సిన వీర యువత సిద్ధంగా ఉన్నారు, మరి ఆ యువతను గౌరవించే సమాజం సిద్ధంగా ఉందా?
డా. సూర్యదేవర రామకృష్ణ

