Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Down fall of Naveen Patnaik: నవీన్‌ పట్నాయక్‌కు రాజకీయ పరాభవం

Down fall of Naveen Patnaik: నవీన్‌ పట్నాయక్‌కు రాజకీయ పరాభవం

సుమారు 24 ఏళ్లుగా ఒక వెలుగు వెలిగిన నవీన్‌ నివాస్‌, శంఖ భవన్‌ ఒక్కసారిగా వెలాతెలా పోయాయి. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధికార నివాసమైన నవీన్‌ నివాస్‌, పాలక బిజూ జనతాదళ్‌ ప్రధాన కార్యాలయమైన శంఖ భవన్‌ నిర్మానుష్యంగా మారడమన్నది ఊహించని విషయం. ఒడిశా ఆత్మ గౌరవ నినాదంతో సుమారు పాతికేళ్ల పాటు అధికారంలో కొనసాగిన నవీన్‌ పట్నాయక్‌ ఇప్పుడు ప్రజలకు ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, ఆయన ఆరోగ్యం గురించి, ఆయనకు తమిళనాడుకు చెందిన వి.కె. పాండ్యన్‌ సలహాదారుగా వ్యవహరించడం గురించి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారం సత్ఫలితాలనిచ్చినట్టు కనిపిస్తోంది.
నిజానికి ఇటీవలి వరకూ పట్నాయక్‌ బీజేపీకి ఒక స్నేహితుడిగానే వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనను స్నేహితుడిగా, సన్నిహితుడిగానే గౌరవించడం జరి గింది. ఈసారి ప్రచారంలో మాత్రం ఆయనను మోదీ రాష్ట్రంలోని జిల్లాల పేర్లు, జిల్లా ప్రధాన కేంద్రాల పేర్లు చెప్పలేని వ్యక్తిగా అభివర్ణించడం జరిగింది. బీజేపీ గనుక అధికారంలోకి వచ్చే పక్షంలో నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఒక నిపుణుల కమిటీని నియమించడం జరుగుతుందని కూడా మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రక టించారు. పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన రత్న భండార్‌ తలుపుల తాళం చెవులను పాండ్యన్‌ తమిళ నాడుకు చేరవేయడాన్ని కూడా మోదీ పదే పదే ప్రస్తావించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తనకు పాండ్యన్‌ రాజకీయ వారసుడు కాదని పట్నాయక్‌ వివరణ ఇచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఒడిశా ప్రభుత్వంలో పాండ్యన్‌ ఆధిపత్యం క్రమంగా పెరిగిపోవడం, నవీన్‌ పట్నాయక్‌ క్రమంగా తన మంత్రులు, శాసనసభ్యులను దూరంగా పెట్టేస్తుండడం బిజూ జనతాదళ్‌ దెబ్బతినడానికి కారణ మయ్యాయి. నవీన్‌ కొలువులోని మంత్రులు వారిస్తున్నప్పటికీ బీజేపీకి చెందిన అశ్వినీ వైష్ణవ్‌ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం కూడా మంత్రుల్లో అసమ్మతిని రాజేశాయి. నవీన్‌ పట్నాయక్‌ చేసిన మరొక పొరపాటు ఏమిటంటే, జైపూర్‌ శాసనసభ్యుడు ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌ ను పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా నియమించారు. ఆయన పాండ్యన్‌ క్రమంగా పైకి తీసుకు రావడం ప్రారంభించారు. పాండ్యన్‌ నవీన్‌ పట్నాయక్‌ రాజ కీయ వారసుడంటూ దాస్‌ ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు. అక్టోబర్‌ లో పదవీ విరమణ చేసిన పాండ్యన్‌ నవంబర్‌ నెలలో బిజూ జనతాదళ్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన కూడా తాను పట్నాయక్‌ వారసుడిని అన్నట్టుగానే వ్యవహరించడం ప్రారంభించారు.
పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడెవరూ లేకపోవడంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగ జారడం ప్రారంభం అయింది. ఏ నిర్ణయం తీసుకున్నా పట్నాయక్‌ స్వయంగా తీసుకునే వారు. ఎవరితో నైనా సంప్రదించడం అన్నది ఉండేది కాదు. పార్టీ నిర్వహణ బాధ్యతలను కూడా ఆయన ఎవరికీ అప్పగించలేదు. విచిత్రమేమిటంటే, శాసనసభ, లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ, అందుకు పార్టీ సంసిద్ధం కాలేకపోయింది. 1997లో ఆ పార్టీ ఏర్పడిన తర్వాత ఇంత ఘోర పరాజయం ఏనాడూ చోటు చేసుకోలేదు. బీజేపీతో పొత్తు చర్చలు విఫలం అయిన తర్వాతే ఈ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి అది బీజేపీ ప్రచార ధాటిని తట్టు కోలేకపోయింది. ఒడిశా ఆత్మ గౌరవ నినాదాన్ని ఈసారి బీజేపీ చేపట్టింది. నవీన్‌ పట్నాయక్‌ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తన ప్రాధాన్యాన్ని కోల్పోతూ వచ్చిన ఈ పార్టీ అటు లోక్‌ సభ ఎన్నికల్లో కూడా అతి తక్కువ సీట్లతో బయటపడింది.
ఒడిశాలోని సంబల్పూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు పోటీ చేసిన దాస్‌ కు అక్కడ గట్టి పోటీ ఎదురు కావడంతో ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేకపోయారు. పట్నా యక్‌, పాండ్యన్‌లు మాత్రమే ప్రచారం చేయాల్సి వచ్చింది. పాండ్యన్‌ ప్రచారంలో పాల్గొనడం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చింది. విచిత్రమేమిటంటే, ప్రజాదరణ కోల్పోయిన శాసన సభ్యులకు ఆయన టికెట్‌ను నిరాకరించలేకపోయారు. అసమ్మతి వర్గీయులను అదుపులో ఉంచలేక పోయారు. మొత్తం 21 లోక్‌ సభ స్థానాల్లో 20 స్థానాలను బీజేపీ గెలుచుకుండి. అంతేకాక, 147 శాసనసభ స్థానాల్లో 78 స్థానాలను బీజేపీ గెలుచుకుని అధికారంలోకి రాగలిగింది. బీజేడీ ఒక్క లోక్‌ సభ స్థానాన్ని కూడా చేజిక్కించుకోలేకపోవడం నిజంగా ఆశ్చ ర్యం కలిగించే విషయం. బీజేడీ 51 శాసనసభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఒక లోక్‌ సభ స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు, 14 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. ఒడిశాలో బీజేపీ కొత్త రాజకీయ అధ్యాయాన్ని ప్రారంభించింది. 1995లో బిజూ పట్నాయక్‌ ప్రభుత్వం ఓడిపోయినట్టే, 2024లో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా ఓడిపోవడం యాదృచ్ఛిక మేననుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News